మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ.. ప్రియురాలి ఇన్‌స్టాగ్రాం పోస్టు వైరల్

బాధితురాలు ప్రియాసింగ్

బాయ్ ఫ్రెండ్ కారుతో తనను తొక్కించాడని మహారాష్ట్రలోని థానేలో ఓ యువతి ఆరోపించింది.

బాధితురాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఈ మేరకు ఆరోపణలు చేసింది. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తన ప్రియుడు మహారాష్ట్రకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడని బాధితురాలు చెప్తోంది.

ఈ మేరకు ఆరోపణలు చేస్తున్న ప్రియా సింగ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.

ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం, ఆమె బాయ్‌ఫ్రెండ్ అశ్వజిత్ గైక్వాడ్ ఆమెను కారుతో తొక్కించడానికి ప్రయత్నించాడు.

థానే డీసీపీ అమర్ సింగ్ జాదవ్
ఫొటో క్యాప్షన్, మీడియాకు కేసు వివరాలు వెల్లడిస్తున్న థానే డీసీపీ అమర్ సింగ్ జాదవ్

“నాలుగురోజుల క్రితమే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా, జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈరోజు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక, వారినుంచి సహకారం అందుతోంది” అని ప్రియాసింగ్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి థానే డీసీపీ అమర్ సింగ్ జాదవ్ మాట్లాడుతూ, “బాధితురాలికి అశ్వజిత్ గైక్వాడ్, రోమిల్ పాటిల్, సాగర్ షెల్క్‌లతో గొడవ జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఐపీసీ 279, 338, 323, 504, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిందితులపై చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

నిందితుడితో నాలుగున్నరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రియాసింగ్ చెప్తున్నారు.

తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన ఫోన్‌లో ఉన్నాయని తెలిపారు.

“గతంలోనే అతడికి వివాహమైంది. భార్యకు విడాకులు ఇచ్చానని నాతో చెప్పాడు. కానీ ఆరోజు నేను అశ్విజిత్‌ను అతడి భార్యతో చూశాను. ఆ విషయం నాకు తెలిసిందని, కోపంతో నన్ను చంపడానికి ప్రయత్నించాడు” అని బాధితురాలు తెలిపారు.

బాధితురాలు ప్రియాసింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జరిగిన ఘటనను వివరిస్తున్న బాధితురాలు

తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో జరిగిన ఘటనను వివరిస్తూ ప్రియాసింగ్ పోస్ట్ పెట్టారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం..

“సోమవారం ఉదయం సమయంలో నా బాయ్‌ఫ్రెండ్(అశ్వజిత్ గైక్వాడ్) నుంచి నాకు కాల్ వచ్చింది. నేను అతడిని కలిసేందుకు వెళ్లాను. ఆ సమయంలో ఏదో కార్యక్రమం జరుగుతోంది. అతడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉన్నాడు. నేను అక్కడికి వెళ్లి, కొంతమంది స్నేహితులను కలిశాను. ఆ సమయంలో నా బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నాకు వింతగా అనిపించి, బయటకు వచ్చి, అతడి కోసం ఎదురుచూశాను. ఏం జరిగిందో అడిగేందుకు విడిగా కలుద్దామని కోరాను.

అతడు స్నేహితులతో కలిసి వచ్చాడు. నేను మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, అతడి స్నేహితుడు (రోమిల్ పాటిల్) నన్ను మాట్లాడనివ్వలేదు. పైగా నన్ను దూషించడం మొదలుపెట్టాడు. దీంతో మా మధ్య గొడవ మొదలైంది. అతడు అసభ్యంగా మాట్లాడుతుంటే, నాకు మద్దతుగా మాట్లాడమని నా బాయ్‌ఫ్రెండ్‌ని అడిగాను. కానీ ఆ తరువాతే నేను ఊహించనిది జరిగింది” అని రాశారు.

ప్రియాసింగ్ కొనసాగిస్తూ, “నా బాయ్‌ఫ్రెండ్ నాపై చేయి చేసుకున్నాడు. నా గొంతు నొక్కేందుకు ప్రయత్నించాడు. అతడిని దూరంగా తోసేందుకు ప్రయత్నిస్తే, నా జట్టు పట్టుకుని దాడి చేయడం మొదలు పెట్టాడు” అని రాశారు.

