'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీఫెన్ హ్యూస్
- హోదా, బీబీసీ కోసం
తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారు, అలాంటి ఆలోచనే లేని వారి కంటే ముందుగా మరణిస్తున్నారని ఇటీవల వెల్లడైన స్వీడన్ అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది.
‘హైపోకాండ్రియాక్’ అన్న పదం ఈ మధ్య ఎక్కువగా వాడకంలోకి వచ్చింది.
అయితే, వైద్యులు దీనికి బదులుగా సిక్ యాంగ్జైటీ డిజార్డర్ లేదా ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అన్న పదాన్ని వాడాలని సూచిస్తున్నారు.
హైపోకాండ్రియాను వివరించాలంటే, ఎలాంటి అనారోగ్యమూ లేకపోయినా ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉండటం. హైపోకాండ్రియాక్‌తో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఈ రుగ్మత మానసిక ఆరోగ్య స్థితికి సంబంధించినది.
ఈ రుగ్మత గురించి యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలోని సీనియర్ ఆచార్యులు స్టీఫెన్ హ్యూస్ వివరిస్తున్నారు..
అనారోగ్యం పట్ల ఆందోళన రుగ్మత (ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్)తో బాధపడుతున్నవారు వారి ఆరోగ్యం పట్ల తీవ్రమైన ఆందోళనతో ఉంటారు.
వీరిలో కొంత మంది తరచూ ఆసుపత్రులను సందర్శించేందుకు ప్రయత్నిస్తే, కొంత మంది అసలు ఆసుపత్రికే వెళ్లకుండా ఆందోళనతో ఉండిపోతారు. ఇలాంటి రెండు సందర్భాలూ ప్రాణాంతకమైనవే.
ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నవారిని గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలకే ముప్పు రావొచ్చు.
ఈ రుగ్మత బారిన పడిన వారు ఎక్కువ సమయం ఆసుపత్రులకే వెచ్చిస్తుంటారు. దీనివల్ల వారి సమయం వృథా కావడంతోపాటు వైద్య వనరులు కూడా వృథా అవుతాయి. వీరిలో ఈ ఆందోళనే లేకపోతే వైద్యులు ఆ సమయాన్ని నిజమైన సమస్యలు ఉన్న రోగుల కోసం వెచ్చించే వీలుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
42 వేల మందిపై అధ్యయనం.. ఏం తేలింది?
స్వీడన్ పరిశోధకులు సుమారు 20 ఏళ్లకు పైగా 42 వేల మంది ఆరోగ్య స్థితులను ట్రాక్ చేస్తూ వచ్చారు. వీరిలో ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్న వెయ్యి మంది కూడా ఉన్నారు.
ఈ అధ్యయనాల్లో ఈ రుగ్మతతో బాధపడుతున్నవారి ప్రాణాలకే ముప్పు ఎక్కువ అని తేలింది.
ఆరోగ్యం పట్ల తక్కువ ఆందోళన ఉన్నవారి కన్నా వీరు సగటున ఐదేళ్లు ముందుగానే చనిపోయారు.
సహజ, అసహజ మరణాల ప్రమాదం కూడా వీరిలో పెరిగినట్లు తెలుస్తోంది.
సహజ మరణాలను చూసినప్పుడు గుండె సంబధిత, శ్వాసకోస సంబంధిత, కారణాలు తెలీని ఇతర సమస్యల వల్ల ఈ రుగ్మతకు గురైనవారు మరణించారు.
ఆసక్తికరమైన విషయమేంటంటే, వీరిలో క్యాన్సర్ మరణాల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేదే, ఎందుకంటే, క్యాన్సర్ వ్యాప్తి పట్ల ఆందోళనే ఈ మధ్య ఎక్కువ మందిలో కనిపించింది.
ఈ రుగ్మత బాధితుల్లో కూడా ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధి తమకు వస్తుందేమో అన్న ఆందోళనతో ఉన్నవారే.
ఇక, అసహజ మరణాల విషయంలో, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినవారు ఉన్నారు. ఈ సంఖ్య ఇతరులతో పోలిస్తే, వీరిలో నాలుగు రెట్లు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక సమస్యలతో సంబంధం
అనారోగ్య ఆందోళన రుగ్మత అనేది మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉందని చెప్పొచ్చు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో ఆత్మహత్యకు ప్రేరేపించే ప్రమాదం ఉంది కాబట్టి, ఆ రెండు రుగ్మతలకు సంబంధం ఉంది.
