హాదియా: ఏడేళ్ళ కిందటి ‘లవ్ జిహాద్’ కేసుపై మళ్ళీ ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
ఏడేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ పేరుతో వార్తల్లో మార్మోగిన కేరళ యువతి హాదియా కేసుపై మళ్లీ చర్చ జరుగుతోంది.
తాజాగా హాదియా తండ్రి రాష్ట్ర హైకోర్టులో హాబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలుచేశారు. దీంతో హైకోర్టు డివిజన్ ధర్మాసనం రెండు రోజుల్లోగా హాదియాను తమ ముందు హాజరు పరచాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
హాదియా తండ్రి కేఎన్ అశోకన్ దాఖలుచేసిన హాబియస్ కార్పస్ పిటిషన్‌పై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ అను శివరామన్, జస్టిస్ జాన్సన్ జాన్‌లు సభ్యులుగాగల ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది.
దీంతో మళ్లీ హాదియా కేసుపై చర్చ జరుగుతోంది. 2017లో కేరళ హైకోర్టు షఫీన్ జహాన్‌తో హాదియా పెళ్లి చెల్లదని ప్రకటించింది. హాదియా అసలు పేరు అఖిల అశోకన్. ఆమె హిందువు. అయితే, ఇస్లాంలోకి మతంమారిన తర్వాత ఆమె షఫీన్‌ను పెళ్లి చేసుకున్నారు.
2018లో వీరి వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా విచారణ చేపట్టింది. మతం మారేలా హాదియాను తన భర్త బలవంతం చేయలేదని, ఆయనకు ఎలాంటి నిషేధిత సంస్థతోనూ సంబంధంలేదని ఎన్ఐఏ తేల్చింది.

ఫొటో సోర్స్, REUTERS
తాజాగా ఏం జరిగింది?
అయితే, కొన్ని రోజుల క్రితం షఫీన్‌కు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని హాదియా పెళ్లి చేసుకోవడంతో మళ్లీ ఈ కేసుపై వార్తలు వస్తున్నాయి.
అయితే, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి పేరును హాదియా బయటపెట్టలేదు. ఇది తన వ్యక్తిగత అంశమని ఆమె చెబుతున్నారు.
తాజా పరిణామాలపై కేఎం అశోకన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘మాకు హాదియా కనిపించడం లేదు. ఆమె కోసం చాలా వెతికాను. కానీ ఫలితం కనిపించలేదు. అందుకే హెబియన్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాను’’ అని ఆయన అన్నారు.
‘‘ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఆ కొత్త వ్యక్తి పేరు కూడా నాకు తెలియదు. అసలు మొదటి భర్తకు తను ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలియడం లేదు. అసలు మొదట పెళ్లి నిజంగా జరిగిందా లేదా అని కూడా నాకు అనుమానం వస్తోంది’’ అని ఆయన అన్నారు.
‘‘అసలు హాదియాకు బుర్ర పనిచేయడం లేదు. అందుకే తను ఇలా చేస్తోంది. నేను ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే, తను ఎక్కడికో వెళ్లిపోతుంది. నేనేం చెబుతున్నానో మీకు అర్థం అవుతుందా?’’ అని ఆయన అన్నారు.
హాదియా మొదటి పెళ్లిపై వివాదాన్ని ముగ్గురు న్యాయమూర్తుల నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం పరిష్కరించింది.
నాటి తీర్పును ఉటంకిస్తూ.. ‘‘మీ తల్లిదండ్రులు మీ మొదటి పెళ్లిని ఆమోదించారా?’’ అని హాదియాను బీబీసీ ప్రశ్నించింది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు నా ఫీలింగ్స్‌ను ఎప్పుడూ పట్టించుకోలేదు. నా సంతోషంతో వారికి పనిలేదు’’ అని ఆమె అన్నారు.
‘‘నా మొదటి పెళ్లికి బీటలు వారినప్పుడు, తమ ఇంటికి వచ్చేయాలని నా తల్లిదండ్రులు చెప్పారు. కానీ, నేను వెనక్కి వెళ్లలేదు. ఎందుకంటే నేను ఇస్లాంను నమ్ముతున్నాను. ఈ మతాన్ని వీడే ఉద్దేశం నాకు లేదు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నాపై ఒత్తిడి చేస్తున్నారు: హాదియా
‘గత వారం మీ నాన్న ఫోన్ చేసినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు?’ అని హాదియాను బీబీసీ ప్రశ్నించింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు మా నాన్నతో ఒకప్పుడు మంచి సంబంధాలే ఉండేవి. కానీ, ప్రతి చిన్న విషయంపైనా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఆయన నాకు వ్యక్తిగత జీవితమంటూ లేకుండా చేశారు. ఆయనకు నా రెండో పెళ్లి గురించి కూడా తెలుసు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులన్నీ ఆయనతో వేరొకరు చేస్తున్నారు’’ అని హాదియా అన్నారు.
