ఫాలున్ గాంగ్: వైద్యంపై నమ్మకంలేని ఈ సంస్థను ‘ఈవిల్ కల్ట్‌’గా ఎందుకు పిలుస్తున్నారు? ఈ సంస్థ సభ్యులను అరెస్ట్ చేసి అవయవాలు దోచుకుంటున్నారా

ఫాలున్ గాంగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేనీ విన్సెంట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆమె చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఒక ప్లాస్టిక్ షీట్‌పై చెప్పులు లేకుండా, గొడుగు కింద ఆమె నిల్చున్నారు.

స్పీకర్‌ నుంచి సంగీతం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వస్తుండగా ఆమె ధ్యానం చేస్తున్నారు.

ఫాలున్ గాంగ్ సభ్యులతో చైనా అనుసరిస్తున్న విధానాలపై నిరసన తెలుపుతున్నవారిలో ప్రస్తుతం ఆమె ఒక్కరే మిగిలారు.

ఆమెకు ఎదురుగా కనిపిస్తున్న భవనం హాంకాంగ్‌లోని చైనా ప్రభుత్వ కార్యాలయం .

ఇదివరకు ఆమెతోపాటు నిరసన తెలియజేసేందుకు చాలా మంది వచ్చేవారు.

కానీ, 2020లో హాంకాంగ్‌లో ‘నేషనల్ సెక్యూరిటీ లా’ను తీసుకురావడంతో, నిరసనకారులను అదుపులోకి తీసుకొని, విచారించడం తేలికైంది.

దీంతో ఫాలున్ గాంగ్ సభ్యులు ఇక్కడ నిరసన తెలిపే ధైర్యం చేయడం లేదు.

నిజానికి ఫాలున్ గాంగ్ సభ్యులుగా తమను తాము ప్రకటించుకునే వారిని చూడాలంటే మీరు ఇతర దేశాలకు వెళ్లాల్సిన స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది.

ఫాలున్ గాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫాలున్ గాంగ్ కల్ట్ అంటే ఏమిటి?

తైవాన్ రాజధాని తైపీ శివార్లలో ఒక భవనం పైఅంతస్తులో కొందరు ఫాలున్ గాంగ్ సభ్యులు ధ్యానం చేస్తూ కనిపించారు.

తమ కల్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్ షీ బోధనలను వీరు పఠిస్తున్నారు. ఎదురుగా ఉండే గోడపై లీ హాంగ్ ఫోటో కనిపిస్తోంది. ఆయన ప్రవచనాలు బోర్డులపై రాసివున్నాయి.

తైవాన్‌లో ఎలాంటి అరెస్టుల భయం లేకుండా ఈ సెక్ట్ మనుగడ సాగిస్తోంది. ఫాలున్ గాంగ్‌ను ‘ఈవిల్ కల్ట్’గా చెబుతూ దాదాపు రెండు దశాబ్దాల క్రితమే చైనాలో కమ్యూనిస్టు పార్టీ దీన్ని నిషేధించింది.

చైనాలో తమ సభ్యులు అణచివేత, వెట్టిచాకిరీకి బలవుతున్నారని ఫాలున్ గాంగ్ చెబుతోంది. మరోవైపు అవయవాల కోసం తమ సభ్యులను చంపేస్తున్నారని కూడా ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలను చైనా అధికారులు ఖండిస్తున్నారు. అయితే, ఒక స్వతంత్ర ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ మాత్రం అణచివేత జరుగుతోందని తేల్చింది.

‘‘అరెస్టైన ఈ సంస్థ సభ్యుల శరీరాల నుంచి అవయవాలు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది’’ అని 2018 డిసెంబరులో ఆ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది.

ఫాలున్ గాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎలా పనిచేస్తుంది?

‘‘ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమం’’ అని స్థానిక ఫాలున్ గాంగ్ నాయకుడు లియావో చెప్పారు. ‘‘వ్యాయామంతోపాటు ధ్యానాన్ని కూడా మేం బోధిస్తాం’’ అని ఆయన చెప్పారు.

‘‘మేం ‘ఆయన’ను దేవుడిగా భావిస్తాం. ఏసు, మహమ్మద్‌లలానే ఆయన మాకు దేవుడు. అతడి జ్ఞానం అద్భుతమైనది’’ అని కల్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్ షీ గురించి మాజీ వ్యాపారవేత్త వాంగ్ చెప్పారు. వాంగ్, ఆయన భార్య చెన్ దశాబ్ద కాలం నుంచి ఈ ఫాలున్ గాంగ్‌లోనే ఉన్నారు.

