ఉస్మాన్ ఖవాజా: ‘యూదులు, ముస్లింలు సమానమే’ అనే సందేశం ఉన్న బూట్లు వేసుకోకుండా ఆస్ట్రేలియా క్రికెటర్‌ను ఐసీసీ ఎందుకు ఆపింది?

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా అనుకూల నినాదాలున్న బూట్లు ధరించేందుకు తనకు అనుమతి ఇవ్వని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చెప్పారు. అయితే, ఐసీసీ నిర్ణయాన్ని తాను నిరసిస్తానని ఆయన తెలిపారు.
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ‘‘అందరికీ జీవితం సమానమే’’, ‘‘స్వేచ్ఛ మానవజాతి హక్కు’’ అనే నినాదాలున్న బూట్లు ధరించాలని ఉస్మాన్ ఖవాజా అనుకున్నప్పటికీ ఐసీసీ ఆయన్ను అందుకు అనుమతించలేదు.
అలాంటివి రాజకీయ ప్రకటనలు అంటూ ఐసీసీ ఉస్మాన్ ఖవాజా ప్రయత్నాన్ని ఆపింది.
అయితే, ఈ వ్యవహారంపై ఉస్మాన్ ఖవాజా ఓ వీడియో విడుదల చేశారు. మానవతా దృక్పథంలో పిలుపునిచ్చేందుకు ఈ నినాదాలున్న బూట్లు ధరించాలని తాను అనుకున్నానని ఖవాజా అందులో తెలిపారు.
36 ఏళ్ల ఉస్మాన్ ఖవాజా ఆ వీడియోలో.. ‘‘నేను ఐసీసీ నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను. ఈ సందేశాలున్న బూట్లు ధరించేందుకు ఆమోదం కోరుతాను’’ అన్నారు.
అయితే, ఉస్మాన్ ఖవాజా ఆట తొలి రోజున తన చేతికి నల్ల రిబ్బన్ కట్టుకుని వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ ఆమోదం లేకుండా అలాంటి సందేశాలు, నినాదాలు ఉన్న బూట్లు ధరించి ఆడడానికి వస్తే నిబంధనల ప్రకారం నిలువరించొచ్చు.
ఖవాజా ఆ బూట్లతో ఆడడానికి రాలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పాడు.
పెర్త్‌లో పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఖవాజా ఈ బూట్లు ధరించడం కనిపించింది.
ఖవాజా గతంలో కూడా గాజాలో సాధారణ ప్రజలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
ఇంతకుముందు ఆయన ఒక వీడియో సందేశంలో... ‘‘ఎవరూ తాము జన్మించే ప్రదేశాన్ని ముందే ఎంచుకోలేరు. అందరి జీవితం సమానంగా లేదన్న సంగతి నా చిన్ననాటి నుంచి నా మనసులో ఉంది. జీవితం, మరణాల మధ్య తేడా ఉన్న ప్రపంచంలో నేను ఎన్నడూ జీవించలేదు. అసమానత చాలా తీవ్రంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘క్రికెట్ ఆస్ట్రేలియా’ ఏమంటోంది?
దీనికంటే ముందు ఖవాజా గాజాలో పరిస్థితులపై యూనిసెఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను షేర్ చేశారు.
‘అమాయకులను చంపుతుంటే మీరు పట్టించుకోరా? లేదంటే చర్మం రంగే మీకు ముఖ్యమా? లేదంటే మతం ఆధారంగా పట్టించుకుంటారా? మనుషులంతా ఒక్కటే అనుకుంటే ఇలాంటివన్నీ అర్థరహితం కావాలి కదా’’ అంటూ ఆయన ఆ వీడియోపై కామెంట్ చేశారు.
కాగా తాజా వ్యవహారంపై ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ బుధవారం స్పందిస్తూ ‘‘ఆటగాళ్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుకు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతిస్తుంది. అదేసమయంలో ఆటగాళ్లంతా ఐసీసీ నిబంధనలు పాటించాలని ఆశిస్తుంది’’ అని పేర్కొంది.
