ఎంపీ ప్రతాపసింహ: పార్లమెంట్ గ్యాలరీ పాసులు ఇచ్చిన ఈ ఎంపీ బస్టాం‌డ్‌పైకి బుల్డోజర్లు తీసుకువెళతానని ఎందుకు అన్నారు?

బీజేపీ ఎంపీ ప్రతాప సింహా

ఫొటో సోర్స్, INSTAGRAM/PRATAPSIMHA_MP

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎంపీ ప్రతాప సింహా
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ

భారత పార్లమెంటులోకి ఆగంతకులు దూకి కలకలం సృష్టించాక, భారతీయ జనతా పార్టీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మారుమోగిపోవడం మొదలైంది. దీంతో ఈయన నేపథ్యమేమిటనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ప్రతాప్ సింహా పాత్రికేయుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆపైన అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో బీజేపీ నుంచి మైసూరు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. గడిచిన 9ఏళ్ళుగా ఆయన ప్రతిపక్షాలతోనే కాకుండా సొంతపార్టీ వారితోనూ పోటీ పడాల్సి వచ్చింది. క్రమశిక్షణకు కట్టుబడే బీజేపీలో ఇలాంటి సంఘటనలు అసాధారణమే.

గత మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడానికి బిఎస్ యడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై కారణమంటూ ప్రతాప్ సింహా వేలెత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతి పై విచారణ జరిపించలేదని ఆయన ఆరోపించారు.

బీజేపీ జాతీయ కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రతాప్ సింహా శిష్యుడని కర్నాటకలో అందరికీ తెలుసు. సంతోష్ కారణంగానే ప్రతాప్ సింహాకు మైసూర్ ఎంపీ సీటు దక్కింది.

‘‘ప్రతాప్ తన ఆత్మను ఎవరికీ అమ్ముకోలేదు’’ అని మైసూరు మాజీ ఎమ్మెల్యే జి. మదుసూదన్ బీబీసీకి చెప్పారు. ‘‘2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏహెచ్ విశ్వనాథ్ పై గెలిచేందుకు వొక్కలింగ సామాజిక వర్గ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావించినప్పుడు ప్రతాప్ సింహా పేరు తెరపైకి వచ్చింది’’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.

బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

ఫొటో సోర్స్, INSTAGRAM/PRATAPSIMHA_MP

అహంకారమా, ఆత్మగౌరవమా?

‘‘హిందుత్వకు తీవ్రంగా మద్దతు పలికే వొక్కలింగ వర్గానికి సంబంధించినవారి కోసం మేం వెదుకుతున్నప్పుడు ప్రతాప్ సింహా మా ఎదురుచూపులకు సరిగ్గా సరిపోయాడు. అప్పటికే ఆయనకు చాలా పేరుంది. కానీ ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కానీ మేం ఆయనను మాలో చేర్చుకన్నాం. అయితే ఆయనకు కొంత గర్వం కూడా ఉండేది’’ అని మదుసూదన్ తెలిపారు.

‘‘ప్రతి మనిషి గౌరవాన్ని కోరుకుంటారు. కొందరు దీనిని అర్థం చేసుకోలేరు. కొంతమంది ఈ యువకుడు తమతో ఇలా ఎలా మాట్లాతాడు అంటూ ఆశ్చర్యపోయేవాడు. అతనేంటి, అతని స్థాయి ఏంటి అని ఆలోచించేవారు’’ అని సింహా గురించి వివరించారు.

2018 జనవరిలో ప్రతాప్ సింహా మైసూరులో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించాలనుకుంటే పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు ఈయన ర్యాలీని అడ్డుకుంటే సింహానే స్వయంగా తన కారును నడిపి బారికేడ్స్‌ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఈ సంఘటనకు జరగడానికి ముందు ప్రతాప్ సింహ కేంద్రమంత్రి అమిత్ షా మాటలను ఉటంకించారు. ‘‘ అమిత్ షా ఎంతమంది నిరసనకారులు లాఠీచార్జ్, టియర్‌గ్యాస్‌లను చూశారు అని అడిగితే నేను ఒక్కరు కూడా వాటిని చూడలేదని చెప్పాను. దీంతో ఆయన మమ్మల్ని మరింత తీవ్రంగా ఉండాలని, పెద్దపెద్ద ప్రదర్శనలు చేయాలని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రదర్శనలు అనేకం చేస్తామని నేను ఆయనకు హామీ ఇచ్చాను’’ అని ప్రకటించారు.

