‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్ షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’

- రచయిత, స్యూ మిచెల్
- హోదా, బీబీసీ న్యూస్
తనకంటూ ఎలాంటి ఆశ్రయమూలేని ఓ వ్యక్తి, వయసులో తన కంటే చాలా పెద్దదైన ఓ ధనవంతురాలితో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది నిజమైన ప్రేమ కథేనా? లేక మరేదైనానా?
80 ఏళ్ల కరోలిన్ హాలండ్ ఒంటరి మహిళ. ఆమె భర్త చనిపోయారు. కాలిఫోర్నియా బీచ్‌సైడ్ రిసార్ట్‌లో జీవించేవారు. అయితే, తన కంటే వయసులో 23 ఏళ్లు చిన్నవాడైన డేవిడ్ ఫౌట్‌తో పరిచయం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది.
ఆమెకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేందుకు డేవిడ్ వచ్చేవారు. కొన్ని వారాల్లోనే వీరిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు.
ఒక అపరిచితుడితో ఇంత గాఢంగా ప్రేమలో మునిగిపోతానని లేదా ఈ వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని తాను అసలు అనుకోలేదని కరోలిన్ చెప్పారు.
‘‘ఆయన నాపై ప్రత్యేకమైన ప్రేమను చూపించాడు. సాయం చేయడంలో ముందుంటాడు. మా ఇద్దరి అభిరుచులు చాలా విషయాల్లో కలుస్తాయి. అతడి వ్యక్తిత్వమంటే నాకు చాలా ఇష్టం. అతడు లేకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది’’ అని ఆమె అన్నారు.
‘‘ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను’’ అని డేవిడ్ నాతో చెప్పారు. ‘‘కరోలిన్ నా మనిషని ఇక్కడ అందరికీ తెలుసు. నేను పనికి వెళ్లేటప్పుడు అక్కడే ఎక్కువసేపు ఉండిపోను. ఎందుకంటే నా కోసం ఒకరు ఎదురుచూస్తున్నారు. నా ప్రాణం పోయేంత వరకూ నేను ఆమెతోనే ఉంటాను’’ అని ఆయన అన్నారు.
అయితే, కరోలిన్ కుమార్తెలు ఈ ప్రేమను భిన్నంగా చూస్తున్నారు.
తమ తల్లిని డేవిడ్ మోసం చేస్తారని, ఏదో ఒకరోజు ఆమె గుండె బద్ధలవుతుందని వారు అంటున్నారు.
కరోలిన్, డేవిడ్ ఉండే వీధిలో నేను కూడా ఉండేదాన్ని. కాలిఫోర్నియాలో కాయుకోస్‌లో జన జీవితం అంత పరుగులేమీ పెట్టదు. ఇక్కడి జనం కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు.
సముద్రంలోకి దాదాపు వంద అడుగుల వరకూ దూరం వెళ్లే వంతెన లాంటి (పీర్) నిర్మాణం ఇక్కడ ఉంటుంది.
సాయంత్రం పూట ఇక్కడ చాలామంది ఈత కొడుతుంటారు. ప్రేమికులు కలిసి కూర్చొని మాట్లాడుకునేందుకు ఇది మంచి చోటు.
డేవిడ్‌ను నమ్మాలని నాకు కూడా అనిపించింది. అయితే, కరోలిన్ కూతుళ్లలాగానే నాకు కొన్ని సందేహాలున్నాయి.
ఆమె ఆర్థిక దోపిడీకి బాధితురాలు అవుతారా? అనే సందేహం మొదట్నుంచీ వెంటాడుతోంది.
ఎందుకంటే 60 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి ఐదు మందిలో ఒకరు ఇలాంటి దోపిడీకి బాధితులు అవుతున్నారు.

‘‘వయసులో తేడా జీర్ణించుకోవడం చాలా కష్టం. అదే నాకు అసలు సమస్య’’ అని కరోలిన్ బంధువు కిమ్ నాతో అన్నారు.
‘‘అంత పెద్ద వయసులో ఉన్న ఆమెతో ఎవరైనా ప్రేమలో ఉన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తారు? ఉండటానికి చోటు కోసమేనా?’’ అని ఆమె ప్రశ్నించారు.
ఈ కథలో ఏం జరుగుతుందో అన్ని వైపుల నుంచీ చూసే అవకాశం నాకు దక్కింది.
