ధీరజ్ సాహూ: లిక్కర్ ఫ్యాక్టరీలో ఐటీ శాఖ పట్టుకున్న ఈ డబ్బును లెక్క పెట్టడానికే అయిదు రోజులు పట్టింది...

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, MANARANJAN JOSHI

    • రచయిత, సందీప్ సాహూ
    • హోదా, భువనేశ్వర్ నుంచి

ఒడిశా బలాంగీర్‌లోని సూద్‌పాడాలో ఒక మద్యం ఫ్యాక్టరీలో జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బును లెక్కించేందుకు ఐదు రోజులు పట్టింది. మొత్తంగా ఈ సోదాల్లో రూ. 285 కోట్ల డబ్బు బయటపడింది.

డబ్బుతోపాటు టిట్లాగఢ్‌లోని రెండు బ్యాంకు లాకర్లలో పెద్దయెత్తున బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లాకర్లు మద్యం వ్యాపారవేత్త సంజయ్ సాహూకు చెందినవి.

స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ భగత్ బెహరా ఈ సమాచారాన్ని వెల్లడించారు.

బలాంగీర్‌ జిల్లాలోని టిట్లాగఢ్, సంబల్‌పుర్‌లలో కూడా ఆదాయపు పన్ను విభాగం సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో వరుసగా రూ.11 కోట్లు, రూ.37.50 కోట్ల నగదు బయటపడింది. దీంతో మొత్తంగా ఒడిశాలోని భిన్న ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో రూ.333.50 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా చరిత్రలోనే ఇది అతిపెద్ద నగదు స్వాధీనంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, దేశ వ్యాప్తంగానూ భారీగా నగదు స్వాధీనాల్లో దీన్ని ఒకటిగా చెబుతున్నారు.

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, MANARANJAN JOSHI

మొరాయించిన మెషీన్లు

సూద్‌పాడా భట్టీతోపాటు దీనికి పక్కనే ఉండే మేనేజర్ బంటీ సాహూ ఇంట్లో 176 సంచుల్లో ఈ డబ్బును దాచిపెట్టారు. రూ.500, రూ.200, రూ100 నోట్లలో ఈ నగదు ఉంది. వీటిలో కొన్ని చాలా పాత నోట్లు ఉన్నాయి.

50 మందికిపైగా స్టేట్ బ్యాంకు ఉద్యోగులు 25 కౌంటింగ్ మెషీన్ల సాయంతో రాత్రీపగలు కూర్చొని ఈ నగదును లెక్కపెట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఈ డబ్బును లెక్క పెట్టేందుకు ఐదు రోజులు పట్టింది.

పాత నోట్ల వల్ల మధ్యలో చాలాసార్లు మెషీన్లు మొరాయించాయని స్టేట్‌ బ్యాంక్ ఉద్యోగులు చెప్పారు. కొన్ని కట్టలను చేతులతోనే లెక్కపెట్టాల్సి వచ్చిందని వివరించారు.

డబ్బు కట్టలపై పెద్దయెత్తున దుమ్మూధూళి కూడా పేరుకుంది. దీంతో వీటిని లెక్క పెట్టేటప్పుడు సిబ్బంది మాస్కులు వేసుకొని కనిపించారు.

నగదు లెక్కింపు ప్రస్తుతానికి పూర్తయింది. కానీ, ఈ సోదాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.

సూద్‌పాడా భట్టీ మేనేజర్ బంటీ, మరో సిబ్బంది దర్యాప్తుల్లో వెల్లడించిన సమాచారం ఆధారంగా మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీంతో మరింత నగదు బయటపడే అవకాశముందని తెలుస్తోంది.

ఒడిశాతోపాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఆదాయపు పన్ను విభాగం సోదాలు చేపడుతోంది. అయితే, జార్ఖండ్, బెంగాల్‌లలో ఎంత మొత్తం బయటపడిందో స్పష్టంగా తెలియడం లేదు. అయితే, జార్ఖండ్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ కుమార్ సాహూ, అతడి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు, సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయన్నది సుస్పష్టం.

మూడు రాష్ట్రాల్లో ఒకేసారి 30 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో 100 మందికిపైగా ఆదాయపు పన్ను అధికారులు పాల్గొంటున్నారు.

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, ANI

సాహూ కుటుంబం, మద్యం వ్యాపారం

ఒకే మద్యం తయారీ భట్టీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బయటపడటంతో ఒడిశా ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, రాష్ట్రంలో మద్యం వ్యాపారానికి ధీరజ్ సాహూ కుటుంబానికి ఎప్పటినుంచో బలమైన సంబంధాలు ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఇక్కడ లోహర్‌దగా వ్యాపారవేత్త రాయ్ సాహెబ్ బల్‌దేవ్ సాహూ (ధీరజ్ సాహూ తండ్రి)కు నాటి బలాంగీర్ సంస్థాన రాజుతో మంచి సంబంధాలు ఉండేవి.