దీని తరువాత 2022 నవంబరులో మైసూరు జాతీయ రహదారికి సమీపంలోని ఓ కళాశాల వద్ద బస్టాండ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దాస్ తన ఎమ్మెల్యే నిధుల నుంచి నిర్మిస్తున్న బస్టాండ్ ను వెంటనే ఆపాలని సింహా ఆందోళనకు దిగారు.

బస్టాండ్ పై కప్పు మసీదును పోలిఉందని ఆరోపిస్తూ ఆయనీ ఆందోళనకు దిగారు. దీనిని వెంటనే తొలగించకపోతే తానే జేసీబీని తీసుకువచ్చి ధ్వంసం చేస్తానని హెచ్చరించారు.

రామ్‌దాస్ మద్దతుదారుడొకరు కిందటేడాది మాట్లాడుతూ, ‘‘మైసూరులో అనేక బస్టాండ్లు ఇలాగే ఉంటాయి, వీటి పై కప్పులు మైసూరు పాలెస్‌ ఫై కప్పులతో పోలి ఉంటాయి. ప్రతాప్ సింహా కేవలం తాను హిందువులకు నాయకుడినని చెప్పుకోవడానికి ఇటువంటివి చేస్తున్నారు. ఇది కేవలం ఆయన అహకారం. దీని వలన పార్టీ దెబ్బతింటోంది’’ అని చెప్పారు.

సినీనటుడు ప్రకాశ్ రాజ్ విషయంలో కూడా ప్రతాప్ సింహా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తనపై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రకాష్ రాజ్ లీగల్ నోటీసులు పంపడంతో సింహా క్షమాపణ చెప్పారు.

బెంగళూరు, మైసూరు మధ్య ఆరువరుసల జాతీయ రహదారి తానే తీసుకువచ్చినట్టు ప్రతాప్ సింహ ప్రకటించుకున్నారు. అయితే దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. యూపీఏ ప్రభుత్వంలో ఆస్కార్ ఫెర్నాండెజ్ మంత్రి గా ఉన్న సమయంలోనే ఈ జాతీయరహదారుల అనుమతి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘ ఈ రహదారికి ఫెర్నాండెజ్, శ్రీనివాస ప్రసాద్ కారణం. ప్రతాప్ సింహా చేసే ప్రకటనలన్నీ ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుంటాయి’ అని చెప్పారు.

సింహకు రాజకీయ పరిణితి లేదని ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యకు, భారతీయ జనతపార్టీ మధ్య సర్దుబాటు రాజకీయాలు నడుస్తున్నాయంటూ సింహా చేసిన వ్యాఖ్యలపై కర్నాటక సీఎం ఈ రాజకీయ పరిణితి వ్యాఖ్యలు చేశారు .

బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా

ఫొటో సోర్స్, INSTAGRAM/PRATAPSIMHA_MP

ప్రతాప్ సింహ ‘నగ్న ప్రపంచం’

ప్రతాప్ సింహకు జర్నలిస్టుగా విశ్వేశ్వర్ భట్ అవకాశం ఇచ్చారు. సింహా 24 ఏళ్ళ వయసులో కాలమ్స్ రాయడం మొదలుపెట్టారు. ‘‘ ఆరోజుల్లో విజయ కర్నాటక పత్రిక కొత్తది. దీంతో నేను సంపాదక పేజీ బాధ్యతలు యువకులకు ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాను. సింహ ఈ బాధ్యతలను మా పత్రికలో పదేళ్ళపాటు చూశారు. తరువాత ఆయన కన్నడ ప్రభలో ఐదేళ్ళపాటు పనిచేశారు’’ అని చెప్పారు.

సింహా రాసే వ్యాసాలు ప్రతిశనివారం ప్రచురితమయ్యేవని, కర్నాటకలో ఆయన పేరు ప్రతి ఇంట్లోనూ తెలుసని చెప్పారు. ‘‘ఆయన బాగా చదువుకున్నవాడు. ప్రతిదానిని పరిశోధించేవాడు. ప్రతి విషయంపైనా నిశ్చితాభిప్రాయం ఉండేది’ అని తెలిపారు.

‘‘ఆయన కాలమ్ పేరు ‘నగ్నప్రపంచం’. ఈ శీర్షిక కింద సింహా రాసే వ్యాసాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. దీనివలనే ఆయనకు రాజకీయాలలో నేరుగా అవకాశం లభించి లోక్‌సభ సభ్యుడయ్యారు’’ అని మదుసూదన్ చెప్పారు.

