కాప్-28: తన ఇంటిని కాపాడుకోవడానికి 8,000 మైళ్లు ప్రయాణించిన తువాలు మహిళ

- రచయిత, జార్జినా రానార్డ్
- హోదా, క్లైమేట్ రిపోర్టర్, దుబాయ్
మహాసముద్రాలను ఎలా రక్షించాలనే దానిపై ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి, ఈ సమావేశాలను ఒక మహిళ నిశితంగా పరిశీలిస్తున్నారు.
లోతట్టు పసిఫిక్ దీవుల సమూహమైన 'తువాలు' ప్రాంత భవిష్యత్తుపై చర్చించడానికి దుబాయ్‌కి వచ్చారు 25 ఏళ్ల మెర్వినా పౌలీ. ఆమె తువాలులో నివసిస్తున్నారు.
మనం సముద్రాలకు చాలా రుణపడి ఉంటాం, వాతావరణంలోని వేడిని గ్రహించి గ్లోబల్ వార్మింగ్ నుంచి మనల్ని రక్షిస్తాయి సముద్రాలు. అవే సముద్రాలు ఇపుడు ప్రమాదంలో పడిపోయాయి.
శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం అంగీకరిస్తే, మహాసముద్రాలే విజేతలు అవుతాయి.

'నా దేశం కోసం ఏం చేసినా విలువైనదే'
మెర్వినాకు ఈ కాప్ సమ్మిట్ ఎంతో ముఖ్యం. అందుకోసం ఆమె 24 గంటలపాటు విమానంలో ప్రయాణించి ఫిజీ నుంచి హాంకాంగ్ మీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చేరుకున్నారు.
"మనందరికీ భూమితో అనుబంధం ఉంది. నా దేశం కోసం ఏం చేసినా అది విలువైనదే" అని మెర్వినా అంటున్నారు.
మెర్వినా తువాలు నుంచి వచ్చిన గ్రూపులో ఒకరు, అక్కడి ప్రజలు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సముద్ర మట్టం పెరుగుతున్నందున వారి నివాస ప్రాంతమైన తువాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
"తువాలు గణాంకాలు ఆశాజనకంగా లేవు. అసలు తువాలు లేదన్నట్లు చూడటం నాకు నిజంగా బాధ కలిగించింది" అని మెర్వినా చెప్పారు.
సముద్రం పక్కన తన ఇంటికి ఇరువైపులా ఉన్న ఇసుక, అందమైన నీటి గురించి మాట్లాడుతున్నారు మెర్వినా.

