సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు: తెలంగాణలో ప్రభుత్వం మారడంతో కార్మిక సంఘాల నాయకత్వాలూ మారుతాయా?

సింగరేణి ఎన్నికలు

ఫొటో సోర్స్, REVANTHREDDY/GETTY IMAGES/BRS

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా ఉన్న సింగరేణిలో నేడు(డిసెంబర్ 27న) ‘గుర్తింపు కార్మిక సంఘం’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

తెలంగాణ గురించి మాట్లాడితే.. అందులో ‘సింగరేణి’ ఒక అధ్యాయం. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా.

సింగరేణి పరిధిలోని ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతిలో ఆ కంపెనీది కీలకపాత్ర. ఇక్కడి రాజకీయాలను శాసించే స్థాయిలో ‘సింగరేణి కాలరీస్’ కార్మికులు ఉన్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా కార్మిక సంఘాల నాయకత్వం మారుతుందా?

సింగరేణి

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

తెలంగాణలో ప్రాణహిత-గోదావరి లోయలో 350 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన సింగరేణి, ఈ ప్రాంత ప్రజల సంస్కృతి, జీవనవిధానాలతో పెనవేసుకుపోయింది.

సింగరేణిలో బొగ్గు తవ్వకాలు నిజాం ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నాయి. 1871లో ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. 1920‌లో హైదరాబాద్ కంపెనీస్ యాక్ట్ కింద ‘పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’గా ప్రస్తుత సింగరేణి సంస్థ ఏర్పాటయ్యింది.

తెలంగాణలో 6 జిల్లాల పరిధిలో (కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం) సింగరేణి 18 ఉపరితల (ఓపెన్ కాస్ట్), 24 భూగర్భ గనులను నిర్వహిస్తోంది.

ఒక దశలో లక్షా 20 వేల మంది కార్మికులు సింగరేణి సంస్థలో పనిచేశారు. అయితే, సింగరేణి సంస్థ తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 42 వేలు.

గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో మొత్తం 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సింగరేణి

ఫొటో సోర్స్, Satyam

గుర్తింపు కార్మిక సంఘం

1990లలో పదుల సంఖ్యలో ఏర్పడ్డ కార్మిక సంఘాలు, వాటి మధ్య ఆధిపత్య పోరాటాలు, డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు దిగడంతో తరచూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడేది.

ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు, డిమాండ్లపై కార్మికుల ప్రతినిధిగా యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఒక గుర్తింపు కార్మిక సంఘం ఉండేలా, దాన్ని కార్మికులే ఎన్నుకునేలా ఏర్పాటు చేశారు.

కార్మికులు,యాజమాన్యానికి మధ్య గుర్తింపు సంఘం వారధిగా పనిచేస్తుంది.

1998‌లో మొదటిసారి సింగరేణిలో ‘గుర్తింపు కార్మిక సంఘం’ ఎన్నికలు నిర్వహించారు.

మొదట్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించగా, ఆ తర్వాత కాలపరిమితిని నాలుగేళ్లకు మార్చారు.

సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అందులో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం మూడుసార్లు, ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఒక సారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రెండు సార్లు విజయం సాధించాయి.

చివరిసారిగా 2017లో జరిపిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపొందింది.

నిజానికి రెండేళ్ల క్రితమే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నా కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి.

ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి.

పోటీ ప్రధానంగా జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్ మధ్య నెలకొంది.

సింగరేణి ప్రాంతాన్ని మొత్తం 11 డివిజన్లు (ఏరియాలు) గా విభజించి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

సింగరేణి

సింగరేణి పై అసెంబ్లీ ఫలితాల ప్రభావం ఉంటుందా?

‘ప్రత్యక్ష రాజకీయాలు, కార్మిక సంఘాల మధ్య పోరు వేర్వేరు’ అన్న మాటలు సింగరేణి ఎన్నికల సందర్భంగా వినిపిస్తుంటాయి.

పేరుకు 40 వేల మంది ఓటర్లే అయినా వారి కుటుంబాల ఓట్లు సంస్థ విస్తరించిన ప్రాంతాల్లోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో ఈ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత ఏర్పడుతుంటుంది.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 అసెంబ్లీ, ఐదు పార్లమెంట్ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుంది.

సార్వత్రిక ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సింగరేణి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన సందర్భాలున్నాయి.

అయితే, గతంతో పోలిస్తే సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గింది. మొదటిసారి నిర్వహించిన గుర్తింపు ఎన్నికల్లో 98 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో వచ్చిన స్వచ్చంద పదవీ విరమణ స్కీమ్( గోల్డెన్ షేక్ హ్యాండ్)తో పాటూ కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

‘రాజకీయాలు వేరు, సింగరేణి కార్మిక ఎన్నికలు వేరు. గతంలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు పరిశీలిస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, సమస్యలతో సంబంధం లేకుండా కార్మిక సమస్యలే ప్రధాన ఎంజెండాగా ఈ ఎన్నికలు జరుగుతాయి’’ అని గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్ పూదరి బీబీసీతో అన్నారు.

అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , సీపీఐ పార్టీల మధ్య పొత్తు కొనసాగింది. సీపీఐ అనుబంద కార్మిక సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ప్రస్తుత సింగరేణి ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు.

కార్మికుల పక్షాన డిమాండ్లు చాలా ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి రెండు ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్ మొత్తం పెంచాలన్నవి దీర్ఘకాలిక డిమాండ్లుగా వస్తున్నాయి.

