గవదబిళ్లలు: పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలేంటి? చికిత్స ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ కోసం
దేశంలోని అనేక రాష్ట్రాలలో గవదబిళ్లల వ్యాధి వ్యాపిస్తోంది.
చాలామంది పిల్లలు దీనిబారిన పడుతున్నారు. సహజంగా గవదబిళ్లలు గొంతుకు రెండు వైపులా వస్తాయి.
కానీ కొన్ని ప్రత్యేక కేసులలో ఇవి చెవులు, క్లోమం(పాంక్రియాస్), జననేంద్రియాల వద్ద కూడా వస్తాయి.
కొన్ని జాగ్రత్తలతో ఈ వ్యాధి పిల్లల్లో వ్యాపించకుండా అరికట్టవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎందుకు వస్తాయి?
పిల్లల్లో గవదబిళ్లలు రావడం సాధారణమే. ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వయసు మధ్యనున్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. కొన్నిసార్లు పెద్దలలో కూడా గవదబిళ్లలు కనిపిస్తుంటాయి.
‘‘గవదబిళ్లలనేవి వైరల్ వ్యాధి. చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడో ఈ వైరస్ పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుందని’’ చిన్నపిల్లల వైద్యుడు మనీష్ సనారియా చెప్పారు.
‘‘ గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. దీనివలన ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపునకు గురవుతాయి. ఈ సందర్భంలో పిల్లలు ఏమీ తినలేరు, తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది’’ అని మనీష్ వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిస్తాయి. బాలికల్లో పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. గవదబిళ్లల లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. రెండువారాలలో ఈ లక్షణాలు మాయమై రోగి సాధారణ స్థితికి వస్తాడు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఇవి తీవ్రమైన ప్రభావం చూపుతాయి’’ అని చెప్పారు మనీష్.
‘‘ బ్రెయిన్, పాంక్రియాస్, చెవులు, జననాంగాలకు ఈ ఇన్ఫెక్షన్ పాకితే అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి. చెవికి ఇన్ఫెక్షన్ సోకితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. జననాంగాలకు సోకితే నపుంసకత్వానికి దారితీస్తుంది. బాలికల్లో ఓవరీలు దెబ్బతింటే పెద్దయ్యాక గర్భధారణకు ఇబ్బందిపడతారు’’ అని మనీష్ వివరించారు .
గవదబిళ్లలు సోకిన పిల్లలను బడికి పంపకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి కనుక గవదబిళ్ళల లక్షణాలు కనిపిస్తుంటే మాస్క్ లేకుండా బయటకు పంపవద్దని చెపుతున్నారు.
గవదబిళ్లలతో బాధపడే పిల్లలకు ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారాన్ని అందించాలని, వారికి మంచినీరు, పండ్ల రసాలు ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాలలో పెద్దలు కూడా ఆటలమ్మ, పొంగు, గవదబిళ్లల బారిన పడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో పెద్దలు లైంగిక చర్యలలో పాల్గొనవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏమిటి?
చాలా వైరల్ వ్యాధుల్లానే గవదబిళ్లలకు కూడా ప్రత్యేకమైన చికిత్స లేదు.
లక్షణాలను బట్టి డాక్టర్లు మందులు ఇస్తారు. దీంతోపాటు మల్టీ విటమిన్ , మల్టీ మినరల్ టాబ్లెట్లు కూడా ఇస్తారు. కానీ డాక్టర్లందరూ వ్యాక్సిన్ వేసుకోమని చెపుతుంటారు.
‘‘ సాధారణంగా గవదబిళ్లలనేవి చలికాలంలో వస్తుంటాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్య ఇవి కనిపిస్తుంటాయి’’ అని వడోదరలోని చిన్నపిల్లల డాక్టర్ భావిక్ కన్‌బర్ తెలిపారు.
‘‘ ఇది తీవ్రమైన వ్యాధేమీ కాదు కానీ, ఇన్ఫెక్షన్ బ్రెయిన్‌కు చేరితే మెదడువాపు వచ్చి పిల్లలు మరణించే ప్రమాదం ఉంది. ఇలాంటివి డెంగీ, చికున్‌గన్యా, మలేరియాలోనూ సంభవిస్తుంటాయి. టైఫాయిడ్ కు కూడా చికిత్స తీసుకోకుండా నిర్లక్యంగా వదిలేస్తే ప్రమాదంగా పరిణమిస్తుంది’’ అని వివరించారు.
