ఆ ఊళ్లో అందరికీ మతిమరుపే

మతిమరుపు
    • రచయిత, సోఫీ హచిన్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఫ్రాన్స్‌కు నైరుతి దిక్కున ఉన్న ఓ గ్రామంలోని ప్రజలందరికీ మతిమరుపు సమస్య ఉంది. ఆ గ్రామం పేరు లాండియాస్ అల్జీమర్.

అల్జీమర్ అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం.

ఆ ఊళ్లోని చౌరస్తాలో ఉన్న కిరాణా దుకాణంలో వస్తువులన్నీ ఉచితంగానే తీసుకోవచ్చు. కాబట్టి గ్రామస్తులు తమ పర్సు గురించి బెంగపడాల్సిన పనిలేదు.

పూర్వాశ్రమంలో వ్యవసాయం చేసిన రైతు ఫ్రాన్సిస్ ఈ దుకాణం వద్ద దినపత్రిక తీసుకుంటున్నప్పుడు ఆయన్ని పలకరించాను. పక్కనే ఉన్న కాఫీ షాపులోకి వెళదామన్నాను.

అక్కడ ఫ్రాన్సిస్‌తో సంభాషణ మొదలుపెట్టాను. ‘‘ అల్జీమర్స్ ఉందనే విషయం తెలియగానే ఎలా అనిపించింది?’ అని అడిగా.

ఆయన తన తల పరికించారు. మెల్లిగా గతంలోకి జారుకున్నారు. కొద్దిసేపు ఆగాకా ‘‘ చాలా కష్టంగా అనిపించింది’’ అని చెప్పారు.

ఫ్రాన్సిస్ తండ్రికి కూడా ఈ సమస్య ఉంది. కానీ ఫ్రాన్సిస్ ఏనాడూ భయపడలేదు.

‘‘ఈ జబ్బు సంగతి పక్కనపెట్టి నా జీవితాన్ని నేను జీవించాలనుకున్నాను. నేనిక్కడ ఉంది జీవించడానికి. అదెలా ఉన్నా సరే. నువ్వు సమస్యకు తలొగ్గితే అది నిన్ను నిలవనీయదు. అందుకే ముందుకు వెళ్ళిపోతుండాలి. నీ సామర్థ్యం మేరకు ముందడుగు వేస్తూనే ఉండాలి’’ అని చెప్పారు.

ఇక్కడ పచారీ కొట్టు, కాఫీ దుకాణానికి వెళ్ళేందుకు గ్రామస్తులందరినీ ఉత్సాహపరిచినట్టే, అక్కడ థియేటర్‌లో జరిగే రకరకాల కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా వీరిని ఉత్సాహపరుస్తుంటారు.

‘ఇద్దరికీ మతిమరుపు ఉంది’

ఫిలిప్ , వివియన్

ఫిలిప్ , వివియన్ ఇద్దరికీ అల్జీమర్స్ సమస్య ఉంది. కానీ వీరిద్దరూ సాధారణ జీవితం గడపాలనుకుంటున్నారు.

‘‘మేం మార్నింగ్ వాక్‌కి వెళతాం’’ అంటూ ఫిలిప్ దూరంగా ఏదో చూస్తూ చెప్పారు.

‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’ అని అడిగితే ఠక్కున నావైపు తలతిప్పి ‘‘ నిజంగా సంతోషంగా ఉన్నాం’’ అని మెరిసిపోయే చిరునవ్వుతో చెప్పారు.

వెచ్చని దుస్తులు ధరించిన ఆ దంపతులిద్దరూ కాఫీ తాగాకా పార్కువైపు సాగిపోయారు.

ఈ ఊళ్ళో సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది అని ఈ ఊరును చూపించడానికి వచ్చిన గైడ్ చెప్పారు.

ఈ గ్రామంలో అందరికీ కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎవరినైనా ఫలానా టైముకే కలవాలి అనే నిబంధనలేమీ ఉండవు.

మతిమరుపు క్షీణత తగ్గుతోంది

ప్రొఫెసర్ అమీవా
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ అమీవా

ఈ గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటామని ప్రొఫెసర్ హెలెన్ అమీవా తెలిపారు. ఈ వ్యాధికి అందిస్తున్న చికిత్స విధానాన్ని ఇక్కడి వాతావరణం చాలా చక్కగా ప్రభావితం చేస్తోందని చెప్పారు.

‘‘ఎవరైనా ఒక సంస్థలోకి ప్రవేశించినప్పుడు మనం చూసేది వేగవంతమైన అభిజ్ఞాక్షీణత (మనం ఏం చేయాలనే విషయాన్ని మరిచిపోవడం). కానీ ఇక్కడ మనమది చూడం’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇక్కడ చాలా చక్కని పరివర్తన కనిపిస్తుంటుంది, ఇలాంటి సంస్థలు క్లినికల్ ఫలితాల విధానాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మడానికి తగిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు.

