విజయవాడ 2020 గ్యాంగ్‌ వార్: 'మర్డర్ చేసే ఇంటికి రావాలని కొడుకుని తల్లే పంపించారు’ - పోలీసుల వెల్లడి

పండు తల్లి పద్మ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఎం పండు తల్లి పద్మావతిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దాదాపు మూడున్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయమైన విజయవాడ గ్యాంగ్‌వార్ ఘటన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

అది 2020 మే 30వ తేదీ. కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయం. అయితే, విజయవాడలో మాత్రం పట్టపగలే రెండు గ్యాంగ్‌లు రెచ్చిపోయాయి. ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ కేసులో తాజాగా కొత్త విషయం బయటపడింది.

విజయవాడ వీధుల్లో జనావాసాల మధ్య జరిగిన ఈ గ్యాంగ్ వార్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చనీయాంశమైంది.

ఈ కేసులో చాలా మంది నిందితులను అరెస్ట్ చేశారు. కొందరికి నగర బహిష్కరణ వంటి శిక్షలు కూడా పడ్డాయి.

తాజాగా ఒక మహిళ అరెస్ట్ అయ్యారు.

గ్యాంగ్ వార్ కేసులో ఏ1గా ఉన్న కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు తల్లి పద్మావతిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ గ్యాంగ్ వార్‌లో తన కొడుకుని రెచ్చగొట్టి, హత్యకు పురిగొల్పారంటూ పద్మ మీద పోలీసులు అభియోగం మోపారు.

దాడిలో పాల్గొన్న నిందితులు

ఫొటో సోర్స్, Youtube

ఫొటో క్యాప్షన్, విజయవాడలో సందీప్, పండు అనుచరులంతా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

అప్పట్లో ఏం జరిగింది?

ఈ గ్యాంగ్ వార్ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

2020 మే 29వ తేదీన పటమట తోటవీధిలోని ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో తోట సందీప్, కొండూరి మణికంఠ అలియాస్ పండు మధ్య విబేధాలు తలెత్తాయి. అదే రోజు సాయంత్రం సందీప్, తన అనుచరులతో కలిసి పెనమలూరు సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్న పండు ఇంటికి వెళ్లాడు. పండు ఇంట్లో లేకపోవడంతో అతని తల్లికి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన పండుని తల్లి పద్మ రెచ్చగొట్టారు. సందీప్ అంతు చూసిన తర్వాతనే ఇంటికి రావాలంటూ ఆదేశించారు. దాంతో కొడుకు పండు మే 30న ఉదయం 8 గంటల సమయంలో సందీప్ నిర్వహిస్తున్న ఐరన్ షాప్ వద్దకు తన అనుచరులతో కలిసి వెళ్లాడు. ఆ సమయానికి అక్కడ సందీప్ లేకపోవడంతో షాపులో పనిచేస్తున్న వారిపై దాడి చేసి వచ్చాడు.

ఆ తర్వాత 30వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో సందీప్, పండు వర్గాలు ఎదురెదురుగా తలపడ్డాయి. మరణాయుధాలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. పలువురు గాయపడ్డారు.

తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన తోట సందీప్ ఆ తర్వాత మరణించారు.

నగర బహిష్కరణలు, రౌడీ షీట్లు

ఈ కేసులో పటమట పోలీసులు క్రైమ్ నెంబర్ 452/2020గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐరన్ షాపు నడుపుకొనే సందీప్, చికెన్ షాపు నిర్వహించే పండు చెరో వైపు 30 మంది చొప్పున అనుచరులతో కలిసి మారణాయుధాలతో చెలరేగిపోయిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఘటన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించిన తర్వాత పలువురు బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విచారణ సాగుతోంది.

దాడిలో పాల్గొన్న నిందితులపై రౌడీ షీట్లు తెరిచారు. పండుతోపాటు ఆయన అనుచరులు ప్రశాంత్, రవితేజతోపాటు పలువురిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా తెరిచారు, నగర బహిష్కరణ కూడా విధించారు.

అయినప్పటికీ నగరంలోని పలు వ్యవహారాల్లో ఈ గ్యాంగ్‌ల పాత్ర కొనసాగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సందీప్ మరణించిన తర్వాత కూడా అతని అనుచరుల్లో కొందరు దందాలకు దిగినట్టు ప్రచారం సాగుతోంది.

పండు తల్లిపై పటమటలోనూ రౌడీ షీట్

ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఎం పండు తల్లి పద్మావతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మీద గతంలోనే పెనమలూరు పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. తాజాగా పటమట పోలీసులు కూడా రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు ప్రకటించారు.

కాల్‌మనీ సహా వివిధ నేరాల్లో ఆమె పాత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఆమె తన పంథా మార్చుకోకపోగా, మరింతగా కాల్‌మనీ బెదిరింపుల వ్యవహారం సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గ్యాంగ్ వార్ కేసులో పద్మ ఏ4గా ఉన్నారు. ఇంతకాలంగా ఆమె పరారీలో ఉండగా, డిసెంబర్ 11న అరెస్ట్ చేసినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. విజయవాడలోని నాలుగో మెట్రోపాలిటన్ కోర్టు ముందు ఆమెను హాజరుపరిచారు.

పద్మ తన కొడుకుని రెచ్చగొట్టి, పంపించడమే గ్యాంగ్ వార్ జరగడానికి కారణమంటూ పోలీసులు చెబుతున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడలోని సబ్ జైలుకు ఆమెను తరలించారు.

అంతకుముందు పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తి ముందు ఆరోపించారు పద్మ. అయితే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి, అలాంటిది జరగలేదని తేల్చారు.

ఒకరి ప్రాణాలు పోయి, వీధుల్లో కత్తులు, ఇతర ఆయుధాలతో దాడులు చేసుకున్న ఘటనను చిన్న పిల్లల వివాదంగా చూడాలంటూ ఆమె కోర్టు వద్ద హంగామా చేశారు. విడుదలై వచ్చిన తర్వాత అందరి సంగతి చూస్తానంటూ హెచ్చరించారు పద్మ. దీంతో పద్మ వ్యవహారం చర్చనీయాంశమైంది.

విజయవాడ పోలీసులు

ఫొటో సోర్స్, CP office

ఫొటో క్యాప్షన్, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా

ఎవరినీ ఉపేక్షించం: పోలీసు కమిషనర్

విజయవాడలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు.

"కేటీఎం పండు సహా ఇతర గ్యాంగ్స్ అన్నింటినీ కట్టడి చేశాం. కాల్ మనీ, ఇతర సెటిల్ మెంట్లు సాగకుండా నియంత్రిస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం. ఈ కేసులో తదుపరి చర్యలు కూడా ఉంటాయి" అని ఆయన తెలిపారు.

నిందితుల నగర బహిష్కరణ తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు కమిషనర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)