ప్రియాసింగ్ ఆ ఘటన గురించి వివరిస్తూ, “నేను ఏం జరుగుతుందో గమనించేలోగానే అతడు తన కారు దగ్గరకు వెళ్లాడు. అప్పటికే నా బ్యాగ్, మొబైల్‌ను లాక్కొని కారులో ఉంచాడు. వాటి కోసం నేను కారు దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో డ్రైవర్‌తో నన్ను తొక్కించమని చెప్పాడు. డ్రైవర్ వెంటనే కారు వేగం పెంచి నామీదకు వచ్చాడు. ఎడమవైపు నుంచి కారు ఢీకొట్టడంతో కిందపడిపోయాను. కారు వెనుక టైరు నా కుడికాలుపై నుంచి వెళ్లింది.

20-30 నిముషాలపాటు ఏం జరిగిందో తెలీలేదు. నొప్పి తాళలేక నేను సాయం కోసం అరిచాను. కానీ, వారు నాకు సాయం చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు. అరగంటకు పైగా నేను నిస్సహాయ స్థితిలో సాయం కోసం చూస్తూ ఉండిపోయాను. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి నన్ను చూసి, స్థానికపోలీసులకు సమాచారం ఇచ్చాడు” అని రాశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది

“ఆ వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు. కొంతసేపటికి నేను చనిపోయానో, బతికే ఉన్నానో చూడటానికి నా బాయ్‌ఫ్రెండ్ కారు డ్రైవర్ అక్కడికి వచ్చాడు. నాకు సాయంగా మరోవ్యక్తి ఉండటం చూసి, పోలీసులకు ఎక్కడ విషయం చేరుతుందో అని నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ముందుకు వచ్చాడు. ఆసుపత్రికి వెళ్లే దారిలో నన్ను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు.

“ఇందులో పోలీసులను తీసుకురావొద్దు. ఎందుకంటే చిచ్చు భాయ్ (అశ్వజిత్) ఏం చేయగలడో నీకు బాగా తెలుసు. నువ్వేమీ చేయలేవు. ఈ నిందను నేను నామీద వేసుకుంటాను అని డ్రైవర్ అన్నాడు’’

ఆసుపత్రికి చేరుకున్నాక నా కుటుంబానికి సమాచారం ఇవ్వడానికి నా మొబైల్‌తోపాటు నా వస్తువులన్ని ఇవ్వమని డ్రైవర్‌ను చాలా బతిమిలాడాను. కానీ, ఆసుపత్రిలోని డాక్టర్లు ఒత్తిడి చేయడంతో నా సోదరికి కాల్ చేయడానికి నా ఫోన్ నాకు తిరిగిఇచ్చాడు” అని రాశారు.

కుటుంబానికి బెదిరింపులు

“నా కాలు ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేసి రాడ్ వేశారు. శరీరంపై చాలాచోట్ల గాయాలయ్యాయి. చేతులు, భుజం, కడుపు, వీపుపై గాయాలయ్యాయి. మూడు, నాలుగు నెలలపాటు నేను బెడ్‌మీదనే ఉండాలి. ఏ ఆధారం లేకుండా నేను నడవడానికి ఆరు నెలలు పట్టొచ్చు. నా కుటుంబానికి నేనే ఆధారం” అని ప్రియ చెప్పారు.

“మేం నాలుగున్నరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కానీ, అతడు నన్ను చూడటానికి కూడా రాలేదు. దీన్ని బట్టి చూస్తే, అతడు నన్ను నా ప్రాణాలు తీయడానికే ప్రయత్నించాడని నాకర్థమైంది.

నేను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతడి స్నేహితులు పదేపదే ఆసుపత్రికి వచ్చి, నా సోదరిని బెదిరిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నా గురించి, నా కుటుంబ గురించి ఆందోళనగా ఉంది. మానవత్వంపై నమ్మకం పోయింది. నా జీవితం మళ్లీ మామూలవుతుందో లేదో కూడా నాకు తెలీదు. నాకు న్యాయం జరిగేలా చూడండి” అన్నారు ప్రియాసింగ్.

అశ్వజిత్ గైక్వాడ్‌ను సంప్రదించేందుకు బీబీసీ మరాఠీ ప్రతినిధి ప్రయత్నించినా, అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)