తక్కువ ఖర్చులో హాయిగా బతకాలంటే దేశంలో హైదరాబాదే బెస్ట్.. ‘మెర్సర్’ సర్వే ఇంకా ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జక్కుల బాలయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో క్వాలిటీ ఆఫ్ లివింగ్ (జీవన నాణ్యత) మెరుగ్గా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ మరోసారి టాప్‌లో నిలిచింది.
మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2023లో- దిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతా, చెన్నై వంటి నగరాలను వెనక్కు నెట్టి, హైదరాబాద్ ఆరోసారి టాప్‌లో నిలిచింది.
ఈ సర్వేలో సిటీ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ 153వ స్థానంలో నిలిచింది.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం వంటి అంశాల ప్రాతిపదికగా మెర్సర్ సంస్థ నిపుణులతో ఈ సర్వే నిర్వహిస్తుంది.
కరోనావైరస్ మహమ్మారికి ముందు 2015 నుంచి 2019 వరకూ వరుసగా ఐదుసార్లు భారత్‌లో క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ముందుంది.
2019లో 143వ స్థానంలో ఉన్న హైదరాబాద్, ఈసారి పది స్థానాలు వెనకబడినప్పటికీ భారత్‌లోని మిగిలిన నగరాల కంటే మెరుగ్గా ఉంది.
క్వాలిటీ ఆఫ్ లివింగ్‌తోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ (జీవన వ్యయం)లోనూ హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచింది.
క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ 153వ స్థానంలో ఉండగా, పుణె 154, బెంగళూరు 156, చెన్నై 161, ముంబయి 164, కోల్‌కతా 170, దిల్లీ 172వ స్థానాల్లో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా 241 నగరాల జాబితాలో భారత్ నుంచి హైదరాబాద్ ముందంజలో ఉంది.
మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సిటీస్ (జీవన వ్యయం ఎక్కువగా ఉండే నగరాలు) జాబితాలో హైదరాబాద్ 202వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 227 నగరాల జాబితాను మెర్సర్ విడుదల చేసింది. అందులో హైదరాబాద్ తక్కువ ఖర్చయ్యే నగరాల జాబితాలో ఉంది.
జీవనం వ్యయం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో భారత్ నుంచి బెంగళూరు 189, చెన్నై 184, దిల్లీ 169, ముంబయి 147 స్థానాల్లో నిలవగా, హైదరాబాద్ 202వ స్థానంలో ఉంది. అంటే, ఆ నగరాల కంటే తక్కువ ఖర్చుతో ఇక్కడ సౌకర్యవంతంగా జీవించొచ్చని సర్వే తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
నంబర్ 1 నగరం వియెన్నా
మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రియాలోని వియెన్నా టాప్‌లో నిలిచింది. చారిత్రక నేపథ్యం, అద్భుతమైన నిర్మాణ శైలి, సంస్కృతీ సంప్రదాయాలతో వియెన్నా క్వాలిటీ ఆఫ్ లివింగ్ జాబితాలో ఉత్తమ నగరంగా నిలిచింది.
స్విట్జర్లాండ్‌లోని జురిచ్, న్యూజీలాండ్‌లోని ఆక్లండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
కోపెన్‌హాగెన్(డెన్మార్క్), జెనీవా (స్విట్జర్లాండ్), ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ), మునిచ్ (జర్మనీ), వాంకోవర్ (కెనడా), సిడ్నీ(ఆస్ట్రేలియా), డస్సెల్‌డార్ఫ్ (జర్మనీ) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఆఫ్రికన్ నగరాలు ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. చాద్‌లోని ఎన్జమెనా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని బంగుయ్, సుడాన్ రాజధాని ఖార్టూమ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్‌లో 236, 239, 241 స్థానాల్లో ఉన్నాయి.
క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌కు 153వ స్థానం దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
'మోస్ట్ ఎక్స్‌పెన్సివ్' నగరాలు
జీవనానికి అత్యంత ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే నగరాల జాబితా (కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్) లో హాంగ్‌కాంగ్ మరోసారి టాప్‌లో నిలిచింది.
మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ నగరాల జాబితాలో మొదటి రెండు నగరాలు, చివరి రెండు నగరాలు కూడా ఆసియా ఖండంలోనివే. హాంగ్‌కాంగ్, సింగపూర్ మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో హాంగ్ కాంగ్, సింగపూర్ తర్వాత స్థానాల్లో జురిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), బాసెల్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (అమెరికా), బెర్న్(స్విట్జర్లాండ్), టెల్ అవీవ్ (ఇజ్రాయెల్), కోపెన్‌హాగెన్(డెన్మార్క్), నసౌ (బహమాస్) ఉన్నాయి.
ఈ జాబితాలో హైదరాబాద్ 202వ స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సర్వే ఎలా చేస్తారు?
వివిధ దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే క్వాలిటీ ఆఫ్ లివింగ్ డేటాను అందించే సంస్థల్లో మెర్సర్‌కు మంచి పేరుంది.
న్యూయార్క్ నగరాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ నగరంతో పోలుస్తూ ఇతర నగరాల్లో సదుపాయాలు, జీవన ప్రమాణాలపై అధ్యయనం ద్వారా మెర్సర్ ప్రపంచవ్యాప్తంగా నగరాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది.
ఇందులో భాగంగా మెర్సర్ అంతర్జాతీయ బృందం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు, ఈ విభాగంలో నిపుణుల నుంచి డేటా సేకరిస్తుంది.
విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం, సామాజిక-సాంస్కృతిక వాతావరణం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ రూపొందిస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రతిభకు తగిన అవకాశాలు ఉండడం కూడా జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
'కాస్ట్ ఆఫ్ లివింగ్' ఎలా లెక్కిస్తారు?
కాస్ట్ ఆఫ్ లివింగ్ విభాగంలోనూ నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చేందుకు న్యూయార్క్ సిటీని ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు, ఆయా దేశాల కరెన్సీలో డాలర్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 నగరాల్లో ఈ సర్వే నిర్వహిస్తారు. ఈ ఏడాది ఐదు ఖండాల్లోని 227 దేశాలతో ర్యాంకింగ్స్ విడుదల చేసింది మెర్సర్
వివిధ నగరాల్లో ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, ఆహారం, బట్టలు, కిరాణా సరుకులు, వినోద ఖర్చులు వంటి 200కి పైగా వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.
మెర్సర్ నివేదికలోని కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇంటి అద్దెలలో పోలికల గణాంకాలు 2023 మార్చిలో నిర్వహించిన ఓ సర్వే నుంచి తీసుకున్నారు. వస్తువులు, సేవలకు అయ్యే ఖర్చులను అప్పటి మారకపు విలువల ఆధారంగా లెక్కించారు.
ద్రవ్యోల్బణాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర భారతం, దక్షిణ భారతం గొడవేంటి, బీజేపీపై ఉత్తరాది పార్టీ ముద్రపడుతోందా?
- సీరియల్ కిల్లర్ కిష్టప్ప: అడ్డా మీది మహిళా కూలీలే అతడి టార్గెట్, ఏడు మర్డర్లు చేసి ఎలా బయట తిరుగుతున్నాడంటే...
- ముస్లిం ఓటు చీలడం వల్లే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయా?
- సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
- రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు? కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















