తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌‌కు ఒకే ఒక సీటు...ఏపీలో జగన్‌కు ఎదురైన చేదు అనుభవాలు రేవంత్‌కూ తప్పవా?

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, RevanthReddy/FB

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఒకే ఒకటి.

తెలంగాణలో గణనీయంగా బలం పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకున్నప్పటికీ, శాసన మండలిలో ఆ పార్టికి ఒక్కరంటే ఒకరే సభ్యుడు ఉన్నారు.

శాసన సభలో మెజార్టీ సాధించినప్పటికీ పెద్దల సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 151 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, వై.ఎస్. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ, జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో మండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు.

దీంతో ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కితగ్గాల్సి వచ్చిన సందర్భాలున్నాయి.

ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ రిపీట్ కానుందా? ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులు రేవంత్‌కూ తప్పవా?

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, AFP

ఏపీలో ఏం జరిగింది?

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు శాసన సభ, శాసన మండలిలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధికార పార్టీ సంఖ్యా బలంతో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినా, శాసన మండలిలో మోకాలడ్డే పరిస్థితి రావొచ్చు.

వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ-2020 (Andhra Pradesh Decentralisation and Inclusive Development of All Regions Act, 2020), ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వంటి బిల్లులు శాసన మండలిలో తిరస్కరణకు గురయ్యాయి.

దీంతో ఏపీ ప్రభుత్వం ఒకానొక దశలో మండలిని రద్దు చేసే ఆలోచన వరకు వెళ్లింది. శాసన మండలి రద్దు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసింది కూడా. కానీ, ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

ఇప్పుడు అలాంటి ఇబ్బందులే రేవంత్ ప్రభుత్వానికీ రానున్నాయా?

జీవన్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, శాసన మండలిలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు

కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కరు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం, శాసన మండలి సభ్యుల సంఖ్య, రాష్ట్ర శాసన సభ సీట్ల సంఖ్యలో మూడింట ఒకవంతు మించకూడదు.

దీని ప్రకారం, తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు అవకాశముంది. ప్రస్తుతం 34 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎమ్మెల్సీల సంఖ్య 38గా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు తమ పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 34కి తగ్గింది.

40 స్థానాలున్న మండలిలో బీఆర్ఎస్‌ బలం 27. ఎమ్మెల్యే కోటాలోని 12 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది, స్థానిక సంస్థల కోటా 13 మందిలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఒకరు, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మరో నలుగురు ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ తరఫున ఉన్నారు.

మజ్లిస్ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ, పీఆర్టీయూ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు చొప్పున మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టి.జీవన్ రెడ్డి ఆ ఒక్క సభ్యుడు.

రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images/ANI

మండలిలో ఎవరి బలమెంత?

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 11 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల్లో కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్ రెడ్డి, తాతా మధుసూదన్, ఎల్.రమణ, ఎంఎస్ ప్రభాకర్‌ రావు, సుంకరి రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాటిపర్తి భానుప్రసాద్ రావు, విఠల్ దండె, ఎం.కోటిరెడ్డి, వంటేరు యాదవ రెడ్డి ఉన్నారు.

ఇక మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్లెళ్లపల్లి రవీందర్ రావు, పారుపాటి వెంకట్రామ్ రెడ్డి, డాక్టర్ బండ ప్రకాష్, కురుమయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లు ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

గ్రాడ్యుయేట్స్(పట్టభద్రుల) నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె ఎస్.వాణీ దేవి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు.

ప్రముఖ కవి గోరటి వెంకన్న, తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గవరపు దయానంద్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

ఎంఐఎం నుంచి మీర్జా రహ్మత్ బేగ్ స్థానిక సంస్థల కోటాలో, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఏవీఎన్ రెడ్డి(బీజేపీ), కూర రఘోత్తమ్ రెడ్డి(పీఆర్టీయూ), అలుగుబెల్లి నర్సిరెడ్డి(ఇండిపెండెంట్) ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ సంఖ్య రెండుగా భావించొచ్చు.

''ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఆయనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు గానీ, చర్యలు గానీ లేవు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేయనందున ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది'' అని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే, పార్టీ మారినందున ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని ఆ పార్టీ మండలి చైర్మన్‌ను కోరే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/Padi Kaushik Reddy/fb

నలుగురు సభ్యుల రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల అనంతరం నలుగురు సభ్యుల రాజీనామాతో శాసన మండలిలో ఖాళీల సంఖ్య ఆరుకి పెరిగింది.

నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలతో పాటు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మరో నలుగురు ఎమ్మెల్సీలు వారి పదవులకు రాజీనామా చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 2022లో ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి, పోటీ చేసి విజయం సాధించారు.