రెండు డోసుల ఎంఎంఆర్ టీకా ఇప్పించాలని, మూడోసారి బూస్టర్ డోసు ఇవ్వాలని డాక్టర్ కన్‌బర్ తెలిపారు. బహుశా చిన్నప్పుడే పిల్లలు ఈ వ్యాధి భారినపడితే దీనిని ఎదుర్కొనే సహజ నిరోధక శక్తి పిల్లల్లో పెరిగి, తరువాత ఒక వేళ ఈ వ్యాధి వచ్చినా వారిపైన పెద్దగా ప్రభావం చూపించదని కన్బర్ చెప్పారు.
‘‘పిల్లల్లో గవదబిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి’’ అంటారు డాక్టర్ కన్బర్.
ఎంఎంఆర్ వ్యాక్సిన్ పిల్లల్లో పొంగు, గవదబిళ్లలు, రుబెల్లా రాకుండా అరికడుతుంది. ఈ వ్యాక్సిన్ వేసిన తరువాత పిల్లలు ఒకటి రెండు రోజులు జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడటం సామాన్యంగా జరిగేదే.
ప్రభుత్వ, ప్రైవేటు చికిత్సాలయాలలో వ్యాక్సిన్ ఇవ్వడంలో తేడాలున్నాయని, దీనివలన కూడా గవదబిళ్లల వ్యాప్తి పెరుగుతోందని నిపుణులు చెపుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రభుత్వంలో అలా.. ప్రైవేటులో ఇలా...
ఇండియాలో గడిచిన 45 సంవత్సరాలుగా ప్రజారోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం పిల్లలకు 9రకాలైన వ్యాధినిరోధక టీకాలు అందిస్తోంది. ఇదో జాతీయ కార్యక్రమం.
పోలియో, రోటావైరస్, పొంగు, నోరోవైరస్, న్యుమోనియా, టెటనస్, టీబీ, హెపటైటిస్ బీ, డిఫ్తీరియా రాకుండా పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతోంది. వీటితోపాటు మరో మూడు వ్యాధులకు కూడా వ్యాక్సిన్లు ఇస్తారు. కానీ ఈ వ్యాక్సిన్లు ఇవ్వడమనేది ఆ వ్యాధి వ్యాప్తి ఉన్న రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లలో 60 శాతాన్ని ఇండియాలోని ఆరు కంపెనీలే తయారుచేస్తున్నాయి. ఈ సామర్థ్యం కారణంగానే భారత్ కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగిందని నిపుణులు నమ్ముతున్నారు.
ప్రైవేటు క్లినిక్స్‌లో పిల్లలకు రెండు ఎంఎంఆర్ వాక్సిన్స్ తో పాటు మూడోసారి బూస్టర్ డోసు కూడా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ వైద్యశాలల్లో మాత్రం ఒక్క ఎంఆర్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ గవదబిళ్ళలకు పనిచేయదు.
మీడియా కథనాల మేరకు 2016 నుంచి గుజరాత్ రాష్ట్రంలో పిల్లలకు కేవలం ఎంఆర్ ( మీజిల్స్, రూబెల్లా) వాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా అక్కడ వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని బట్టి వ్యాక్సిన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముంబాయి, గుజరాత్‌లలో గవదబిళ్లల ముప్పు ఎక్కువ కావడానికి సరైన వ్యాక్సినేషన్ లేకపోవడమే కారణమవుతోంది.
ప్రైవేటు ఆస్పత్రులలో వ్యాక్సిన్లు వేయించుకునే వారి సంఖ్యతో పోల్చితే ప్రభుత్వ వైద్యశాలలో తక్కువమంది వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో గవదబిళ్ళలకు వ్యాక్సిన్లు వేయకపోవడం వలన ఈ వ్యాధి వ్యాప్తి పెరుగుతోంది.
ఇంటిగ్రేటేడ్ డిసీజెస్ సర్వెలెన్స్ ప్రోగ్రామ్ కు సంబంధించిన 38 వారపు నివేదిక బయటకు వచ్చింది. దీని ప్రకారం దేశంలోని మిగతా ప్రాంతాలలోనూ గవదబిళ్లల వ్యాధి కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని సోఫియన్ లోనూ, ఒడిసాలోని కందమాల్‌లోనూ ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు.
గవదబిళ్లలను సాధారణ వ్యాధిగా పరిగణించి ఇంట్లోనే వైద్యం చేస్తుంటారు. దీనివలన ఎంతమంది కచ్చితంగా ఈ వ్యాధి బారినపడుతున్నారనే గణాంకాలు అందుబాటులో లేవు. ఈ వ్యాధి బారినపడిన పిల్లలను చాలామంది డాక్టర్లకు దగ్గరకు తీసుకువెళ్ళడానికి బదులుగా ఇంట్లోని పెద్దవారిని సంప్రదిస్తుంటారు.
