ధోనీ: నం.7 జెర్సీని ‘రిటైర్’ చేసిన బీసీసీఐ.. ఈ నంబర్లు ఎలా కేటాయిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భానుప్రకాశ్ కర్నాటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండియాలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు. అంతకుమించి.
మ్యాచ్ జరుగుతోందంటే చాలు, ఎంత పనిలో ఉన్నా ఓ కన్ను అటు వైపు ఉంటుంది. ఇక ప్రపంచ కప్, ఐపీఎల్ లాంటి టోర్నీలంటే సరేసరి.
చరిత్రాత్మక విజయాలు సాధించి పెట్టిన, అద్భుతంగా ఆడిన, మరపురాని జ్ఞాపకాలను అందించిన లెజండరీ క్రికెటర్లంటే అభిమానులకు విపరీతమైన ప్రేమ, గౌరవం, ఆరాధనా భావం ఉంటాయి. ఫేవరెట్ క్రికెటర్ హెయిర్ స్టైల్ నుంచి జెర్సీ నంబరు వరకు అన్నీ గుర్తించుకొనేవారు చాలా మందే ఉంటారు.
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన సేవలను గౌరవిస్తూ, అతడు ధరించిన నంబర్ 7 జెర్సీని రిటైర్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఇదే సమయంలో, జెర్సీ నంబర్ రిటైర్మెంట్ అంటే ఏంటి, జెర్సీ నంబర్ ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు, ఎవరు కేటాయిస్తారు అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. వీటికి సమాధానాలు చూద్దాం.

ఫొటో సోర్స్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీతో ధోనీ
జెర్సీ నంబరును రిటైర్ చేయడమంటే?
జెర్సీ నంబరును రిటైర్ చేయడమంటే, ఆ నిర్దేశిత జెర్సీ నంబరును మరొక ప్లేయర్ ఎంపిక చేసుకునే వీలు ఉండదు. అంటే, బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇకపై భారత జట్టులోని ఆటగాళ్లెవరూ ధోనీ ధరించిన నంబర్ 7 జెర్సీని ధరించడానికి వీలుండదు.
గతంలో మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీని రిటైర్ చేసింది క్రికెట్ బోర్డు. ఇప్పుడు ధోనీ సేవలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫొటో సోర్స్, AFP
ఎందుకు రిటైర్ చేస్తారు?
ఆటలో అసామాన్య ప్రతిభతో రాణించిన ఆటగాళ్లు, వారు సాధించిన రికార్డులు, విజయాలు ఎంతో ప్రత్యేకమైనవి.
లెజెండరీ ఆటగాళ్లను గౌరవిస్తూ, వారు ధరించిన జెర్సీ నంబర్లను మరొకరు వినియోగించకుండా, రిటైర్ చేయడం క్రీడా ప్రపంచంలో సంప్రదాయంగా వస్తోంది.
అలా రిటైర్ చేసిన జెర్సీ నంబర్లను మరొకరికి కేటాయించరు. ఆ నంబర్ గల జెర్సీ ఆ ఆటగాళ్ల ‘ఐకానిక్ జెర్సీ’గా గుర్తుండిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
జెర్సీ నంబరు ఎలా కేటాయిస్తారు?
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు(ఐసీసీ) నిబంధనల ప్రకారం- ఈ జెర్సీ నంబర్ల కేటాయింపులో నిర్దిష్ట నిబంధనలేవీ లేవు. 1 నుంచి 100 మధ్య ఏ సంఖ్యనైనా ఆటగాళ్లు ఎంచుకోవచ్చు.
అయితే, జట్టులో ఏ ఇద్దరికీ ఒకే నంబరు జెర్సీని కేటాయించకుండా చూసుకుంటారు.
"భారత క్రికెట్ బోర్డులో మాత్రం జెర్సీ నంబర్ ఎంపికపై పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతానికి జట్టులోని రెగ్యులర్, పోటీలో ఉన్న ప్లేయర్లకు 60కి పైగా జెర్సీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ప్లేయర్ ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలంపాటు జట్టుకు దూరంగా ఉన్నా కూడా అతడి జెర్సీని కొత్త ప్లేయర్‌కు కేటాయించరు. అంటే, కొత్తగా ఆడే వారు ఎంచుకోవడానికి 30కి పైగా జెర్సీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఒక కథనంలో చెప్పింది.
“ప్లేయర్ రిటైర్ అయ్యాక ఆ జెర్సీ నంబరుని మరొకరికి కేటాయిస్తుంటారు. లెజెండరీ ఆటగాళ్లు ధరించిన జెర్సీ నంబర్లను రిటైర్ చేయడమంటే, భవిష్యత్తులో మరొకరికి ఆ నంబర్ జెర్సీని ఎంపిక చేసేందుకు వీలుండదు” అని క్రీడా విశ్లేషకుడు సి.వెంకటేష్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఎన్ని జెర్సీలు రిటైర్ చేశారు?
