యానిమల్: ‘ఆల్ఫా మేల్’ అంటే ఏమిటి? ఇలాంటి మగవాళ్లు ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, TSERIES
- రచయిత, నసీరుద్దీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక- యానిమల్ సినిమాలోని అనేక సన్నివేశాలు, సంఘటనలు ఈ కథనంలో ప్రస్తావించాం.)
యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. సినీ పరిశ్రమలో విజయానికి ఆదాయమే కొలమానం. అయితే ఇలా వసూళ్లు రాబట్టేందుకు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు?.
యానిమల్ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన నటులు.
ఈ సినిమా ఎలాంటి సమాజాన్ని ఊహించింది? ప్రపంచానికి ఏం చెప్పడానికి ప్రయత్నించింది? ఈ ప్రయత్నంలో ఎంత వరకు విజయం సాధించింది?
ఈ సినిమా ఆలోచన స్థాయి ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇది వినోదం ఏ మాత్రం కాదు. సామాజిక స్థాయిలో ప్రమాదకరం. ఇది పక్షపాతాలను బలపరుస్తుంది.
ఇందులో ఆధునిక స్త్రీల కథ ఉంది. కానీ, వారి జీవితాలపై వారికి నియంత్రణ ఉండదు. సినిమాలో ముస్లింల చిత్రీకరణ కూడా సరిగా ఉండదు. అన్నింటికంటే మించి, ఇది హింసాత్మక, ఆధిపత్య, భయపెట్టే పురుషాధిక్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రతీకారం, హింసే ఈ చిత్రానికి ప్రధానాంశం. చిన్న హింస కాదు. ఇది దాని ఆధిపత్య స్వరం. పెద్ద తెరపై బుల్లెట్లు, చుట్టూ రక్తంతో కూడిన హింసే కనిపిస్తుంది. క్రూరమైన ప్రవర్తన చూపించారు. భయంకరమైన హత్యా విధానాలుంటాయి. ఇదంతా చేసేది విలన్ కాదు, హీరోనే.
హీరో చేసే పనే ఆయన స్పెషాలిటీ. కొన్నిసార్లు బయటి ప్రపంచంలోని మనుషులను కూడా జడ్జ్ చేసేలా ఉంటుందీ చిత్రం.
ఈ సినిమాలో ఇంతటి హింస ఎందుకు చూపించారు? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. సినిమా ద్వారా హింసను గొప్పదిగా చెబుతున్నారా? లేక హింస బాట పట్టకుండా గుణపాఠం నేర్చుకోవడానికా?

ఫొటో సోర్స్, TWITTER/@ANIMALTHEFILM
‘ఆల్ఫా మేల్’ ఎలా ఉండేవారు?
‘ఆల్ఫా మేల్’ భావన ఈ సినిమాకు పునాది! ఇంతకీ ఈ ఆల్ఫా మేల్ అంటే ఏమిటి?
ఈ చిత్రంలో హీరో పాత్రధారి రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ పాత్రధారి రష్మికకు శతాబ్దాల క్రితం ఆల్ఫా మేల్స్(మగవారు) ఎలా ఉండేవారో చెబుతాడు.
''బలమైన పురుషులు అడవుల్లోకి ప్రవేశించి వేటాడేవారు. ఆ వేట ఫలాన్ని అందరికీ పంచేవారు. ఆడవాళ్లు భోజనం వండేవారు. ఆమె పిల్లలతో పాటు అందరికీ భోజనం పెట్టేది. ఆహారాన్ని వండటమే కాకుండా, వేటగాళ్లలో ఎవరితో పిల్లలను కనాలో కూడా నిర్ణయించుకునేవారు. ఆమెతో ఎవరుంటారు? ఆమెను ఎవరు కాపాడతారు? సమాజం ఇలాగే పనిచేసేది'' అని అంటాడు.
దీనికి విరుద్ధంగా బలహీనమైన పురుషులు ఉంటే, వాళ్లు ఏం చేస్తారు, వాళ్ల వద్దకు మహిళలు ఎలా రాగలరు అని రష్మికను అడుగుతాడు రణ్‌బీర్.
