కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Prof.J.R.Rowland, Auckland University
- రచయిత, ఫిలిప్ విలిసిక్
- హోదా, బీబీసీ బ్రెజిల్ న్యూస్
ఆఫ్రికాలో కొత్త మహా సముద్రం ఏర్పడబోతోంది.
ఈ మహా సముద్రం పుట్టుకు రావడానికి సుమారు 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చని గతంలో అంచనా వేశారు. అయితే, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు మాత్రం కొత్త మహాసముద్రం ఊహించిన దాని కంటే త్వరగానే ఏర్పడనుందని సూచిస్తున్నాయి.
"కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు పట్టే సమయాన్ని మేం 10 లక్షల సంవత్సరాలకు తగ్గించాం. ఇప్పుడు బహుశా ఆ సమయం కూడా సగానికి తగ్గొచ్చు" అని బీబీసీ బ్రెజిల్‌కు జియోసైంటిస్ట్ సింథియా ఎబింగర్ చెప్పారు.
ఆమె అమెరికాలోని టులేన్ యూనివర్శిటీలో పరిశోధకురాలు. ఆమె 1980ల నుంచి ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారు.
గూగుల్ స్కాలర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు సింథియా ఎబింజెర్ రాసిన వ్యాసాలను 16 వేలసార్లకు పైగా ఉదహరించారు.
ప్రసిద్ధి చెందిన ‘నేచర్ మ్యాగజైన్’లో ఆమె రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు, అధ్యయనాల ఫలితాలు చాలానే ప్రచురితమయ్యాయి.
ఇటీవలి కాలంలో ఆమె ప్రచురించిన వ్యాసాల్లో ఎక్కువగా ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడటం గురించి, అక్కడి భౌగోళిక పరిస్థితులపైనే ఉన్నాయి.
అవేకాక మూడు టెక్టోనిక్ ఫలకాలు- అరేబియన్, ఆఫ్రికన్ (నుబియన్ అని కూడా పిలుస్తారు), సోమాలియన్ ఫలకాల ప్రస్తావనలు ఉన్నాయి.
1998లో నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన సింథియా వ్యాసం ‘సెనోజోయిక్ మాగ్మాటిజం’పై ఎక్కువగా చర్చ నడిచింది. ఆమె తోటి జియోలజిస్టులు సుమారు 900సార్లు ఆ వ్యాసం గురించి చర్చించినట్లు గూగుల్ స్కాలర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Prof.J.R.Rowland, Auckland University
ఎర్ర సముద్రంలోంచి కొత్త మహాసముద్రంలోకి నీరు
తన అధ్యయనంలో ఇథియోపియన్ పీఠభూమిపై మాగ్మా (శిలాద్రవం) ప్రభావం గురించి సింధియా ఒక నమూనాతో విశ్లేషించారు.
ఇది తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరిస్తుందని, 45 మిలియన్ సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని రాశారు.
అంతేకాకుండా శిలాద్రవం ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, తూర్పు ఆఫ్రికా చీలికను దాటి వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఇథియోపియా ఎత్తైన ప్రాంతాలు, తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉంటుందని కూడా రాశారు.
“ఇథియోపియా భూగర్భంలో ఉన్న చిన్న అగ్నిపరత్వం, ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటోంది” అని చెప్పారు సింథియా.
ఆమె చెప్తున్న దాని ప్రకారం.. సోమాలియన్ ఫలకం, విస్తృతమైన ఆఫ్రికన్ ఫలకాలు విడిపోయి, హిందూ మహా సముద్రం దిశగా చీలిక ఏర్పడి, ఆ చీలిక నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు వీలుంది.
“నిజానికి ఇది కొత్త మహాసముద్రం ఉద్భవించినట్లు కాదు. కానీ, మనమంతా కొత్త మహాసముద్రంగానే పిలుస్తున్నాం” అన్నారు సింథియా.
“ఎర్ర సముద్రపు నీరే ఆ మహాసముద్రంలోకి చేరుతుందని ఊహించుకోండి” అన్నారు.
మూడు టెక్టోనిక్ ఫలకాలు భిన్నమైన వేగంతో కదులుతున్నాయి.
అరేబియన్ పలక ఆఫ్రికన్ ఫలకం నుంచి ఏడాదికి 2.5 సెంటీమీటర్ల మేర దూరం జరుగుతోంది. మిగిలిన రెండూ ఏడాదికి అర సెంటీమీటర్ చొప్పున కదులుతున్నాయి.
నిదానంగా కదిలి, కొన్నాళ్లకు ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీల్చుతాయి. ఈ చీలికలోకి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల నుంచి ఉప్పు నీరు వచ్చి చేరుతుంది.
ఈ సిద్ధాంతానికి ప్రధాన కారణమూ లేకపోలేదు. 2005లో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగానే ఇదంతా చెప్తున్నారు జియాలజిస్టులు.
