పార్లమెంట్ గ్యాలరీ పాసులు ఎవరిస్తారు? ఇక్కడ భద్రతా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

లోక్‌సభలో భద్రతా వైఫల్యం

ఫొటో సోర్స్, ANI

పార్లమెంట్‌లో బుధవారం జీరో అవర్ సమయంలో ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలోంచి సభ మధ్యలోకి దూకడం కలకలం సృష్టించింది. సరిగ్గా 22 సంవత్సరాల కిందట పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైనవారికి పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితరులు నివాళులర్పించారు.

దీని తరువాత పార్లమెంటు సభా కార్యకలాపాలు యథావిధిగా సాగాయి. జీరో అవర్ వ్యవధి ముగుస్తున్న సమయంలో గ్యాలరీలోంచి ఇద్దరు ఆగంతకులు దూకడంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉండే పార్లమెంటులో ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలోకి ఎలా రాగలిగారు, పైగా తమతోపాటు పొగడబ్బాలు ఎలా తేగలిగారనే ప్రశ్నలు వస్తున్నాయి.

పార్లమెంటులో సెక్యూరిటీ విభాగం ఎలా పనిచేస్తుందో సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కుమార్, బీబీసీ ప్రతినిధి మాన్సి దాస్‌కు వివరించారు.

‘‘సభ జరుగుతున్న రోజులలో కానీ, లేదా సాధారణ రోజులలోనైనా పార్లమెంటుకు తన సొంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది. సభాకార్యకలాపాలు లేని రోజుల్లో కూడా ఈ భద్రత ఉంటుంది. ఎవరినైనా పూర్తిగా చెక్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. ప్రస్తుత సంఘటనలో ఆగంతకులు గ్యాలరీలోకి వచ్చారంటే వారి దగ్గర ఎంపీ పాసులు లేనిదే అక్కడికి రాలేరు . వారి దగ్గర పొగడబ్బాల్లాంటివి ఉన్నాయి. అవేమిటి, ఎలా వచ్చాయనేది విచారణలో తేలుతుంది’’ అని చెప్పారు.

పార్లమెంటు సెక్యూరిటీ సేవల గురించి ప్రశ్నిస్తే- ‘‘సాధారణంగా పార్లమెంటు భద్రతా వ్యవహారాలను పార్లమెంటు సెక్యూరిటీ సర్వీసెస్ చూస్తుంది. ఈ విభాగమే భద్రతనంతటిని పర్యవేక్షిస్తుంటుంది’’అని అరవింద్ కుమార్ తెలిపారు.

‘‘పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నప్పుడు దిల్లీ పోలీసులు కూడా భద్రతా బాధ్యతలు చూస్తుంటారు. కేంద్ర రిజర్వు బలగాలు, ఐటీబీపీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందినవారు, ఎస్పీజీ, ఎన్ఎస్‌జీ లాంటివారంతా అక్కడే ఉంటారు’’ అని చెప్పారు.

పెద్ద పెద్ద సందర్భాలలో ఏర్పాట్ల గురించి అరవింద్ మాట్లాడుతూ- ‘‘జీ20 లాంటి పెద్ద పెద్ద సందర్భాలలో భద్రతను కట్టుదిట్టం చేస్తారు. 22 ఏళ్ళ కిందట పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు పరిస్థితులు ఇప్పటిలా ఉండేవి కావు. అప్పట్లో పార్లమెంటు సిబ్బందికి కూడా గుర్తింపు కార్డులు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పార్లమెంటుపై దాడి తరువాత భద్రతను సాంకేతికంగానూ పటిష్టం చేశారు. ఉద్యోగులకు గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఉద్యోగులు కూడా పై అధికారి అనుమతిస్తేనే పార్లమెంటులోకి ప్రవేశించగలరు’’ అని వివరించారు.

‘‘ఈ రోజు పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్ళు పూర్తయిన రోజు. ఆ రోజునుంచి భద్రత విషయంలో వచ్చిన మార్పులు గమనిస్తే- దాడి తరువాత భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇప్పుడు భద్రతా వ్యవస్థ ఎంతో కట్టుదిట్టమైనది, మొత్తం డిజిటలైజ్ చేశారు. పార్లమెంటు కోసం ప్రత్యేకంగా భద్రతా దళం ఉంది. అదెంతో బలమైనది. పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ వ్యవస్థను కూడా పార్లమెంట్ సభ్యునిగానే పరిగణిస్తారు. స్పీకర్ కింద ఈ వ్యవస్థ పనిచేస్తుంటుంది’’ అని అరవింద్ కుమార్ తెలిపారు.