''బలహీనుడు కవిత్వం రాయడం మొదలుపెడతాడు. స్త్రీలను ఆకర్షించడానికి తన కవితలలో చంద్రుడు, నక్షత్రాలను ఉపయోగిస్తాడు. సమాజానికి ఏం చేసినా అది ఆల్ఫా మగవాళ్లు మాత్రమే చేస్తారు. బలహీనులు కవిత్వమే రాస్తారు'' అని ఆమెకు చెబుతాడు.
ఇది మాత్రమే కాదు, హీరో వాదన ప్రకారం.. ‘‘శారీరకంగా తక్కువ బలంగా ఉన్నవారు సమాజానికి పనికిరారు. వారి వల్ల ఉపయోగం లేదు’’. ఇలా శక్తిమంతులైన వారే సమాజంలో పుట్టాలనుకునే ఆలోచన చాలా ప్రమాదకరం.
ఒకానొక సమయంలో హీరో, హీరోయిన్ వైపు చూసి, ‘‘నీ బ్యాక్ చాలా పెద్దది. నీ శరీరంలో ఆరోగ్యకరమైన సంతానాన్ని పెంచవచ్చు’’ అంటాడు.
అప్పటికే ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం ఫిక్స్ అయింది. హీరో అక్కడ ఆల్ఫా పురుషుడని, హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకొనే వ్యక్తేమో బలహీనుడని సూచించేలా ఉంటుంది ఆ సీన్.
కొన్ని రోజులకు హీరోయిన్, హీరో వద్దకు వచ్చి అతడిని పెళ్లి కూడా చేసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు రణ్‌బీర్ కపూర్ ఏం చెబుతాడు?
శతాబ్దాల నాటి విషయాలను సినిమాలో నేటి మహిళలకు ఎందుకు చెబుతున్నారు? ఒక వ్యక్తితో ఆమె ఎలా ఉండాలి? నేటితరం అమ్మాయిలకు ఎలాంటి మగాడు కావాలో ఎందుకు చెబుతున్నాడు?
సినిమాలో హీరోకు అక్క ఉంటుంది. ఫారిన్‌లో ఎంబీఏ చేశారామె. ఆమెకు వివాహమై ఇంట్లోనే ఉంటోంది. అయితే, హీరోకు అక్క భర్త అంటే ఇష్టం ఉండదు.
‘‘నేను అప్పుడు చిన్నవాడిని. లేదంటే ఈ పెళ్లి జరిగేదే కాదు'' అని అక్కతో చెబుతాడు హీరో.
ఈ సినిమాలో హీరో బావ, పిల్లనిచ్చిన మామపై హత్యాయత్నంలో ఇతరులకు సాయం చేస్తాడు. ఈ విధంగా సినిమా కూడా అక్క నిర్ణయం తప్పని నిరూపిస్తుంది. హీరో అభిప్రాయమే సరైనదని చెప్పేలా ఉంటుంది.
ఒక చోట తన చెల్లెలితో, ‘‘నేను నీకు స్వయంవరం పెడతాను’’ అంటాడు కథానాయకుడు. అంతేకాదు, ఆడపిల్లలు ఏ మద్యం తాగాలో కూడా ఆమెకు చెబుతాడు. ఇది పితృస్వామ్యానికి మరో రూపం. ఇలాంటి వాళ్లు ఇతరుల జీవితాలను నియంత్రిస్తుంటారు.

ఫొటో సోర్స్, T-SERIES
ప్రతి సమస్యకు హింసతోనే హీరో పరిష్కారం
ఆల్ఫా మేల్స్ ఆధిపత్యం చెలాయిస్తారు. మనుషులను ముఖ్యంగా స్త్రీలను రౌడీల మాదిరి నియంత్రిస్తారు. వారిని చూసి ప్రజలు భయపడుతుంటారు. భయం ద్వారా వారిపై ‘గౌరవం’ పెరుగుతుంది.
నిజానికి ఈ సినిమాలో హీరో అందరికి రక్షకుడిగా మారడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ప్రతి సమస్యకు అతడు ఎంచుకునే మార్గం హింసే.
పాఠశాలలో చదువుతున్నప్పుడు ఇలాంటివే చేస్తాడు. అతని అక్కను కాలేజీలో కొంత మంది అబ్బాయిలు ‘ర్యాగింగ్’ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ పిల్లాడైన హీరో, అక్కతో కలిసి ఆమె క్లాస్‌కు వెళతాడు.
