టైటానిక్: 111 ఏళ్ళ కిందట సముద్రంలో మునిగిన ఈ నౌకలో బంగారు నాణేలు, ఈజిప్ట్ మమ్మీలు ఉన్నాయా?

టైటానిక్ నౌకలో ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న సమయం అది. ఆ చిమ్మచీకట్లో అది ఒక మంచు శకలాన్ని ఢీకొనడంతో గమ్యస్థానానికి చేరుకోకముందే అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన 111 ఏళ్ళయింది.
ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన ఈ నౌక ప్రమాదం జరిగినప్పుడు 41 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
కేవలం మూడు గంటల్లోనే టైటానిక్ నౌక 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి.. 15వ తేదీ తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా జలసమాధి అయ్యారు. వందల ఏళ్ల తర్వాత కూడా టైటానిక్ ప్రమాదాన్నే అతిపెద్ద సముద్ర ప్రమాదంగా పేర్కొంటుంటారు.
టైటానిక్ శిథిలాలను 1985 సెప్టెంబర్‌లో వెలికితీశారు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌కు 650 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల లోతున ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఈ నౌక రెండు ముక్కలుగా విరిగిపోయింది. మునిగిన చోటనే టైటానిక్ రెండు ముక్కలూ కనిపించాయి. ఈ రెండు ముక్కలు 800 మీటర్ల దూరంలో ఉన్నాయి.
ప్రమాదం జరిగి 111 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ప్రమాద అవశేషాలు మిస్టరీగా ఉన్నాయి. ఇది జల సమాధి అయినట్లు గుర్తించిన తర్వాత ఎన్నో కథనాలు, అపోహలు, అనుమానాలు ఈ టైటానిక్ నౌక చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్నాయి.
ఈ కథనంలో మనం ఇప్పుడు టైటానిక్ గురించి 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..

1. వేగంలో టైటానిక్ రికార్డు సృష్టించాలనుకుందా?
సముద్ర ప్రయాణంలో టైటానిక్ సరికొత్త వేగాన్ని రికార్డు చేయాలనుకుందని పలు కథనాలున్నాయి.
కానీ, దీనిలో ఎలాంటి నిజం లేదు. వేగం కోసం ఈ నౌకను రూపొందించలేదు. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఉల్లాసంగా జరిపేలా ఈ నౌకను డిజైన్ చేశారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో వేగంగా వెళ్లే నౌకలతో ఈ షిప్ పోటీ పడలేదు.
2. టైటానిక్‌లో బంగారు నాణేలు, ఈజిప్ట్ మమ్మీలు
టైటానిక్ గురించి బాగా వినిపించే కథనం.. బంగారు నాణేలను, ఈజిప్ట్ మమ్మీలను ఈ నౌక తీసుకుని వెళ్తుందని చెప్పేవారు.
కానీ, ఈ నౌక కార్గో జాబితాలో మాత్రం ఎక్కడా కూడా బంగారు నాణేల గురించి ప్రస్తావించలేదు.
‘వైట్ స్టార్’ పేరుతో ఉన్న మరో నౌక బంగారు నాణేలను తీసుకుని వెళ్తూ.. 1917లో సముద్రంలో మునిగిపోయింది.
టైటానిక్ ఈజిప్ట్ మమ్మీలను తీసుకెళ్తుందని మరో ప్రచారం కూడా ఉంది. ఈ నౌకలోని ప్రయాణికుల వద్ద ఎంతో విలువైన వస్తువులున్నాయని కూడా పలు కథనాలు వచ్చాయి.
నౌక మునిగిపోయినప్పుడు దీనిలోని వస్తువులన్నీ కూడా సముద్రంలో గల్లంతయ్యాయి. చాలా మంది ప్రయాణికులు ఈ వస్తువుల కోసం ఇన్సూరెన్స్ క్లయిమ్స్ పెట్టుకున్నారు. కానీ, ఎక్కడా కూడా ఈజిప్టియన్ మమ్మీల గురించి ప్రస్తావించలేదు.

3. షాంపేన్ బాటిల్ తెరుచుకోలేదా?
టైటానిక్ లాంచ్ పార్టీ రోజు షాంపేన్ బాటిల్ తెరవాలని ప్రయత్నించారు. అప్పుడు బాటిల్ క్యాప్ తెరుచుకోలేదు. దీన్ని దురదృష్టంగా చెబుతుంటారు.
కానీ, అలా జరిగిందన్న దానికి రుజువు లేదు. వైట్ స్టార్ లైన్ షిప్‌లకు ఈ రకంగా దురదృష్టమనే పేరు లేదు.
4. లైఫ్‌బోట్లను ఎక్కకుండా మూడో క్లాస్ ప్యాసెంజర్లను అడ్డుకున్నారా?
ఈ నౌకలో కొన్ని లైఫ్‌బోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నౌక మంచు శకలాన్ని కొట్టుకున్నప్పుడు, లైఫ్‌బోట్లను ఎక్కకుండా థర్డ్ క్లాస్ ప్యాసెంజర్లను అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.
దీన్ని టైటానిక్ సినిమాలో కూడా చూపించారు. కానీ, ఈ విషయాలేమీ నిజం కాదు.
మూడో క్లాస్‌లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు చనిపోయినప్పటికీ, వారికి లైఫ్‌బోటులో స్థలం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించలేదు.
‘‘మంచు శకలాన్ని నౌక ఢీకొని పెద్ద శబ్దం వచ్చినప్పుడు నేను నా బంకుపై నిద్రపోతున్నాను. నేను ఆ శబ్దం వినగానే వెంటనే డెక్‌పైకి వెళ్లాను’’ అని ఐరిస్ వ్యక్తి డేనియల్ బెర్కెలీ చెప్పారు.
మెట్లపై నుంచి కిందకి వెళ్లినప్పుడు, గేటు మూసుకుని లేదు. ఒక ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్ లైఫ్‌బోటులో చోటివ్వడంతో, తాను సురక్షితంగా బయట పడ్డట్టు తెలిపారు.
5. మహిళలాగా దుస్తులు ధరించి లైఫ్‌బోటులో చోటు దక్కించుకున్న వ్యక్తి
లైఫ్‌బోటులో చోటు కోసం విలియం స్లోపర్ అనే వ్యక్తి మహిళలాగా వేషధారణ చేసుకుని బయటపడ్డట్లు ఒక వార్తా పత్రిక రిపోర్టు చేసింది.
ఇది కూడా అవాస్తవమే. ఎందుకంటే, విలియమ్ స్లోపర్ దీన్ని ఎన్నడూ అంగీకరించలేదు.
పురుషులు లైఫ్‌బోట్లలో మహిళలను, పిల్లల్ని పంపించి, వారు వెనకనే ఆగిపోయారు.
నౌకలో ఉన్న చాలా మంది పురుషులు లైఫ్‌బోట్లను వినియోగించుకున్నారు. 50 శాతం మంది పురుషులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