తన 89 ఏళ్ళ తల్లి మారిసెట్‌ను చూసుకుంటున్న డొమినిక్యూ మాట్లాడుతూ ‘‘మా అమ్మకు మానసిక ప్రశాంతత, రక్షణ ఉందని తెలుసు. అందుకే నేను కూడా ప్రశాంతంగా ఉన్నా’’ అని చెప్పారు. ఆమె బెడ్‌రూమ్‌లో తల్లి దగ్గర కూర్చుని ఉన్నారు.

ఆ గది అంతా ఫ్యామిలీ ఫోటోలు, పెయింటింగ్స్‌, ఫర్నీచర్‌తో నిండి ఉంది. తోటవైపు ఓ పెద్ద అద్దం కూడా ఉంది.

ఇక్కడ ఎటువంటి సందర్శనా సమయాలు లేనందున ప్రజలు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. అయితే డొమినిక్యూ మాట్లాడుతూ తాను, తన సోదరి ఇక్కడ ఇంత చక్కటి జాగ్రత్తలు తీసుకుంటారని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

‘‘నేను ఆమెను వదిలి వెళ్ళేటప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. తిరిగి వచ్చినప్పుడు అచ్చం ఇంట్లో అమ్మతో ఉంటున్నట్టే ఉంటుంది. ఇదేదో చికిత్స కోసం ఇక్కడకు వచ్చామనిపించదు’’ అని చెప్పారు.

మారిసెట్, డొమిన్ క్యూ
ఫొటో క్యాప్షన్, మారిసెట్, డొమిన్ క్యూ

ఇక్కడ ఒకొక్క ఇంటిలో ఎనిమిదిమంది నివసించడానికి అవకాశం ఉంటుంది. సామూహిక వంటగది, కూర్చుని భోజనం చేయడానికి వీలుగా భోజనాల గది ఉన్నాయి.

ఇక్కడ ఉండేవారు తమవంతుగా కొంత డబ్బు అందచేస్తుండగా, దీనికి బదులుగా ప్రతి ఇంటికి అవసరమయ్యే ఖర్చుల సగటును ప్రాంతీయ ఫ్రెంచ్ ప్రభుత్వం భరిస్తుంటుంది. ఈ గ్రామ నిర్మాణానికి 17 మిలియన్ పౌండ్లను ఖర్చుచేసింది. అంటే సుమారు 178 కోట్ల రూపాయలు వెచ్చించిందన్నమాట.

దేశంలో ఇలాంటివి మొత్తం రెండు గ్రామాలు ఉన్నాయి. కానీ ఈ గ్రామం పరిశోధనలో భాగమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి మరికొన్ని గ్రామాలు ఉండి ఉండొచ్చు కానీ ఈ గ్రామం మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ గ్రామంలోని క్షౌరశాలలో 65 ఏళ్ళ పాట్రిసియా అప్పుడు తన తలను ఆరబెట్టుకుని వచ్చారు. లాండియా అల్జీమర్ తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చిందని ఆమె చెప్పారు.

‘‘ నేను ఇంటి దగ్గర ఉన్నాను. కానీ బోరు కొడుతోంది’ అని చెప్పారు. ‘‘ నాకోసం ఓ ఆడ వంటమనిషి ఉంది. నేను అలసిపోయాను. నాకు ఆరోగ్యం బావున్నట్టు అనిపిస్తోంది. మతిమరుపు ఎంత కష్టమో నాకు తెలుసు. నాకు సహాయం చేసే చోటు ఎక్కడుండా అని ఆలోచించాను. మిగతా కేర్ హెమ్స్‌లో అలా చేస్తాం, ఇలా చేస్తామని చెపుతారు కానీ వారేమీ చేయరు. కానీ ఇక్కడ నిజమైన జీవితం ఉంటుంది. నేను నిజమని చెపుతున్నాను అంటే అది నిజమనే అర్థం’’ అని చెప్పారు.

మతిమరుపు గ్రామం

చాలా సందర్భాలలో మతిమరుపు అనేది బాధితులను ఒంటరివారిని చేస్తుంది.

కానీ ఇక్కడ మాత్రం ఒంటరితనానికి చోటేలేదు. ఇక్కడున్నవారందరూ నిజాయితీగా ఒకరితో ఒకరు కలివిడిగా ఉంటారు. కలిసిమెలిసి జీవించడానికి ఆసక్తి చూపుతారు.

ఈ సామాజిక అంశమే డిమెన్షియాతో ఉన్నవారిని సంతోషంగా జీవించేలా చేస్తోందని, వారికి మెరుగైన ఆరోగ్యం అందిస్తోందని పరిశోధకులు చెపుతున్నారు.

ఇక్కడ 120మంది డిమెన్షియా బాధితులు ఉండగా, అంతే సంఖ్యలో ఆరోగ్య వృత్తి నిపుణులు ఉన్నారు. అందరికంటే స్వచ్ఛంద సేవచేసేవారు అగ్రభాగాన ఉన్నారు.

మతిమరుపు అనేది ఒక క్రూరమైన అనివార్యత. దానికి విరుగుడు లేదు.

ఇక్కడున్నవారికి మతిమరుపు పెరుగుతున్న కొద్దీ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంటారు.

మొత్తంగా సామూహిక భావనే ఈ గ్రామ విజయరహస్యమని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)