నేను మొదటిసారి డేవిడ్‌ను కలిసినప్పుడే, ఆయన నాకు బాగా నచ్చారు. మా పొరుగింట్లో ఉండే ఆయన, మీ ఇంటిలో కొన్ని మార్పులు చేసుకుంటే బావుంటుందని నాకు సూచించారు.
చర్చికి కూడా తరచూ వచ్చేవారు. అంతేకాదు, అతడితో పనిచేసే దాదాపు అందరూ అతడిని ఇష్టపడేవారు. అతడికి హార్మోనికా, గిటార్‌లు వాయించడం కూడా వచ్చు. చాలా సరదాగా ఉంటారు. గతం గురించి చెప్పుకొనేందుకు ఏ మాత్రం ఆలోచించరు.
అయితే, ఈ ప్రేమ కథ గురించి మరింత తెలుసుకునేటప్పుడు, అసలు కరోలిన్ కుటుంబం ఎందుకు ఆందోళనతో ఉందో నాకు అర్థం కావడం మొదలైంది.
కాయుకోస్‌లో డేవిడ్‌కు కనీసం ఇల్లు కూడా లేదు. ఆయన వీధిలోనే పడుకునేవారు. ఏదో చిన్న పనిలో సాయం చేయడానికి ఓసారి కరోలిన్ ఇంటికి వచ్చారు.
ఒకప్పుడు డ్రగ్స్‌కు తను బానిసని కూడా తను అంగీకరించారు. పైప్ బాంబులను తయారు చేస్తున్నందుకు ఆయన జైలుకు కూడా వెళ్లారు.
అయితే, డ్రగ్స్‌ను విడిచిపెట్టానని డేవిడ్ చెప్పారు. కానీ, అతడు విపరీతంగా మద్యం తీసుకోవడం నేను చూశాను. గంజాయి కూడా తీసుకుంటారు.
డేవిడ్‌ను కలిసిన తర్వాత తన తల్లిలో వచ్చిన మార్పులు చూసి కరోలిన్ కమార్తెలు సుశాన్, సల్లీ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘వాళ్లిద్దరూ ఫాంటసీ ప్రపంచంలో జీవిస్తున్నట్లు అనిపిస్తోంది. అది చాలా వింతగా ఉంది’’ అని సల్లీ అన్నారు.
‘‘అతడితో ఉండేటప్పుడు ఆమె టీనేజర్‌లా ప్రవర్తిస్తోంది. విచిత్రంగా నవ్వుతోంది’’ అని ఆమె చెప్పారు.
అసలు వారి కళ్లముందు కనిపిస్తోంది ప్రేమని ఆ ఇద్దరు కుమార్తెలు నమ్మలేకపోతున్నారు. వారికి ఒక ఒంటరి మహిళ...మోసగాడైన ఓ అపరిచితుడితో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఇక్కడ ఆస్తి సమస్యలు కూడా ఉన్నాయి. మరణించిన తన భర్త జోయితో కలిసి కరోలిన్ కొన్ని మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు.

‘‘అది మా కుటుంబ ఆస్తి. దాని కోసం మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. ఎవరో అపరిచితుడి చేతుల్లో దాన్ని పెట్టాలా?’’ అని సల్లీ నాతో అన్నారు.
డేవిడ్‌ను కలిసి తర్వాత తన తల్లి మానసిక ఆరోగ్యం దెబ్బతినడం మొదలైందని కరోలిన్ కుమార్తెలు చెప్పారు.
తన పనులు తను చేసుకొనే మానసిక స్థైర్యం ఆమెకు లేదని వారు అన్నారు.
కరోలిన్ కూడా ‘‘నాకు అల్జీమర్స్ వచ్చినట్లుగా అనిపిస్తోంది’’ అని నాతో అన్నారు.
‘‘నేను చాలా విషయాలు మరచిపోతున్నాను. నాపై చాలా ఒత్తిడి కూడా ఉంటోంది. కానీ, నా నిర్ణయాలు నేను తీసుకోగలను’’ అని ఆమె అన్నారు.
డేవిడ్‌తో రిలేషన్‌షిప్ కారణంగా ఆమె కూతుళ్లు ఆమెకు దూరమయ్యారు.
అయితే, జీవిత భాగస్వామి విషయంలో తగిన నిర్ణయం తీసుకునే హక్కు తనకుందని ఆమె అన్నారు.
భర్త మరణం తర్వాత తనకు కావాల్సిన సపోర్టును కూడా తన కూతుళ్లు అందించలేదని కరోలిన్ అన్నారు.