తరగతి గదిలోనే గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. ‘‘నీ సేఫ్టీ కోసం ఏమైనా చేయగలను’’ అని అక్కతో గర్వంగా చెబుతాడు. స్కూల్ పిల్లాడైన కొడుకు ప్రవర్తన చూసిన తండ్రి అనిల్ కపూర్‌కు చాలా కోపం వస్తుంది.
అప్పుడు హీరో తన తండ్రితో ''నా అక్కను నేను రక్షించుకోలేనప్పుడు ఇంత ఆస్తి ఉండి ఏం ప్రయోజనం? మీ తర్వాత ఈ కుటుంబాన్ని కాపాడుకోవాల్సింది నేనే కదా?'' అంటాడు.

ఫొటో సోర్స్, TSERIES/YOUTUBE
ఆడవాళ్లు తోలుబొమ్మలా?
పితృస్వామ్యపు మూలాలు ఎంత లోతుకు పాతుకుపోయాయో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
పితృస్వామ్యం ఎలా పనిచేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. ఫాదర్, ఫాదర్ అండ్ ఫాదర్… ఇదే ఫిల్మ్‌లో చూపించారు.
సినిమా ప్రారంభం నుంచే కొడుకు(హీరో)కి తండ్రి పట్ల అభిమానం కనిపిస్తుంది.
అయితే ఈ అనుబంధం మామూలు తండ్రీకొడుకుల ప్రేమ కాదు. తన తండ్రి మాదిరి కొడుకు ఉండాలనుకుంటాడు. హీరో జీవితంలో తల్లిది ద్వితీయ స్థానం. తండ్రి కోసం హీరో ఎంతకైనా తెగించగలడు.
తండ్రి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా కానుకగా ఇష్టమైన పొడవాటి జుట్టునూ హీరో కత్తిరించుకుంటాడు. చిన్నప్పుడే తండ్రికి ఎదురుతిరిగి విదేశాలలో పెరుగుతాడు. అయితే కొన్నేళ్లు గడిచాక, తండ్రిపై దాడి జరిగిందని తెలుసుకొని, ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగొస్తాడు.
ఈ సినిమాలో తండ్రి, తాతలు, అన్నదమ్ములు, వాళ్ల కొడుకులు ఇలా మగవాళ్లందరినీ చురుకైన వాళ్లలా చూపిస్తారు. అదే సమయంలో ఆడవాళ్లను తోలుబొమ్మళ్లా చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సమానత్వం ఎక్కడ?
ఈ సినిమాలో హీరోయిన్ చాలా చోట్ల హీరోతో వాదించుకోవడం, చెంపదెబ్బ కొట్టడం వంటివి చూపించారు. ఇది ఎలాంటి సమానత్వం?
ఈ సమానత్వంలో సమానత్వమే లేదు. ఎందుకంటే చివరికి ఆమె అతని నియంత్రణలోనే ఉంటుంది.
ఓ సీన్‌లో హీరో మాట్లాడుతూ ,పెళ్లి అంటే భయం ఉండాలి కానీ, అంతా పోయిందంటాడు. హీరోయిన్ గౌను లాంటి డ్రెస్ వేసుకుంటే అభ్యంతరం చెబుతాడు.
సినిమా మొత్తంలో హీరోయిన్ ఎక్కువగా సల్వార్ సూట్ లేదా చీరలో ఉంటుంది. అంతేకాదు, మతపరమైన ఆచారాలనూ పాటిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంత మంది మహిళలు ఎందుకు చూస్తున్నారు?
ఆధిపత్య పురుషత్వానికి సెక్స్‌తో లోతైన సంబంధం ఉంది. అలాంటి మగవాడు లైంగిక సంబంధాల గురించి చాలా ఆందోళన చెందుతాడు. దానిలో ఎంత శక్తిమంతంగా ఉంటాడో కూడా చూపించాలనుకుంటున్నాడు.
అతనికి లైంగిక కోరికలు ఎంత బలంగా ఉంటే, ఆ చర్యలో అంత బలంగా ఉంటాడు. ఇది యానిమల్ సినిమాలో పదేపదే కనిపిస్తుంటుంది.
హీరో మాత్రమే కాదు విలన్ కూడా.. ఎప్పుడైనా, ఎక్కడైనా సెక్స్ చేస్తాడు. అంతేకాదు హీరోకి వివాహేతర సంబంధాలు కూడా ఉంటాయి. గర్వంగా శరీరంపై గుర్తులనూ ప్రదర్శిస్తాడు.
