ఐవీఎఫ్‌కు వయో పరిమితి ఉందా? 50 ఏళ్లు దాటాక ఈ విధానంలో పిల్లలను కంటే ఏమవుతుంది?

ఐవీఎఫ్ విధానం

ఫొటో సోర్స్, Getty Images

‘‘ ఇది అద్భుతం’’

యుగాండా రాజధాని కంపాలాలో ఈ ఏడాది నవంబరు 29న 70 ఏళ్ల సఫీనా నముక్వాయా ఐవీఎఫ్ టెక్నాలజీతో కవలపిల్లలకు జన్మనిచ్చిన తరువాత పలికిన మొదటి మాట ఇది.

ఈ ఆఫ్రికన్ దేశంలో వృద్ధాప్యంలో పిల్లలకు జన్మనిచ్చిన మహిళలలో సఫీనా కూడా ఒకరు.

ఉమెన్స్ హాస్పటిల్ ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ (డబ్ల్యుహెచ్ఐ అండ్ ఎఫ్‌సీ) లో ఆమెకు సిజేరియన్ చేశారు.

ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చారు.

డబ్ల్యుహెచ్ఐ అండ్ ఎఫ్‌సీలోని ఫెర్టిలిజీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ తమేలా సాలీ బీబీసీతో మాట్లాడుతూ సఫీనా తన భర్త వీర్యంతోనూ, దాత ఇచ్చిన అండం సాయంతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారని చెప్పారు.

సఫీనా నముక్వాయా ఇదే పద్ధతిలో మూడేళ్ళ కిందట 2020లోనూ ఒక ఆడపిల్లను ప్రసవించారు.

ఈమె వృద్ధాప్యంలో పిల్లలను కనాలనుకోవడానికి కారణం ఆమెకు పిల్లలు లేరనే వేధింపులు ఎదుర్కోవడం వలనే.

సఫీనాలానే భారత్‌లోని గుజరాత్‌లోని బనస్కాంతాకు చెందిన గీతాబెన్ (పేరు మార్చాం)కూడా పిల్లలు లేనందుకు సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే చివరకు ఆమె ఐవీఎఫ్ టెక్నాలజీతో 2016లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గర్భిణులకు మానసికంగా అండగా ఉంటం ఎంతో ముఖ్యం

పిల్లలు లేరనే బాధకు సాంకేతికతో పరిష్కారం

తన పెళ్ళయిన పాతికేళ్ళ తరువాత తల్లి అయినట్టు గీతాబెన్ బీబీసికి చెప్పారు. ఇప్పుడు ఆమె భర్త మనోజ్‌కుమార్ (పేరు మార్చాం) తమ ఏడేళ్ళ పిల్లాడితో సంతోషంగా జీవిస్తున్నారు.

పెళ్ళయిన తరువాత పిల్లలు పుట్టకపోవడంతో సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, బంధువుల ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకు వెళ్ళడం కూడా మానేశామని మనోజ్‌ కుమార్ చెప్పారు.

ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్జిలైజేషన్) అంటే ఏమిటి?

గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మెడికల్ డైరక్టర్‌గా ఉన్న డాక్టర్ నయనా పటేల్ ఈ విషయాన్ని బీబీసీతో చెప్పారు.

1978లో లెస్లీ బ్రౌన్ టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వడంతో ఇది ప్రారంభమైంది అని చెప్పారు. ‘‘మహిళల ట్యూబ్స్ దెబ్బతినడంమో, ఇన్ఫెక్షన్ కు గురవడమో జరిగితే, వారికి ఐవీఎఫ్ విధానాన్ని ఉపయోగిస్తారు’’ అని తెలిపారు.

ఈ విషయాన్ని పటేల్ మరింత వివరిస్తూ ‘‘అండాన్ని, వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణ చెందిస్తాం. పిండం సిద్ధమయ్యాక , దానిని మహిళ యుటెరస్‌లో ప్రవేశపెడతాం. ఈ టెక్నాలజీ ఎంతోమంది జంటలకు సంతానాన్నిచ్చింది. పిల్లలు కలగరేమోనని మహిళల బెంగను తీర్చింది’’ అని చెప్పారు.

ఐవీఎఫ్ విప్లవంలో రెండో దశగా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) టెక్నిక్ ను 1991లో తీసుకొచ్చారని డాక్టర్ నయనా తెలిపారు.