‘‘మా నాన్నలో ఎప్పుడూ విద్వేషం ఉండేది కాదు. నాకు తెలుసు ఆయన మరొకరి ఒత్తిడి వల్ల ఇలా చేస్తున్నారు. నేను ఇస్లాంలోకి మారిన తర్వాత నన్ను గృహనిర్బంధం చేశారు. అప్పుడు మా ఇంటికి కొందరు వచ్చేవారు. వారంతా మళ్లీ నన్ను హిందువును చేయాలని పట్టుబట్టారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘లవ్ జిహాద్’ కేసు
‘గృహ నిర్బంధం’ అనే పదాన్ని ఒక ఘటన గురించి వివరిస్తూ ఆమె ఉపయోగించారు. నిజానికి ఆ సమయంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లొచ్చని కేరళ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం చెప్పింది.
2016లోనూ ఇలానే కేరళ హైకోర్టులో హాదియా తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
అప్పుడు కూడా తండ్రి ఫోన్ కాల్స్ ఎత్తడాన్ని హాదియా ఆపేశారు. మరోవైపు ఆమెకు బలవంతంగా మతం మార్చారని కొందరు చెప్పారని ఆమె తల్లిదండ్రులు కోర్టులో చెప్పారు.
ఆ సమయంలో కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో హాదియా హోమియోపతి చదువుతుండేది.
అయితే, ముస్లింల ప్రార్థన, మతపరమైన అంశాలంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఆ మతాన్ని స్వీకరించానని కోర్టులో హాదియా చెప్పారు.
ఆమె తల్లిదండ్రులు చెబుతున్నట్టుగా ఆమెను ఎవరూ అక్రమంగా నిర్బంధించకపోవడంతో, నచ్చినట్లు స్వేచ్ఛగా జీవించే హక్కు ఆమెకుందని కోర్టు చెప్పింది.
అయితే, ఆనాడు బీబీసీతో అశోకన్ మాట్లాడుతూ, ‘‘మా అమ్మాయికి కొందరు బ్రెయిన్ వాష్ చేశారు’’ అని అన్నారు.
‘‘ఆమెను వారు సిరియాకు పంపించాలని చూస్తున్నారు. ఆ విషయాన్ని ఆమె ఫోన్‌లో చెప్పింది. ఈ విషయాన్ని నేను ఫోన్‌లో రికార్డు చేశాను కూడా’’ అని ఆనాడు ఆయన చెప్పారు.
అయితే, 2017లో హాదియా దేశం విడిచి వెళ్లిపోతోందని మళ్లీ ఆయన హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
రెండో కేసు విచారణ మొదలయ్యేనాటికి షఫీన్‌ను హాదియా పెళ్లి చేసుకున్నారు. ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌లో షఫీన్‌ను ఆమె కలిశారు.
అయితే, విచారణ తర్వాత హాదియాను తల్లిదండ్రులకు హైకోర్టు అప్పగించింది. కొన్ని సంస్థలు హిందూ యువతులను ప్రేమ పేరుతో మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆనాడు దాదాపు ‘లవ్ జిహాద్’ కోణంలోనే హైకోర్టు స్పందించింది.
అయితే, కేరళ హైకోర్టు డివిజన్ ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసింది. అంతేకాదు, హాదియా, షఫీన్‌ల పెళ్లి చెల్లుబాటు అవుతుందని కూడా ప్రకటించింది.

ఫొటో సోర్స్, A S SATHEESH/BBC
తాజాగా హాదియా ఏం చెప్పారు?
హాదియా రెండో పెళ్లిపై మళ్లీ తాజాగా అశోకన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిపై ఒక మలయాళం చానెల్‌తో హాదియా కూడా మాట్లాడారు.
‘‘నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. దీనిపై నేను చర్చ జరగాలని అనుకోవడం లేదు. మన దేశంలోని చట్టాల ప్రకారం, నచ్చిన వారిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇష్టంలేకపోతే విడిపోవచ్చు కూడా. ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. మా అమ్మానాన్నలకు ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఇది నా హక్కు. నేనేమీ చిన్న పిల్లలను కాదు’’ అని ఆమె అన్నారు.
మరోవైపు బీబీసీతో హాదియా మాట్లాడుతూ.. ‘‘స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని సుప్రీం కోర్టు నాకు ఇచ్చింది. తాజా హెబియస్ కార్పస్ పిటిషన్ వెనకున్న వారిని రాష్ట్ర హైకోర్టు శిక్షిస్తుందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా ఇలాంటి పనులు చేసేవారికి గుణపాఠం చెప్పాలి’’ అని ఆమె అన్నారు.
తిరువనంతపురంలో కొత్త క్లినిక్‌ను తెరవాలని హాదియా భావిస్తున్నారు. మరోవైపు హోమియోపతీలో పీజీ కూడా చేయాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
- మెహందీ పెట్టుకుంటే కొందరికి అలర్జీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















