మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?

ఫొటో సోర్స్, FB/Nalini.dsp
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాన్ని త్యజించిన మాజీ డీఎస్పీ నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వడంలో ఇబ్బందేమిటో చెప్పండి.’’… డిసెంబరు 15, 2023న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖతో జరిగిన సమీక్షలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేకపోతే అదే హోదాలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారని ప్రకటనలో ఉంది.
ఈ ప్రకటన తర్వాత నళిని విషయంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమె పేరు తెరపైకి వచ్చింది.
డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి ఆమెపై సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఆమె పాల్గొన్న ఉద్యమాల తాలూకూ వీడియోలను తీసి పోస్టు చేస్తున్నారు.
ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లడంతో, పోలీసుశాఖపై జరిగిన సమీక్షలోనూ నళినికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే, ఉద్యోగంలోకి తిరిగి చేరాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన సూచనలను ఆమె సున్నితంగా తిరస్కరించారు.
‘‘మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను.’’ అని తన ఫేస్‌బుక్ వాల్ మీద రాశారు నళిని.
‘‘క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎగా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి.’’ అని పేర్కొన్నారు.
‘‘నాలా ఇంకే ఆఫీసర్ కూడా డిపార్ట్‌మెంట్‌లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది.’’ అని రాశారమె.
మరి పోలీసు ఉద్యోగానికి 12ఏళ్ల కిందట నళిని ఎందుకు రాజీనామా చేశారు..? ఆమె ఆవేదనకు కారణం ఏంటి, ఆమె ఇప్పుడు ఎక్కడున్నారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఫొటో సోర్స్, Nalini.DSP/FB
ఇంతకీ ఎవరీ నళిని..
రాయబారపు నళిని.. ఈ పేరుతో పిలిచే కంటే డీఎస్పీ నళిని అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామందికి తెలుస్తుంది.
మలిదశ తెలంగాణ పోరాటానికి మద్దతుగా ఉన్నత ఉద్యోగాన్ని వదలుకున్నారు.
ఈమెది ప్రస్తుత యాదాద్రి జిల్లా భువనగిరి. 1976లో జన్మించారు. 18ఏళ్లకే వివాహమైంది. ఆ సమయంలో ఆమె డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈమె భర్త నరేందర్‌ది ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు ప్రాంతం.
వివాహమై పిల్లలు పుట్టినా.. చదువు కొనసాగించారు నళిని. ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేశారు. తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఎడ్ కూడా చేశారు.
గ్రూప్-1, గ్రూప్ 2 పరీక్షలు రాశారు. గ్రూప్-1 పోస్టింగ్ ఆలస్యం కావడంతో గ్రూప్ -2కు సెలెక్ట్ అవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు.
2007లో గ్రూప్ -1 అధికారిగా ఉద్యోగం రావడంతో హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే ఏడాది జూన్ 1న డీఎస్పీగా ఎంపికయ్యారు.
డీఎస్పీ శిక్షణ పూర్తయ్యాక హసన్ పర్తి, హన్మకొండలో ప్రొబెషనరీ డీఎస్పీగా పనిచేశారు. మొదటి పోస్టింగ్ కరీంనగర్ ఇచ్చినప్పటికీ, తర్వాత ఆర్డర్ ను అప్పటి ప్రభుత్వం మార్చి మెదక్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది.
2009లో తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక డిసెంబరు 9న ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంపై అప్పట్లో జరిగిన అణచివేత, ఉద్యమకారులపై దాడులకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు.
డీఎస్పీ స్థాయి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.
అదే రోజున అంటే డిసెంబరు 9వ తేదీ రాత్రికే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్లుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Nalini.DSP/FB
మళ్లీ ఉద్యోగంలో చేరి…
ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు.
మరోవైపు తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 2009 డిసెంబరు 24న 19 పేజీల లేఖను సోనియాగాంధీకి రాశారు నళిని.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లుగా కేంద్రం ప్రకటనతో అప్పట్లో కొందరు ఉద్యమకారులు తిరిగి ఆమెను విధుల్లో చేరాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా నళిని గతంలో పలు సందర్భాల్లో చెప్పారు.
ఆ తర్వాత ఆమె రాజీనామా విత్‌డ్రాయల్(వెనక్కి తీసుకుంటూ) లెటర్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంది.

