మహువా మొయిత్రా: పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మీదే ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికం. పార్లమెంట్ సభ్యురాలిగా ఇది ఎంతమాత్రం తగనిది. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె కొనసాగడం సబబు కాదు. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలా?’’
బహిష్కరణ తీర్మానం మీద ఓటింగ్ కోసం డిసెంబర్ 8న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మాటలు పూర్తిచేయగానే, సభలో కూర్చున్న బీజేపీ ఎంపీలు వెంటనే సంసద్ టీవీ కెమెరా వైపు తిరుగుతూ ‘అవును’ అని చెప్పడం వినిపించింది.
ఆ తర్వాత, ఓం బిర్లా మాట్లాడుతూ, ‘‘అవును అని చెప్పిన వర్గానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం’’ అని చెప్పారు.
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసి, ఎంపీగా మహువాను బహిష్కరించాలని సిఫార్సు చేసింది.
లోకసభ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మహువా మొయిత్రా మాట్లాడుతూ, ‘‘నాకు 49 ఏళ్లు. వచ్చే 30 ఏళ్లు పార్లమెంట్ ఇంటా బయట నేను మీపై పోరాడతాను’’ అని అన్నారు.
ఎథిక్స్ కమిటీ సిఫార్సును ఆమె 'కంగారూ కోర్ట్ ఫిక్స్‌డ్ మ్యాచ్' అని అభివర్ణించారు. తనపై బహిష్కరణను వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఎథిక్స్ కమిటీ మీద విపక్షాలతో సహా కమిటీలోని కొందరు సభ్యులు కూడా తీవ్ర సందేహాలు లేవనెత్తుతున్నారు.
బీజేపీ అండతో ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రతిపక్షాల గొంతును నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిటీ మీద వారు ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఎథిక్స్ కమిటీపై సందేహాలు
ఎథిక్స్ కమిటీని 2000లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఒక ఎంపీని బహిష్కరించడం ఇదే మొదటిసారి.
అంటే, ఇంతకుముందు ఎంపీలను బహిష్కరించలేదని కాదు. 2005లో ఇలాగే 10 మంది ఎంపీలను బహిష్కరించాలని సిఫార్సులు వచ్చాయి. కానీ, అవి ఎథిక్స్ కమిటీ కాకుండా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ చేసిన సిపార్సులు.
మహువా మొయిత్రా పాత మిత్రుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు.
వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్‌వర్డ్‌ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్‌లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు.
అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్‌లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్‌కు హీరానందానీ గ్రూప్ గట్టి పోటీదారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ లేఖ రాసింది.
ఆ తర్వాత ఈ కేసు విచారణను ఎథిక్స్ కమిటీకి అప్పగించారు.
పార్లమెంట్ సభ్యులను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారీ అభిప్రాయపడ్డారు. ప్రివిలేజేస్ కమిటీకి ఈ అధికారం ఉంటుందని అన్నారు.
‘‘మహువా మొయిత్రా డబ్బులు తీసుకొని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నారనేది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. నిజానికి ఇక్కడ అందరూ కుమ్మక్కు అయ్యారు. ఈ వ్యవహారం లోక్‌సభ ప్రివిలేజేస్ కమిటీకి వెళ్లాలి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు లంచం తీసుకోవడం తీవ్రమైన ఉల్లంఘన కిందికి వస్తుంది. పార్లమెంట్‌ను అవమానించినట్లు అవుతుంది. ఇలాంటి ఉల్లంఘనలపై ప్రివిలేజేస్ కమిటీ విచారణ జరపాలి. కానీ, ఈ వ్యవహారం ఎథిక్స్ కమిటీకి ఎందుకు పంపించారో నాకు అర్థం కావట్లేదు’’ అని ఆయన ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

ఫొటో సోర్స్, X@GIRIDHARIYADAV_
‘‘ఆరోపణలు చేసిన వ్యక్తి ఎక్కడ?’’
ఒక ఏడాది కాలానికి ఎథిక్స్ కమిటీ సభ్యులను స్పీకర్ నియమిస్తారు. ప్రస్తుత ఎథిక్స్ కమిటీకి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వం వహిస్తున్నారు.
ఆయనతో పాటు ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు విష్ణుదత్తా శర్మ, సుమేధానంద్ సరస్వతి, అపరాజిత సారంగి, డాక్టర్ రాజ్‌దీప్ రాయ్, సునీతా దుగ్గల్, సుభాష్ భామ్రే ఉన్నారు. వీరితో పాటు ఇకాంగ్రెస్ ఎంపీలు వి. వైథిలింగం, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్ణీత్ కౌర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ బాలసోర్ వల్లభనేని, శివసేన ఎంపీ హేమంత్ గోడ్సే, జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్, సీపీఎం ఎంపీ పీఆర్ నటరాజన్, బహుజన్ సమాజ్ పార్టీ బహిష్కృత ఎంపీ కున్వర్ దానిష్ అలీ కూడా ఉన్నారు.
బీబీసీతో మాట్లాడుతూ ఎథిక్స్ కమిటీ సభ్యుడు, జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ గిరిధారి యాదవ్ చాలా తీవ్రమైన ప్రశ్నలు సంధించారు.
