స్వాతి, రామ్‌కుమార్: ఏడేళ్లు దాటినా వీడని మరణాల మిస్టరీ, వీరిద్దరి మృతికి కారణమేంటి?

స్వాతి, రామ్‌కుమార్ (ఫైల్ ఫోటోలు)

ఫొటో సోర్స్, PTI

2016 జూన్ 24వ తేదీ, సమయం ఉదయం 6:50 గంటలు. తమిళనాడులో చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్ యధావిధిగా రద్దీగా ఉంది.

చెంగల్పట్టు రైలు కోసం దాదాపు 60 మంది ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్నారు.

రైలు రావడానికి కొన్ని నిమిషాల ముందు, ఎవరో ఒక అమ్మాయిపై దాడి చేస్తున్నట్లు కనిపించడంతో స్టేషన్‌లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ క్షణంలో ఆమె అరుస్తోంది. తర్వాత 3 నిమిషాల్లో ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన అమ్మాయి పేరు స్వాతి, ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

స్వాతి హత్య గురించి ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. చార్జ్‌షీట్‌లో ఆ వాంగ్మూలం నమోదైంది.

“హత్య చేస్తున్నపుడు అతని దగ్గరికి ఎవరూ వెళ్లలేదు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే హంతకుడిని వెంబడించేందుకు ప్రయత్నించారు. అయితే హంతకుడు గోడ దూకి తప్పించుకున్నాడు.

రైలు కోసం వేచి ఉన్న వారందరూ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన చెంగల్పట్లు రైలు ఎక్కి వెళ్లిపోయారు” అని సాక్షి రాజరాజన్ (పేరు మార్చాం) తెలిపారు.

స్వాతి హత్య తర్వాత ఈ కేసులో నిందితుడైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ రామ్‌కుమార్ జైలులో (87 రోజుల తర్వాత) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన జరిగి ఏడేళ్లవుతోంది. అయితే ఈ ఇద్దరి మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.

అయితే, మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం పరిహారం అందించాలని ఆదేశాలు ఎందుకు జారీ చేసింది? అసలేం జరిగింది?

పోలీసులు విడుదల చేసిన ఫుటేజీలోని దృశ్యం

ఫొటో సోర్స్, RPF

ఫొటో క్యాప్షన్, పోలీసులు విడుదల చేసిన ఫుటేజీలోని దృశ్యం

ఎనిమిది రోజుల అనంతరం..

నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి హత్య తర్వాత, రైల్వే పోలీసులు ప్రాథమికంగా కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో విధానపరమైన ఇబ్బందుల కారణంగా కేసు తమిళనాడు పోలీసుల చేతుల్లోకి వచ్చింది.

తమిళనాడు పోలీసులు హంతకుడు తప్పించుకున్నప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఫుటేజీలో హంతకుడి వీపుపై బ్యాగ్‌ ఉందని అప్పటి చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు.

అయితే, ఘటన జరిగిన ఎనిమిదో రోజు రాత్రి తిరునల్వేలి జిల్లాలోని ఒక వ్యక్తిని అతని ఇంట్లోనే అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అరెస్టయిన వ్యక్తి పేరు రామ్‌కుమార్ అని, హత్య తర్వాత ఆయన తన గ్రామానికి వెళ్లారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు.

“నాకు ఇంకా గుర్తుంది. 50 మందికి పైగా పోలీసులు మా ఇంట్లోకి చొరబడ్డారు. వెతుకుతూ లోపలికి వెళ్లారు. వాళ్లు మా కొడుకు కోసం వెతుకుతున్నారని తెలియదు. ఇంటి వెనుక నుంచి తనను బయటకు లాక్కెళ్లడంతో మెడకు గాయమైంది’’ అని రామ్‌కుమార్ తండ్రి పరమశివం గుర్తు చేసుకున్నారు.

2016 జూలై 1 రాత్రి అరెస్టయిన రామ్‌కుమార్‌కు పోలీసులు తిరునల్వేలిలో ప్రథమ చికిత్స అందించారు.

