జాతులను కుదిపిన ప్రేమకథ: ‘మా అమ్మానాన్నల జాత్యంతర వివాహాన్ని అంతర్జాతీయ స్కాండల్ అన్నారు’

ఫొటో సోర్స్, SUPPLIED
- రచయిత, జెరెమీ బాల్
- హోదా, బీబీసీ న్యూస్
ఇది అప్పట్లో జాతి దుమారాన్ని రేకెత్తించిన ప్రేమకథ, ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లో హెడ్‌లైన్‌గా మారి, చర్చనీయాంశమైంది. అదే రూత్ హోల్లోవే, జాన్ కిముయు ప్రేమ కథ.
రూత్ అనే తెల్ల బ్రిటీష్ మిషనరీ, జాన్ అనే ఒక నల్లజాతి కెన్యా వ్యక్తి తో ప్రేమలో పడ్డారు.
జాన్ అంధుడు. ఆయన కెన్యాలోని అంధుల ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేవారు.
అక్కడే రూత్ పనిచేసేవారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు. తర్వాత వారిని అనేక కష్టాలు వెంటాడాయి.
రూత్, జాన్‌ల కూతురు ఎన్డిండా. తన తల్లి జీవితంపై ఒక పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టారు ఎన్డిండా. వీరి ప్రేమ కథ 1957లో ప్రారంభమైంది.
యూకేలోని నాటింగ్‌హామ్‌షైర్‌లో మైనింగ్‌కు నిలయమైన కిర్క్‌బీ-ఇన్-యాష్‌ఫీల్డ్‌లో పెరిగారు రూత్. ఆమెకు 19 ఏళ్లు ఉండగా కెన్యాకు వచ్చారు.
కెన్యాలో జాన్‌తో ప్రేమలో పడ్డారు రూత్. అప్పట్లో దేశం అల్లకల్లోలంగా ఉంది. 'మౌ మౌ' అని పిలిచే 'కెన్యా ల్యాండ్ అండ్ ఫ్రీడమ్' ఆర్మీ బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాలమది.
అయితే, ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత రూత్ తన ఉన్నతాధికారులకు, తల్లిదండ్రులకు పెళ్లి విషయం తెలియజేయడానికి యూకేకి వెళ్లారు.
అయితే, రాగానే రూత్‌కు ఎదురుదెబ్బ తగిలిందని ఎన్డిండా గుర్తుచేసుకున్నారు.
"రూత్‌ను ఉద్యోగం నుంచి తీసేయాలని సాల్వేషన్ ఆర్మీ( క్రైస్తవ మిషినరీ ) నిర్ణయించింది. దీంతో ఆమె పెళ్లి ఉంగరాన్ని కొని, కేక్‌లో పెట్టి ఓడలో కెన్యాకు అక్రమంగా రవాణా చేయించుకున్నారు" అని బీబీసీతో తెలిపారు ఎన్డిండా.

పత్రికల్లో కథలు కథలుగా..
అప్పట్లో ఈ జంట పెళ్లి వివాదాస్పదమైంది, ఎందుకంటే నల్లజాతి కెన్యా వ్యక్తిని వివాహం చేసుకున్న మొదటి శ్వేతజాతీయురాలు రూత్ అని అప్పట్లో అందరూ అనుకునేవారు.
రిజస్ట్రార్ కూడా వీరి పెళ్లి విషయంలో ఇబ్బందులు పెట్టారు. వారి పెళ్లికి అంగీకరించేది లేదని కూడా ప్రకటించారు.
ఇరువురి వివాహం గురించి యూకే, కెన్యా నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు వార్తాపత్రికలు, టెలివిజన్‌లలో కథనాలుగా వెలువడ్డాయని, ఇది జాతి విద్వేష హింసాకాండకు దారి తీయొచ్చని కొన్ని వార్తా కథనాలు వచ్చినట్లు ఎన్డిండా చెప్పారు.
"పెళ్లిపై కెన్యాలోని కొందరు తెల్లజాతి వలసదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది''అని తెలిపారు.
"అమ్మా నాన్న గెలవలేకపోయారు. సానుకూల కథనాలు కొన్ని మాత్రమే వచ్చాయి. చాలా వార్తలు జాత్యహంకారంతో నిండి ఉండేవి" అని ఎన్డిండా చెప్పారు.

