'విశాఖపట్నం వచ్చేస్తున్నా' అని సీఎం జగన్ ఎన్నిసార్లు చెప్పారు... ఎందుకు రావడం లేదు?

ఫొటో సోర్స్, YSR Congress Party - YSRCP/fb
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
జనవరి 31: ‘‘కొద్ది నెలల్లో నేను విశాఖకు మారుతున్నా’’
సెప్టెంబరు 20: ‘‘దసరా నుంచి విశాఖకు మారుతున్నా’’
అక్టోబరు 16: ‘‘డిసెంబరులో విశాఖకు వస్తున్నా’’
విశాఖకు పాలన మారడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి. మూడు రాజధానుల ఫార్ములాలో భాగంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నట్లు సుమారు రెండేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యాయపరమైన చిక్కులతో మూడు రాజధానుల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచి పోయింది. అయితే తాను విశాఖపట్నానికి మారతానంటూ దాదాపు ఏడాది కాలంగా తరచూ జగన్ చెబుతూ వస్తున్నారు. కానీ ఇంతవరకు వైజాగ్‌కు ఆయన మారలేదు. డిసెంబరు నెలలో మారుతామని ఇటీవల చెప్పారు.

ఫొటో సోర్స్, YSR Congress Party - YSRCP
జనవరి 31, 2023: ‘త్వరలోనే విశాఖకు మారుతున్నా’
ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సీఎం, మంత్రులు వివిధ వేదికలపై ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలోనే దిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ తాను విశాఖకి షిప్ట్ అవుతున్నానని చెప్పారు.
"విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా" అని సీఎం జగన్ 2023, జనవరి 31న అన్నారు.
మార్చి 3, 2023: ‘‘రానున్న రోజుల్లో నేను విశాఖకు మారుతున్నా’’
మార్చిలో విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికపై నుంచి కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని వెల్లడించారు.

ఫొటో సోర్స్, YSR Congress Party - YSRCP
మే 3, 2023: ‘‘విశాఖకు త్వరలోనే మారుతున్నా’’
ఈ ఏడాది మే 3వ తేదీన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచిలా ఉండే విశాఖకు తాను త్వరలో మారబోతున్నానని, విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానంటూ చెప్పారు.

సెప్టెంబర్ 20, 2023: ‘‘దసరా నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం’’
ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరగిన కేబినేట్ భేటిలో కూడా సీఎం విశాఖ పాలన కేంద్రంపై మాట్లాడారు. ఈ సారి మరింత స్పష్టంగా సమయాన్ని కూడా చెప్పారు.
దసరా (అక్టోబర్ 24) నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినేట్ లో వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రకటన తర్వాత రుషికొండపై సీఎం నివాసమంటూ ప్రచారం జరుగుతున్న నిర్మాణాలు మరింత ఊపందుకున్నాయి.
అదే సమయంలో ఇతర కార్యాలయాల కోసం విశాఖలో ఉన్న భవనాలు ఉపయోగించుకోబోతున్నట్లు 2023, అక్టోబర్ 11వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవో నంబరు 2015 విడుదల చేసింది.
వైసీపీ కూడా ‘‘విశాఖ వందనం’’ అనే కార్యక్రమాన్ని చేపట్టి...విశాఖకి సీఎం జగన్ రాకని స్వాగతిస్తూ కార్యక్రమాలు చేపట్టింది.

ఫొటో సోర్స్, ysrcp
అక్టోబర్ 16, 2023: ‘డిసెంబర్ నుంచి విశాఖలో పాలన’
సీఎం జగనే విశాఖకు మారడం మీద మరొకసారి ప్రకటన చేశారు.
విశాఖలో ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని అక్టోబర్ 16న సీఎం జగన్ ప్రారంభించారు.
ఆ సందర్భంగా ‘‘నేను అక్టోబర్ నాటికి విశాఖ వచ్చేద్దామని అనుకున్నాను. అనివార్య కారణాల వలన డిసెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తాను” అని జగన్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది.
మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ.. మొత్తం 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని పేర్కొంది.
ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండలో పలు భవనాలను విభాగాధిపతులు, ఇతర కార్యాలయాలకు కేటాయించింది.
జీఏడీ, ఆర్థిక, గ్రామ-వార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు చినగదిలి, ఎండాడ, హనుమంతవాక ప్రాంతాల్లోని భవనాలు కేటాయించారు.
అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఉత్తర్వుల్లో సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది పేర్కొనలేదు.
సుమారు ఏడాది కాలంగా ‘‘విశాఖకు మారుతున్నాం’’ అంటూ అనేక సార్లు చెప్పినా ఇంతవరకు జగన్ మారలేదు.
ఇప్పుడు డిసెంబర్ నెల అంటూ కొత్త గడువు చెప్పారు.

ఫొటో సోర్స్, YSR Congress Party - YSRCP
ఇన్ని ప్రకటనలు, వాయిదాలు ఎందుకు?
విశాఖ కేంద్రంగా ఇన్ని ఏర్పాట్లు, హడావుడి జరుగుతున్న సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి పాలన అంశంపై ఇన్ని ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలు సమీపిస్తున్నా కూడా సీఎం జగన్ ఎందుకు దానికి కార్యచరణలోకి తీసుకురాలేకపోతున్నారు? అనే అంశాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే అసలు విశాఖ వస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఎం.యుగంధర్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.
“వైసీపీ ప్రభుత్వానికి విశాఖ నుంచి పరిపాలన సాగించడం అనే అంశంపై చిత్తశుద్ధి లేదు. దీన్ని ఎన్నికలకు ఉపయోగపడే అంశంగానే వైసీపీ చూస్తోందని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే సీఎం రావాలనుకుంటే రుషికొండపై భవనాలే అక్కరలేదు. పోర్టు గెస్ట్ హౌస్, వీఎంఆర్డీయే భవనాలు అనేకం అందుబాటులో ఉన్నాయి” అని ఆయన అన్నారు.
“కమిటీల పేరుతో సీఎం విశాఖ రాకను ప్రకటనలకే పరిమితం చేస్తున్నారు. మరో వైపు కోర్టుల్లో కేసులు ఎలాగూ ఉన్నాయి. తాను విశాఖ వద్దామని అనుకుంటే, ప్రతిపక్షం కోర్టు కేసులు వేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటుందనే సాకు చూపించడానికి విశాఖ పాలన రాజధాని అంశాన్ని వాడుతున్నట్లు కనిపిస్తోంది.” అని ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన జరగడం ఖాయమని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఈ నెల మొదటివారంలో అన్నారు.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
హైకోర్టులో ప్రభుత్వం ఏం చెప్పింది?
ఈ నెల 12వ తేదీన విశాఖకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోరుతూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్‌లో పేర్కొంది.
ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది.
కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