తమ రాజ్యంలో మద్యం దుకాణాలు తెరచుకునేందుకు బల్‌దేవ్‌కు రాజు అనుమతి ఇచ్చారు. రాజ కుటుంబ ప్రోత్సాహంతో సాహూ కుటుంబం బలాంగీర్‌లో ఒకదాని తర్వాత మరొకటి మద్యం భట్టీలను తెరచుకుంటూ పోయింది. అలా సాహూ కుటుంబ సామ్రాజ్యం విస్తరించింది.

ప్రస్తుతం బలాంగీర్ జిల్లాలోని 62 మద్యం భట్టీల్లో 46 ఈ కుటుంబానికి చెందినవే. స్వాతంత్ర్యం అనంతరం పశ్చిమ ఒడిశాలోని చాలా ప్రాంతాలకు ఈ వ్యాపారం విస్తరించింది.

కాలాహాండీ, నువాపడా, సంబల్‌పుర్, సుందర్‌గఢ్.. ఇలా చాలా ప్రాంతాల్లోని మద్యం భట్టీలు సాహూ కుటుంబం కిందకు వచ్చాయి.

క్రమంగా బల్‌దేవ్, ఆయన కుమారులు నాటు మద్యం నుంచి విదేశీ మద్యం విక్రయాల్లోకీ అడుగుపెట్టారు. దీని కోసం బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్) పేరుతో మరొక అనుబంధ సంస్థను కూడా తెరిచారు.

రాష్ట్రంలో ఇంగ్లిష్ మద్యం గణాంకాలను పరిశీలిస్తే, ఈ సంస్థే 80 శాతం మద్యం తయారీకి అవసరమయ్యే స్పిరిట్‌ను 18 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) ప్లాంట్లకు సరఫరా చేస్తోంది.

ఒడిశాలో మాత్రమే కాదు. తూర్పు భారత్‌లోని బెంగాల్, జార్ఖండ్‌ సహా చాలా ప్రాంతాల్లోని ప్లాంట్లు స్పిరిట్ల కోసం బీడీపీఎల్‌పైనే ఆధారపడుతుంటాయి.

స్పిరిట్స్‌తోపాటు విస్కీ, వోడ్కా, జిన్‌ల తయారీలో ఉపయోగించే ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)’ను కూడా బీడీపీఎల్ ఉత్పత్తి చేస్తుంది. పెయింట్లు, ఇంక్‌లు, కాస్మెటిక్స్ తయారీలోనూ ఈఎన్ఏను ఉపయోగిస్తుంటారు.

సాహూ కుటుంబం మరో రెండు కంపెనీలను కూడా నడిపిస్తోంది. వీటిలో ‘కిశోర్ ప్రసాద్, విజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేటెడ్ లిమిటెడ్’ కూడా ఒకటి. ఈ సంస్థ చాలా ఐఎంఎఫ్ఎల్‌ బ్రాండ్లను సరఫరా చేస్తుంది, విక్రయిస్తుంది. రెండో సంస్థ పేరు ‘క్వాలిటీ బాటెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇంగ్లిష్ మద్యాన్ని సరఫరా చేస్తుంది.

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, ANI

ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?

బీడీపీఎల్‌కు చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ, ఈ డబ్బు మొత్తం మద్యం వ్యాపారం నుంచి వచ్చినదేనని చెప్పారు.

‘‘నాటుసారా తయారీకి ఇప్ప పువ్వులను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలను గిరిజనులు పండిస్తుంటారు. అయితే, వారికి డిజిటల్ చెల్లింపులు తెలియవు. వారు నగదు రూపంలోనే చెల్లిస్తారు. మరోవైపు మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు కూడా బాటిల్‌కు రూ.60 చొప్పున నగదు రూపంలోనే చెల్లిస్తుంటారు’’ అని ఆయన అన్నారు.

ఇక్కడ బిజినెస్ మొత్తం నగదుపైనే నడుస్తుందని, అందుకే అంత పెద్దమొత్తంలో నగదు దొరకడంతో ఆశ్చర్యమేమీ అనిపించలేదని ఆయన చెప్పారు.

‘‘2019లోనూ సాహూ కుటుంబంపై సోదాలు జరిగాయి. మొత్తంగా రూ.35 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎక్కడి నుంచి ఈ నగదు వచ్చిందో చెప్పడంతో ఆ డబ్బును మళ్లీ వెనక్కి ఇచ్చేశారు’’ అని ఆయన తెలిపారు.

