గౌతమ్ సింఘానియా: భార్యను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రేమండ్ బాస్ తన ఆస్తిలో 75 శాతాన్ని కోల్పోతారా?

గౌతమ్ సింఘానియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ సింఘానియా
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

భారత టెక్స్‌టైల్ టైకూన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీల మధ్య విడాకుల సెటిల్‌మెంట్‌, తన సంపదలో 75 శాతాన్ని సింఘానియా వదులుకునేందుకు దారి తీయవచ్చు.

గౌతమ్ సింఘానియా ఆస్తుల విలువ రూ. 11.663 కోట్లు (1.4 బిలియన్ డాలర్లు).

భారత్‌లోని వినియోగదారులు అత్యుత్తమ బ్రాండ్‌లలో ఒకటిగా భావించే రేమండ్ కంపెనీకి సింఘానియా, నవాజ్ మోదీలు బోర్డు సభ్యులుగా, వాటాదారులు (ప్రమోటర్ షేర్ హోల్డర్లు)గా ఉన్నారు.

ఫిట్‌నెస్ కోచ్ అయిన సింఘానియా భార్య, విడాకుల వ్యవహారంలో తక్కువ భరణాన్ని తీసుకునేందుకు ఇష్టపడలేదని నవాజ్ మోదీ సన్నిహితుల్లో ఒకరు బీబీసీకి చెప్పారు.

ఇరుపక్షాల కుటుంబ సభ్యులు ఈ వివాదానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. 75 శాతం భరణం అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయి అని బీబీసీకి వారు తెలిపారు.

‘‘స్నేహితులు, మధ్యవర్తులు, లాయర్లు, చార్టెట్ అకౌంట్ల సమక్షంలో 75 శాతం భరణం ఇచ్చేందుకు సింఘానియా ఒప్పుకున్నందున ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని నవాజ్ మోదీ చెప్పారు. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ కోసం ఈ డబ్బును భద్రపరిచేందుకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆమె పట్టుబట్టారు’’ అని వారు బీబీసీకి చెప్పారు.

గౌతమ్ సింఘాానియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో భార్య నవాజ్ మోదీతో గౌతమ్ సింఘానియా

భారత సంపన్న కుటుంబాలకు చెందిన వాటాదారుల నికర విలువలో దాదాపు 96 శాతం ట్రస్టుల్లోనే ఉందని ముంబయిలోని ఒక న్యాయ సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ భాగస్వామి రిషభ్ ష్రాఫ్ తెలిపారు.

ట్రస్ట్ ఏర్పాటుకు సింఘానియా ఆసక్తితో ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. కానీ, ఆ ట్రస్టుకు ఆయన మాత్రమే ఏకైక ట్రస్టీ, సెటిలర్‌గా ఉండేలా ఆయన చేసిన ప్రతిపాదనలను నవాజ్ మోదీ వ్యతిరేకించారు.

‘‘తనకు హక్కులు ఉండని ట్రస్ట్ నిర్మాణానికి నవాజ్ మోదీ అంగీకరిస్తారని నేను అనుకోవట్లేదు. ఆమె దానికి సహ ట్రస్టీగా ఉండాలని కోరుకుంటారు. లబ్ధిదారుగా ఉండటంతో పాటు ట్రస్ట్‌పై నిర్ధిష్ట హక్కుల్ని ఆమె కావాలనుకుంటారు’’ అని ష్రాఫ్ చెప్పారు.

మూడు తరాలకు మించి చాలా కంపెనీలు మనగడ సాగించవని బీబీసీతో మోదీ సన్నిహితులొకరు అన్నారు.

రేమండ్ అయిదో తరం కంపెనీ. అందులో తన కూతుళ్లకు భవిష్యత్ ఉండాలని నవాజ్ మోదీ పట్టుదలగా ఉన్నారని తెలిపారు.

విడాకుల తర్వాత కూడా బోర్డు సభ్యురాలిగా ఆమె కొనసాగాలి అనుకుంటున్నారు. వ్యాపారాలను తన భర్త నిర్వహించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె చెప్పినట్లుగా నివేదికలు ఉన్నాయి.

నవాజ్ మోదీకి తన మామ, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌పత్ సింఘానియా నుంచి బహిరంగ మద్దతు లభించింది.

2017లో సొంత ఇంటి నుంచి తనను వెళ్లగొట్టారని తన కుమారుడు గౌతమ్ సింఘానియాపై విజయ్‌పత్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను గౌతమ్ సింఘానియా గతంలో ఖండించారు.

రేమండ్స్ గ్రూప్

ఫొటో సోర్స్, Getty Images

భౌతిక దాడిలో విరిగిన ఎముక

రేమండ్స్ కంపెనీ దీపావళి పార్టీకి హాజరు అవ్వకుండా నవాజ్ మోదీ ప్రవేశాన్ని నిరాకరించిన వీడియో నవంబర్ నెలలో వైరల్ అయింది. ఈ వీడియోతోనే తొలిసారిగా వారి మధ్య వైరం వెలుగులోకి వచ్చింది.

వందేళ్ల చరిత్ర ఉన్న రేమండ్స్ గ్రూప్ వారసుడు తన మీద, తన మైనర్ కూతురి మీద భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై బీబీసీతో మాట్లాడేందుకు గౌతమ్ సింఘానియా ఒప్పుకోలేదు.