2005లో ఇథియోపియాలోని ఎడారిప్రాంతంలో సుమారు 420కి పైగా భూకంపాలు సంభవించాయి. అగ్నిపర్వతాల నుంచి భారీగా బూడిద వెలువడింది.
ఈ పరిణామాల వల్ల అఫార్ ప్రాంతంలో 60 కిలోమీటర్ల పొడవున చీలిక ఏర్పడింది.
ఇథియోపియాలోని అడీస్ అబాబా యూనివర్సిటీకి చెందిన జియోఫిజిసిస్ట్ అటాలే అయెలె నేతృత్వంలో ఈ ఘటనపై అధ్యయనం నిర్వహించారు.
ఆ ఫలితాలను 2009లో ప్రచురించారు. ‘జియోఫిజికల్ రీసర్చ్ లెటర్స్’లో అగ్నిపర్వత-టెక్టోనిక్ సంక్షోభం పేరిట ప్రచురించిన వ్యాసంలో దబ్బాహు-గబ్‌హో, అడోఅలె అగ్నిపర్వత సముదాయాల్లో ఈ ఘటన మూలాలను గుర్తించినట్లు తెలిపారు. శిలాద్రవం అక్కడి నుంచే వచ్చినట్లు చెప్పారు.
“ఈ సంక్షోభం చివరికి మహాసముద్రం ఏర్పడే చీలికను ఏర్పరుస్తుంది” అని పేర్కొన్నారు.
దీనిపై మరింత సమాచారం కోసం బీబీసీ ఆయన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించింది.
ఆయన బదులిస్తూ, “చీలిక ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్రికన్ ఫలకం ఉత్తరం దిశగా వెళ్లి యురేషియన్ ఫలకాన్ని ఢీకొంటుంది. దీనివల్ల ఆల్ప్స్ పర్వాతాల్లో మరిన్ని పర్వతాలు ఏర్పడతాయి” అని చెప్పారు.
“అయితే, ఈ భౌగోళిక ప్రక్రియ మొత్తం రాబోయే కొన్ని శతాబ్దాల్లోనో లేదా వేల సంవత్సరాల్లోనో జరగదు. అందుకు మిలియన్ల సంవత్సరాల కాలం పడుతుంది. భూకంప చిత్రాలను చూస్తే కొత్త మహాసముద్రం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది” అని అయెలె వివరించారు.

ఫొటో సోర్స్, Prof.J.R.Rowland, Auckland University
భారీ భూకంపాలు వస్తే ఇంకా ముందే కొత్త మహాసముద్రం
టెక్టోనోఫిజిక్స్ జర్నల్‌లో గత నెలలో ప్రచురితమైన అధ్యయనాన్ని నిర్వహించిన తొమ్మిది మంది శాస్త్రవేత్తల్లో అయెలె, సింథియా కూడా ఉన్నారు.
ఆ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న భౌగోళిక ప్రక్రియలపై త్రీడీ నమూనాను ఆ జర్నల్‌లో ప్రచురించారు.
అధ్యయనానికి సంబంధించి ముగింపులో వారు పేర్కొన్నదేంటంటే, ఆ ప్రాంతంలో కొత్త, భారీస్థాయి బాల్సమిక్ క్రస్ట్‌లను గుర్తించారు. అంతేకాకుండా అఫార్ డిప్రెషన్ కిందిపొర 25 కిలోమీటర్ల కంటే తక్కువ మందంతో ఉందని తేల్చారు.
అఫార్ డిప్రెషన్‌లో మహాసముద్రపు ప్రారంభానికి దారితీసేందుకు వీలున్న అంశాలను ప్రస్తావించారు.
“చీలిక మరింతగా పెరిగే కొద్దీ సముద్రపు నీరు చేరడం కూడా పెరుగుతుంది. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు, ఆయా తీవ్రతలను బట్టి ఉంటాయి” అని బీబీసీకి వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో సింథియా చెప్పారు.
ఎర్ర సముద్రం నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు ఒక మిలియన్ సంవత్సరాల కంటే తక్కువే పట్టొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు.
“అయితే, పెద్ద భూకంపాల వంటివి చోటుచేసుకుంటే, ఈ సమయం మరింత తగ్గొచ్చు” అన్నారు.
“ఇప్పుడున్న సైన్స్ సాయంతో అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలను కచ్చితంగా అంచనా వేసి చెప్పలేం. అందుకు సైన్స్ మరింత అభివృద్ధి చెందాలి” అని ఆమె తెలిపారు.
ఇథియోపియా ఎడారిలో 2005లో ఏర్పడిన చీలికపై జరిగిన పరిశోధనలతో భవిష్యత్తులో చోటుచేసుకోబోయే విపత్తులను ముందే కచ్చితత్వంతో అంచనా వేసేలా భూకంప నమూనాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