అయితే, సాహూ కుటుంబం పెద్దయెత్తున మద్యం వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఇంత పెద్ద మొత్తంలో నగదు కేవలం ఆ వ్యాపారం నుంచే వచ్చిందంటే చాలామంది నమ్మడం లేదు.

బలాంగీర్‌లో మద్యం వ్యాపారాన్ని ఏళ్ల నుంచీ గమనిస్తున్న ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నాటు మద్యం తాగడానికి వచ్చేవారు రూ.100 లేదా రూ.200 నోట్లు తీసుకొస్తారు. కానీ, ప్రస్తుతం దొరికిన నోట్లలో రూ.500 నోట్లు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇదంతా నల్లధనం. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేస్తూ ఉండొచ్చు’’ అని ఆయన చెప్పారు.

‘‘సాహూ బ్రదర్స్ కంపెనీ దాదాపు అన్ని పార్టీలకూ విరాళాలు ఇస్తోంది. అంతేకాదు పూజలు, స్పోర్ట్స్ ఇతర కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బు ఖర్చు పెడుతోంది. ఇవన్నీ తెలిసినప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదు. ఇదంతా కంపెనీ సీఎస్ఆర్ పాలసీలో భాగంగా చూపిస్తారు’’ అని ఆయన అన్నారు.

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఈ విషయంలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని దిల్లీలో పార్లమెంటు వెలుపల నిరసన తెలుపుతున్న బీజేపీ ఎంపీలు

ఈడీ, సీబీఐ దర్యాప్తు కోసం బీజేపీ డిమాండ్

ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ సొమ్ము మొత్తం నల్ల ధనమేనని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ అన్నారు.

రాంచీ నుంచి ఫోన్ ద్వారా బీబీసీతో ఆయన మాట్లాడారు. ‘‘మీరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే టర్నోవర్ రూ.120 కోట్లు మాత్రమే. మరి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘ధీరజ్ సాహూ అన్నయ్య గోపాల్ ఏళ్ల నుంచీ జార్ఖండ్ కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేస్తున్నారు. అయితే, అసలు అనధికార కోశాధికారి మాత్రం ధీరజ్‌నేనని అందరికీ తెలుసు. ప్రస్తుతం బయటపడింది మొత్తం కాంగ్రెస్ నల్లధనమే. అందుకే దీనిపై ఈడీ, సీబీఐ విచారణ చేపట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బు కాంగ్రెస్ అధిష్టానానికి వెళ్తుందో లేదో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు.

అయితే, ధీరజ్ సాహూ బిజినెస్‌తో తమకు ఎలాంటి సంబంధమూలేదని కాంగ్రెస్ చెబుతోంది.

పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘‘ఈ విషయంలో ధీరజ్ మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ సొమ్ము ఎక్కడిదో ఆయనే వివరణ ఇవ్వాలి’’ అని అన్నారు.

భారీగా నగదు బయటపడటంతో బీజేపీ దూకుడుగా ఈ విషయంపై స్పందిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సాహూ కుటుంబంతో పార్టీ అనుబంధం ఏళ్లనాటిది.

ధీరజ్ సాహూ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్‌తో సాహూ కుటుంబం సంబంధం

సాహూ కుటుంబంలో తొలి తరం మద్యం వ్యాపారవేత్త బల్‌దేవ్ సాహూకు కాంగ్రెస్‌తో మంచి సంబంధాలు ఉండేవి.

దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లోహర్‌దగాకు వచ్చినప్పుడు సాహూ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యమిచ్చింది.

1958లో రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చినప్పుడు బల్‌దేవ్ సాహూ తన కారులో మొత్తం చూపించారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు.

అలానే 1984లో రాంచీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఇందిరా గాంధీ వచ్చినప్పుడు విలాసవంతమైన సాహూ బ్రదర్స్ బంగ్లాలోనే గడిపినట్లు చెబుతారు.

ధీరజ్ పెద్ద అన్నయ్య శివ్ ప్రసాద్ సాహూ రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై రాంచీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఆరుగురు సోదరుల్లో ధీరజ్ చిన్నవారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

2018 రాజ్యసభ ఎన్నికలకు ముందుగా నామినేషన్ పత్రాలను సమర్పించేటప్పుడు తన మొత్తం ఆస్తుల విలువ రూ.34.83 కోట్లుగా ప్రమాణపత్రంలో ధీరజ్ వెల్లడించారు. చరాస్తుల విలువల కూడా రూ.2.04 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ‘క్యాష్ ఇన్ హ్యాండ్’ను కూడా రూ.27 లక్షలుగా వెల్లడించారు.

దీంతో పెద్దమొత్తంలో బయటపడిన నగదుతో చాలా కొత్త ప్రశ్నలు, సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో దర్యాప్తు పూర్తయితేనే అన్నింటికీ సమాధానం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)