‘హలాల్ సర్టిఫైడ్’ ఉత్పత్తులన్నింటినీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?

పసుపు ప్యాకెట్‌పై హలాల్ సర్టిఫికేషన్

ఫొటో సోర్స్, SHAILENDRA SHARMA

ఫొటో క్యాప్షన్, పసుపు ప్యాకెట్‌పై హలాల్ సర్టిఫికేషన్
    • రచయిత, అనంత్ జణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హలాల్ లేబుల్‌‌తో తయారు చేసిన ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకంపై నిషేధాన్ని అమలు చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లో అధికార యంత్రాంగం దాడులు జరుపుతోంది.

వీటికి హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చిన సంస్థలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు రావడంతో దీనిపై కొన్ని రోజుల క్రితం లఖ్‌నవూలో కేసు నమోదైంది.

హలాల్ అంటే, ఇస్లామిక్ షరియత్ ప్రకారం తయారైన ఒక ఉత్పత్తి.

ఉత్తర్ ప్రదేశ్‌లో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులన్నింటినీ నిషేధించాలని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అనితా సింగ్ నవంబర్ 18న ఆదేశాలు జారీ చేశారు.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని నిబంధనల కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులపై హలాల్ అని ముద్రించకూడదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల్లో ఇంకా ఏముంది?

ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల ప్యాకెట్లపై హలాల్ అని ముద్రించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని చట్టాలు చెబుతున్నాయని, అలా చేసిన వారిని 'డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940' కింద శిక్షిస్తామని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎగుమతి చేసే ఉత్పత్తులు మినహా హలాల్ లేబుల్ ఉన్న ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ, నిల్వ, సరఫరా, కొనుగోలు, అమ్మకాలు చేసే వారిపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం-1940 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతోపాటు పాల ఉత్పత్తులు, బేకరీ, నూనెలు, చిరుతిళ్లు, వంటనూనెలు తదితర ఉత్పత్తులపై కొన్ని కంపెనీలు హలాల్‌ ముద్ర వేస్తున్నట్లు సమాచారం అందిందంటూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

"ఆహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వడం వాటి గురించి గందరగోళాన్ని సృష్టించే సమాంతర వ్యవస్థ, ఇది చట్ట విరుద్ధం. ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులపై హలాల్ లేబులింగ్ ఆహార ఉత్పత్తుల భద్రత గురించి వినియోగదారును తప్పుదారి పట్టించే సమాచారం. భద్రత ప్రమాణాల చట్టం - 2006 ప్రకారం నేరం" అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులు జారీ చేసిన అదనపు ప్రధాన కార్యదర్శి అనితా సింగ్‌తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేందు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆమెతో మాట్లాడలేకపోయింది. దీని గురించి ప్రభుత్వం మరింత సమాచారం ఇస్తే, దాన్ని ఈ కథనంలో పొందుపరుస్తాం.

తెరపైకి కొత్త సందేహాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అదనపు ప్రధాన కార్యదర్శి అనితా సింగ్‌తో మాట్లేడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆమె అందుబాటులోకి రాలేదు.

సంఘ వ్యతిరేక శక్తులకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపణలు

ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులకు 24 గంటల ముందు, పలు ఉత్పత్తులపై హలాల్ స్టిక్కర్లు వెయ్యడంపై లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

చెన్నైకి చెందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దిల్లీలోని జమాతే ఉలేమా-ఇ-హింద్ హలాల్ ట్రస్ట్, జమాతే ఉలేమా మహారాష్ట్ర, కొన్ని చిరునామా లేని సంస్థలు, వాటి యజమానులపై ఎఫ్ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేశారు.