బీసీసీఐ ఇప్పటివరకు రెండు జెర్సీలను రిటైర్ చేసింది. వీటిలో ఒకటి సచిన్ తెందూల్కర్ ధరించిన నంబర్ 10 జెర్సీ, మరొకటి ధోనీ ధరించిన నంబర్ 7 జెర్సీ.
2014లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఫిలిప్ హ్యూస్ ధరించిన నం.64 జెర్సీని రిటైర్ చేస్తూ ప్రకటన చేసింది.
2014 నవంబరు 25న ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు ఫిలిప్.
బౌలర్ సీన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో బంతి ఫిలిప్ తలకు తగలడంతో తీవ్ర గాయం అయింది. ఆసుపత్రికి తరలించి, సర్జరీ చేసినా ఫలితం లేకపోయింది. చనిపోయే సమయానికి అతడి వయసు కేవలం 25 ఏళ్లు.
ఫిలిప్ హ్యూస్‌ను గౌరవిస్తూ, అతడు ధరించిన నం.64 జెర్సీని రిటైర్ చేస్తూ, నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.
ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచకప్2023 ఫైనల్ మ్యాచ్‌లో ఫిలిప్‌ను గుర్తుచేసుకుంటూ, ఆస్ట్రేలియా ఆటగాడు మిషెల్ స్టార్క్ ‘పీహెచ్’ అన్న పేరు ఉన్న బ్యాండ్‌ను తన కుడిచేతికి ధరించాడు.
2021లో నేపాల్ జట్టు మాజీ కెప్టెన్ పరాస్ ఖడ్కా ధరించిన జెర్సీ నంబర్ 77ను రిటైర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆటగాళ్లు ఎలా ఎంచుకొంటారు?
ఆటగాళ్లకు వారికి నచ్చిన జెర్సీ నంబరును ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. భారత్‌లో ఆ నంబర్ల ఎంపికలో చాలా మంది న్యూమరాలజీని అనుసరిస్తుంటారని క్రీడా విశ్లేషకుడు వెంకటేష్ అన్నారు.
“ఆటగాళ్లు ఎక్కువగా తొమ్మిది సంఖ్య వచ్చే నంబర్లను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ జెర్సీ నంబర్ల ఎంపికలో ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యుల సూచనలు కూడా పాటిస్తుంటారు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ధరించే జెర్సీ నంబర్ 45. విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నంబరు 18. ఈ జెర్సీ నంబర్లలోని అంకెలను కూడితే 9 వస్తుంది. అలాగే ధోనీ ఎంచుకున్న జెర్సీ నంబర్ 7 వెనుక కూడా నేపథ్యం ఉంది. ధోనీ జులై 7న జన్మించారు. దీనికి గుర్తుగానే జెర్సీ నంబర్‌ను ఎంచుకున్నారని క్రికెట్ అభిమానులు చెప్తుంటారు” అని ఆయన వివరించారు.
“వీరేంద్ర సెహ్వాగ్ జెర్సీ నంబర్ 44ను ఎంపిక చేసుకున్నారు. అయితే, జెర్సీ నంబర్ లేకుండా, కేవలం పేరుతో ఉన్న జెర్సీని మాత్రమే ధరించి, క్రికెట్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నం.10 జెర్సీ: శార్దూల్ ఠాకూర్‌పై విమర్శలు
ఫుట్‌బాల్‌లో జెర్సీ నంబర్ 10కి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
ఫుట్‌బాల్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ పీలే వాడిన 10వ నంబర్ జెర్సీని అభిమానులు ఎంతలా గుర్తుంచుకున్నారంటే, ఇప్పటికీ జెర్సీ నంబర్ 10 అంటే మొదట గుర్తొచ్చే వారిలో పీలే ఉంటారు.
క్రికెట్‌లోనూ ఇదే అభిమానం కొనసాగుతోంది.
లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీని 2017లో శార్దూల్ ఠాకూర్ ధరించాడు.
ఆ సమయంలో సోషల్ మీడియాలో శార్దూల్‌పై ట్రోలింగ్ జరిగింది. బీసీసీఐ జోక్యంతో శార్దూల్ 54వ జెర్సీ నంబరుకు మారాడు.
ఇవి కూడా చదవండి:
- యానిమల్: ‘ఆల్ఫా మేల్’ అంటే ఏమిటి? ఇలాంటి మగవాళ్లు ప్రమాదకరమా?
- బుధిని మంజియాన్: ‘నెహ్రూ గిరిజన భార్య’గా పేరున్న ఈమెను గ్రామస్థులు ఎందుకు వెలివేశారు... ఆమె చేసిన తప్పేంటి?
- 'డెవిల్ ట్రీస్': విశాఖలో ఈ 'ఏడాకుల చెట్ల'ను చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
- చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?
- ఆంధ్రప్రదేశ్: జగన్ ఇప్పుడు బీసీ ఓట్ల మీద దృష్టి పెట్టారా... రెడ్డి లీడర్లు అందుకే పార్టీకి దూరమవుతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














