మహువా మొయిత్రా: పార్లమెంటులో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడుగుతున్నారనే ఆరోపణల్లో చిక్కుకున్న తృణమూల్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ

మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, నిఖిల హెన్రీ, చెరిలాన్ మొల్లన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ బీజేపీపై ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే 'ఫైర్‌బ్రాండ్ ఎంపీ' వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మొయిత్రా లంచాలు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

ఆసియాలోని ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సంస్థలే లక్ష్యంగా ఎంపీ మొయిత్రా ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ఒక వ్యాపారవేత్త నుంచి ఖరీదైన బహుమతులు, నగదు అందుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

అయితే, ఈ ఆరోపణలను ఖండించిన మొయిత్రా, తాను ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. దూబే ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ గురువారం నుంచి విచారణ మొదలుపెట్టింది.

మహువా మొయిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకున్నారని ఎంపీ మొయిత్రపై ఆరోపణలు వచ్చాయి

నిబంధనలు మొయిత్రాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కమిటీ ఆమెను శిక్షించలేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కమిటీకి అలాంటి అధికారాలు లేవని అంటున్నారు.

అయితే, ఈ కమిటీ పార్లమెంట్‌కు కొన్ని సిఫార్సులు చేస్తుందని, ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటారా, లేదా అన్నది లోక్‌సభ నిర్ణయమని చెబుతున్నారు. ఒకవేళ మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తే, ఆ నిర్ణయాన్ని ఆమె కోర్టులో సవాల్ చేయొచ్చు.

అదానీ గ్రూప్ మానిప్యులేషన్ అండ్ అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఆ సంస్థ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. దానిని ద్వేషపూరిత నివేదికగా పేర్కొంది.

అప్పటి నుంచి అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని మహువా మొయిత్ర సహా మరికొందరు ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భారత స్టాక్‌మార్కెట్ లావాదేవీలను పర్యవేక్షించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటికే ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది.

నిషికాంత్ దూబే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, టీఎంసీ ఎంపీ మొయిత్రాపై నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు

ఇప్పటి వరకూ ఏం జరిగింది?

బీజేపీ ఎంపీ దూబే అక్టోబర్ 15న లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. అందులో న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్ చెప్పిన సమాచారాన్ని ప్రధానంగా ఎత్తిచూపారు.

అదానీ గ్రూప్‌, ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మెయిత్ర లంచాలు తీసుకున్నారనేందుకు ఆమె తన మాజీ ప్రియుడిగా పేర్కొన్న దెహద్రాయ్ తిరుగులేని సాక్ష్యాలు అందించారని దూబే అందులో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి అదానీ సన్నిహితుడని, వారి మధ్య ఉన్న రాజకీయ సంబంధాలతోనే అదానీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను అటు అదానీ, ఇటు బీజేపీ కూడా కొట్టిపారేస్తున్నాయి.

లోక్‌సభలో ఇప్పటి వరకూ ఎంపీ మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్ లక్ష్యంగానే అడిగారని, అందుకోసం హీరానందానీ నుంచి మొయిత్రా రెండు కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని దూబే ఆరోపించారు.

ఈ ఆరోపణలను మొయిత్రా ఖండించారు. అంతేకాదు ఎంపీ దూబే, న్యాయవాది దెహద్రాయ్, పలు మీడియా సంస్థలపై దిల్లీ హైకోర్టులో ఆమె పరువు నష్టం కేసులు వేశారు.

హీరానందాని గ్రూప్ కూడా ఆ ఆరోపణలను ఖండించింది. అయితే, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి అక్టోబర్ 20న హీరానందానీ ప్రమాణ పత్రం సమర్పించినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.

''ఫేమస్ అయ్యేందుకే అదానీని, ఆయన గ్రూపు సంస్థలను ఎంపీ మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నారు'' అని హీరానందానీ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి.