హలాల్ సర్టిఫికేషన్, లేబులింగ్ చేస్తూ ఒక మతానికి చెందిన వారిని మోసం చేసి అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎఫ్ఐఆర్‌లో రాశారు. హలాల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నకిలీ పత్రాలను ఉపయోగిస్తున్నారని, ప్రజల విశ్వాసంతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

అంతే కాకుండా హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తుల వల్ల అలాంటి సర్టిఫికేషన్ పొందని కంపెనీల ఉత్పత్తులు, అమ్మకాలపై ప్రభావం పడిందని, ఇది అన్యాయమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మాంసం రహిత ఉత్పత్తులైన నూనె, సబ్బు, తేనె లాంటి ఉత్పత్తుల అమ్మకానికి కూడా హలాల్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. దీని వల్ల ముస్లిమేతర వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే వ్యక్తుల ప్రమేయం ఉందని, దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి వాటిని టెర్రరిస్టులు, సంఘ వ్యతిరేక శక్తులకు అందించే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానిస్తున్నట్లు ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు.

ఆరోపణలను ఖండించిన జమాతే ఉలేమా ఇ హింద్ ట్రస్టు

ఫొటో సోర్స్, WWW.JAMAITHALALITRUST.ORG

ఫొటో క్యాప్షన్, ఆరోపణలను జమాతే ఉలేమా-ఇ-హింద్ ట్రస్ట్ ఖండించింది.

ఆ ట్రస్టు ఏం చెప్పింది?

లఖ్‌నవూలో రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్‌లో జమాతే ఉలేమా-ఇ-హింద్ హలాల్ ట్రస్ట్ పేరు కూడా ఉంది.

“ఇవన్నీ మా ప్రతిష్టను దెబ్బ తీసే లక్ష్యంతో చేస్తున్న ఆరోపణలు. ఇలాంటి తప్పుడు సమాచారంపై మేం తప్పనిసరిగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం” అంటూ ఈ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా హలాల్ వ్యాపారం వల్ల 3.5 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని, దీని వల్ల భారత్ ఎక్కువగా లాభపడుతోందని ట్రస్టు చెబుతోంది. తమ హలాల్ ధృవీకరణ ప్రక్రియ, దేశీయంగా పంపిణీ, విదేశీ ఎగుమతులకు సంబంధించినదని ట్రస్టు తెలిపింది.

హలాల్ ధృవీకరణ భారతదేశానికి లాభం చేకూర్చే ఆర్థిక అంశమని ట్రస్టు చెబుతోంది. ఇది కేవలం ఎగుమతులకు మాత్రమే కాకుండా, భారత దేశాన్ని సందర్శించే పర్యటకులకు కూడా అవసరం. ఎందుకంటే పర్యటకుల్లో హలాల్ లేబుల్‌ చూసిన తర్వాతే వస్తువులను కొనే వారు ఉంటారని అంటున్నారు.

తాము కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిబంధనలను పాటిస్తామని ట్రస్ట్ పేర్కొంది. తమ ట్రస్ట్, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్‌కి చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్ట్రేషన్ అయినట్లు జమాతే ఉలేమా-ఇ-హింద్ ట్రస్ట్ వెల్లడించింది.

తమ ట్రస్టు జారీ చేసే హలాల్ సర్టిఫికెట్లు మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, ఖతార్, యుఎఇ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెబుతోంది. తాము వరల్డ్ హలాల్ ఫుడ్స్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నట్లు ప్రకటించింది.

హలాల్ సర్టిఫికేషన్, లేబులింగ్ వల్ల హలాల్ వినియోగదారులకు సాయపడటమే కాకుండా మిగతా వినియోగదారులకు కూడా ఎంపిక చేసుకునే సమాచారం అందిస్తుందని ట్రస్టు వివరించింది.

తాను వాడే ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేషన్ ఉందని ఫిర్యాదు చేసిన శైలేంద్ర శర్మ

ఫొటో సోర్స్, SHAILENDRA SHARMA

ఫొటో క్యాప్షన్, తాను వాడే ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికేషన్ ఉందని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్త శైలేంద్ర శర్మ

ఫిర్యాదు చేసింది బీజేపీ కార్యకర్తే

హలాల్ సర్టిఫికేషన్ మీద ఫిర్యాదు చేసిన శైలేంద్ర శర్మ తాను బీజేపీ కార్యకర్తనని ప్రకటించుకున్నారు. గతంలో అవధ్ బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు.