‘‘ఫాలున్ గాంగ్ అద్భుతమైనది’’ అని చెన్ చెప్పారు. రెండు దశాబ్దల క్రితం ఆమెకు ‘హేపటైటిస్ బీ’ సోకింది.

ఫాలున్ గాంగ్‌కు తరచూ రావడంతో వైద్యులకు సాధ్యంకాని ఫలితాలను ఇక్కడ తాను చూసినట్లు ఆమె భావిస్తున్నారు. ‘‘నా శరీరం మొత్తం దురదపెట్టే ఎర్రని దద్దుర్లు వచ్చాయి. అయితే, అవి తగ్గినప్పుడు నా శరీరం నుంచి ఆ ఇన్ఫెక్షన్‌ కూడా పోయింది’’ అని ఆమె చెప్పారు.

‘‘నా శరీరాన్ని లీ పరిశుద్ధం చేశారు. నా అనారోగ్యాన్ని నయంచేసిన లీకి నేను రుణపడిఉంటాను. చాలా మంది క్యాన్సర్‌లు, ఇతర వ్యాధులతో ఇక్కడికి వస్తున్నారు. ఫాలున్ గాంగ్ వారికి సాయం చేస్తోంది’’ అని ఆమె అన్నారు.

అయితే, అనారోగ్యాలను ఫాలున్ గాంగ్ నయం చేస్తుందని ఆమె చెబుతున్న మాటలను ధ్రువీకరించే ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు.

ఫాలున్ గాంగ్

ఫొటో సోర్స్, Getty Images

అనుచరులు ఏం చెబుతున్నారు?

‘‘లీ చెప్పే బోధనలు అనుసరించేవారికి అనారోగ్యం దరిచేరదు. మీకు జబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం అనారోగ్యం కాదు.. కర్మ అని లీ చెబుతారు. మీరు జబ్బులను నయం చేసుకునేందుకు మందులు వేసుకోవాల్సిన పనిలేదు. అసలు వాటి అవసరమే లేదు’’ అని చెన్ అన్నారు.

అయితే, ఇలాంటి బోధనలు చాలా ప్రమాదకరమైనవని చైనా కమ్యూనిస్టు పార్టీ అంటోంది.

మరోవైపు, తమను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తోందని ఫాలున్ గాంగ్ చెబుతోంది. అయితే, సెక్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్ షీ, ఆరోగ్యంపై అతడి బోధనలు మీద విమర్శలు కూడా వస్తుంటాయి.

‘‘అనారోగ్యాలను నయంచేసే వ్యక్తిగా లీ హాంగ్ తనను తాను చెప్పుకొనేవారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి అనారోగ్యాలు, జబ్బులను ఫాలున్ గాంగ్ ఉపయోగించుకునేది. ఏదైనా ఇతర కారణాలతో జబ్బులు తగ్గినప్పుడు, దీనికి కారణం ఈ కల్టేనని కొందరు ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. అలా చాలా మంది ఈ కల్ట్‌కు బానిసలుగా మారుతున్నారు’’ అని సంస్థ మాజీ సభ్యుడు శామ్ (పేరు మార్చాం) చెప్పారు.

‘‘చికిత్సలు తీసుకోకపోవడంతో మరణించిన చాలా మంది సభ్యులు నాకు తెలుసు. నిజానికి వీరిలో చాలా మంది ఫాలున్ గాంగ్‌కు వచ్చుండకపోతే బతికేవారు’’ అని ఆయన అన్నారు.

ఫాలున్ గాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు పుట్టింది?

1992లో ఈశాన్య చైనాలో ఫాలున్ గాంగ్ మొదలైంది. మొదట్లో దీన్ని చైనా అధికారులు ప్రజారోగ్య విధానాలకు మేలు చేసే సంస్థగా చూసేవారు.

1990ల చివరినాటికి కమ్యూనిస్టు పార్టీ కంటే ఫాలున్ గాంగ్‌కే ఎక్కువ మంది అనుచరులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 1999 నాటికి ప్రపంచ వ్యాప్తంగా తమకు 10 కోట్ల మంది అనుచరులు ఉన్నారని కల్ట్ వ్యవస్థాపకుడు చెప్పారు.