‘‘డేవిడ్ రాకముందు, వారు నన్ను చూడటానికి కూడా వచ్చేవారు కాదు’’ అని ఆమె చెప్పారు.
అయితే, ఈ విషయంలో ఆమె వాదనతో కూతుళ్లు విభేదించారు.
సుశాన్ ఇల్లు తల్లి ఉండే ప్రాంతానికి చాలా దూరంలో ఉంటుంది. తల్లి దగ్గరకు రావాలంటే ఆమెకు 4 గంటలు పడుతుంది.
తనతోపాటు ఉండాలని తల్లిని చాలాసార్లు అడిగానని సుశాన్ అన్నారు. సుశాన్, సల్లీలకు పిల్లలు ఉన్నారు. పైగా వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.
‘‘మేం చాలాసార్లు మా ఇంటికి రమ్మనేవాళ్లం. ఆమె వచ్చేది కాదు’’ అని వారిద్దరూ చెప్పారు.

డేవిడ్ రాకముందు, తల్లి ఇంటికి దగ్గర్లోనే రెండో కూతురు సల్లీ ఉండేవారు. బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వ్యవహారాలు, ట్యాక్స్ రిటర్న్స్ చూసుకునేవారు. అయితే, తల్లీకూతుళ్ల మధ్య వచ్చిన విభేదాలతో ఆర్థిక వ్యవహారాలన్నీ ఇప్పుడు కరోలినే చూసుకోవడం మొదలుపెట్టారు.
కొంత కాలం తర్వాత, డేవిడ్, కరోలిన్ కలిసి లోను మీద 40,000 డాలర్ల (రూ.33.32 లక్షల) విలువైన వ్యాన్‌ను కొన్నారు. అయితే, ఏదో ఒకరోజు డేవిడ్ కనిపించకుండా పోతే, ఆ లోను మొత్తం మీపై పడుతుంది కదా? అని నేను కరోలిన్‌ను అడిగాను. ఏం ఫర్వాలేదని ఆమె సమాధానం ఇచ్చారు.
‘‘డేవిడ్ నుంచి నన్ను కాపాడుతున్నామని వారు అనుకుంటున్నారు. కానీ, నా జీవితంలో అత్యంత అద్భుతమైన వ్యక్తి డేవిడ్’’ అన అన్నారు.
అసలు డేవిడ్ ప్రేమ నిజమైనదేనా? రోజూ పనికి వెళ్లి వచ్చిన తర్వాత కరోలిన్ కోసం ఆయన వంట చేస్తున్నారు. మందులు దగ్గరుండి ఇస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న పనులే ఆయన నిజంగా ప్రేమిస్తున్నారని నమ్మేలా చేస్తున్నాయి.
అయితే, ఆయన బయట ఉన్నప్పుడు కూడా నేను పరిశీలించాను. ఇకపై నేను పని చేయాల్సిన అవసరంలేదని తన స్నేహితుల దగ్గర గొప్పగా చెప్పుకోవడం గమనించాను.
అందుకే అతడి గతంలోకి తొంగి చూడాలని నేను అనుకున్నా. అప్పుడే నాకు అతనిపై ఉన్న గృహహింస, పిల్లలను పట్టించుకోకపోవడం లాంటి ఆరోపణల గురించి తెలిశాయి.
పార్ట్‌నర్‌పై అనుమానంతో ఆమెను వదిలేశారు. పైగా ఆమెను కొట్టేవాడట. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. కానీ, ఆమెను పట్టించుకునేవారు కాదు. ఒక సమయంలో ఆ పాప చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. చివరకు ఆ పాపను ఒక జంటకు డేవ్ అమ్మేశారు.
వీటి గురించి అడిగినప్పుడు, అదంతా గతమని ఆయన అన్నారు. ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నానని, బుద్ధిగా ఉంటానని దేవుడికి ప్రమాణం చేశానని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆయన కాయుకోస్‌కు వచ్చారు. కరోలిన్‌తో తన బంధం దేవుడు ఇచ్చిన వరం అంటారాయన.
‘‘ఆమెను దేవుడే నాకు ఇచ్చాడు. నేను ఎప్పటికీ ఆమెను వదిలిపెట్టను’’ అని డేవిడ్ అన్నారు.

అయితే, వీరి కథ కొద్దిరోజుల్లోనే ముగింపుకు చేరుకుంది.