అందుకే, దీనిపై పరిశోధనలు మరింత లోతుగా జరగాలి.
ఈ రుగ్మత బారిన పడినవారు ఆందోళన, డిప్రెషన్‌ల వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులు ఆత్మహత్యలకు దారితీయొచ్చు.
సహజ కారణాల వల్ల మరణాలు సంభవించే అవకాశాలను వివరించడం చాలా సులభమని చెప్పొచ్చు.
అనారోగ్య ఆందోళన రుగ్మతతోపాటు మానసిక రుగ్మతలతో బాధపడే వారిలో ఎక్కువ శాతం ఆల్కహాల్, టొబాకో లేదా డ్రగ్స్ వినియోగం సాధారణంగా కనిపించే ఒక అంశం.
వీటి వినియోగం వల్ల ఆయుర్ధాయం తగ్గుతుంది. ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఎక్కువ.
వీటితోపాటు కుటుంబంలో ఎవరైనా తీవ్రమైన వ్యాధి బారిన పడిన సందర్భాల్లోనూ కొంత మంది ఈ రుగ్మతబారిన పడతారు.
కొన్ని తీవ్రమైన వ్యాధులు జన్యుపరంగా సంక్రమించే సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి కారణాల వల్ల కూడా మరణాలు సంభవించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రోగులు చెప్పేది వైద్యులు పట్టించుకోవాలి
వైద్యులు తమ దగ్గరికొచ్చే రోగులు చెప్పేది జాగ్రత్తగా వినడంతోపాటు అంతర్లీనంగా ఏమైనా ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో చూడాల్సిన అవసరం ఉంది.
ఒక్కోసారి రోగులు చెప్పేది వినడంలోనూ చిన్నచూపు చూసే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల, అనారోగ్య ఆందోళన రుగ్మతతో మన దగ్గరకు వచ్చేవారి అంతర్లీన స్థితిని గుర్తించలేకపోవచ్చు.
ఈ ఉదాహరణనుఫ్రెంచ్ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ వైపు నుంచి చెప్పొచ్చు. ఆయన జీవితచరిత్ర రాసిన రచయితలు, ప్రౌస్ట్‌ను హైపోక్రాండియాక్ అని చెప్తారు.
ప్రౌస్ట్ 51 ఏళ్ల వయసులో 1922లో మరణించారు. అప్పటికి ఫ్రెంచ్ పౌరుల సగటు జీవితకాలం 63 సంవత్సరాలుగా చెప్పారు.
ప్రౌస్ట్ తన జీవితకాలంలో చాలాసార్లు జీర్ణాశయ సంబంధిత సమస్యలు (గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సింప్టమ్స్) గురించి ఫిర్యాదు చేసేవారు. కడుపు ఉబ్బరం, వాంతులు, ఆకలివేయకపోవడం వంటి సమస్యల గురించి వైద్యులను సంప్రదించేవారు. అయితే, వైద్యులు అలాంటి సమస్యేమీ లేదని చెప్పారు. కానీ, ప్రౌస్ట్ చెప్పిన లక్షణాలన్నీ గ్యాస్ట్రోపరెసిస్‌కు దగ్గరగా ఉన్నాయి.
గ్యాస్ట్రోపరెసిస్‌తో బాధపడుతున్న వారిలో తిన్నది వెంటనే అరగక పోవడం, కడుపు ఉబ్బరం, కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో వాంతులు చేసుకోవడం కారణంగా నిమోనియాకు దారి తీసే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే, ప్రౌస్ట్ నిమోనియో వల్ల చనిపోయినట్లుగా చెప్తారు.
చివరిగా, ఓ హెచ్చరిక: ఇలాంటి రుగ్మత గురించి రాయడం సాహసంతో కూడుకున్నది. ఫ్రెంచ్ నాటక రచయిత మొలియర్, హైపోకార్డియాక్‌పై ‘ది ఇమాజినరీ సిక్’ పేరిట ఓ నాటకాన్ని రచించారు. అందులో ఆర్గాన్ అనే పేరున్న వ్యక్తి తన కూతురిని వైద్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. అలా చేయడం వల్ల ఆమె వైద్య ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చని ఆర్గాన్ ఆలోచన.
ఆర్గాన్ పాత్రధారిగా నాలుగోసారి ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే మొలియర్ మరణించారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?
- పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం...తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?
- వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