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ నలుగురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో మండలిలో మరో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ శాసన మండలి కౌన్సిల్

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/council

మండలిలో బలం లేకపోతే ఏమౌతుంది?

రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన బిల్లు, మండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి చేరుతుంది.

మండలిలో బిల్లుపై చర్చించి సవరణలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లును మండలి సభ్యులు వ్యతిరేకించినా, లేదా సవరణలు సూచించినా శాసన సభకు తిరిగి పంపిస్తారు.

శాసన మండలి నిబంధనల ప్రకారం, ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని లేదా బిల్లును వ్యతిరేకించే అధికారం మండలి సభ్యులకు ఉంటుంది. అయితే, అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.

''అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలిలో ఓడిపోతే మళ్లీ అసెంబ్లీకి వెళ్తుంది. సాధారణంగా అలా జరగదు, రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న అంశాల్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది.

ఒకవేళ అదే బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించినట్లయితే, అది ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు'' అని ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గానూ వ్యవహరించిన విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.

అయితే, మనీ(ద్రవ్య) బిల్లులకు మండలి ఆమోదంంతో నిమిత్తం లేదని ఆయన అన్నారు.

బిల్లును వ్యతిరేకిస్తూ ఎవరైనా సభ్యుడు మండలి చైర్మన్ అనుమతితో తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఈ మేరకు సంబంధిత సభ్యుడు, సంబంధిత తీర్మానాన్ని లిఖితపూర్వక నోటీసు రూపంలో శాసన మండలి కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుంది.

ఆ తీర్మానానికి అనుకూలంగా 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు అనుకూలంగా ఉంటే, ఆ తీర్మానాన్ని చర్చకు స్వీకరించాల్సి ఉంటుంది.

తీర్మానం నోటీసులో కోరిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు, లేదంటే సభా సమావేశాలను నిరవధిక కాలంపాటు వాయిదా వేసేలోపు ఎప్పుడైనా ఒకరోజు ఈ చర్చను చైర్మన్ అనుమతించాల్సి ఉంటుంది.

తెలంగాణ శాసన మండలి

ఫొటో సోర్స్, legislature.telangana.gov.in/council

బిల్లు ఆమోదం పొందకపోతే?

ఒకవేళ బిల్లుపై మండలి చైర్మన్ చర్చకు అనుమతించి, ఆ బిల్లును మండలి వ్యతిరేకిస్తే, బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళ్తుంది. లేదా బిల్లుకు పలు సవరణలు, సూచనలు చేస్తూ శాసన సభకు తిప్పి పంపే అవకాశం కూడా ఉంటుంది.

అలా మండలి నుంచి వెనక్కి వచ్చిన బిల్లును శాసన సభ రెండోసారి ఆమోదిస్తే, మళ్లీ అది శాసన మండలికి వెళ్తుంది. బిల్లుకు సంబంధించి మండలి చేసిన సవరణలను శాసన సభ చేర్చినా, లేదా ఆ సవరణలు చేర్చకపోయినా బిల్లు మండలికి చేరుతుంది.

అనంతరం, గవర్నర్ ఆమోదంతో అది చట్టంగా మారుతుంది.

విఠపు బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, Balasubramanyam Vitapu/fb

ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

'రాజకీయ ప్రాధాన్యం ఉంటే..'

''బిల్లుల్లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. రోజువారీ వ్యవహారాలు, జనరల్ బిల్లులు సాధారణంగా ఆమోదం పొందుతాయి. వాటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న విషయాల్లోనే బిల్లులను తిప్పి పంపడం జరుగుతుంది.

ఒకసారి మండలిలో తిరస్కరణకు గురైన బిల్లును అసెంబ్లీ తిరిగి రెండోసారి ఆమోదిస్తే మండలి ఆమోదం పొందినట్లే. అయితే, మండలి తిప్పికొట్టింది కాబట్టి, గవర్నర్ కూడా ఆ బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది'' అని బాలసుబ్మహ్మణ్యం వివరించారు.

''అసెంబ్లీలో ఆమోదం పొంది మండలిలో తిరస్కరణకు గురైతే ఆ బిల్లు మళ్లీ అసెంబ్లీకి వెళ్తుంది. అయితే, ఆ సమావేశాలు అప్పటికే ముగిసిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఆ తర్వాత సమావేశాల్లోనే అది సభ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాలయాపన జరగొచ్చు.

ఏపీ ప్రభుత్వం తెచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, ఇంగ్లిష్ మీడియం బిల్లులు మండలిలో తిరస్కరణకు గురవడంతో పెండింగ్‌లో పడిపోయాయి. ఆ తర్వాత హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం బిల్లులను విరమించుకుంది. అవి అక్కడి నుంచి ముందుకు సాగలేదు'' అని విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.

అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తే ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు తెచ్చే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో చర్చ లేకుండానే గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)