సందర్శకుల పాసులపై వివాదం

సందర్శకుల పాసులపై సింహా సంతకం చేయడాన్ని మాజీ సంపాదకుడు భట్ సమర్థించారు. ‘ రోజూ ఎంతోమంది ఎంపీ, ఎమ్మెల్యేలు సంతకం చేసిన పాసులు కావాలని కోరుతుంటారనే విషయం జర్నలిస్టులుగా మనందరికీ తెలుసు . ఇది ప్రతాప్ తప్పు కాదు’ అని ఆయన సమర్థించారు.

‘‘ఇది భద్రతా వైఫల్యం. వారు పటిష్ఠంగా తనిఖీలు చేసి ఉండాల్సింది. అలా జరిగి ఉంటే ముందుగానే పట్టుబడి ఉండేవారు’’ అంటూ ఆయన ముగించారు.

లలిత్ ఝా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లలిత్ ఝా

లలిత్ ఝా : మాస్టర్ మైండ్ ఈయనదేనా?

పార్లమెంటులో ఆగంతుకులు సభ మధ్యలోకి దూకి గందరగోళం సృష్టించిన కేసులో లలిత్ ఝా అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. పార్లమెంటులో గందరగోళం జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నా, పోలీసులనుంచి తప్పించుకున్నాడు.

లలిత్ ఝా కోలకతాలో టీచరుగా పనిచేసేవాడు. ఇతని స్వస్థలం బిహార్ అని ఎన్టీటీవీ వార్తా కథనం తెలిపింది. 32 ఏళ్ళ లలిత్ ఝా స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ నుంచి స్ఫూర్తి పొందాడని పోలీసులు చెప్పారు.

లలిత్ ఓ ఎన్జీఓకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్లమెంటులో జరిగిన గందరగోళాన్ని అతను వీడియోగా తీసి తన ఎన్జీఓ వ్యవస్థాపకుడికి పంపాడు. దాంతో ‘వారంతా క్షేమంగానే ఉన్నారు’ అనే సందేశాన్ని పంపారు.

కోల్‌కతాలో అతను నివసించని ప్రాంతంలోని ఇరుగుపొరుగువారు పీటీతో మాట్లాడుతూ లలిత్ ఝా చాలా కామ్‌గా ఉండేవారని, తన పనేదో తాను చేసుకునేవాడని చెప్పారు. అతనొక టీచరుగా మాత్రమే తమకు తెలుసని, ఇరుగుపొరుగువారితో తక్కువగా మాట్లాడేవాడని తెలిపారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాకథనం ప్రకారం గురువారం లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయేముందు సాంకేతిక ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశాడు. పోలీసులు పార్లమెంటు నలుగురిని అరెస్ట్ చేసినప్పుడు లలిత్ కూడా అక్కడే ఉన్నా అతను తప్పించుకోగలిగాడు.

పోలీసులు చెప్పిన వివరాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఈమేరకు 11.30 గంటల ప్రాంతంలో లలిత్ ఝా రాజస్థాన్‌లోని కుచ్’మాన్ సిటీని చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడు మహేష్ ను కలుసుకున్నాడు. మహేష్ కూడా ఇందులో పాల్గొనాలకున్నాడు కానీ, అతని తల్లి వారించడంతో రాలేకపోయాడు.

ఫేస్‌బుక్‌లో భగత్ సింగ్ ఫాన్ పేజీ ద్వారా మహేష్ లలిత్‌జాకు పరిచయమయ్యాడు. ‘‘ మహేష్, అతనికి వరుసకు సోదరుడయ్యే కైలాష్, లలిత్ ఝా కలిసి ఓ దాబా గదిని అద్దెకు తీసుకున్నారు. దాబా యజమానికి మహేష్ పరిచయస్తుడే. అందుకే గది ఇచ్చాడు’’ అని పోలీసు విచారణలో తేలింది.

‘‘ గురువారం ఉదయం మిగిలిన ఇద్దరి సహకారంతో లలిత్ ఝా ఫోన్ తో సహా సాంకేతిక ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశాడు. దీని తరువాత మహేష్, లలిత్ ఝా తాము పోలీసులకు లొంగిపోతున్నట్టు కైలాష్‌కు చెప్పి బయల్దేరారు’’

తరువాత కైలాష్ ఫోన్ నెంబరును కనుగొన్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతని ద్వారా లలిత్, మహేష్ జైపూరుకు బస్సులో వెళుతున్నారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి దిల్లీకి వెళతారని తెలుసుకున్నారు. దీని తరువాత పోలీసులు అనేక ప్రాంతాలలో దాడులు చేశారు. అయితే చిట్ట చివరకు లలిత్ , మహేష్ పోలీసులకు లొంగిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)