వీర్యకణాలు తక్కువగా ఉండి, తల్లిదండ్రులు కాలేని వారికి ఐసీఎస్ఐ విధానం ఊరటనిచ్చేదిగా మారింది.

‘‘ ఈ విధానం వీర్యదాతల అవసరం కూడా లేకుండా చేయడంతో ఎటువంటి అనుమానాలు లేకుండా దీనిని ఆమోదిస్తున్నారు’’ అని డాక్టర్ నయనా చెప్పారు.

ఐవీఎఫ్ విధానం

ఫొటో సోర్స్, Getty Images

ఇది అంత తేలికైనదా?

ఏదీ అనుకున్నంత తేలిక కాదు..

ఇటీవల కాలంలో ఐవీఎఫ్ విధానంలో పిల్లలను కనడం బాగా పెరిగింది. అయితే అన్ని సందర్భాలలోనూ ఈ పద్ధతిలో తల్లిదండ్రులు కాలేరు. ఈ కేసులలో కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి.

‘‘ చాలా జంటలు మొదటిసారి చాలా ఆనందపడతారు. కొన్ని సందర్భాలలో ఈ విధానం చాలా సుదీర్ఘమైనది కావడంతో ఇబ్బందిపడతారు’’ అని చెప్పారు.

ఐవీఎఫ్‌కు ముందు అనేక చికిత్సలు తీసుకున్నట్టు గీతాబెన్ చెప్పారు. తరువాత తాను ఐవీఎఫ్ వైపు మొగ్గు చూపాకా రెండేళ్ల తరువాత తమకు బిడ్డలు పుట్టారని చెప్పారు.

8సార్లు విఫలమయ్యాక 9వ ప్రయత్నంలో ఆమె గర్భం దాల్చినట్టు తేలింది. కానీ కొన్ని నెలలకే అబార్షన్ అయిపోయింది. ఆ తరువాత పదో ప్రయత్నంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

గీతాబెన్ తన భర్త మనోజ్’కుమార్‌తో కలిసి ప్రతిదశను ఎంతో సహనంగా భరించారు. చాలా కేసులలో ఇలాంటి విధానంలో తల్లి అవ్వాలనుకునే మహిళలు తమ కుటుంబం నుంచి తగినంత అండ పొందలేకపోతుంటారు.

ఇది గ్యారంటీ ఇస్తుందా?

దీనిపై డాక్టర్ నయనా పటేల్ మాట్లాడుతూ 35 ఏళ్ళలోపు మహిళల్లో 80శాతం విజయాన్ని సాధించాం.

ఒకవేళ మహిళల వయసు 35 నుంచి 40మధ్య ఉంటే వీరికి పిల్లలు కలిగే అవకాశం 60 శాతం దాకా ఉంటాయి.

అదే 40 ఏళ్ళు పైబడిన వారి విషయంలో 18 నుంచి 20 శాతం మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

ఐవీఎఫ్ విధానం

ఫొటో సోర్స్, JONAS GRATZER

ఫొటో క్యాప్షన్, గర్భధారణ సమయంలో మహిళలు తీవ్ర భావోద్వేగాలకు గురవుతారు

భావోద్వేగాల నియంత్రణే పెద్ద సవాల్

ఐవీఎఫ్ విధానంలో పిల్లలు కనడానికి వచ్చే జంటలు చాలావరకు భావోద్వేగాలతో సతమతమవుతుంటారని దిల్లీలోని బ్లూమ్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీతా ఆరోరా చెప్పారు.

పిల్లల్లు లేనందుకు వీరు ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటారంటే మనోజ్ కుమార్ లాంటివారి మాటల్లో చెప్పాలంటే ఒక్కోసారి విషం తాగి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు కూడా చేసేవారుట.

‘‘ ఇది సహజమైన పద్ధతి కాదనే ఆలోచన వారి మనసును, మెదడును తొలిచేస్తుంటుంది’’అని డాక్టర్ ఆరోరా చెప్పారు. అందుకే ఐవీఎఫ్ చికిత్స అందించేటప్పడు వారి ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమంటారు ఆరోరా.

‘‘ గర్భధారణ సమయంలో శారీరకంగా కలిగే మార్పులు కలుగుతాయి. ఆ సమయంలో ఆమె నైతికస్థైర్యం దెబ్బతినకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు తమ స్థాయిలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఈ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకునే ప్రతి ఐవీఎఫ్ కేంద్రంలోనూ ఓ కౌన్సెలర్ ఉండాలనే చట్టపరమైన నిబంధన ఉంది’’ అన్నారు.

