గయానా: ఈ దేశంలో 40 శాతం మంది భారతీయ మూలాలున్నవారే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లూయీస్ బరూకో
- హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్
దక్షిణ అమెరికాలోనే ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉన్న ఏకైక దేశం గయానాలో ప్రతి పది మందిలో నలుగురు భారత మూలాలు ఉన్నవారే.
బ్రిటన్ పాలన సమయంలో కాలనీగా ఏర్పడి, స్వాతంత్య్రం పొంది, దేశంగా అవతరించింది గయానా.
పొరుగుదేశమైన వెనిజువెలాకు గయానాకు మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది.
కేవలం భారత్ నుంచి మాత్రమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న పౌరులు కూడా గయానాలో ఉన్నారు.
ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఇర్ఫాన్ అలీ, ఈ పదవి చేపట్టిన తొలి ముస్లిం.
అయితే, ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని గయానాలో భారతీయ మూలలున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం ఆసక్తిని కలిగించే విషయమే.
అసలు, భారతీయులు అక్కడికి ఎలా చేరారు? చరిత్రలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, UK NATIONAL ARCHIVES
2.14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గయానా రాజధాని జార్జ్‌టౌన్. ఇక్కడి జనాభా 8.1 లక్షలు.
యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం మిగిలిన జనాభాలో 30 శాతం మంది ఆఫ్రికా మూలాలు, 17 శాతం మంది వేర్వేరు దేశాల సంతతి, తొమ్మిది శాతం మంది అమెరికా మూలాలున్న వారు ఉన్నారు.
1814లో నెపోలియన్‌తో జరిగిన యుద్ధంలో బ్రిటన్ ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుంది. అనంతరం బ్రిటీష్ గయానా కాలనీగా మార్చింది. అంతకుముందు ఈ ప్రాంతంలో ఫ్రెంచ్, డచ్ వారి ఆధిపత్యం ఉండేది.
ఇరవై ఏళ్ల తర్వాత 1834లో ప్రపంచ వ్యాప్తంగా బ్రిటిష్ కాలనీల్లో బానిసత్వాన్ని నిషేధించారు. ఈ నిర్ణయం తరువాత కార్మికులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఆ సమయంలో కొంతమంది భారతీయుల బృందం గయానాకు చేరుకుంది.
అదే సమయంలో కేవలం గయానా మాత్రమే కాదు, జమైకా, ట్రినిడాడ్, కెన్యా, యుగాండా వంటి దేశాలకూ భారతీయుల బృందాలు చేరుకున్నాయి.

ఫొటో సోర్స్, UK NATIONAL ARCHIVES
చరిత్ర ఏం చెప్తోంది?
గయానాకు చేరిన బృందంలో 396 మంది ఉన్నారు.
‘గ్లాడ్‌స్టన్ కూలీలు’ పేరిట వారిని వ్యవహరిస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు.
బ్రిటీష్ గయానాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వంలో పేరొందిన సర్ జాన్ గ్లాడ్‌స్టన్ వారిని గయానాకు పంపాడు.
వెస్టిండీస్ అసోసియేషన్ ప్రతినిధి అయిన జాన్ గ్లాడ్‌స్టన్‌కు బ్రిటీష్ పాలనలో ఉన్న చాలా ప్రాంతాల్లో చక్కెర ప్లాంట్‌లు ఉన్నాయి.
గయానాకు పంపడానికి ముందు వారితో ఒప్పందాలు చేసుకున్నాడు.
అందుకే గ్లాడ్‌స్టన్ కూలీలుగా వ్యవహరించారు.
అయితే, 19, 20వ శతాబ్దాల్లో ఆసియా నుంచి ముఖ్యంగా చైనా, భారత్‌ల నుంచి పనిచేసేందుకు వారిని ‘కూలీ’ అన్న పదంతో పిలిచేవారు.
ప్రస్తుతం ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఇలా ‘కూలీ’ అన్న పేరుతో పిలవడాన్ని ఆసియా సంతతికి చెందిన ప్రజలను అవమానించడానికి, లేదా జాత్యంహకారాన్ని ప్రదర్శించేందుకు వాడే పదంగా పరిగణిస్తున్నారు.
అలా భారత్ నుంచి ఎంవీ విట్‌బీ, హెస్పరస్ పేరుగల రెండు నౌకల్లో 396 మందితో తొలి భారతీయుల బృందం గయానాకు చేరుకుంది.
అతితక్కువ మొత్తానికి చాలా ఏళ్లు పనిచేసేలా రూపొందించిన ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, ఒప్పంద కార్మికులుగా పరిగణిస్తూ, వారందరినీ హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా గయానాకు చేర్చారు.

ఫొటో సోర్స్, EPIA TIMES/UNIVERSAL IMAGES GROUP VIA GETTY IMAGES
2.38 లక్షల మంది భారతీయుల తరలింపు..
గయానా విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొన్నదాని ప్రకారం.. అలాంటి వ్యవస్థ 75 ఏళ్లకు పైగా అమలులో ఉంది. బానిసత్వపు లక్షణాలు కలిగిన విధానం అది.
దశాబ్ద కాలంపాటు అక్కడి ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన చక్కెర పరిశ్రమలో ‘విప్లవాత్మక మార్పులు’ రావడం వెనుక భారతీయ వలసల పాత్ర కీలకమైంది. పరిశ్రమ మనుగడలోనూ ఆ వలసలు కీలకంగా నిలిచాయి.
ఆ ఒప్పంద గడువు పూర్తయ్యాక కొంతమంది భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లగా, మిగిలినవారు అక్కడే స్థిరపడ్డారు.
రికార్డుల ప్రకారం 1838-1917 మధ్య కాలంలో మొత్తం 500 నౌకల్లో 2,38,909 మంది భారతీయులను ఒప్పంద కార్మికులుగా గయానాకు పంపారు.
ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బ్రిటీష్ గయానాలో మాత్రమే ఎక్కువ సంఖ్య భారత్ నుంచి ఒప్పంద కార్మికులను తరలించారు.
ఈ ఘటనను గయానా దేశం మర్చిపోలేదు. ఇప్పటికీ ఏటా మే 5వ తేదీన భారతీయల తొలి బృందం గయానాకు చేరుకున్న రోజును జాతీయ సెలవుదినం ప్రకటించింది.
1966లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది గయానా.
గయానా క్యాలెండర్‌లో భారతీయ పండుగలకు కూడా స్థానం కల్పించారు.
దీపావళి, హోలీ వంటి పండుగలు అక్కడ కూడా జరుపుకుంటారు. అలా గయానాలో భారతీయ మూలాలు చేరాయి. ప్రస్తుతం 40 శాతం జనాభా భారత సంతతికి చెందినవారే.
ఇవి కూడా చదవండి..
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’.. డబ్బున్న వృద్ధురాలు, నిరాశ్రయుడి సహజీవనం
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














