ముంబయి ఇండియన్స్: ఒక్క నిర్ణయంతో లక్షల ఫాలోవర్లను కోల్పోయిన జట్టు

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్న కొద్దిరోజుల్లోనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ముంబయి ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు తెరలేచింది.
ఐపీఎల్ 2024 నేపథ్యంలో దుబాయ్‌లో జరగనున్న మినీ వేలానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయంతో ముంబయి ఇండియన్స్ ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌ను లక్షల సంఖ్యలో యూజర్లు అన్‌ఫాలో చేశారు.
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ముంబయి ఇండియన్స్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కు 1.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే, ఇప్పుడు ఫాలోవర్ల సంఖ్య 1.28 కోట్లకు తగ్గిపోయింది.
రోహిత్‌శర్మ అభిమానులు ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తోంది.
రోహిత్‌శర్మకు మద్దతుగా, ముంబయి ఇండియన్స్ జట్టును బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియా క్యాంపెయిన్‌లు కూడా ప్రారంభించారు కొంతమంది అభిమానులు.
రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.
హిట్ మ్యాన్, ఐపీఎల్ 2024, కెప్టెన్సీ, షేమ్ ఆన్ ఎంఐ, అంబానీల పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ముంబయి ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం తరువాత ఇన్‌స్టాగ్రాంలో ఫాలోవర్లు తగ్గడంతో, ఇప్పటివరకు అత్యధిక ఫాలోవర్లు ఉన్న జట్టు కాస్తా, రెండోస్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్ 1.3 కోట్ల ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రోహిత్‌ను కాదని పాండ్యాకు ఎందుకు ఇచ్చారు?
హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ, పాండ్యాకు మద్దతుగా అతడి అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
వయసు దృష్ట్యా చూస్తే, రోహిత్(36)కు బదులుగా పాండ్యా(30)కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడాన్ని విశ్లేషకులు సమర్థిస్తున్నారు.
రోహిత్‌శర్మ కెప్టెన్‌గా ప్రపంచకప్‌లో అద్భుతాలు చేశాడని, అయితే, పాండ్యా అతితక్కువ సమయంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టును తరువాతి స్థాయికి తీసుకువెళ్లాడని విశ్లేషకులు చెప్తున్నారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకుంది. గత సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లింది.
అయితే, రోహిత్‌శర్మ సమర్థతను తక్కువ చేయడంలేదని, అతడి కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుందని విశ్లేషకులు అంటున్నారు.
ఐపీఎల్ సీజన్లలో రోహిత్‌శర్మ ఇన్నింగ్స్ కొంతకాలంగా ఆశించిన స్థాయిలో లేదు. మరోవైపు పాండ్యా సారధ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు విశేషంగా రాణించింది.
సచిన్ తెందూల్కర్, హర్బజన్ సింగ్, రికీ పాంటింగ్, రోహిత్‌శర్మల తరువాత ఐదో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఈ నేపథ్యంలో, భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ‘బ్రోకెన్ హార్ట్’ ఎమోజీని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు.
దీనిపై కూడా పలు రకాలుగా వాదనలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్‌లో పాండ్యా సక్సెస్ గ్రాఫ్
తొలి సీజన్‌తోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు పాండ్యా. 2022 ఐపీఎల్ సీజన్‌లో ట్రోఫీ గెలుచుకున్న జట్టు, 2023లో రన్నరప్‌గా నిలిచింది.
హార్దిక్ పాండ్యా జట్టు నుంచి వైదొలిగాక శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం.
కెప్టెన్సీ బాధ్యతలనుంచి రోహిత్ శర్మను తప్పించాక, అతడికి ఏ బాధ్యతలు ఇస్తున్నారో ముంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్ ఇంకా చెప్పలేదు.
కొద్దిరోజుల క్రితమే హార్దిక్ పాండ్యాను 15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్.
అప్పటినుంచే పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి.
శుక్రవారం జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి పాండ్యా సిద్ధంగా ఉన్నారని ముంబయి ఇండియన్స్ ప్రకటించింది.
ఎక్కువకాలం కెప్టెన్‌గా సేవలందించిన రోహిత్ శర్మకు బదులుగా పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, DANIEL POCKETT-ICC/ICC VIA GETTY IMAGES
సూర్యకుమార్ యాదవ్ స్పందనతో..
సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేయడంతో, రోహిత్ శర్మ విషయంలోనే అతడలా స్పందించారని కొంతమంది యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
హర్షిత్2.0 అన్న యూజర్, "రోహిత్ శర్మ పట్ల సూర్యకుమార్ యాదవ్ ఆవేదనగా ఉన్నాడు" అని రాశాడు.

ఫొటో సోర్స్, X
ఆదిత్య వర్మ అన్న పేరుగల యూజర్ దీనిపై, స్పందిస్తూ, "రోహిత్ శర్మకు సూర్యకుమార్ విధేయుడు" అని రాశారు.
రిత్విక్ సక్సేనా అన్న యూజర్, "సూర్యకుమార్ ఇన్‌స్టా స్టోరీ చూస్తుంటే, హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా చేయడం పట్ల సంతోషంగా లేడని తెలుస్తోంది" అని రాశారు.
మరో యూజర్ అర్వింద్ కలిర్వానా "రోహిత్‌శర్మనే ముంబయి కెప్టెన్‌గా మళ్లీ నియమించాలి" అని కామెంట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