దగ్గర్లోని ఒక పట్టణంలో కరోలిన్‌కు రెండు ఇళ్లు ఉన్నాయి. అయితే, ఈ ఇళ్లలో ఒక దానిలో తన మనవడు, అతడి కుటుంబం జీవిస్తోంది. వీటిని అమ్మేలా కరోలిన్‌ను డేవిడ్ ఒప్పించారు.
దీంతో కరోలిన్ కూతుళ్లకు చాలా కోపం వచ్చింది. తన తల్లి మానసిక అనారోగ్యాన్ని ఆయన అనువుగా తీసుకుంటున్నారని వారు భావించారు. అంతేకాదు, ఒక సెక్యూరిటీ కెమెరా సీసీటీవీ ఫుటేజీని వారు నాకు చూపించారు. దీనిలో ఆ ఇంటి చుట్టుపక్కల ఎస్టేట్‌ను ఏజెంట్లకు చూపిస్తూ డేవిడ్ కనిపించారు. ఇందులో కరోలిన్ ఏమీ తెలియనట్లుగా చూస్తున్నారు.
ఆ ఆస్తులు అమ్మగా వచ్చిన దాంట్లో 6,00,000 డాలర్లు (రూ.4.99 కోట్లు) డేవ్‌కు ఇస్తానని కరోలిన్ చెప్పారు. ఇది అతడి భవిష్యత్ కోసమని ఆమె అన్నారు.
ఆ విక్రయాలు చాలా వేగంగా జరిగిపోయాయి. మరికొన్ని రోజుల్లో చెక్ కూడా కరోలిన్‌కు అంది ఉండాల్సింది. అయితే, ఇంతలోనే కరోనాతో ఆమె హాస్పిటల్‌లో చేరారు.
వ్యాక్సీన్ తీసుకోవద్దని కరోలిన్‌ను డేవిడ్ ఒప్పించారు. అదంతా ప్రభుత్వ తతంగమని ఆమెకు ఆయన చెప్పారు.
అయితే, మళ్లీ ఆసుపత్రి నుంచి ఆమె ఇంటికి వచ్చేసరికి, శారీరకంగా, మానసికంగా ఆమె బలహీనం కావడంతో ఆమె కుమార్తెలు ఆస్తిపై హక్కులను సంపాదించగలిగారు.
దీని తర్వాత కొన్నాళ్లకే కరోలిన్ మరణించారు. ‘‘ఆమె ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తూ వచ్చింది. కోవిడ్ వల్ల అది మరింత దెబ్బతింది’’అని సుశాన్ చెప్పారు.
చివరి రోజుల్లో కరోలిన్‌ను చూసేందుకు డేవిడ్‌ను వారు అనుమతించలేదు. ఆమె చనిపోయినప్పుడు కూడా అతడిని పిలవలేదు. మరోవైపు స్థానిక చర్చి సాయం చేయకపోవడంతో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు.
తమ తల్లి శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు ఆయన అవకాశం తీసుకోబోయారని సుశాన్, సల్లీ ఇప్పటికీ భావిస్తున్నారు. డాక్టర్, పోలీసులు, కేర్ సర్వీసులు ఎవరూ తమకు సాయం చేయలేదని వారు అంటున్నారు.
మొత్తానికి కాయుకోస్‌లో మళ్లీ డేవిడ్ ఇల్లులేని వాడయ్యారు.
అయితే, కరోలిన్‌తో కలిసి కొన్న వ్యాన్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది.
నగరానికి మొదట వచ్చినప్పుడు ఎక్కడ ఉండేవారో అక్కడే ఈ వ్యాన్‌ను పార్క్ చేస్తున్నారు.
రీసైకిల్డ్ వస్తువుల నుంచి తయారుచేసిన ఆభరణాలు, కళాఖండాలు అమ్ముతూ జీవిస్తున్నారు.
చివరిసారిగా నేను చూసినప్పుడు, ఆయన ఒకరకమైన ట్రాన్స్‌లో ఉన్నారు. లైటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తూ.. ‘‘ఆమె పిలిచినప్పుడు నేను వెళ్లాను. ఇప్పటికీ నేను ఆమెను మిస్ అవుతున్నాను. ఆమెను నేను నిజంగా ప్రేమించాను’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
- విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
- ఇజ్రాయెల్: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు
- ‘రెండేళ్లుగా పీరియడ్స్ రావట్లేదు. సెక్స్‌లో పాల్గొంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఎందుకిలా?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