పార్లమెంట్ పై దాడి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌లో పొగలు

గ్యాలరీలోకి వచ్చి చూడాలంటే...

భద్రతా ఉల్లంఘన కారణంగా లోక్‌సభ గ్యాలరీ ఇప్పుడో వార్తగా మారింది. గ్యాలరీలోకి ప్రవేశించి సభా కార్యకలాపాలు చూడాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి? దీనిపై లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు ఇచ్చిన పాసుల వల్లనే ఎవరైనా గ్యాలరీల్లోకి రాగలుగుతారని తెలిపారు.

లోక్‌సభ కార్యకలాపాలు చూడాలనుకునేవారు సహజంగా తమ ప్రాంత పార్లమెంటు సభ్యుడి సిఫార్సు లేఖ తీసుకుని వస్తారు. దీని ద్వారా వారు పాసులు పొంది గ్యాలరీలోకి వెళతారు.

‘‘పాసుల జారీకి ఎంపీ సిఫార్సు లేఖ తప్పనిసరి’’ అని ఆచారి చెప్పారు. గ్యాలరీ పాసుల కోసం ఎంపీలు కేంద్రీకృత పాసుల జారీ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తనకు వ్యక్తిగతంగా తెలిసినవారికి మాత్రమే ఎంపీ విజిటర్ పాసులు కోరాలనే నిబంధన ఉంది. కొన్ని సందర్భాల్లో ఎంపీ తనకు బాగా తెలిసినవారు పరిచయం చేసిన వ్యక్తికి కూడా గ్యాలరీ పాసు ఇప్పించవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఎంపీలు జాగ్రత్తగానే వ్యవహరిస్తారని భావిస్తుంటారు.

పాసులు పొందినవారు గ్యాలరీలో ఏవైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే, వీరికి పాసులు ఇప్పించిన సంబంధిత ఎంపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

బుధవారంనాడు లోక్‌సభ మధ్యలోకి దూకిన సాగర్ శర్మ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా సిఫార్సు లేఖపై పొందిన పాసుతో గ్యాలరీలోకి ప్రవేశంచినట్టు తెలుస్తోంది.

విజిటర్ పాసు పొందిన వారు గ్యాలరీలో గరిష్ఠంగా గంటసేపు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డులను మరొకరికి బదిలీ చేయడానికి కుదరదు. పదేళ్ళలోపు పిల్లలను గ్యాలరీలోకి అనుమతించరు.

‘‘పాసులు జారీచేసేటప్పుడు సంబంధిత వ్యక్తి నేపథ్యాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తాయి. పాసుల తయారీకి సందర్శకుల పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారంలో పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, తండ్రి లేదా భర్త పేరు మొదలైన వివరాలు ఉంటాయి. ధీనిపై ఇంటెలిజెన్స్ పరిశీలన పూర్తయ్యాక పార్లమెంటుకు వచ్చే సందర్శకులను పలు చోట్ల తనిఖీలు చేస్తారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా బాడీ మొత్తాన్ని చెక్ చేస్తారు’’ అని ఆచారి చెప్పారు.

ప్రస్తుత ఘటనలో సభ మధ్యలోకి దూకిన ఇద్దరు ఆగంతకుల సమాచారం కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, స్థానిక పోలీసులు వారి ఇళ్ళకు వెళ్ళాయి. గ్యాలరీలో కూడా భద్రతా సిబ్బంది సాధారణ దుస్తులలో రెండువైపులా కూర్చోని ఉంటారు అని ఆచారి తెలిపారు.

‘‘ గ్యాలరీలో కూర్చున్న వారందరిపైనా ఈ సాధారణ దుస్తులలో ఉండేవారు ఓ కన్నేసి ఉంచుతారు. ఎవరైనా ప్రేక్షకుడు హఠాత్తుగా నినాదాలు చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే వీరు అతన్ని వారించి బయటకు తీసుకువెళ్లిపోతారు’’ అని ఆచారి చెప్పారు. బుధవారం నాటి ఘటన తీవ్రమైన భద్రతా వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘నేను 40 ఏళ్ళు పార్లమెంటులో ఉన్నాను.ఇలాంటి విషయాల గురించి ఎన్నడూ వినలేదు. సెక్రటరీ జనరల్‌గా ఐదేళ్ళు పనిచేశాను. ఓ ప్రేక్షకుడు పొగడబ్బాను పట్టుకుని పార్లమెంటులోకి చొరబడటమనేది నేనింతవరకు చూడలేదు’’ అని ఆచారి చెప్పారు.

