లంచాలు ఇచ్చి సొంతంగా దేశం నిర్మించుకోవడానికి ప్రయత్నించిన జంటను ఎలా అరెస్టు చేశారు?

మార్షల్ ఐలాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్షల్ ఐలాండ్స్

ప్రజాప్రతినిధులకు, అధికారులకు లంచం ఇవ్వడం ద్వారా ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చైనాకు చెందిన ఒక జంట ప్రయత్నించిందని అమెరికా తెలిపింది.

అమెరికా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం...

'చైనాకు చెందిన క్యారీ యాన్, జీనా హూ న్యూయార్క్‌లో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

పసిఫిక్ సముద్రంలో ఉండే మార్షల్ ఐలాండ్స్ దేశంలో ఆ జంట ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇందుకు వారు మార్షల్ ఐలాండ్స్ దేశపు ప్రజాప్రతినిధులు, అధికారులకు లంచం ఇచ్చారు.

చాలా మంది ప్రజాప్రతినిధులకు చైనా జంట 7వేల డాలర్ల నుంచి 22వేల డాలర్ల వరకు అంటే సుమారు 6 నుంచి 18 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చింది. తమ ఎన్జీఓ నుంచి వారికి ఆ డబ్బును ఇచ్చారు.

మార్షల్ ఐలాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్షల్ ఐలాండ్స్

మార్షల్ ఐలాండ్స్‌లోని రోంగేల్యాప్ దీవిలో సొంత దేశాన్ని ఏర్పాటు చేసేందుకు 2016 నుంచి వారు అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. 1950లలో ఇక్కడ అమెరికా హైడ్రోజన్ బాంబును పరీక్షించిన నాటి నుంచి ఆ ప్రాంతం ఖాళీగా ఉంటూ వస్తోంది.

తమ పాలనలోనికి వచ్చిన తరువాత ఆ ప్రాంతంలో పన్నులు భారీగా తగ్గించడం, వలస చట్టాలను చాలా సులభతరం చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని చైనా జంట ప్రణాళికలు రచించారు.

తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు మార్షల్ ఐలాండ్స్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు న్యూయార్క్, హాంకాంగ్‌లలో విలాసవంతమైన విందులు ఏర్పాటు చేశారు. విమాన టికెట్లు, హోటల్ బిల్లులు చెల్లించారు.

లంచం తీసుకున్న ఒక అధికారి క్యారీ యాన్‌ను మార్షల్ ఐలాండ్స్ ప్రత్యేక సలహాదారుగా నియమించారు. అలాగే ఆ జంటకు పౌరసత్వాన్ని కూడా ఇచ్చారు. ఆ తరువాత 2018లో స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు.

మార్షల్ ఐలాండ్స్ మ్యాప్

కానీ నాటి మార్షల్ ఐలాండ్ అధ్యక్షుడు హిల్డా హీన్ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో అది చట్టరూపం దాల్చలేదు. ప్రతిపక్షాలు చైనా తరపున పని చేస్తూ మార్షల్ ఐలాండ్స్‌లోనే మరొక దేశాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నాడు హిల్డా ఆరోపించారు.

ఆ తరువాత 2019 ఎన్నికల్లో హిల్డా ఓడిపోయారు. ఆ తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం 2020లో 'స్వయం ప్రతిపత్తి ప్రాంతాలు' అనే కాన్సెప్ట్‌ను ఆమోదిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తద్వారా స్వయం ప్రతిపత్తి ప్రాంతాల బిల్లుకు మార్గం సులభతరం చేసింది.

కానీ ఆ తరువాత యాన్, జీనా హూలను థాయిలాండ్‌లో నిర్బంధించారు. అమెరికాలో మనీలాండరింగ్, అవినీతి, లంచం ఇవ్వడం వంటి వాటికి పాల్పడినట్లు అధికారులు ఆరోపణలు మోపారు. ఇటీవలే వారిని అమెరికాకు థాయిలాండ్ అప్పగించింది.

పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉండే మార్షల్ ఐలాండ్స్ 1979 వరకు అమెరికా పాలనలో ఉండేది. సుమారు 40ఏళ్లపాటు అమెరికా దాన్ని పాలించింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దేశం అమెరికాకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. నేటికీ మార్షల్ ఐలాండ్స్‌తో అమెరికా భద్రతా పరమైన ఒప్పందాలున్నాయి.

కానీ కొంత కాలంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? వీటిని ఎందుకు ఆపట్లేదు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)