గుజరాత్‌లో చిన్పపిల్లల వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ తుషార్ షా ‘‘ పొంగుకు వ్యతిరేకంగా ప్రభుత్వం విజయవంతమైన ప్రచారం చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ జరగాల్సి ఉంది. గవదబిళ్ళల వ్యాప్తిని అరికట్టేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఎంఆర్ వ్యాక్సిన్‌కు బదులుగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇదేమంత పెద్ద ఖర్చు కాదు, దీనికి అదనంగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు’’ అన్నారు.
తమ సంఘం తరపున ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు డాక్టర్ తుషార్ చెప్పారు. అలాగే పెద్దలకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని ఆయన తెలిపారు.
‘సుశ్రుత సంహిత’లోనూ గవద బిళ్లల ప్రస్తావన
సుశ్రుత సంహితలో గవదబిళ్లల ప్రస్తావన ఉంది. ఈ సంహితను ఆరోగ్యం, చికిత్సపై పురాతన గ్రంథంగా పరిగణిస్తారు. ఆరోశతాబ్దంలో సుశ్రుతుడు అనేక వ్యాధుల గురించిన సమాచారాన్ని, వాటి లక్షణాలు, చికిత్సా విధానాలను ఈ సంహితలో రాశారు.
‘కర్ణ్‌ఫేరా’ పేరుతో సుశ్రుత సంహిత గవదబిళ్లలను పేర్కొంది. దవడల వాపు, జ్వరం దీని లక్షణాలని తెలిపింది.
వందేళ్ళ తరువాత క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల సమయంలో గ్రీకు వైద్యుడు హిప్పోక్రాట్స్ గవదబిళ్లల గురించి రాశారు.
ఆయన తన నోట్స్‌లో ‘‘ కొన్నిసార్లు చెవులకు రెండువైపులా వాపు వస్తుంది’’ అని రాశారు. ఇది గవదబిళ్ళల్లో చాలా సాధారణంగా కనిపించే లక్షణం.
ఇంగ్లీషు వైద్యంలో దీనిని ‘మంప్స్’ అని పిలుస్తారు.పాత ఇంగ్లీషు భాషలో ‘మంప్’ అంటే అపరిశుభ్ర నోరు అని అర్థం. ‘మంపా’ అనే పదానికి నోరు అని అర్థం. డచ్‌లో దీనిని ‘మంబుల్’ అని పిలుస్తారు.
వాక్సిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
1796లో ఇంగ్లీషు డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. దీంతో అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు కనుగొనడానికి పోరాటం మొదలైంది. 1885లో లూయీస్ పాశ్చర్ రేబిస్ వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ ఆరోగ్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చింది.
1937లో యెల్లో ఫీవర్ వ్యాక్సిన్, 1945లో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ , 1952-55 మధ్య పోలియో వాక్సిన్ వచ్చింది. 1969లో హెపటైటిస్ బీ వాక్సిన్‌ను తీసుకువచ్చారు.
మీజిల్స్ వ్యాక్సిన్ 1963లో, 1967లో గవదబిళ్లలకు వ్యాక్సిన్ వచ్చాయి. 1969లో రూబెల్లా వాక్సిన్, 1971లో ఎంఎంఆర్ వాక్సిన్ ను ప్రవేశపెట్టారు.
కాలక్రమంలో అనేక వ్యాధులను అరికట్టే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అనేక దేశాలు పిల్లల కోసం ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: జగన్ ఇప్పుడు బీసీ ఓట్ల మీద దృష్టి పెట్టారా... రెడ్డి లీడర్లు అందుకే పార్టీకి దూరమవుతున్నారా?
- బుధిని మంజియాన్: ‘నెహ్రూ గిరిజన భార్య’గా పేరున్న ఈమెను గ్రామస్థులు ఎందుకు వెలివేశారు... ఆమె చేసిన తప్పేంటి?
- ధీరజ్ సాహూ: లిక్కర్ ఫ్యాక్టరీలో ఐటీ శాఖ పట్టుకున్న ఈ డబ్బును లెక్క పెట్టడానికే అయిదు రోజులు పట్టింది...
- 'డెవిల్ ట్రీస్': విశాఖలో ఈ 'ఏడాకుల చెట్ల'ను చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
- చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















