మాల్దీవులు: చైనాతో స్నేహం వల్లే ‘ఇండియా అవుట్’ అంటోందా? మోదీ ముందున్న మార్గాలేంటి....

మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ (ఫైల్)
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ముమ్మరంగా అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్‌ చేసింది. తాజాగా నాలుగేళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థన మేరకు ఈ ఒప్పందం జరిగింది.

ఈ సర్వే కింద ఇరు దేశాలు మాల్దీవులలో జలాలు, పగడపు దిబ్బలు, సముద్రపు అలలను, వాటి స్థాయిలను సంయుక్తంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

మాల్దీవుల్లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా రద్దు అయిన మొదటి ద్వైపాక్షిక ఒప్పందం ఇదే.

అంతకుముందు, మాల్దీవుల్లో మోహరించిన భారత సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ముయిజ్జు ప్రకటించారు.

మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్‌పై చైనా ప్రభావం ఉందని చెబుతారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ 'ఇండియా అవుట్' నినాదాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవులలో భారత దళాల ఉనికిని తొలగిస్తామని పేర్కొంది.

మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలి మాత్రం 'ఇండియా ఫస్ట్' నినాదాన్ని ఇచ్చారు. ముయిజ్జు వైఖరి దీనికి పూర్తిగా విరుద్ధం.

ముయిజ్జు అధ్యక్షుడయ్యాక.. 'పూర్తిగా చైనా ప్రభావంతో' ఈ అడుగులు వేస్తున్నట్లు ఆయన నిర్ణయాలను బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాల్దీవులు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ ప్రాంతంలో చైనాతో పోల్చితే భారత వ్యూహాత్మక ప్రభావం తగ్గే అవకాశాలు పెరిగాయి.

తుర్కియే పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముయిజ్జు తుర్కియే పర్యటనకు వెళ్లారు.

తుర్కియే, చైనాల పర్యటన

ముయిజ్జు తన మొదటి విదేశీ పర్యటనలో తుర్కియే వెళ్లారు. ఆయనక్కడ మాల్దీవుల రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి మాల్దీవులు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

"మాల్దీవులు తుర్కియే నుంచి రోజువారీ వినియోగం కోసం అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. మాల్దీవుల్లో తుర్కియే పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఎగుమతుల్లో తుర్కియేకి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలి కాలంలో మాల్దీవుల నుంచి తుర్కియేకి వెళ్లే విద్యార్థులు, పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది" అని తెలిపింది.

ముయిజ్జు తుర్కియే పర్యటన అనంతరం మాల్దీవుల ఉపాధ్యక్షుడు హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్ చైనా చేరుకున్నారు.

చైనా నేతృత్వంలోని 'చైనా-ఇండియా ఫోరమ్‌ డెవలప్‌మెంట్‌ కో ఆపరేషన్‌' సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వచ్చారు.

అయితే అలాంటి మరొక ఫోరమ్ అయిన 'ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్' పట్ల మాల్దీవుల వైఖరి అంత సానుకూలంగా లేదు.

చైనా-ఇండియా ఫోరమ్ ఆన్ డెవలప్‌మెంట్ కో ఆపరేషన్ సమావేశంలో లతీఫ్ తమ దేశానికి చైనా పాత్ర ముఖ్యమైనదని పేర్కొన్నారు.

కాగా, తుర్కియే, చైనాలలో మాల్దీవుల నేతల పర్యటన భారత్ ప్రయోజనాలకు సానుకూల సంకేతం కాదని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే భారత భూ, సముద్ర భద్రత అవసరాలకు సంబంధించి చైనా, తుర్కియే రెండూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి.

మయిజ్జు, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

మాల్దీవుల తాజా వైఖరి హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

"బ్లూ ఎకానమీ లేదా ఓషన్ ఎకానమీపై 1996-97 నుంచి అంతర్జాతీయంగా దృష్టి పెరిగింది. హిందూ, పసిఫిక్ మహాసముద్రాలకు దగ్గరగా ఉండటంతో సముద్ర వ్యూహాలలో భారత్ పాత్ర పెరిగింది" అని అరవింద్ యెల్లేరి అన్నారు.

అరవింద్ యెల్లేరి న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చైనీస్ అధ్యయనాల కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

"అప్పటి నుంచి భారతదేశం దక్షిణ చైనా సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. అందువల్ల మారిషస్, మాల్దీవులు, సీషెల్స్ వంటి దేశాలతో భారత్‌కు సంబంధాలు పెరిగాయి. నిఘా, ఇంధన సరఫరా, అనేక ఇతర విషయాలకు సంబంధించి ఇండియాకు ఈ ప్రాంతాల్లో ఆసక్తి ఉంది. గత 25-30 ఏళ్ల నుంచి ఇక్కడ దృష్టి పెట్టడం ప్రారంభించింది." అని చెప్పారు అరవింద్.

ఆర్థిక, వ్యూహాత్మక కోణం నుంచి భారతదేశానికి మాల్దీవులు చాలా ముఖ్యమని అని డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా చెప్పారు.

డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్.

మాల్దీవులలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ ప్రభుత్వం కొంతమేరకైనా అనుకూలంగా ఉండేలా చూసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది.

చైనా కూడా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటోంది, అయితే, ఇండియా దానికి పెద్ద పోటీదారు.