ఫొటో సోర్స్, SUPPLIED
కెన్యాకు స్వాతంత్య్రం రావడంతో..
వారిద్దరికీ పెళ్లయిన మూడేళ్ల తర్వాత పుట్టిన ఎన్డిండాకు నాన్నంటే చాలా ఇష్టం
అయితే, కెన్యా దేశానికి స్వాతంత్య్రం రావడంతో ఆమె ఐదో పుట్టినరోజుకు ముందే వారి కుటుంబం విడిపోయింది.
శ్వేతజాతీయులందరూ దేశాన్ని విడిచిపెట్టాలంటూ కెన్యా కోరడంతో రూత్ జీవితం ఇబ్బందుల్లో పడింది. 1965లో రూత్ దంపతులు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఎన్డిండాతోపాటు మిగిలిన ఇద్దరు కూతుళ్లను కూడా తీసుకుని యూకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు రూత్. " అప్పుడు నేను చాలా బాధపడ్డా" అని తెలిపారు ఎన్డిండా.

ఫొటో సోర్స్, Getty Images
"ఒక చిన్న సూట్‌కేస్, కొన్ని బట్టలతో తిరిగి వచ్చాం, అప్పటి నుంచి మేం ఇక్కడే ఉన్నాం. మా నాన్నకది చాలా కష్టమైన సమయం. మా అమ్మ గుండె పగిలిందని నాకు తెలుసు, కానీ ఆమెకు అది తప్పదు" అని అన్నారు.
యూకేలో అంధులకు పని దొరకదని తన తల్లిదండ్రులు భావించారని ఎన్డిండా తెలిపారు.
అందుకే తన తండ్రి కెన్యాలో ఉంటున్నారని, అక్కడ ఆయన పోలీసుల వద్ద స్విచ్‌బోర్డ్ సంబంధిత విభాగంలో ఉద్యోగం చేస్తున్నారని ఎన్డిండా చెప్పారు.

ఫొటో సోర్స్, SUPPLIED
భార్యభర్తలిద్దరూ ఎలా మాట్లాడుకునే వారు?
తన భార్యకు టేప్ రికార్డుల ద్వారా మెసేజ్‌లు పంపుతూ టచ్‌లో ఉండేవారు జాన్. ఈ రికార్డులను ఎన్డిండా భద్రపరిచారు కూడా
తన తల్లి పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించారని, అయితే భర్తతో ఉండలేకపోవడం బాధాకరంగానే ఉంటుందని ఎన్డిండా అన్నారు.
రూత్ 30 ఏళ్ల క్రితం మరణించారు. జాన్ మరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆయన చనిపోవడానికి ముందు తొంభైవ ఏట అడుగుపెట్టారు.
ఎన్డిండా గత నెలలో తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమంలో ప్రసంగించడానికి కెన్యాకు వెళ్లారు. 30 ఏళ్లలో ఆమె మొదటిసారి అక్కడికి వెళ్లారు.
ఆ పర్యటనే ఆమెను తన తల్లిదండ్రుల గురించి ఒక పుస్తకం రాసేలా ప్రేరేపించింది.
"నాకు ఇంట్లో ఉన్నట్లే ఉంది" అని ఎన్డిండా చెప్పారు. "నా తండ్రి చనిపోయినందుకు విచారంగా లేను. నిజానికి నేను ప్రశాంతంగా ఉన్నాను'' అని ఆమె తెలిపారు
వరండా దగ్గరికి వెళ్లగానే అమ్మ గొంతు వినిపిస్తుందని అంటున్నారు ఎన్డిండా. "నా తల్లి స్వరం నాకు ఏళ్లుగా కథలు చెబుతోంది, అలాగే నా వేళ్లు నా కీబోర్డ్‌పై మాట్లాడుతున్నాయి" అని అన్నారు.
తన తల్లిదండ్రులు ప్రపంచాన్ని మార్చడానికి సాయం చేసిన మార్గదర్శకులని అభివర్ణించారు ఎన్డిండా. అందుకే ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచం భిన్నంగా, అద్భుతంగా ఉందని ఆమె అంటున్నారు.
"అయితే అది ప్రేమ. దాని కోసం మీరు ఏదైనా చేస్తారు. పర్వతాలనూ అధిరోహిస్తారు. ప్రేమే వారిని ఒకచోట చేర్చింది, ప్రేమ దాని కోసం పోరాడేలా చేసింది" అని ఎన్డిండా అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఒక్క నిర్ణయంతో లక్షల ఫాలోవర్లను కోల్పోయిన ముంబయి ఇండియన్స్
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