“ఏ యూనియన్ అధికారంలోకి వచ్చినా కార్మికులు ఎప్పుడూ కోరుతున్నది సొంత ఇల్లు. 30 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాక సింగరేణి క్వార్టర్స్ ఖాళీ చేసి ఎక్కడికి పోవాలో ఆర్థం కాని పరిస్థితి ఉంది. పదవీ విరమణ చేసిన కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి 20 లక్షల వరకు వడ్డీ లేని బ్యాంకు రుణం కల్పించాలి. హెల్త్ బెనిఫిట్స్ పెంచాలి. ఒకే కుటుంబం-ఒకే లక్ష్యం-ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి సంస్థ ఆదాయ పన్ను విషయంలో అధికారులకు, కార్మికులకు మధ్య పక్షపాతం చూపుతోంది. అధికారులకు ఐటీ రీయింబర్స్ ఇస్తున్నట్టుగానే కార్మికులకు కూడా కడుతున్న ఆదాయపు పన్నులో కొంత మొత్తం సింగరేణి సంస్థ తిరిగి ఇవ్వాలి ’’ అని రామగుండం రీజియన్ లో పనిచేసే కార్మికుడు కన్నం సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

ఏఐటీయూసీ

ఫొటో సోర్స్, UGC

కార్మిక సంఘాలు ఏమంటున్నాయి:

సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సింగరేణిలో కార్మిక సంఘాల పోటాపోటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఐఎన్టీయూసీ సంఘం 6 గ్యారంటీలతో మానిఫెస్టోను కూడా విడుదల చేసింది.

‘’రాష్ట్రంలో అధికారం మారిన సందర్భాల్లో సింగరేణి కార్మిక సంఘాల్లో అధికార మార్పిడి జరగాలని ఏమీ లేదు. అసెంబ్లీ ఫలితాలకు అనుగుణంగా గతంలో సింగరేణిలో అధికారం మారిన, మారని సందర్భాలు రెండూ ఉన్నాయి. కార్మికుల విశ్వాసం, నాయకత్వంపై నమ్మకమే ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖచ్చితంగా మాకు కలిసి వచ్చే అంశమే’’ అని కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ అన్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాల మధ్య పొత్తులతో ఉమ్మడిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ , కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. అయితే, ప్రస్తుతం సింగరేణిలో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీలు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. వీటి మధ్య పొత్తు అంశంపై రెండు సంఘాల నాయకులు బీబీసీతో మాట్లాడారు.

‘’అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నమాట నిజమే. అయితే , ప్రత్యక్ష రాజకీయాలు, ట్రైడ్ యూనియన్ పాలిటిక్స్ వేరు. మునుగోడు ఉపఎన్నికల్లో సీపీఐ పార్టీ బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట నడిచింది. ఇక సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య ఎలాంటి పొత్తు లేదు’’ అని జనక్ ప్రసాద్ అన్నారు.

‘’సింగరేణిలో మాది పెద్ద సంఘం. గతంలో మూడు సార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచాం కాబట్టి మాకు మద్దతు ఇవ్వాలని అడిగాం, అయితే వారు ఇవ్వలేదు. దీంతో ఒంటరిగా పోటీ చేస్తున్నాం’’ అని ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య బీబీసీతో అన్నారు.

సింగరేణి

ఫొటో సోర్స్, Getty Images

గుర్తింపు కార్మిక సంఘానికి అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ఉద్యమాలు, పోరాటాలు లేకుండానే కేవలం చర్చల ద్వారా కావాల్సినవి సాధించుకునే అవకాశం ఉంటుందని టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.

‘’అలాగని, రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు కార్మిక సంఘం ఒకే పార్టీవారై ఉండాల్సిన అవసరం లేదు. మేం 2012 లో గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 లో మా అనుబంధ పార్టీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేంత వరకు మాకు ప్రభుత్వం అండ లేదు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 12 నుంచి 32 శాతంకు పెంచుకోగలిగాం. వృత్తి పన్ను శాశ్వతంగా రద్దు చేశాం. 10 లక్షల వరకు వడ్డీ లేని గృహ నిర్మాణ రుణం, ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, 12 వేల కారుణ్య నియామకాలు సాధించాం’’ అని రాజిరెడ్డి చెప్పారు.

రిటైర్మెంట్ తర్వాత వస్తున్న పెన్షన్ లు, ఐటీ పన్ను తదితర అంశాలపై ఆయా సంఘాలు తమ అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నాయి.

‘ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి ఇప్పుడు వస్తున్న పెన్షన్‌కు అదనంగా సెకండ్ పెన్షన్ ఇవ్వాలని గతంలో సింగరేణి యాజమాన్యానికి నివేదించాం. ఈ అంశంపై పోరాటం చేస్తాం. ఆదాయపు పన్ను రీఫండ్ అంశంలో కనీసం సగం మొత్తమైనా సంస్థ తిరిగి ఇవ్వాలన్న డిమాండ్‌తో ముందుకు పోతున్నాం’’ అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు రాడిరెడ్డి అన్నారు.

కనీసం మొత్తంగా 6 వేల పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్‌ను ఏఐటీయూసీ చేస్తుండగా, కార్మికులకు వస్తున్న అలవెన్స్‌లను (ప్రెక్స్) ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా చూస్తామని ఐఎన్టీయూసీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)