ఆగంతకులు పార్లమెంటులో చొరబడటాన్ని అతిపెద్ద భదత్రా వైఫల్యంగా భావిస్తున్నారు. పార్లమెంటులో అనేక స్థాయులలో భదత్రా ఏర్పాట్లు ఉంటాయి.

భద్రతా దళాల కళ్ళు గప్పి పొగడబ్బాలతో గ్యాలరీలోకి ఎలా రాగలిగారనేది విచారించాల్సి ఉంది.

ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించారా అనే అంశాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిర్థరించాల్సి ఉంది.

పార్లమెంటుపై దాడి

ఫొటో సోర్స్, SANSADTV

పార్లమెంటుపై దాడి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ఎంపీ గు ర్జీత్ సింగ్ ఔజ్లా

పొగడబ్బాను లాక్కుని విసిరేసిన కాంగ్రెస్ ఎంపీ

పార్లమెంట్ కార్యకలాపాలు సాగుతున్నప్పుడు గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు సభ మధ్యలోకి దూకిన సంఘటనకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుర్జీత్ సింగ్ ఔజ్లా మీడియాకు తెలిపారు.

‘‘వారు పైనుంచి దూకినప్పుడు జీరో అవర్ పూర్తి కావస్తోంది. ఇంతలో ఏదో అలజడి జరుగుతున్నట్టు మేం గమనించాం. ముందు ఓ వ్యక్తి దూకాడు. తరువాత మరొక వ్యక్తి దూకాడు. మొదట దూకిన ఆగంతకుడు స్పీకర్ వైపు కదిలాడు. అతనేదో అరుస్తున్నాడు’’ అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకు ఆయన చెప్పారు.

‘‘అతను తన బూట్లు తీయడం మొదలుపెట్టాడు. ఆ బూట్లలో ఏదో ఉంది. అతనికి దగ్గరలోనే ఉన్న ఎంపీ బెనీవాల్ ఆ ఆగంతకుడి చేతిలోని వస్తువును పట్టుకున్నారు. ఆయనతో పాటు మరొకరు కూడా ఉన్నట్టున్నారు. అతని చేతిలో ఉన్నది బాంబా అనిపించింది. దాని నుంచి పొగ వస్తోంది. నేను వెంటనే దానిని పట్టుకుని బయటకు విసిరేశాను. ఇది అందరి భద్రతకు సంబంధించిన విషయం’’ అని గుర్జీత్ సింగ్ వివరించారు.

బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ మాలూక్ నగర్ కూడా లోక్‌సభ గ్యాలరీలోకి దూకిన ఆగంతకుల గురించి వివరించారు.

‘‘పార్లమెంటులో జీరో అవర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడేదో శబ్దం వచ్చింది. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎవరైనా పడిపోయారేమో అనుకున్నాం. అప్పుడే పై నుంచి ఒకరు దూకడం కూడా చూశాం. ఎప్పుడైతే ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఇంకో ఆగంతకుడు కూడా దూకాడు, ఏదో జరగబోతోందని మాకు అర్థమైంది. అతను దూకిన చోటు నుంచి పారిపోకుండా, సీట్లపై నుంచి దూకడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడి నుంచి హనుమాన్ బేనీవాల్ ఇక్కడ నుంచి నేను, మిగిలిన ఎంపీలు పరుగులు పెట్టాం’’ అని చెప్పారు.

‘‘ఆగంతకుడు తన బూట్లు విప్పగానే, మేం కొంత సంశయించాం కానీ తరువాత అతన్ని గట్టిగా పట్టుకున్నాం. తరువాత అతనిని కొట్టడం మొదలుపెట్టాం. మా ఉద్దేశం అతను ఏ ఆయుధాన్ని బయటకు తీయకుండా నిరోధించడమే, అందుకే కొట్టాం. ఈలోగా సెక్యూరిటీ గార్డులు వచ్చారు’’ అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)