లిటిల్ హైతీ: ఇక్కడ సముద్రమట్టం పెరిగిపోతుంటే ఇళ్ళ అద్దెలు పెరిగిపోతున్నాయి...

రెనైటా హోమ్స్
ఫొటో క్యాప్షన్, రెనైటా హోమ్స్ గడిచిన మూడేళ్ళలో అద్దె పెరగడం కారణంగా నాలుగు ఇళ్ళు మారారు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఫ్లారిడాలో మయామీ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుండటంతో స్థిరాస్థి వ్యాపారుల కన్ను పొరుగునే సముద్రమట్టానికి ఎగువన ఉండే పేదల ప్రాంతంపై పడింది. దీంతో ఇక్కడ అద్దెలు పెరిగిపోతుండటంతో పేదలు ఈప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వస్తోంది.

‘‘ఇదో అందమైన ప్రదేశం. ఈ ఉష్ణమండల ప్రాంతాన్ని స్థిరాస్తి వ్యాపారులు అమ్మకానికి పెడుతున్నారు’’ అని రెనైటా హోమ్స్ చెప్పారు. ఈమె హౌసింగ్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నారు.

‘‘వారిక్కడ ఇళ్ళు కట్టి అందరూ మియామికి తరలి రావాలని కోరుకుంటున్నారు. మేమిక్కడ నుంచి వలసపోవాలని చూస్తున్నారు’’

విలాసవంతమైన మయామీ బీచ్‌కు ఐదుమైళ్ళ దూరంలోని లిటిల్ హైతీలో హోమ్స్ నివసిస్తున్నారు. ఇక్కడి రంగురంగల వీధులలో మీరు నడుస్తుంటే క్రియోల్ భాష వినిపిస్తుంటుంది, కరేబియన్ వంటల ఘుమఘుమలు మీ నోరూరేలా చేస్తుంటాయి.

‘‘లిటిల్ హైతీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రాంతంలోని చిత్తడినేలలు, అల్లుకుపోయే తీగలంటే నాకెంతో ఇష్టం’’ అని చెప్పారు హోమ్స్

‘‘హైతీయన్ ప్రజలు, వారి సంస్కృతి చైతన్యవంతమైనవి. ఇక్కడి ప్రజలు అందంగా ఉంటారు, ప్రతిభావంతులు కూడా. ఇప్పుడిది నా ఇల్లు కూడా’’ అని చెప్పారు.

లిటిల్ హైతీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోడలపై బొమ్మలకు లిటిల్ హైతీ ప్రసిద్ధి

స్థానభ్రంశం

మయామి నగరంలోని పేదరికపు సగటుకంటే లిటిల్ హైతీలోని పేదరికం ఎక్కువ. ఇక్కడి ప్రజలందరూ దిగువ మధ్య తరగతి వారే. 20వ శతాబ్దం మొదట్లో జాతివిభజన చట్టాల కారణంగానూ, బలవంతంగా మైనార్టీలకు కల్పించిన పునరావాసాలకు, పేదలకు లిటిల్ హైతీలాంటి పొరుగు ప్రాంతాలు ఆశ్రయంగా మారాయి.

ఈ ప్రాంతానికి పొరుగునే ఉన్న డిజైన్ డిస్ట్రిక్ట్ లోని హిప్ బార్స్, రెస్టారెంట్లు, వైన్‌వుడ్‌లోని కుడ్యకళాకృతులు స్థిరాస్థి వ్యాపారులను ఆకర్షిస్తున్నాయి.

వైన్‌వుడ్‌లో పలు ప్రాంతాలను అభివృద్ధి చేసిన స్థిరాస్థి వ్యాపారి టోని చో దృష్టి ఇప్పడు లిటిల్ హైతీపై పడింది. ఆయన ఇక్కడ 792 మిలియన్ల పెట్టుబడితో ఆకాశహార్మ్యాల నిర్మాణానికి ప్రణాళిక వేశారు.

ఇందుకోసం 2019లోనే అనుమతులు కూడా తీసుకున్నారు. దీనికి మ్యాజిక్ సిటీ అనేపేరు కూడా పెట్టారు. మొత్తం 18 ఎకరాలలో దీనిని నిర్మించనున్నారు.