‘‘నా వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వస్తున్న నివేదికలపై నేను స్పందించకూడదని అనుకుంటున్నా. నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం’’ అని గౌతమ్ సింఘానియా చెప్పినట్లు ఆయన అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.

తన భర్త తనను తీవ్రంగా గాయపరిచారని హలో మ్యాగజీన్ మాజీ ఎడిటర్, సెలెబ్రిటీ జర్నలిస్ట్ సంగీత వద్వానీతో నవాజ్ మోదీ చెప్పారు.

తన భర్త వల్ల సాక్రమ్ ఎముక విరిగిపోయిందని, పోలీసులను ఆశ్రయించడానికి తనకు ముఖేశ్ అంబానీ కుటుంబం సహాయం చేసిందని ఆమె వద్వానీతో అన్నారు.

ముంబయిలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో గౌతమ్ సింఘానియాపై మూడు నాన్ కాగ్నిజబుల్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ కష్టకాలంలోనూ రేమండ్ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని ఉద్యోగులకు పంపిన కంపెనీ అంతర్గత ఈమెయిల్‌లో సింఘానియా పేర్కొన్నారు.

దంపతుల వివాదం తొలిసారి బయటకు వచ్చినప్పుడు రేమండ్ కంపెనీ షేర్లు ప్రభావితం అయ్యాయి. మళ్లీ ఇప్పుడు పుంజుకోవడం ప్రారంభించాయి.

భారతీయ సమాజంలోని గృహ హింస మీద ఈ వ్యవహారం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతుంది.

వీడియో క్యాప్షన్, పసిఫిక్ మీద వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తెగిపడ్డ విమానం పైకప్పు

యధావిధిగా వ్యాపారం

మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఈ నెల మొదట్లో ఎక్స్చేంజీలకు చేసిన ఫైలింగ్‌లో రేమండ్ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పారు.

ఇద్దరు ప్రమోటర్ డైరెక్టర్ల మధ్య తలెత్తిన వివాదాలు రేమండ్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌతమ్ సింఘానియా సామర్థ్యాలపై ప్రభావం చూపలేవని వారు అన్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీపై, వ్యక్తిగత సమస్యల కారణంగా చైర్మన్, ఎండీగా సింఘానియా సామర్థ్యాలపై పడే ప్రభావం గురించి రేమండ్ సంస్థను ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) వంటి సంస్థలు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రాలేదు.

కంపెనీ నిధులను స్వప్రయోజనాల కోసం తన భర్త వాడుకుంటున్నారని నవాజ్ మోదీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ నిధులకు రక్షణ కల్పించే సరైన నియంత్రణలు అమల్లో ఉన్నాయా? లేదా? అనే అంశాలపై కూడా ఆందోళన చెలరేగింది. దీనికి సంబంధించి బీబీసీ అడిగిన ప్రశ్నకు రేమండ్స్ సంస్థ స్పందించలేదు.

‘‘ఆమె విజిల్ బ్లోయర్‌లా ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి రేమండ్స్ ఆడిట్ కమిటీ రంగంలోకి దిగుతుంది. దీనంతటి వెనుక వైవాహిక బంధం వివాదం ఉందనే నిజాన్ని ఎవరూ దాచలేరు’’ అని బీబీసీతో ఐఐఏఎస్ అధ్యక్షుడు హేతల్ దలాల్ అన్నారు.

న్యాయ సలహా కోసం రేమండ్ బోర్డ్ ఒక సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ను నియమించింది.

అయితే, ఈ నియామకంపై నవాజ్ మోదీ సంతోషంగా లేరని బీబీసీతో ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రమోటర్ల మధ్య వివాద ప్రభావం వ్యాపారంపై కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

సింఘానియా నికర విలువలో 49 శాతం వాటా రేమండ్ కంపెనీలో ఉన్నందున ఈ వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని బీబీసీతో ఒక సీనియర్ కార్పొరేట్ లాయర్ చెప్పారు.

ఒక వ్యాపారవేత్త అప్పు తీసుకోకుండా, ఆస్తులను మానిటైజ్ చేయకుండా పెద్ద మొత్తంలో డబ్బు సెటిల్‌మెంట్ చేసుకుంటూ సంస్థలో తన వాటాను కాపాడుకోవడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి చైర్మన్‌గా ఉండటంతో సంస్థలోని కార్పొరేట్ సంస్కృతి మీద అనేక ప్రశ్నల్ని ఉత్పన్నం అవుతాయని దలాల్ అన్నారు. వీటిని బోర్డు పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.

గుప్త రహస్యం

భారతదేశంలోని కొన్ని సంపన్న కుటుంబాల్లో మహిళలపై హింస అనేది కొత్త కాదని సామాజిక వ్యాఖ్యాత, ప్రముఖ రచయిత శోభా డే అన్నారు.

‘‘ఇది కార్పొరేట్ ఇండియా గుప్త రహస్యం’’ అని ఆమె అభివర్ణించారు.

శక్తిమంతమైన ప్రజలకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఈ వివాదం ఎలా ముగుస్తుందనే దాని గురించి తనకు అవగాహన ఉందని ఆమె అన్నారు.

‘‘దేశంలో విచారణను అణిచివేయడం చాలా సులభం. ఇది చాలా కష్టమైన పోరాటం. నవాజ్ ఎంత శక్తిమంతంగా చర్చలు జరుపుతారనేది చూడాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్నేహ జావ్లేపై జరిగిన హింసాత్మక ఘటనలపై సమాజం మౌనం వహిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)