మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా... పంజాబ్‌ హైకోర్టు ఏం చెప్పింది?

అత్యాచారం

ఫొటో సోర్స్, THINKSTOCK

    • రచయిత, అరవింద్ చాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పంజాబ్‌లోని 62 ఏళ్ల వితంతువుపై రేప్ కేసు నమోదైంది.

దీంతో, అత్యాచారం కేసులో ఒక మహిళను నిందితురాలుగా పేర్కొనవచ్చా? అనే ప్రశ్న మళ్లీ సుప్రీం కోర్టు ఎదుట నిలిచింది.

తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. మహిళలపై రేప్ కేసు నమోదు చేయకూడదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదించారు.

తుది తీర్పు వెలువరించేంతవరకు ఆమెను అరెస్ట్ చేయకూడదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, కేసు దర్యాప్తులో సహకరిస్తామంటూ పేర్కొంది.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న ఒక మహిళకు అనుకూలంగా 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఈ మహిళ తరఫు న్యాయవాది ఉదహరించారు.

లైంగిక హింస

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘పురుషులు మాత్రమే రేప్ చేయగలరు’

2006 నాటి కేసులో తీర్పునిస్తూ ఆర్టికల్ 375 ప్రకారం, కేవలం పురుషుడు మాత్రమే అత్యాచారం చేయగలరు అని స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించింది.

ఈ కేసు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌లో జరిగిన అత్యాచారానికి సంబంధించినది.

ఈ కేసు బాధితురాలు చెప్పినదాని ప్రకారం, ఆమె ఒక స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుగు పయనం అయ్యారు.

ఆమె సాగర్‌కు చేరుకోగానే రైల్వే స్టేషన్‌లో ఆమెను ఒక వ్యక్తి కలిశారు.

‘‘నిన్ను తీసుకురావడానికి మీ నాన్న నన్ను పంపించారు’’ అని ఆమెతో ఆ వ్యక్తి చెప్పారు.

జ్వరంతో ఉన్న ఆ మహిళ ఆయన వెంట వెళ్లారు. సదరు మహిళను తన ఇంటికి తీసుకెళ్లిన ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే ఇంటికి అతడి భార్య వచ్చారు.

తనను రక్షించాలంటూ ఆ మహిళ అతడి భార్యను వేడుకున్నారు. బాధితురాలిని కాపాడటానికి బదులుగా ఆ మహిళ, బాధితురాలిని చెంపదెబ్బ కొట్టి ఇంటి తలుపు మూసేసి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు.

భర్తతో పాటు ఆ మహిళపై కూడా రేప్ కేస్ నమోదు చేశారు. కానీ, ఆ మహిళ దీన్ని సవాలు చేయడంతో ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది.

అత్యాచారం

ఫొటో సోర్స్, THINKSTOCK

ఆ మహిళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు సందర్భంగా కోర్టు మాట్లాడుతూ, ‘‘ఒక పురుషుడు రేప్ చేసినట్లుగా ఏ సందర్భంలో పరిగణించాలనే అంశాన్ని సెక్షన్ 375 తెలుపుతుంది. అత్యాచారానికి సంబంధించిన తీవ్రమైన కేసులను సెక్షన్ 376(2) ప్రకారం నిర్వహిస్తారు. గ్యాంగ్ రేప్ దీని పరిధిలోకి వస్తుంది.

గ్యాంగ్ రేప్‌ చేసిన వారందరికీ శిక్ష పడుతుంది. ఒక మహిళపై ఒకరు కంటే ఎక్కువ పురుషులు అత్యాచారం చేస్తే దాన్ని సామూహిక అత్యాచారం లేదా గ్యాంగ్ రేప్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో వారందరిపై గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన అభియోగాలు మోపవచ్చు.

సబ్ సెక్షన్ (2) ప్రకారం వారందరినీ గ్యాంగ్ రేప్ నిందితులుగా భావించవచ్చు. కానీ, ఇది ఒక మహిళను అత్యాచార నిందితురాలిగా పరిగణించదు. లాజికల్‌గా అది సాధ్యం కాదు.

కాబట్టి సెక్షన్ 376 (2) (జీ) ప్రకారం, ఆ మహిళను ప్రాసిక్యూట్ చేయలేమని’’ పేర్కొంది.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

సెక్షన్ 375 ఏం చెబుతోంది?

ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, ఒక వ్యక్తి ఈ ఆరు పరిస్థితుల్లో ఒక మహిళతో లైంగిక సంబంధంలో పాల్గొంటే ఆ మహిళపై అత్యాచారం జరిగినట్లుగా పరిగణిస్తారు.

  • మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా
  • మహిళ అనుమతి లేకుండా
  • చంపుతామని లేదా ఇతర హాని కలిగిస్తామంటూ భయపెడుతూ బలవంతంగా మహిళను లైంగిక సంబంధానికి ఒప్పిస్తే,
  • ఒక వ్యక్తిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లుగా భావించి మహిళ సమ్మతి ఇస్తుంది. కానీ, ఆ పురుషుడికి తాను ఆ మహిళ భర్త కాదనే విషయం స్పష్టంగా తెలిసీ కూడా లైంగిక సంబంధంలో పాల్గొంటే,
  • మానసిక స్థితి సరిగా లేని సమయంలో లేదా మత్తు పదార్థాల ప్రభావంతో ఏ జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో మహిళ ఉన్నప్పుడు ఆమె నుంచి అనుమతి పొంది లైంగిక సంబంధంలో పాల్గొంటే,
  • 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న అమ్మాయి అనుమతితో, అనుమతి లేకుండా లైంగిక సంబంధంలో పాల్గొంటే అత్యాచారంగా పరిగణిస్తారు.

మినహాయింపు: ఒకవేళ భార్య వయస్సు16 ఏళ్ల లోపు ఉంటే, భర్తతో ఆమె లైంగిక సంబంధాలు కలిగి ఉండటం అత్యాచారం కాదు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్‌లో తాజా కేసు ఏంటి?

ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసులో అత్యాచార బాధితురాలు పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లా నివాసి. అమెరికా నివాసి మన్‌ప్రీత్ సింగ్‌తో ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయం జరిగిందని, తర్వాత ప్రేమించుకున్నట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

2022లో తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తుండగా, తననే పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఆమె కుటుంబీకులను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడతానని మన్‌ప్రీత్ ఒత్తిడి చేసినట్లుగా బాధితురాలు ఆరోపించారు.

భయపడిన ఆమె మన్‌ప్రీత్‌తో పెళ్లికి ఒప్పుకున్నారు. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. అమెరికాకు తీసుకెళ్లేంతవరకు పంజాబ్‌లోని తన ఇంట్లో ఉండమని మన్‌ప్రీత్ కోరాడని ఆమె తెలిపారు.

మూడు నెలల తర్వాత పోర్చుగల్‌లో నివాసం ఉండే మన్‌ప్రీత్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్ పంజాబ్‌కు వచ్చారు.

మన్‌ప్రీత్‌ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఆయన బాధితురాలిని ఒత్తిడి చేశారు.

ఆయన తల్లి (ప్రస్తుతం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన మహిళ) కూడా హర్‌ప్రీత్‌కు మద్దతుగా మాట్లాడారు. బాధితురాలు దీనికి ఒప్పుకోకపోవడంతో మన్‌ప్రీత్ కుటుంబీకులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు.

పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

‘గదిలో బంధించి అత్యాచారం’

ఒకరోజు మన్‌ప్రీత్ తల్లి ఆమెను ఒక గదిలో బంధించారు. తర్వాత రెండురోజుల పాటు హర్‌ప్రీత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమె నగ్న చిత్రాలను తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించారు. తర్వాత తన తల్లిదండ్రులను పిలిచిన బాధితురాలు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మొదట సెషన్స్ కోర్టు, తర్వాత నవంబర్‌లో పంజాబ్-హరియానా హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి.

ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి పిటిషనర్ వృద్ధురాలు అనే కారణం ఏమాత్రం సరిపోదని హైకోర్టు తీర్పునిచ్చింది.

నేరంలో ఆమె భాగస్వామ్యం గురించి ఎఫ్ఐఆర్‌లో స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

ఇప్పుడు సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళపై అత్యాచార ఆరోపణలు ఎందుకు మోపకూడదో చెప్పాలంటూ కోర్టు ఆమె తరఫు లాయర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

పంజాబ్‌లో పెరుగుతున్న రేప్ కేసులు

నేషనల్ క్రైమ్ రిజిస్ట్రేషన్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాల ప్రకారం, పంజాబ్‌లో రేప్ కేసులు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో అత్యాచార కేసులు దాదాపు 10 శాతం పెరిగాయి.

2021లో 464 కేసులు, 2022లో 517 కేసులు నమోదు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)