దీని ప్రభావం తమ జేబులపై పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఏడాదిలోపే తన ఇంటి అద్దె రెట్టింపు అయిందని లిటిల్ హైతీ ప్రధాన వీధులలో కేఫ్ నడుపుతున్న రెయినా కార్టజెన్ చెప్పారు. చాలామంది కస్టమర్లు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారని ఆమె చెప్పారు. తాను కూడా అదే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. ఇప్పటికే ఈ వీధిలోనే అనేక వ్యాపారాలు మూతపడ్డాయి.

‘‘నేను నాదైన చోటు కోల్పోతున్నాను అని అనుకుంటున్నాను. అద్దెలు పెనుభారంగా మారాయి. నా నిత్యావసరాలను కూడా కొనుక్కోలేకపోతున్నాను’’ అని చెప్పారు.

తన ఇంటి అద్దె గడిచిన మూడేళ్ళలో 1,200 అమెరికన్ డాలర్లనుంచి 1,800 డాలర్లకు పెరిగినట్టు రెనైటా చెప్పారు.

‘‘స్థలాల అభివృద్ధి మొదలైంది, మా అభివృద్ధి ఆగిపోయింది’’ అని ఆమె చెప్పారు.

‘‘ ఇందులోని అంతిమ సూత్రం డబ్బే. చౌకగా కొను. ఎక్కువ ధరకు అమ్ము. దీని వలన మేము నిరాశ్రయులవుతున్న భావన కలుగుతోంది’’ అని తెలిపారు.

లిటిల్ హైతీలో రెండు అంతస్తులు మించి నిర్మాణాలు లేని చోట ఆకాశహార్మ్యాలు నిర్మించాలనే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అయితే సరసమైన ధరలలో ఇళ్ళు లభించేలా, ప్రజా ప్రయోజనా లకోసం 31 మిలియన్ల నిధులను మ్యాజిక్ సిటీ డెవలప్‌మెంట్ వెచ్చించనుంది.

హైతీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదలు, తుపానులు మియామీలో సాధారణమవుతున్నాయి

సముద్ర మట్టానికంటే ఎత్తులో..

లిటిల్ హైతీకి ఉన్న ప్రధాన ఆకర్షణ దాని ఎత్తే. సున్నపురాయి కొండపై సముద్రమట్టానికి 5.5 మీటర్ల ఎత్తులో ఈ ఊరు ఉంది. ఇది మియామీ బీచ్ కంటే నాలుగురెట్లు ఎక్కువ ఎత్తులో ఉంది. సముద్ర మట్టం పెరుగుతూ ఉంటే వచ్చే వరద నీటిని బయటకు పంపేందుకు మియామీలో ఏర్పాట్లు లేవు.

గడిచిన 31 సంవత్సరాలలో మయామిలో సముద్రమట్టం 6 ఇంచులు ( 15 సెంటిమీటర్లు) పెరిగిందని, రాబోయే 15 ఏళ్ళలోనూ ఇలాంటి పెరుగుదలే ఉంటుందని ఫ్లోరిడా వాతావరణ కేంద్రం తెలిపింది.

2100 నాటికల్లా సుమారు ఏడు అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుందని మిగతా పరిశోధనలు చెబుతున్నాయిి.

ఈ మార్పు లిటిల్ హైతీలో ప్రజలను బాధితులుగా మార్చుతోంది. ఇది క్లైమెట్ జెంట్రిఫికేషన్ వైపు దారి తీస్తోంది. అంటే దీనర్థం మారుతున్న వాతావరణ ప్రభావానికి లోనుకాకుండా ఉండే ప్రాంతాలలోకి ధనవంతులు వచ్చి, అప్పటికే అక్కడ నివసిస్తున్న పేదలను నిరాశ్రయులను చేయడమని.

‘‘సరిగ్గా ఇదే జరుగుతోంది’’ అని రెనైటా హెమ్స్ చెప్పారు.

ఒకప్పుడు లిటిల్ హైతీని ఎవరూ పట్టించుకునేవారు కాదు అని ఫ్లారిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ విలియమ్ బట్లర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం చాలా చాలా అవసరమైనది, ఇది విషాదం అని చెప్పారు.

ఈ పరిణామం అత్యల్ప ఆదాయవర్గాలను నిరాశ్రమయులను చేస్తుంది. వాతావరణ మార్పులకు బలయ్యేవారిలో ముందువరుసలో ఉండేది వీరే అని ఆయన తెలిపారు.

లిటిల్ హైతీలో క్లైమెట్ జెంట్రిఫికేషన్ అనేది కీలక విషయమో కాదో ఇప్పుడే చెప్పలేమని విలియం బట్లర్ భావిస్తున్నారు.