"కొడుకుని గాయాలతో తీసుకెళ్లడం చూసి నా భార్య, కూతురు పోలీసు వాహనంలోకి ఎక్కారు. కానీ తనను చూడనివ్వకుండా రాత్రికి రాత్రే ఆస్పత్రి నుంచి చెన్నై తీసుకెళ్లారు పోలీసులు. ఆ సమయంలో నా భార్య, కూతురి దగ్గర బస్‌కి కూడా డబ్బులు లేవు, ఆస్పత్రి దగ్గర ఎవరో చార్జీలకు డబ్బులిస్తే ఇద్దరూ ఊరు చేరుకున్నారు’’ అన్నారు పరమశివం.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అరెస్ట్ తర్వాత ఏం జరిగింది?

రామ్‌కుమార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

మరో 10 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే రామ్‌కుమార్‌ చనిపోయే వరకు అలాంటిదేమీ జరగ లేదు.

హత్యకేసులో జైలులో ఉన్న రామ్‌కుమార్‌పై 90 రోజుల్లోగా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోతే బెయిల్‌ పొందే అవకాశం ఉంది.

సరిగ్గా 87వ రోజు 2016 సెప్టెంబర్ 18న రామ్‌కుమార్ జైలులో విద్యుత్ తీగను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును మొదటి నుంచి ఫాలో అవుతూ రామ్‌కుమార్ కుటుంబానికి సాయం చేస్తున్నారు దిలీపన్.

“రామ్‌కుమార్ హత్య చేసినట్లు రుజువు లేదు. రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా ఆరా తీశాను. రామ్‌కుమార్‌ను హంతకుడిగా ఎవరూ గుర్తించలేదు. అతను హత్య చేస్తుండగా నిర్ధరిస్తూ ఎవరైనా చెప్పినట్లు చార్జిషీట్‌లో కూడా లేదు’’ అని ఆయన అన్నారు. అందుకే రామ్‌కుమార్ మృతిపై అనుమానాలున్నాయని దిలీపన్ చెప్పారు.

అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాల ఆధారంగానే రామ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు అప్పట్లో స్వాతి హత్య కేసు దర్యాప్తులో పాల్గొన్న సీనియర్ పోలీసు అధికారి (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) ఒకరు చెప్పారు..

ఈ కేసులో తలెత్తుతున్న సందేహాలపై ప్రశ్నించగా.. కేసుపై ఇంతకు మించి మాట్లాడలేనని చెప్పారు.

స్వాతి

ఫొటో సోర్స్, SWATHI/FB

ఫొటో క్యాప్షన్, స్వాతి (ఫైల్)

దర్యాప్తులో సందేహాలెందుకు?

ఈ కేసును విచారిస్తున్న లాయర్ రామరాజ్, స్వాతి హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

“స్వాతి హత్యకు సంబంధించిన సంఘటనలను సమగ్రంగా విచారించకుండా, రామ్‌కుమార్ హత్య చేశాడని మేం నిర్ధారణకు రాలేం. మేం ఎంక్వైరీ చేసినంత వరకు స్వాతి ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలోని వ్యక్తికి హవాలా వ్యక్తులతో సంబంధాలున్నాయి. స్వాతిని ఉపయోగించుకొని కొన్ని లావాదేవీలు జరిపారు. దీనికి సంబంధించి స్వాతి దగ్గర కీలక పత్రాలు ఉండే అవకాశం ఉంది. అందుకే హత్య చేసి ఉండవచ్చు'' అని లాయర్ ఆరోపించారు.

ఈ ఆరోపణలపై పోలీసు అధికారులను ప్రశ్నించగా.. అందులో వాస్తవం లేదన్నారు.

“స్వాతికి ఒక ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ అబ్బాయిని కుటుంబ సభ్యులు కూడా తిరస్కరించారు. కానీ అతని గురించి ఎవరూ మాట్లాడటం లేదు’’ అని రామ్‌రాజ్‌ అనుమానం వ్యక్తంచేశారు.

నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతి హత్యకు గురైన తర్వాత ప్రత్యక్ష సాక్షి రాజరాజన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం స్వాతికి, ఓ పురుషుడికి అప్పుడప్పుడు గొడవలు జరిగేవని తెలిసింది.

“సంఘటనకు కొన్ని రోజుల ముందు, ఒక వ్యక్తి స్వాతిని కొట్టడం చూశాం. అయితే స్వాతి ఆయనను ఆపలేదు, ఎదురుతిరగలేదు. వారిద్దరూ స్నేహితులనుకొని ఎవరూ కలగజేసుకోలేదు’’ అన్నాడు రాజరాజన్.

“స్వాతిని కొట్టిన వ్యక్తి , చంపిన వ్యక్తి ఒకే వ్యక్తి కాదు. కొట్టిన వ్యక్తి తెల్లగా ఉంటాడు. హంతకుడు కొంచెం నల్లగా ఉంటాడు” అని తెలిపారు రాజరాజన్.

అయితే, హత్య జరిగినప్పుడు ఆమె బాయ్‌‌ఫ్రెండ్‌ ఘటనా స్థలంలో లేడని, ఆయనను విచారించామని పోలీసులు చెప్పారు.

రామ్ కుమార్

ఫొటో సోర్స్, PTI

రామ్‌కుమార్ ఆత్మహత్యలో అనుమానాలేంటి?

2016 సెప్టెంబరు 18న రామ్‌కుమార్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల తర్వాత రామ్‌కుమార్ ఆత్మహత్యపై అనుమానం ఉందని, పోస్ట్‌మార్టం సరిగ్గా నిర్వహించాలని మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారించిన కోర్టు.. ఎయిమ్స్ వైద్యుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో అక్టోబర్ 1న ఎయిమ్స్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం జరిగింది. అక్టోబర్ 3న అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా, రామ్‌కుమార్‌ మృతిపై ఆయన తండ్రి పరమశివం చెన్నైలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

“రామ్‌కుమార్‌ తీగ కొరికి ఉంటే ఆయన పెదవులకు తీవ్ర గాయాలు ఉండేవని, అయితే అలాంటి గాయాలు ఏమీ లేవని, విద్యుత్ లోపల ప్రవహిస్తే, శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతినేవని మానవ హక్కుల కమిషన్ తెలిపింది. కానీ రామ్‌కుమార్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు, ఎయిమ్స్ వైద్యులు మెదడు, గుండె కణజాలం, ఊపిరితిత్తులు, కాలేయం, ప్లీహం, ఎగువ పెదవి, దిగువ పెదవి, మూత్రపిండాలు బాగానే ఉన్నాయని నివేదిక ఇచ్చారు” అని లాయర్ రామ్‌రాజ్ చెబుతున్నారు.

రామ్ కుమార్ ఆత్మహత్య

మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు

అప్పటి జైలు సూపరింటెండెంట్ (ప్రస్తుతం పదవీ విరమణ పొందిన) కూడా 2021లో మానవ హక్కుల కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

బాధిత రామ్‌కుమార్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని 2022లో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

జైలు ఖైదీకి రక్షణ కల్పించే బాధ్యతలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని తెలిపింది.

రామ్‌కుమార్ మృతిపై స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ సిఫారసు చేసింది. ఈ కేసు విచారణ పూర్తయితేనే స్వాతి హత్యకు కారణం తెలుస్తుందని రామ్‌కుమార్ కుటుంబం చెబుతోంది.

‘‘రామ్‌కుమార్‌ కంటే స్వాతికి న్యాయం చేయడం మాకు ముఖ్యం. ఆ కారణం కనుక్కొంటేనే రామ్‌కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయి. రామ్‌కుమార్‌ చనిపోయాక కూడా మనం అపరాధ భావంతో జీవిస్తున్నాం. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని పరమశివం అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)