మరోవైపు ఖవాజాకు బహిరంగంగా మద్దతు పలికిన కెప్టెన్ పాట్ కమిన్స్ ఖవాజాకు ఐసీసీ నిబంధనలు తెలియకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
‘దుమారం సృష్టించాలని ఖవాజా ఇలా చేసి ఉండకపోవచ్చు. మనుషులంతా సమానమే అని ఆయన చెప్పాలనుకున్నాడు. ఇందులో విభజనవాదం ఏమీ కనిపించలేదు. మనుషులంతా సమానమే అనే ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను’ అన్నాడు కమిన్స్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉస్మాన్ ఖవాజా తన వీడియో సందేశంలో ‘‘నాకు మనుషులంతా సమానమే’’ అన్నారు.
‘‘యూదులైనా, ముస్లింలైనా, హిందువులైనా నాకు ఒక్కటే. తమ హక్కుల కోసం గొంతు విప్పలేని వారి తరఫున నేను గొంతు విప్పుతున్నాను’’ అన్నారు.
ఈ అంశంలో ప్రపంచం అటు వైపు చూడ్డం మానేయడం తనకు భరించలేని విషయంగా మారిందని ఖవాజా చెప్పాడు.
చిన్నతనంలో తన గురించి తాను ఆలోచిస్తూ తన జీవితానికి అంతగా పట్టింపు లేదని ఫీలైనప్పటికీ తాను పెరిగిన వాతావరణంలో మాత్రం అసమానతలు అంతగా లేవని ఆయన గుర్తు చేసుకున్నారు.
స్వేచ్ఛ అనేది మానవ హక్కులకు సంబంధించిన విషయమని, దీనిపై ఐసీసీ అభ్యంతరపెట్టడం సరికాదని ఖవాజా అన్నాడు.
ఆస్ట్రేలియా క్రీడా మంత్రి అనీక్ వెల్స్ కూడా ఖవాజాకు మద్దతు పలికారు.
ఖవాజా బూట్లపై ఉన్న సందేశాలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తానేమీ భావించడం లేదని వెల్స్ అన్నారు.
‘‘ఖవాజా గొప్ప ఆటగాడు, ఆస్ట్రేలియన్. ముఖ్యమైనదిగా భావించే ఏ విషయంపైనైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. ఆయన తన పనిని తాను గౌరవప్రదంగా చేశాడు’’ అన్నారు వెల్స్.
అయితే, క్రీడా మైదానాలు రాజకీయ ప్రకటనలకు వేదికలు కారాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రోడ్నీ హాగ్, సైమన్ డోనెల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, @FAIZANLAKHANI
మ్యాచ్ రిఫరీదే నిర్ణయాధికారం
ఆస్ట్రేలియాలోని స్థానిక రేడియోతో మాట్లాడిన సైమన్ ఓ డోనెల్... ‘‘వ్యక్తిగతంగా అయితే నేను ఖవాజా అభిప్రాయాలను గౌరవిస్తాను. కానీ, ఆయన ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తన సొంత విశ్వాసాలను మైదానంలోకి తీసుకొచ్చే హక్కు ఆయనకు లేదు’’ అన్నారు.
‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, క్రీడాధికారులు వారి దుస్తులు, సామగ్రిపై ఆమోదం లేకుండా ఎలాంటి రాజకీయ సంబంధిత సందేశాలు ధరించడానికి వీల్లేదు.
ఆటగాళ్లు మైదానంలో ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా చూసే బాధ్యత రిఫరీపై ఉంటుంది. ఉల్లంఘించినవారిని నిరోధించే హక్కు రిఫరీకి ఉంటుంది’’ అని సైమన్ చెప్పారు.
2014లో ఇంగ్లండ్ బ్యాటర్ మొయిన్ అలీ కూడా గాజాకు మద్దతుగా రిస్ట్ బ్యాండ్ ధరించే ప్రయత్నం చేస్తే నిలువరించారు.
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