నేటికీ 2 నుంచి 4 కోట్ల మంది చైనా ప్రధాన భూభాగంలో ఫాలున్ గాంగ్‌ విధానాలను అనుసరిస్తున్నారని అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ సంస్థ తెలిపింది.

మరోవైపు సమాజానికి ఇది చేటు చేస్తోందని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అయితే, ఫాలున్ గాంగ్ ప్రజాదరణ చూసి చైనా అధికారులు భయపడుతున్నారని, అందుకే దీన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా రాజధాని బీజింగ్‌లో కొనసాగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్.

ఇతర దేశాల్లో ఇలా..

ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో తమ విధానాలను అనుసరిస్తున్నారని ఫాలున్ గాంగ్ చెబుతోంది. తమ గురువు బోధనలను 40కిపైగా భాషల్లోకి అనువదించారని చెబుతోంది.

‘‘అసలు కమ్యూనిస్టు పార్టీనే చెడ్డది. అందుకే వారు ఫాలున్ గాంగ్‌ను అణచివేస్తున్నారు’’ అని వాంగ్ అన్నారు.

మేం మందులు తీసుకోవద్దని చెబుతున్నామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోందని, కానీ, ఆ ఆరోపణల్లో నిజంలేదని కొందరు ఫాలున్ గాంగ్ ప్రతినిధులు చెబుతున్నారు.

‘‘వ్యాధులను మేం చూసే కోణం వేరు. అసలు ఆసుపత్రికే వెళ్లొద్దని మేమేమీ చెప్పం’’ అని స్థానిక నాయకుడు లియావో అన్నారు.

‘‘అనారోగ్యం అనేది చెడు కర్మ వల్ల వస్తుంది. ఇతరులకు చెడు చేయడం వల్ల ఈ చెడు కర్మ వస్తుంది. అంటే నైతికంగా చెడుగా భావించే పనులు మనం చేయకూడదు’’ అని ఆయన వివరించారు.

అయితే, ‘‘ప్రజలు ఎలాగైనా మరణిస్తారు. మీరు దేశ అధ్యక్షుడైనా, ఇంకెవరైనా దీనితో సంబంధంలేదు. మీరు జన్మించినప్పుడే మీకు ఏ జబ్బులు వస్తాయనే నిర్ణయం పూర్తవుతుంది. కాబట్టి మందులు తీసుకోవడంతో ఫలితం ఉండదు’’ అని వాంగ్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా అణచివేత చట్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న హాంగ్ కాంగ్ ప్రజలు

‘‘మొదట్లో ఉన్న ఫాలున్ గాంగ్ నేటి సంస్థకూ చాలా తేడా ఉంది. నేడు వీరు చెబుతున్న చాలా అంశాలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. అందుకే కమ్యూనిస్టు పార్టీ చెప్పే వాదన కొంతవరకూ నిజమని అనిపిస్తోంది’’ అని శామ్ అన్నారు.

‘‘ఆరోగ్యంపై అవగాహన కల్పించే సంస్థగా ఫాలున్ గాంగ్ మొదలైంది. కానీ, ఆ తర్వాత ఆధ్మాత్మికం వైపుగా అడుగులు వేసింది. నేడు ఇది పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

అమెరికాలో జీవిస్తున్నట్లుగా భావిస్తున్న కల్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్ షీని శామ్ విమర్శించారు. ‘‘భూమి అంతం అవుతుందని ఆయన చెబుతున్న బోధనలు సైన్స్ ఫిక్షన్‌ నుంచి తీసుకున్నారు’’ అని అన్నారు.

భూమిపైకి గ్రహాంతరవాసుల రాక, ఇక్కడి నుంచి వేరే గ్రహాల మీదకు పయనం గురించి కూడా ఫాలున్ గాంగ్ బోధనలు ఉన్నాయి.

వీటిపై లియావో మాట్లాడుతూ.. ‘‘భూమిపై ఎప్పటికీ మనం ఇలానే ఉండిపోలేం కదా’’ అని అన్నారు.

‘‘మనం భిన్నమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని నేను నమ్ముతున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రాంతానికి మళ్లీ మనం వెళ్లిపోతాం’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)