హలాల్ సర్టిఫికేషన్ విధానం ప్రభుత్వ వ్యవస్థకు సమాంతరంగా ఉందని, అది తప్పనేది ఆయన వాదన.

తాను ఉపయోగిస్తున్న అలొవెరా, ఐ డ్రాప్స్, తులసి ఉత్పత్తులపై హలాల్ లేబుల్స్ ఉన్నాయని, తన ఆరోపణలకు అవే ఆధారమని శైలేంద్ర శర్మ చెప్పారు.

శైలేంద్ర శర్మ ఫిర్యాదుపై నవంబర్ 17న పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 18న హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తన ఫిర్యాదుకు, ప్రభుత్వ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

"ఇది తీవ్రమైన వ్యవహారం. వేగంగా దర్యాప్తు జరుగుతోంది. నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను. దీనిపై విచారణ జరపాలని పోలీసులు భావించారు కాబట్టే ఎఫ్ఐఆర్ చేశారు” అని శైలేంద్ర శర్మ చెప్పారు.

హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులు ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాలకు ఎగుమతి అవుతాయి కదా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. “ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం తన విధానాన్ని రూపొందిస్తుంది. సర్టిఫికెట్ ఇచ్చే సంస్థలు ప్రభుత్వంతో చర్చించాలా లేకపోతే సొంతంగా తమ వ్యవస్థను నడుపుకోవాలా” అని ప్రశ్నించారు.

"సాధారణంగా మాంసం ఉత్పత్తులలో హలాల్, జట్కా గురించి వినే ఉంటాము, కానీ దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులకు దీని అవసరం ఏముంది? కూరల్లో ఉపయోగించే మసాలాల్లో ఎందుకు? పసుపు, ధనియాల పొడికి హలాల్ సర్టిఫికేషన్ అవసరం ఏముంది” అని శైలేంద్ర శర్మ అడిగారు.

హలాల్ సర్టిఫికేషన్, దానితో వ్యాపారం చేస్తున్నవాళ్లు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలకు సంబంధించి మీ వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి, ఏ ప్రాతిపదికన ఈ ఆరోపణలు చేశారంటూ శైలేంద్ర శర్మను బీబీసీ ప్రశ్నించింది.

‘‘ఇది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. కొన్ని విషయాలు చెబితే పోలీసులు ఏం చేస్తారు? దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి సంస్థల్ని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఆయా ఉత్పత్తుల గురించి నన్ను అడుగుతున్నారు. నేను వాటిని వాళ్లకు ఇస్తున్నాను” అని ఆయన బదులిచ్చారు.

హలాల్ సర్టిఫికేషన్ గురించి "అవసరమైతే, ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అంతే కానీ ఈ సోకాల్డ్ సంస్థలు, సోకాల్డ్ వ్యక్తులు నిర్ణయించ కూడదు" అనేది తన అభిప్రాయమని చెప్పారు శైలేంద్ర శర్మ.

ప్రజలకు అభివాదం చేస్తున్న సమాజ్ వాదీ నేతలు

ఫొటో సోర్స్, FACEBOOK/SAMAJWADIPARTY

ఫొటో క్యాప్షన్, హలాల్ వ్యవహారానికి దూరంగా యూపీ పార్టీలు

హలాల్ వ్యవహారానికి దూరం జరుగుతున్న పార్టీలు

హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, సౌందర్య ఉత్పత్తుల తయారీ, నిల్వ అమ్మకం, కొనుగోలుపై యోగి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వం నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత కూడా ఈ అంశంపై ప్రధాన పార్టీల నేతలెవరూ స్పందించలేదు.

ప్రభుత్వ ఆదేశాలు సామాజిక మాధ్యమాలలో కానీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లలో కానీ షేర్ చెయ్యలేదు. ఈ అంశానికి సంబంధించిన మీడియా కథనాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది.

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కానీ, ఆయన పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగాలు కానీ ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)