కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఫీజు రెట్టింపు.. కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరబ్‌జీత్ సింగ్ ధాలీవాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ సహా విదేశాల నుంచి తమ దేశానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల విషయంలో కెనడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి వల్ల కెనడా చదువు ఖర్చు మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం, గ్యారంటీడ్ ఇన్వెస్టిమెంట్ సర్టిఫికేట్ (జీఐసీ) మొత్తాన్ని కెనడా రెట్టింపు చేసింది. ఇతర దేశాల నుంచి కెనడాకు చదువుకునేందుకు వచ్చేవారు కొంత సొమ్మును జీఐసీ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు తాజాగా వర్క్ పర్మిట్లలోనూ కెనడా మార్పులు తీసుకొచ్చింది.

ఈ కొత్త నిబంధనలు విద్యార్థులపై చాలా ప్రభావం చూపించే అవకాశముంది. ఇవి 2024 జనవరి నుంచి అమలులోకి వస్తున్నాయి.

ఈ మార్పులను ప్రకటించే సమయంలో కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ స్పందిస్తూ.. ‘‘కెనడాకు వచ్చే విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అందుకే తాజా మార్పులు తీసుకొచ్చాం’’ అని అన్నారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

కొత్త నిబంధనలు ఏమిటి?

స్టూడెంట్ వీసాపై కెనడాకు వచ్చే విద్యార్థులు వసతి సహా ఇతర ఖర్చుల కోసం ముందుగానే జీఐసీ రూపంలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం జీఐసీని ప్రస్తుతం పది వేల డాలర్లకు (రూ.8.3 లక్షలు) నుంచి 20,635 డాలర్లు(రూ.17 లక్షలు)కు పెంచారు.

అంటే ఇదివరకు కెనడా వెళ్లే విద్యార్థులు రూ.8.3 లక్షలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ప్రస్తుతం రూ.17 లక్షలకు పెంచారు.

ఈ కొత్త జీఐసీ నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ చెప్పారు.

‘‘కెనడాలో జీవన వ్యయం నానాటికీ పెరుగుతోంది. ఇక్కడకి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదు. అందుకే జీఐసీని మేం పెంచాం’’ అని మార్క్ మిల్లర్ అన్నారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

వర్క్ పర్మిట్ నిబంధనల్లోనూ మార్పులు

జీఐసీతోపాటు వర్క్ పర్మిట్‌కు సంబంధించిన నిబంధనల్లోనూ తాజాగా మార్పులు చేశారు.

ఇదివరకు కెనడాకు వచ్చే విద్యార్థులు వారానికి 20 గంటల వరకూ పనిచేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే, ఈ నిబంధనలను సడలిస్తూ విద్యార్థులు ఫుల్-టైమ్ ఉద్యోగం చేసుకునేలా కెనడా తాత్కాలిక మార్పులు తీసుకొచ్చింది.

మొదట 2023 డిసెంబరు 31 వరకే ఈ నిబంధనలు ఉండేవి. ప్రస్తుతం దీన్ని 2024 ఏప్రిల్ 30 వరకూ పొడిగించారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

వర్క్ పర్మిట్: ‘18 నెలల’ నిబంధన రద్దు

మూడో నిబంధన కూడా వర్క్ పర్మిట్‌కు సంబంధించినదే.

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఉద్యోగాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తాత్కాలికంగా 18 నెలల అదనపు వర్క్ పర్మిట్లను కెనడా జారీ చేస్తూ వచ్చింది.

సాధారణంగా కెనడాలో రెండేళ్లు చదువుకున్న విద్యార్థులకు మూడేళ్లు అదనంగా వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ మూడేళ్లు పూర్తయిన తర్వాత మరో 18 నెలలు దీని కింద పనిచేసుకోవచ్చు.

అయితే, ప్రస్తుతం ఈ 18 నెలల నిబంధనలను రద్దు చేస్తున్నట్లు కెనడా ప్రకటించింది.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏం చెబుతున్నారు?

మే, సెప్టెంబరు నెలల్లో కెనడాకు వెళ్లే విద్యార్థులపై తాజా నిబంధనలు ప్రభావం చూపిస్తాయని చండీగఢ్ ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రూపీందర్ సింగ్ అన్నారు.

‘‘కొత్త నిబంధనల వల్ల కెనడాకు వెళ్లే విద్యార్థులు ప్రస్తుతం కంటే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ అదనంగా డబ్బులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఒకేసారి ఇంత పెంచేకంటే.. కొంచెం కొంచెంగా పెంచుంటే విద్యార్థులపై ఇంత భారం పడుండేది కాదు’’ అని ఆయన అన్నారు.

‘‘జీఐసీ మొత్తం తక్కువగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు కెనడాను చదువుకునేందుకు గమ్య స్థానంగా ఎంచుకునేవారు’’ అని ఆయన చెప్పారు.

‘‘స్టూడెంట్ వీసాల కోసం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ కూడా ఇలానే ఎక్కువగా సీజీఐను అడుతుంటాయి. అయితే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అడుగుతారు. కెనడా ఆ సమాచారాన్ని తీసుకోదు’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, మంచు తుపాన్లు వచ్చే కెనడాలో వడగాడ్పులు..

విద్యార్థులపై ప్రభావం ఏమిటి?

కెనడాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

2022లో కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 40 శాతం వరకూ ఉంది. ఎక్కువగా పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కెనడాకు విద్యార్థులు ఎక్కువగా వెళ్తుంటారు.

అయితే, జీఐసీ పెంపుతో అక్కడకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశముందని రూపీందర్ అన్నారు.

2021 కెనడా జనాభా లెక్కల ప్రకారం, కెనడాలో దాదాపు 14 లక్షల భారత సంతతి ప్రజలు జీవిస్తారు.

ఈ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం కెనడా జనభా భారీగా పెరిగింది. గత ఏడు దశాబ్దాల్లో చూడని రీతిలో ఈ పెరుగుదల రేటు ఉంది. గత ఏడాది 12 లక్షల మంది కెనడాకు వలస వచ్చారు.

మొత్తంగా 2022లో 4.69 లక్షల మందిదికి ఇక్కడ శాశ్వత నివాసం కల్పించారు. 7 లక్షల మంది తాత్కాలిక నివాస పరిమితులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)