ఫొటో సోర్స్, Getty Images
పైకి వస్తున్న సముద్రం
గత 30 ఏళ్లలో సముద్రం 0.15 మీటర్లు పైకి వచ్చింది, అది వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి మరో 20 సెంటీమీటర్లు పెరగొచ్చు.
ద్వీపవాసుల సంస్కృతి, చరిత్ర, జీవనోపాధి పూర్తిగా సముద్రాలపై ఆధారపడి ఉంది. వారికి మంచి చేపలున్న నిలయమే కాకుండా, నీటి ఎత్తు పెరగని మహాసముద్రాలు కావాలి.
ఈ సమస్య తువాలుది మాత్రమే కాదు, చాలామంది ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
మహాసముద్రాలు భూమి, దానిపై నివసించే జీవుల కోసం గొప్ప సేవ చేశాయని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) వైస్ చైర్మన్ కో బారెట్ అంటున్నారు.
కో బారెట్, అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) సీనియర్ వాతావరణ సలహాదారు కూడా.
మానవులు బొగ్గు, చమురు, వాయువులను మండించి, గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయడం ద్వారా పుట్టిన వేడిలో 90 శాతం లోతైన జలాలు గ్రహిస్తున్నాయి. అందుకే భూ గ్రహం తొందరగా వేడెక్కకుండా ఉంటోంది.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా మహా సముద్రాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
దుబాయ్ ఒడ్డున కాప్-28లో నాయకులంతా సమావేశమయ్యే ప్రదేశానికి కొంచెం దూరంలోని జలాల ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్.
సగటు ప్రపంచ సముద్ర ఉష్ణోగ్రత ఈ ఏడాది జూలైలో అత్యధిక స్థాయికి చేరుకుంది.
'చేపలు పట్టడం కష్టమవుతోంది'
తువాలులో ట్యూనా చేపలు చల్లటి నీటి వైపు తరలిపోతున్నాయని, మత్స్యకారులు తీరాల నుంచి ఎక్కువదూరం వెళ్లి వాటిని పట్టుకోవడం కష్టతరం అవుతుందని మెర్వినా గుర్తుచేస్తున్నారు.
వాతావరణ మార్పులపై జరిగే చర్చల్లో మహాసముద్రాలపై తగినంత శ్రద్ధ చూపడం లేదని ఓషన్స్ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి పీటర్ థాంప్సన్ అంటున్నారు.
కాప్-28 సదస్సులోని ఓషన్స్ పెవిలియన్‌లో పీటర్ మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చల ఒప్పందంలో మహాసముద్రాల గురించి రెండేళ్ల క్రితం ప్రస్తావించారని పీటర్ గుర్తుచేశారు.
సముద్రం గల నార్వే, సీషెల్స్, అమెరికా వంటి కొన్ని దేశాల మంత్రులు, తదుపరి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడటానికి శనివారం సమావేశమయ్యారు.
అలల శక్తి (టైడల్ ఎనర్జీ) నుంచి పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడం వంటి పరిష్కారాలపై వారు చర్చించారు.
పెరూ సమీపంలో ఉన్న ఓడలోని శాస్త్రవేత్తలతో సహా 100కి పైగా సంస్థలు దుబాయ్ మహాసముద్రాల డిక్లరేషన్‌పై సంతకం చేశాయి.
మహాసముద్రాలు వేడిని విడుదల చేయడానికి ఎంత సమయం మిగిలిఉందో తెలుసుకోవడానికి ఈ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UN CLIMATE CHANGE/KIARA WORTH
'ఉత్తమ పరిష్కారం సముద్రమే'
నత్రజని స్థాయిలను, ఆమ్లీకరణను కొలిచేందుకు వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన కొల్లెట్ కెల్లీ ఓడలో పరికరాలను ఏర్పాటుచేశారు.
లోతైన నీటిలో అధిక సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి.
అంతేకాదు, దుబాయ్ డిక్లరేషన్, సముద్ర శాస్త్రంలో పెట్టుబడులకు పిలుపునిచ్చింది.
సముద్ర మట్టాలు పెరగడం, పగడపు దిబ్బల క్షీణత వంటి సమస్యలను తెలుసుకోవడానికి నిపుణులకు ఈ పెట్టుబడి చాలా కీలకం కానుంది.
"సులువుగా చెప్పాలంటే, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి మనకున్న ఉత్తమ పరిష్కారాలలో సముద్రం ఒకటి. ప్రభుత్వాలు తమ జాతీయ వాతావరణ లక్ష్యాలు, వ్యూహాలు, విధానాలలో సముద్రానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉండాలి" అని వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఓషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ టామ్ పికెరెల్ చెప్పారు.
అయితే, పసిఫిక్ దీవుల్లోని ప్రజలకు ఇది చాలా ఆలస్యం కావచ్చు. ఎందుకంటే హిమానీనదాలు కరిగి, సముద్ర మట్టం పెరుగుదల మొదలై, భూ వ్యవస్థలోకి ఈ సమస్య వచ్చింది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం ఆగిపోతుందా? చల్లటి స్థాయిలో స్థిరపడుతుందా? అనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది.
ఈ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాన్ని గ్రహించి, పొరుగు దేశమైన ఆస్ట్రేలియా పసిఫిక్ దీవుల ప్రజలకు శరణార్థ వీసాలు అందించింది.
అయితే, ఆ ఆఫర్‌ను అంగీకరించబోమని మెర్వినా అంటున్నారు.
"నేను తువాలును ప్రేమిస్తున్నాను. మేం ఒకరికొకరం బాగా తెలుసు. మాది ఒకరికొకరం సాయం చేసుకునే సమాజం. ఇప్పుడు మా సంస్కృతిని కోల్పోతానేమోనని ఆందోళనగా ఉంది" అని అన్నారు.
చిన్నప్పుడు తన అమ్మమ్మ దీవిలో జరిగిన నూతన సంవత్సర వేడుకల జ్ఞాపకాన్ని మెర్వినా పంచుకున్నారు.
''మేం చిన్న పిల్లలమే, కానీ, తెల్లవారుజామున 4 వరకు మేల్కొని ఉన్నాం, అందరూ సంప్రదాయ ఫకాసీయాకు నృత్యం చేశారు. పిల్లలు టిన్ డబ్బాలు వాయించారు. సంగీతం ఎప్పుడైతే వింటారో వెంటనే డ్యాన్స్ మొదలుపెట్టేస్తారు'' అని ఆమె అన్నారు.
తువాలు ప్రజల కోసం పోరాడుతానని, అలాగే ద్వీపాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కాప్-28ని కోరడానికి ఆమె వచ్చారు.
ఇవి కూడా చదవండి
- మహువా మొయిత్రా బహిష్కరణ: ఈ కేసును రమేశ్ బిధూరీ వ్యవహారంతో ఎందుకు ముడిపెడుతున్నారు? డానిష్ అలీ ఆరోపణలేంటి
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- తెలంగాణ ఎన్నికలలో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న మూడు పాటలు
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- పోలింగ్‌కు ముందు అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా పడతాయా? చట్టం ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