సముద్రమట్టాల పెరుగుదల నుంచి, తుపాన్లు, వరదల నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతున్న ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రకటనలను స్థానికులు గమనిస్తున్నారు.

లిటిల్ హైతీ ఎత్తు వాతావరణ మార్పుల ప్రభావానికి లోనుకాకుండా ఉంటుందని మ్యాజిక్ సిటీ నిర్వాహకులు భావిస్తున్నారు.

హైతీ
ఫొటో క్యాప్షన్, మ్యాజిక్ సిటీ ఆలోచన వెనుక టోనీ చౌ

హైతీ అస్తిత్వాన్ని కాపాడతాం

స్థిరాస్థి వ్యాపారి టోనీ చౌ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. కొంతమంది తన వద్దకు వచ్చి లిటిల్ హైతీ సముద్రమట్టానికి 18 అడుగుల ఎత్తులో ఉన్న కారణంగా పెట్టుబడులు పెడతామన్నారని చెప్పినట్టు ఆయన తెలిపారు.

పెట్టుబడులు పెట్టేవారందరూ తమ పెట్టుబడులపై లాభం రావాలని ఆశిస్తారు. దీంతో తామెక్కడ పెట్టుబడులు పెడితే తమ పెట్టుబడి విలువ పెరుగుతుందో ప్రజలు అక్కడికే వస్తారంటారు టోనీ చౌ.

లిటిల్ హైతీ కూడా మియామి బీచ్ లాంటిదేనని టోనీ చౌ అంటారు. ఇక్కడున్న సున్నపురాయి కొండ స్పాంజ్‌లా ఉంది. అటు మియామిలోనూ, ఇటు లిటిల్ హైతీలోనూ రాళ్ళు తేమగా మారడం సర్వసాధారణం అని చెప్పారు.

లిటిల్ హైతీలో జెంట్రిఫికేషన్ జరుగుతోందనే విషయాన్ని ఆయన ఖండించలేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలలో జరుగుతున్నదే అని చెప్పారు.

గోడలలో తేమ పెరగడాన్ని రెనైటా హోమ్స్ కూడా గమనించారు. గడిచిన మూడేళ్ళలో ఆమె నాలుగు ఇళ్ళు మారడానికి ఇదే కారనం. ఆమె ఈ తేమ బాధ లేని, చక్కని ఇంటికోసం చూస్తున్నారు.

‘‘ఇది అందమైన ప్రాంతం. కానీ నేల అడుగున భిన్నంగా ఉంది.

లిటిల్ హైతీలోని తన కమ్యూనిటీని రక్షించుకోవడానికి హోమ్స్ , ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్జీఓ క్లియో ఇనిస్టిట్యూట్‌లో భాగమయ్యారు.

మహిళ సాధికారికత, వాతావరణ సంక్షోభం బారినపడుతున్నవారిని చైతన్యపరచడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.

వారు మాకు పదబంధాలను, జ్ఞానాన్ని అందించాక అర్థమైనది ఏమంటే సముద్ర మట్టాలు పెరుగుతోంది నాకోసమేనని అర్థమైంది.

నిస్సహాయులైన వారి గృహ హక్కుల కోసం ఆమె పనిచేస్తున్నారు. బీబీసీ 2023కు ఎంపిక చేసిన 100మంది మహిళల్లో హోమ్స్ ఒకరు.

లిటిల్ హైతీ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఆమె తన ఇరుగుపొరుగువారిని చైతన్య పరుస్తున్నారు.

‘‘మనం మన కథలు చెప్పకపోయినా, మనం చైతన్యం కాకపోయినా, వాళ్ళు మన నెత్తిన భవనాలు కట్టేసి, దీన్నొక కాంక్రీట్ నగరంగా మార్చేస్తారు’’ అని హోమ్స్ చెప్పారు.

‘‘ఇది గాయపరిచే విషయం. ఎలా జీవించాలో తెలియక ఆందోళన చెందే సంగతి. అందుకే ఈ విషయాలపై నేను చైతన్యవంతమయ్యాను. నేను నా గొంతు విప్పుతూనే ఉంటాను. నేనిక్కడే జీవిస్తాను.’’ అంటారు హోమ్స్

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ కన్నా ఆరు రెట్లు పెద్దదైన ఐస్‌బర్గ్ 37 ఏళ్ల తర్వాత ఎలా కదులుతోందంటే....

ఇవికూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)