అంతేకాకుండా, మొయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలు తనకు చెప్పారని, వాటితో ''అవసరమైతే ఆమె అడిగినట్టుగా తానే నేరుగా ప్రశ్నలను అడగొచ్చు'' అని హీరానందానీ చెప్పినట్లు తెలిపాయి.

దీనిపై స్పందించిన ఎంపీ మొయిత్రా ట్విటర్‌లో ఒక పత్రికా ప్రకటనను పోస్ట్ చేస్తూ.. ఆ అఫిడవిట్ ప్రామాణికతను ప్రశ్నించారు.

"అఫిడవిట్ తెల్ల కాగితంపై ఉంది, అది అధికారిక లెటర్‌హెడ్ కాదు, నోటరీ కూడా కాదు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన/విద్యావంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు తన తలపై తుపాకీని ఉంచకపోతే, తెల్ల కాగితం వంటి ఇలాంటి లేఖపై ఎందుకు సంతకం చేస్తారు?" అని మొయిత్రా ప్రశ్నించారు.

"దర్శన్ హీరానందనీకి సీబీఐ, ఎథిక్స్ కమిటీ లేదా మరే దర్యాప్తు సంస్థా సమన్లు ​​పంపలేదు. అలాంటపుడు ఆయన ఈ అఫిడవిట్‌ ఎవరికి ఇచ్చారు?" ఆమె అడిగారు.

''అదానీ గ్రూప్, దాని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రతిష్ట, ప్రయోజనాలను దెబ్బతీసేందుకు 2018 నుంచి ఇలా చేస్తున్నారని దేహద్రాయ్ ఫిర్యాదు తెలియజేస్తోంది" అని దూబే ఆరోపణలు చేసిన మరుసటి రోజు అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు ఆరోపించారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

టీఎంసీ ఏమంటోంది?

అయితే మొయిత్రాపై వచ్చిన లంచం ఆరోపణలపై టీఎంసీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎథిక్స్ ప్యానెల్ నివేదిక కోసం టీఎంసీ వేచి ఉందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ'బ్రియన్ అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని పట్టణ, గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేయడంలో విజయవంతమైన రాజకీయ వ్యక్తిగా మొయిత్రా నిలవడమూ ఈ వివాదం ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం.

కాగా, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొయిత్రా ప్రజాదరణను దెబ్బతీయడానికి 'బీజేపీ పన్నిన ఎత్తుగడ' ఈ వివాదం అని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

కాగా, మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు "చాలా కీలకమైనవి" అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఎంపీ మహువా మొయిత్రా

ఫొటో సోర్స్, Getty Images

మొయిత్రా రాజకీయ ప్రస్థానం

మొయిత్రా 2010లో టీఎంసీలో చేరడానికి ముందు బ్యాంకర్‌గా పనిచేశారు. ఆమె ప్రారంభ రాజకీయ జీవితం రాష్ట్ర స్థాయిలోనే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి మొయిత్రా పోటీ చేశారు.

అక్కడ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షలాది మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించడానికి, ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకోవల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో మొయిత్రా 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పార్లమెంట్‌లో చేసిన తొలి ప్రసంగంలోనే మొయిత్రా పలువురి దృష్టిని ఆకర్షించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం "ఫాసిజం సంకేతాలను" చూస్తోందని ఆమె ఆరోపించారు.

ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మద్దతుదారులు ఆమెను ప్రశంసించారు. 'జనాల్లో ఆమె భయాన్ని పుట్టిస్తున్నారు' అని విమర్శకులు ఆరోపించారు.

మొయిత్రా అప్పటి నుంచి టీఎంసీ పార్టీ ముఖచిత్రంగా మారారు. ఆ పార్టీలో ఇప్పటికే బలమైన మహిళా నాయకురాలు (మమతా బెనర్జీ) ఉన్నారు.

2021లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై మొయిత్రాను మమత బహిరంగంగా విమర్శించారు కూడా. తాజా పరిస్థితిపై మమత ఎలా స్పందిస్తారనే దానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)