రజినీకాంత్ మెడలో కోరలు తీయని పాము.. అదెలా జరిగింది? ఆయన ‘స్నేక్ సెంటిమెంట్’ ఏమిటి?

ఫొటో సోర్స్, VALLI VELAN MOVIES
‘సూపర్‌స్టార్’ రజినీకాంత్ నాలుగు దశాబ్దాలకు పైగా తన స్లైలిష్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
మంగళవారం రజినీ తన 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు.
స్టైల్, హెయిర్ స్టైల్, డాన్సులు, హాస్యచతురత, సామాన్యుడి బాడీ లాంగ్వేజ్ వంటివన్నీ కలిపి ఆయన తెరపై మ్యాజిక్ చేస్తారు.
ఇప్పటిదాకా రజినీ 169 సినిమాలలో నటించారు. తెలుపు నలుపుల చిత్రాల నుంచి డిజిటల్ సినిమా వరకు ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి కొన్ని సన్నివేశాలలో ఆయన అభినయానికి అభిమానులు తమను తాము మరిచిపోతుంటారు. ఇలాంటివాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాము సీన్ల గురించి. రజినీ సినిమాల్లో పాము దృశ్యాలు ప్రేక్షకులకు నవ్వులు పంచడమే కాకుండా ఉత్సుకతను కలిగిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాము సెంటిమెంట్
‘భైరవి’ సినిమా నుంచి మొదలుపెడితే అనేక చిత్రాల్లో పాము సీన్లను రజినీ రక్తికట్టించారు.
రజినీ నటించిన తమిళసినిమా ‘తంబిక్కు ఎంద ఊరు’’ సినిమాలో రజనీ తనపై పాము పాకుతున్న విషయాన్ని గమనించకుండా పుస్తకం చదువుతుంటాడు. కొంతసేపటి తరువాత పామును గమనించి...పా...పా... అంటూ ఆయన చేసిన నటన నవ్వులు పూయించింది.
అదే విధంగా అన్నామలై (తెలుగులో ‘కొండపల్లి రాజా’గా రీమేక్ అయింది. వెంకటేష్ హీరోగా నటించారు) చిత్రంలో రజినీకాంత్, ఖుష్బూ హాస్టల్‌కు పాలు పోయడానికి వెళతారు. అక్కడ ఖుష్బు బాత్‌రూమ్‌లో పాము దూరుతుంది. తనను రక్షించాలంటూ ఖుష్బూ రజినీని పిలుస్తుంది. ఆ సీన్‌లో పామును చూసి రజినీ భయపడినట్టుగా నటించిన తీరు ఫాన్స్‌ను థ్రిల్‌కు గురిచేసింది.
ఇక పడయప్ప సినిమాలో అయితే (తెలుగులో నరసింహ) రజినీ పుట్టలో చేయి పెట్టి పామును బయటకు తీసి ముద్దుపెట్టే సన్నివేశంతో రజినీ హరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వీటితోపాటు చంద్రముఖి, రోబో2 సినిమాలలో కూడా పాము దృశ్యాలు ఉంటాయి కానీ, ఆ సీన్స్‌లో రజినీకాంత్ కనిపించరు.
చంద్రముఖి సినిమాలో అతిపెద్ద పాముతో హీరోయిన్ మాట్లాడుతుంటుంది. చాలా మంది భయంతో ఈ సీన్లను చూసి ఉండరు. సినిమా మొత్తం ఈ పామును చూపిస్తారు.
అలాగే రోబో 2.0లో విలన్ అనేక రూపాలలో వస్తుంటాడు. ఇందులో భాగంగా పామురూపంలో కూడా వస్తాడు.
వీటన్నింటి తరువాత రజినీ సినిమాలలో పాము ఉంటే విజయం తథ్యమనే సెంటిమెంట్ బలపడింది. దీంతో దర్శకులు రజిని సినిమాలలో పాము సీన్లను షూట్ చేయడం పరిపాటైంది.

ఫొటో సోర్స్, Getty Images
డైరెక్టర్ సురేష్ కృష్ణ ఏం చెప్పారు?
రజినీకాంత్‌తో అన్నామలై చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కృష్ణ ఆ సినిమాలోని పాము సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.
