కొత్త క్రిమినల్ చట్టాల్లో 6 ప్రధాన మార్పులు ఇవే.. ‘సామాజిక సేవ’ శిక్ష ఎవరికి వేస్తారో తెలుసా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఉమంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మళ్లీ ప్రవేశపెట్టింది.
ఇప్పుడున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుకొస్తున్నారు.
ఈ బిల్లులను మొదటగా ఆగస్టులో ప్రవేశపెట్టారు. తర్వాత వీటిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారు.
స్టాండింగ్ కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకుంది.
గురువారం ఈ బిల్లులపై చర్చ జరుగనుంది. శుక్రవారం వీటిపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
ఈ బిల్లులలో చేసిన ఆరు ప్రధాన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో ‘సామాజిక సేవ’ను శిక్షగా విధించే అంశం కూడా ఉంది.
1. మూక దాడులు, ద్వేషపూరిత నేరాల శిక్షల్లో పెంపు
పూర్వపు బిల్లులో మూక దాడులు, ద్వేషానికి సంబంధించిన నేరాలకు కనీసం ఏడేళ్ల శిక్ష విధించాలనే నిబంధన ఉంది.
ఈ నిబంధన ప్రకారం, కులం లేదా మతం వంటి కారణాలతో అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి సామూహిక హత్యకు పాల్పడితే ఆ మూకలోని ప్రతీ వ్యక్తికి కనీసం ఏడేళ్ల శిక్ష పడుతుంది.
ఇప్పుడు, ఈ శిక్ష కాలాన్ని ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షకు పెంచారు.

ఫొటో సోర్స్, SPL
2.ఉగ్రవాద కార్యకలాపాల నిర్వచనం
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జ్యుడీషియల్ కోడ్) ద్వారా ప్రవేశపెట్టారు. పూర్వం వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి.
ఇందులో చేసిన కీలక మార్పు ఏంటంటే, ఆర్థిక భద్రతకు ముప్పును కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకే తెచ్చారు.
నకిలీ నోట్లను ఉత్పత్తి చేయడం, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం కూడా ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
భారత్‌లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడాన్ని కూడా ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు.
ఇప్పుడు, భారత్‌లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.

ఫొటో సోర్స్, ANI
3. అన్‌సౌండ్ మైండ్
ప్రస్తుత ఐపీసీ ప్రకారం, మానసిక రోగులకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇండియన్ జ్యుడీషియల్ కోడ్‌లో మునుపు దీన్ని ‘మానసిక అనారోగ్యం(మెంటల్ ఇల్‌నెస్)’గా పేర్కొన్నారు. ఇప్పుడు ‘‘మానసిక స్థితి సరిగా లేకపోవడం(అన్‌సౌండ్ మైండ్)’’ అనే పదాన్ని మళ్లీ తీసుకొచ్చారు.
4. లైంగిక దాడి కేసులు: కోర్టు ప్రొసీడింగ్స్ ప్రచురిస్తే జైలు
కోర్టు వ్యవహారాల అంశంలోనూ తాజాగా శిక్షను తీసుకొచ్చారు.
కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి కేసులకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రచురిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కొత్త నిబంధనను తాజా బిల్లులో చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
5. చిన్న స్థాయి వ్యవస్థీకృత నేరాల నిర్వచనం
ముందు ప్రవేశపెట్టిన బిల్లులో వాహనాల దొంగతనం, జేబులు కొట్టేయడం వంటి చిన్న తరహా నేరాలు చేస్తూ పౌరుల్లో అభద్రతా భావానికి కారణమైతే వ్యవస్థీకృత గ్రూపులను శిక్షించాలని పేర్కొన్నారు.
కానీ, తాజా బిల్లులో అభద్రతా భావానికి గురి చేయడం అనే పదాన్ని తొలిగించారు.
6. శిక్షగా సామాజిక సేవ
భారతీయ నాగరిక సురక్షా సంహిత కొత్త బిల్లులో సామాజిక సేవను చేర్చారు.
సామాజిక సేవను శిక్షగా విధించడం అనేది సమాజానికి మేలు చేసే శిక్ష అని అందులో పేర్కొన్నారు. ఇందులో నేరస్థులకు ఎలాంటి పారితోషికం ఉండదని చెప్పారు.
చిన్న చిన్న దొంగతనాలు, మద్యం తాగి ఇతరులకు ఇబ్బంది కలిగించడం, ఇంకా ఇతర అనేక నేరాలకు శిక్షగా ఈ బిల్లులో సామాజిక సేవను ప్రవేశపెట్టారు.
గత బిల్లులో సామాజిక సేవ అంశాన్ని ప్రస్తావించలేదు.
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