‘‘ఎథిక్స్ కమిటీ, దర్యాప్తు ప్రక్రియను అనుసరించలేదు. విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారు హీరానందానీ అఫిడవిట్ ఆధారంగా, ఒక ఎంపీ అయిన మహువా మొయిత్రాను క్రాస్ ఎగ్జామినేషన్‌కు పిలిచారు. కానీ, ఆరోపణలు చేసిన వ్యక్తిని పిలవలేదు. చేసిన ఆరోపణలను ఆయన కమిటీ ముందుకు వచ్చి నిరూపించాల్సింది. హీరానందానీ అఫిడవిట్‌ను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇది మరణ వాంగ్మూలం కాదు. ఆరోపణలు చేసిన వ్యక్తి ప్రాణాలతో లేనందున వారిని పిలవలేమని చెప్పడానికి. ఎథిక్స్ కమిటీ లోక్‌సభ ప్రతిష్టను దిగజార్చే పని చేసింది. ఎంపీ కంటే పెట్టుబడిదారుకే ప్రాధాన్యం ఇచ్చారు.
మహువా చెప్పినవేవీ వినలేదు. ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. మీరు ఏ హోటల్‌లో బస చేశారు? రాత్రి 10 దాటిన తర్వాత మీకు ఎవరెవరు ఫోన్ చేస్తారు? వాటి వివరాలు ఇవ్వండి అని ఆమెను అడిగారు. వీటితో మేం విభేదిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘లావాదేవీల రుజువులు ఏవీ?’
కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని, డబ్బు లావాదేవీలు వెలుగులోకి రాలేదని గిరిధారీ యాదవ్ చెప్పారు.
మోదీ, అదానీలది సోదర బంధం అని నిరూపించినందుకే ఆమెపై బహిష్కరణ వేటు పడిందని ఆయన అన్నారు.
సీపీఎం ఎంపీ పీఆర్ నటరాజన్ కూడా ఇదే విధంగా స్పందించారు. నగదు, లంచానికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక, మౌఖిక ఆధారాలు అందలేదని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
పార్లమెంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ను పంచుకునే విషయానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేవని ఎంపీ నటరాజన్ చెప్పారు.
మహువా మొయిత్రాకు న్యాయం జరుగలేదని ఎథిక్స్ కమిటీ సభ్యుడు దానిశ్ అలీ అన్నారు. పార్లమెంట్ లోపల బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ తనపై దుర్భాషలాడినప్పుడు పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలుగలేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఎలాంటి చర్చ లేకుండానే ఈ తీర్మానాన్ని కమిటీ ఆమోదించిందని కాంగ్రెస్ ఎంపీ వి. వైథిలింగమ్ అన్నారు.
‘‘ఇది ఏకపక్ష నిర్ణయం. చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ, అది జరగలేదు’’ అని ఆయన చెప్పారు.
మహువా మొయిత్రా బహిష్కరణపై బీజేపీ నాయకుడు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, “ప్రశ్నలకు బదులుగా డబ్బు తీసుకోవడం గురించి ఆమెను అడిగారు. తాను బహుమతులు తీసుకున్నట్లు ఆమె ఒప్పుకున్నారు. ఇంతకంటే రుజువు ఇంకా ఏం కావాలి?” అని అన్నారు.
లోక్‌సభ లాగిన్ పాస్‌వర్డ్‌ను హీరానందాని కార్యాలయంతో పంచుకున్నానని మహువా చెప్పారు. అయితే, తన అనుమతి తర్వాతే కంప్యూటర్‌లో ప్రశ్నలు అప్‌లోడ్ అవుతాయని, అందుకు ఓటీపీ అవసరం ఉంటుందని, తన మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ఎప్పుడు ఏం జరిగింది?
అక్టోబర్ 15: మహువా మొయిత్రా పాత మిత్రుడు, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ఆరోపణల తర్వాత లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకొని మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగారని ఆయన ఆరోపించారు.
అక్టోబర్ 17: ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి స్పీకర్ పంపారు.
అక్టోబరు 19: మహువా పార్లమెంటు లాగిన్‌ను ఉపయోగించి తాను ప్రశ్నలను పోస్ట్ చేశానని వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని అఫిడవిట్ ఇచ్చారు.
అక్టోబర్ ఆఖరి వారం: హీరానందానీకి లాగిన్ పాస్‌వర్డ్ ఇచ్చానని, కానీ ప్రతిఫలంగా ఎప్పుడూ డబ్బు తీసుకోలేదని మీడియాతో మాట్లాడుతూ మహువా చెప్పారు.
నవంబర్ 2: మహువా విచారణకు కోసం వచ్చారు. కాసేపటికే దానిష్ అలీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలతో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.
నవంబర్ 9: బహిష్కరణ నివేదికను ఎథిక్స్ కమిటీ ఆమోదించింది.
డిసెంబరు 8: ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటులో సమర్పించారు. ఆ తర్వాత ఆమెను బహిష్కరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు... ఈ కేసు ఎలా మొదలైంది, ఈ నాలుగేళ్ళలో ఏం జరిగింది?
- గాజాలో ఆకలితో అలమటిస్తున్న జనం, సగం మందికి ఆహారం లేదన్న ఐక్యరాజ్యసమితి
- శ్రీకాకుళం: గార ఎస్బీఐ బ్రాంచి నుంచి 7 కిలోల బంగారం ఎలా మాయమైంది, తనఖా పెట్టిన బంగారం పోతే కస్టమర్లు ఏం చేయాలి?
- ఈ ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ పర్యటక గ్రామాలు ఇవేనని ఎందుకు ప్రకటించారంటే...
- World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