ఖుష్బూ ఉండే లేడీస్ హాస్టల్లో పాము దూరుతుంది. దీంతో హాస్టల్లోని వారందరూ పాము పాము అంటూ భయపడుతుంటారు. అదే సమయానికి రజినీ పాలు పోయడానికి వస్తారు. వారు రజినీనీ పామును బయటకు పంపమని వేడుకున్న సన్నివేశంలో రజినీ భయపడుతూ చేసిన నటన అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా పాము ఆయన ఒంటిపై పాకి మెడపైన చుట్టుకున్నప్పుడు నోట మాటరానట్టు పా..పా.. అంటూ ఆయన చేసిన నటనకు థియేటర్లలో ప్రేక్షులు సమ్మోహితులయ్యారు. దీని తరువాత స్నానం చేస్తున్న ఖుష్బూ ఏమిటీ గొడవ అంటూ తలుపు తెరవడం, పాము బాత్రూమ్‌లోకి దూరడం, పాము వెనుకే రజినీ వెళ్లడం, అది అక్కడి కిటికీలోంచి బయటకు వెళ్లిపోవడం, హమ్మయ్యా పాము వెళ్ళిపోయిందని ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నా, తామున్న స్థితి గుర్తుకొచ్చి ఇద్దరూ కేకలు వేయడం, తరువాత రజినీ... సోయిలో లేనట్టుగా బయటకు వచ్చి వెళ్ళిపోయిన సీన్ అప్పటి ప్రేక్షులకు ఇప్పటికీ గుర్తే.
రజినీ పాముతో చేసిన సీన్ చూసి సెట్లో ఉన్నవారంతా వావ్ అంటే తరువాత ప్రేక్షకులు కూడా ఈ పాము సీన్‌కు నీరాజనాలు పలికారు.
‘‘ఈ సీన్‌లో పాము రజినీ మెడలోకి వెళ్ళినప్పుడు చిత్రీకరణ జరిపాం. దానిని చూశాకా అచ్చం శివుడి మెడలో పాములా అనిపించింది. ఒకదశలో రజినీ భయంతో నా పేరును ఓ మంత్రంలా పదేపదే పిలిచారు. దీని తరువాత సెట్లో ఏదో అలజడి జరుగుతున్నట్టనిపించి వెనక్కి తిరిగి చూస్తే మేనేజర్ పామును తీసుకువచ్చిన వ్యక్తితో ఏదో వాదిస్తూ కనిపించారు. తరువాత మేనేజర్ డబ్బులిచ్చి ఆ పాములాయనను పంపించి వేశాడు. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే పాము కోరలు తీయకుండానే తీసుకువచ్చారట. ఈ విషయం తెలిసి ఏం చెప్పాలో నాకు తెలియలేదు. అదృష్టవశాత్తు రజినీకి ఏమీ కాలేదు. పైగా ఆ పాము ఆయన మెడపైకి కూడా ఎక్కింది’’ అని డైరెక్టర్ సురేష్ కృష్ణ ‘మై డేస్ విత్ బాషా’ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చంద్రముఖిలో 30 అడుగుల పాము
రజినీకాంత్ సినిమాలలో పాము సీన్లు కథలో భాగంగానో మరో రకంగానూ కనిపిస్తుంటాయి. అయితే చంద్రముఖిలో మాత్రం 30 అడుగుల పాము ఎప్పటికప్పుడు కనిపించి మాయమవుతుంటుంది.
చంద్రముఖి 2 విడుదల సందర్భంగా దర్శకుడు పీ.వాసు దీనిపై మాట్లాడారు.
‘‘ ఎక్కడ నిధి ఉంటుందో అక్కడ పాములు ఉంటాయి. అందువల్లే నిధి ఉన్న చంద్రముఖి గదిలో పాము ఉంది. మీకు పద్మనాభ ఆలయం గురించి తెలుసు కదా. అక్కడ నాలుగైదు గదులు ఉన్నాయి. చాలా ఏళ్ళ తరువాత తలుపు తెరిచాకా అక్కడ ఎన్నో పాములు ఉన్నాయి’’ అని చెప్పారు.
‘‘నేను కథా చర్చల సందర్భంలో చాలామంది రచయితలను మూసి ఉన్న గదిలోకి పాము ఎలా వస్తుందని అడిగాను. చాలా మంది సీనియర్ రచయితలను, నటులను కూడా అడిగాను. వారంతా నిధి ఉన్న చోట పాము ఉంటుందని చెప్పారు. అందుకే సినిమాలో పామును పెట్టాం’’ అని వాసు తెలిపారు.
రజినీ మునుపటి చిత్రాల్లో పాము సెంటిమెంట్ బాగా పనిచేయడంతో చంద్రముఖి సినిమాలో అదోక పాత్రగా మారిందని వాసు చెప్పారు.
ఇక రోబో 2.0లో పతాక సన్నివేశాలలో విలన్ పక్షి పాము రూపంలో రావడం, రజినీ ఫైట్ చేయడం కనిపిస్తాయి. దీని తరువాత రజనీ సినిమాలలో పాము సన్నివేశాలు కనిపించలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ ఆపిల్‌కు వచ్చిన కష్టాలేంటి?
- మోనాలిసా నవ్వు వెనుక దాగిన రహస్యం ఏంటో తెలుసా?
- సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు?
- బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