ఇక వయసు మళ్ళిన తరువా పిల్లలకు జన్మన్చిన కేసుల గురించి అనేకసార్లు పత్రికలలో హెడ్‌లైన్లు వచ్చాయి.

2016లో : పంజాబ్‌లో పిల్లాడికి జన్మనిచ్చిన 72 ఏళ్ల దల్జిందర్ కౌర్

2019లో: ఆంధ్రప్రదేశ్‌లో కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

2022లో : పెళ్లయిన 54 ఏళ్ల తరువాత పిల్లలను కనాలనే కల నెరవేర్చుకున్న 75 ఏళ్ల భర్త, 70 ఏళ్ల భార్య

ఐవీఎఫ్ విధానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వయసు మళ్ళాక పిల్లలను కంటే వారి పెంపకం కష్టమవుతుంది

వయోపరిమితి

2021లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టి)యాక్ట్ 2021 అమలులోకి వచ్చింది.

ఈ చట్టం ప్రకారం ఐవీఎఫ్ కింద తల్లిదండ్రులవ్వాలనుకునేవారికి భర్త వయసు 55గానూ, భార్య వయసు 50ఏళ్ళుగా నిర్థారించారు. ఈ వయోపరిమితిని డాక్టర్ సునీతా ఆరోరా గట్టిగా సమర్థించారు.

‘‘వయోపరిమితి విధించడంలో ఒక కారణం ఏమిటంటే పిల్లలను పెంచి పెద్దచేయడం. ఉదాహరణకు పిల్లాడికి 15,20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రుల వయసు 70 ఏళ్ళు దాటుతుంది. ఆ సమయంలో వారు పిల్లాడి బాగోగులు ఎలా చూడగలుగుతారు. కానీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు 50 ఏళ్ళ వయసులో తల్లి కావడం అంత తేలికైన విషయం కాదు’’ అని ఆరోరా చెప్పారు.

‘‘ ఐవీఎఫ్ విధానంలో 45 ఏళ్ళు దాటినవారి విషయంలో వారి ఆరోగ్యం గురించి మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే గర్భవతుల గుండె వేగం పెరుగుతుంది. వారి రక్తపోటు కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది. చాలా సందర్భాలలో మహిళలు ఈ మార్పులను తట్టుకోలేరు’’ అంటారు ఆరోరా.

వృద్ధాప్యంలో ఐవీఎఫ్ విధానం కింద పిల్లలు కనడాన్ని డాక్టర్ పటేల్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఒకటీ అరా కేసులలో ఏదైనా ప్రత్యేక ప్రొవిజన్ ఉండి ఉంటే బావుండేదననారు.

‘‘ ఉదాహరణకు భార్య వయసు 40 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండి, భర్త వయసు 56 ఏళ్ళు ఉన్నా, లేకపోతే భర్త వయసు 53 ఉండి, భార్య వయసు 51 ఉన్నా, వారు ఆరోగ్యంగా ఉంటే ఇటువంటి కేసులో ఐవీఎఫ్ విధానాన్ని అనుమతించవచ్చు.

ఖర్చులు కూడా ముఖ్యమైన విషయమే

ఐవీఎఫ్ లో ఒక దశకు అయ్యే ఖర్చు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఒక వేళ మహిళ వయసు 21 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉంటే ఒకటి, రెండు దశలలోనే వారు తల్లయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సునీతా ఆరోరా చెప్పారు.

చాలా సందర్భాలలో వయసు పెరిగినవారికే ఐవీఎఫ్ అవసర పడుతుంది. దీంతో వీరికి ఎక్కువ దశలు, ఎక్కువ ఖర్చు అనివార్యమవుతుంది.

ఐవీఎఫ్‌కు వచ్చే మహిళలు ఆర్థిక కష్టాలతో మానసిక, శారీరక, సామాజిక స్థాయులలో అనేక కష్టాలను ఎదుర్కొంటారని డాక్టర్ పటేల్ చెప్పారు. కానీ ఒకసారి బిడ్డ వారి చేతుల్లోకి వచ్చాకా అప్పటిదాకా పడిన కష్టాలు, విచారాలను మరిచిపోతారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)