"చైనా కూడా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. దక్షిణ చైనా సముద్రం నుంచి తన కార్యకలాపాలను విస్తరిస్తోంది" అని అరవింద్ యెల్లేరి అంటున్నారు.

"మాల్దీవులలో జరిగిన రాజకీయ మార్పు చైనాకు చాలా సానుకూల అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే ఇది భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాబోయే నాలుగు-ఐదేళ్లలో ఇది ఖచ్చితంగా బయటపడుతుంది. మాల్దీవులలో భారతదేశపు సైనికులు చాలా తక్కువ మందే ఉన్నప్పటికీ, వారు తిరిగి రావడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం" అని అన్నారు అరవింద్.

జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (ఫైల్)

చైనా ప్రభావాన్ని తగ్గించడం సవాలే

మాల్దీవులలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ ఏం చేయగలదు?

ఈ ప్రశ్నపై అరవింద్ యెల్లేరి స్పందిస్తూ.. ఈ చిన్న దేశాలపై విజయం సాధించడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని చెప్పారు.

శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో చైనా పెట్టుబడులపై వ్యతిరేకత ఉంది. అయితే, భూటాన్, మాల్దీవులలో తన ప్రభావాన్ని బలోపేతం చేయడంలో చైనా విజయం సాధించింది.

కాకపోతే చైనాతో సంబంధాలు ఎలా ఉంటాయో ఈ దేశాలకు అర్థమయ్యేలా భారత్ చెప్పవచ్చు.

చైనా ఆర్థిక సహాయం ఇప్పుడు చాలా దేశాలకు భారంగా మారింది, వారిప్పుడు ఈ 'ఉచ్చు' నుంచి బయటపడాలనుకుంటున్నారు.

"మాల్దీవులు భౌగోళికంగా భారతదేశానికి దగ్గరగా ఉంటుంది. రెండోది అక్కడి జనాభా తీరు కూడా భారత జనాభా నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది. ఇది చైనా జనాభా స్వభావం, ఆకృతికి సరిపోలడం లేదు. ఈ విషయాన్ని మాల్దీవులు అర్థం చేసుకోవాలి" అని అరవింద్ చెప్పారు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు మూడు మార్గాలు

"ముయిజ్జు అక్కడ ఉన్నంత వరకు ఇస్లామిక్ ఒరవడి కనిపిస్తుంది. మాల్దీవుల ఆర్థిక అవసరాల కారణంగా చైనా జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇది భారత రక్షణ రంగం, ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక విధానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఇండియా తన పొరుగు విధానంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి" అని ప్రేమానంద్ మిశ్రా తెలిపారు.

మాల్దీవుల్లో చైనా ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే భారత్‌కు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

1. మాల్దీవులలో ముయిజ్జు ప్రభుత్వం ఉన్నంత కాలం, చైనా జోక్యం తగ్గనంత కాలం, భారత్ 'వెయిట్ అండ్ సీ' విధానాన్ని అనుసరించాలి.

2. భారత్ ఇక్కడ పరోక్షంగా ప్రభావం సృష్టించడానికి ప్రయత్నించాలి. అమెరికా, ఇతర శక్తులు హిందూ మహాసముద్రం, దాని పక్కనే ఉన్న ప్రాంతాలలో కూడా ఉన్నాయి. అమెరికా ద్వారా మాల్దీవులతో సమీకరణాలను ప్రభావితం చేయడానికి ఇండియా ప్రయత్నించవచ్చు.

3. చైనాపై మాల్దీవులు ఆధారపడటం పెరుగుతున్న తీరు పరిశీలిస్తే దాని సార్వభౌమాధికారం ప్రమాదంలో పడొచ్చు. అటువంటి పరిస్థితిలో మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యను లేవనెత్తే అవకాశం ఉంది.

మాల్దీవుల్లో 'ఇండియా అవుట్'? అంటే దాన్ని చైనా తన కాలనీగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉందనే ప్రచారం కూడా జరుగుతోందని మిశ్రా అంటున్నారు. అందువల్ల ప్రతిపక్షాలు పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.

చైనా, మాల్దీవుల మధ్య సంబంధాలు

మాల్దీవులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్, చైనాలు రూ. వందల కోట్ల రుణాలు, సహాయం అందించాయి.

హిందూ మహాసముద్రంలో మాల్దీవుల ప్రదేశం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. గల్ఫ్ దేశాల నుంచి చమురు తెచ్చే నౌకలు ఇక్కడి నుంచే వెళతాయి.

మాల్దీవులు చాలాకాలంగా ఇండియా ప్రభావంలో ఉంది. హిందూ మహాసముద్రంలోని ప్రధాన భాగంపై ప్రభావం చూపే సామర్థ్యాన్ని భారత్‌కు ఇది అందిస్తుంది.

2016లో మాల్దీవులు తన దీవుల్లో ఒకదానిని చైనా దేశానికి కేవలం రూ. 33 కోట్లకు 50 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌కు కూడా బహిరంగంగా మద్దతు ఇచ్చింది.

మాల్దీవులు చైనాకు సుమారు బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉందని అనుకుంటారు. ఈ మొత్తాన్ని ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేశారు.

ఇపుడు చైనా నౌకాదళం మాల్దీవులలో తన పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది, చైనా ప్రభావాన్ని నిరోధించడానికి భారతదేశం కూడా ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)