అది అతని ‘ఆల్ఫా మేల్’ లక్షణాలకు సంకేతం. సినిమాలో దీనికి విరుద్ధంగా మహిళలు కనిపిస్తారు. ఏం చేయాలన్నా పురుషుడు చేయాల్సిందే. సినిమాలో ఈ పురుష ఆధిపత్యం కనిపిస్తుంటుంది.
అయితే ఈ సినిమా ఈ రోజు ఇంత పాపులర్ ఎలా అవుతోందన్నదే అతి పెద్ద ప్రశ్న. సినిమా ప్రేక్షకుల్లో భారీగా అమ్మాయిలు, మహిళలు కూడా ఉన్నారు, వారు అలాంటి పురుషత్వాన్ని ఎలా చూస్తున్నారు?
సినిమా ఒక శక్తిమంతమైన మాధ్యమం. ఇది ప్రజల హృదయాలను ప్రభావితం చేస్తుంది. ఇది సమాజానికి అద్దం లాంటిది. మనం ఎలాంటి సమాజాన్ని సృష్టించాలనుకుంటున్నామో చెప్పే మాధ్యమం కూడా.
మన దేశం, సమాజం ప్రస్తుతం ఆధిపత్య పురుషాధిక్య దశను దాటుతోంది.
మహిళలకు స్వేచ్ఛ అంతేనా?
ఇలాంటి సినిమాలు ఎలాంటి సమాజాన్ని ఊహించుకుంటాయన్నది ముఖ్యమైన అంశం.
యానిమల్ చిత్రంలోని ఆల్ఫా మేల్ పాత్ర.. మహిళను ప్రత్యేక పాత్రకే పరిమితం చేస్తుంది. హీరో స్వేచ్ఛ ఇస్తాడు, కానీ ఆ స్వేచ్ఛ కూడా అతని చేతుల్లోనే ఉంటుంది.
బాలికలకు ఆధునిక విద్య ఉంటుంది, అయితే, వారి ప్రాథమిక బాధ్యతలేమిటో ఆల్ఫా మేల్స్ నిర్ణయిస్తారు. తల్లి అయినా, చెల్లి అయినా, భార్యయినా ఇంట్లో వాళ్లను పెంచి, పోషించే పనే చేస్తారు.
ఆమె ఏం ధరించాలి, ఏం తాగాలో సొంతంగా నిర్ణయించుకోలేరు. మహిళల రక్షణ బాధ్యత శతాబ్దాల క్రితం పురుషుల చేతుల్లో ఉండేది. వారు సాధారణ పురుషులు కాదు. వారు ‘ఆల్ఫా మేల్’. శారీరకంగా బలవంతులు. ప్రతీకారం తీర్చుకునేవారు. రక్తంతో ఆడుకునేవారు.
ఇలా లేని మనుషులు ఈ సినిమా ప్రకారం బలహీనులు, కవిత్వం రాసుకొనేవారు. ఇది ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే సమాజంలో చాలా మంది పురుషులు ఇలాగే ఉంటారు.
‘ఆల్ఫా మేల్’గా పురుషులు పుట్టరు, తయారవుతారు. ఇలా మారడం అనేది మహిళలకు, సమాజానికి హానికరం, ప్రమాదకరం కూడా.
మరి అంతిమంగా, మనిషిని 'యానిమల్ (జంతువు)' అని ఎందుకు పిలవాలి? ఎలాంటి వారిని యానిమల్ అని పిలుస్తారు? వారి గుణగణాల జాబితా ఎలా ఉంటుంది?
జంతుహక్కుల కోణంలో ఆలోచిస్తే ఇలాంటి పోలిక పెట్టడం సబబేనా?
ఈ చిత్రంలో హీరోయే యానిమల్. ‘యానిమల్’ పట్ల ఆకర్షణను కలిగించేలా ఈ చిత్రాన్ని తీశారు.
ఇలాంటి ఆధిపత్య, విషపూరిత పురుషత్వాన్ని ఎవరైనా ‘యానిమల్’ అని పిలిస్తే, అది విమర్శగా కాకుండా ప్రశంసగా భావించాలని ఈ సినిమాలోని సన్నివేశాలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