ఫొటో సోర్స్, Domakonda nalini/FB
రెండోసారి రాజీనామా.. ఎన్నికలలో పోటీ
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో 2011 నవంబరు ఒకటో తేదీన మరోసారి రాజీనామా చేశారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు.
దిల్లీలో దీక్ష చేస్తానని ప్రకటించడంతో నళిని రాజీనామా ఆమోదించకుండా, ముందుగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం.
డిసెంబరు 4న ఈ పరిణామం చోటు చేసుకుంది.
‘‘అప్పట్లో నన్ను సస్పెండ్ చేయడాన్ని ఒక్క సుష్మస్వరాజ్ మాత్రమే ఖండించారు. మిగిలిన నాయకులెవరు ఖండించలేదు. అది నన్ను చాలా బాధపెట్టింది.’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నళిని.
2011 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు.
ఎనిమిది రోజులు దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణవాదుల వినతిమేరకు దీక్ష విరమించారు.
తర్వాత తెలంగాణ నళిని క్రాంతిసేన ఏర్పాటు చేశారు.
2012లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పరకాల ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం అదే ఏడాది నవంబరు ఒకటిన బీజేపీలో చేరారు. అయితే, తర్వాతికాలంలో రాజకీయాల్లో అంతగా యాక్టివ్ లేరు.

ఫొటో సోర్స్, Domakonda nalini/FB
ఇప్పుడేం చేస్తున్నారు?
తెలంగాణ ఏర్పాటు తర్వాత నళిని పేరు ఎక్కడా ప్రచారంలోకి రాలేదు.
2012లో పరకాల ఉప ఎన్నికల్లో ఓటమితో కొన్నిరోజులు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఆ తర్వాత కోలుకుని, ఆమె ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లారు. వేద ప్రచారకురాలిగా మారినట్లుగా చెబుతున్నారు.
ఆమెకు సంబంధించిన ఫేస్‌బుక్ పోస్టులను గమనిస్తే ఇదే విషయం తెలుస్తోంది.
దోమకొండ నళిని పేరుతో ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఉంది. ‘యజ్ఞ బ్రహ్మ అండ్ వేద ప్రచారక్’గా ప్రొఫైల్ డిస్క్రిప్షన్‌లో రాసి ఉంది.
‘వేదామృత తరంగిణి’ పేరుతో యూట్యూబ్ చానెల్ సైతం నడుపుతున్నారు. వేదాలలోని విశేషాలతో కూడిన వీడియోలు ఆ యూట్యూబ్ చానెల్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Domakonda nalini/FB
తనపై వస్తున్న వార్తలపై నళిని ఏమన్నారు?
ప్రస్తుతం తనపై జరుగుతున్న చర్చపై నళిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఆమె ఫోన్ నంబరుకు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్‌లో ఉంది.
‘నాలో ఉంది ఆనాడు దేశభక్తి.. ఇప్పుడు దైవభక్తి’ అన్న శీర్షికతో దోమకొండ నళిని పేరిట ఫేస్‌బుక్ వాల్‌పై డిసెంబరు 12వ తేదీన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశభక్తి నుంచి దైవభక్తి వైపు తాను మళ్లానని అందులో రాసుకొచ్చారు.
‘‘ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది.’’ అని అందులో పేర్కొన్నారు నళిని. ‘నా మనసులో మాట’ అంటూ ఈ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో,‘‘ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా,వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను.’’ అని రాశారు.
డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినా కూడా తాను చేసే పరిస్థితుల్లో లేనని వివరించారామె.
అందుకు తన ఆరోగ్య కారణాలతోపాటు టెక్నికల్ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్‌ల ద్వారా అర్థం అవుతుంది.
చాలా సంతోషం. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను.అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.’’ అని అందులో పేర్కొన్నారు నళిని.

ఫొటో సోర్స్, Domakonda nalini/FB
మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునే వీలుందా..?
ప్రస్తుతం నళిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో, ఇది అసలు సాధ్యమవుతుందా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో నేరుగా ఉద్యోగంలోకి తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు.
‘‘ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తిని తిరిగి అదే ఉద్యోగంలోకి తీసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం అలా తీసుకునేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో ఆ ఉద్యోగానికి తగ్గ ఫిట్‌నెస్‌తో ఉన్నారా, లేదా? అన్నది కూడా చూస్తారు.
ఒకవేళ ఆ ఉద్యోగానికి తగ్గ ఫిట్‌నెస్‌తో లేకపోతే అదే స్థాయి పోస్టింగ్ వేరొక చోట ఇచ్చేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.’’ అని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత ఒకరు బీబీసీతో చెప్పారు.
అదే ప్రాతిపదికన గతంలో నళిని ఒకసారి రాజీనామా చేసినప్పుడు తిరిగి అప్పట్లో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని ఆయన చెప్పారు.
‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొన్ని రోజులు సెలవులు పెట్టుకుని ఎన్నికల్లో సైతం పోటీ చేసి రావొచ్చు. వారికి అలాంటి వెసులుబాటు కూడా ఉంది. నళినికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడమనేది ఇప్పుడు ప్రభుత్వ విచక్షణాధికారంపై ఉంది.’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి..
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














