ఆంధ్రప్రదేశ్: రాజధానిపై అసెంబ్లీలో విపక్ష నేతగా జగన్ ఏమన్నారు, తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, APCMO/NCBN/FB
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే కేంద్ర ప్రభుత్వం అమరావతి అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులని చెబుతూ విశాఖపట్నం పాలనా రాజధానిగా చేస్తామంటోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో అరు నెలల్లో పదేళ్ళు పూర్తవుతోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద ఏపీ హక్కు గడువు కూడా ముగుస్తోంది. కానీ రాజధాని విషయంలో ఇంకా సందిగ్ధత వీడటం లేదు.
కొన్నేళ్లుగా ఈ వివాదం న్యాయస్థానాల్లో నానుతోంది. చివరకు ఎటు మళ్లుతుందోననే స్పష్టత ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏం జరిగిందనేది ఓసారి పరిశీలించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
ఆరంభం ఏకాభిప్రాయంతోనే..
2014
సెప్టెంబర్ 1న ఏపీ క్యాబినెట్ తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది.
అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విజయవాడలో రాష్ట్ర రాజధానిని పెట్టడానికి తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మద్ధతు ప్రకటించారు. రాజధాని కోసం కనీసంగా 30వేల ఎకరాలుండాలని అభిప్రాయపడ్డారు.
ఆనాటి సభలో ఉన్న మూడోపక్షం, నాటి ప్రభుత్వ భాగస్వామి బీజేపీ కూడా కొత్త రాజధాని అమరావతికి మద్ధతు పలికింది. ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆహ్వానించాయి.
2015
సభలో ఏకాభిప్రాయం దక్కడంతో అక్టోబర్ 22న అమరావతి పేరుతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
విజయవాడ, గుంటూరు నగరాల మధ్య తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 పంచాయతీలను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఆమోద ముద్ర వేసింది.
29 గ్రామాలను కలుపుతూ 217.23 చ. కి.మీల పరిధిలో ఈ నగర విస్తరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దానికి అనుగుణంగా 2015 జనవరి 1 నుంచే ల్యాండ్ ఫూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి భూములు సేకరించారు.
అలా సేకరించిన 33వేల ఎకరాలు, ప్రభుత్వ భూములు కలుపుకుని 53,748 ఎకరాల్లో రాజధాని అమరావతి నగరం రూపుదిద్దుకుంటుందంటూ పలు దఫాలు డిజైన్లు రూపొందించారు.
2016
జనవరిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం పేరుతో గడిచిన ఎనిమిదేళ్లుగా పరిపాలనా కేంద్రంగా ఉన్న భవనాలకు శంకుస్థాపన జరిగింది.
అక్టోబరు 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ఎం. వెంకయ్య నాయుడు పరిపాలనా భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN
ల్యాండ్ పూలింగ్‌తో మొదలు...
అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం పట్ల అన్ని పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కానీ రాజధాని కోసం భూములను తీసుకోవడానికి అనుసరించి ల్యాండ్ ఫూలింగ్ విధానం కారణంగా వివాదాలు మొదలయ్యాయి.
2015 జనవరి నుంచి ఆ ఏడాది పొడవునా ల్యాండ్ ఫూలింగ్ సందర్భంగా అనేక వివాదాలు జరిగాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నందిగామ సురేష్ వంటి వైఎస్సార్సీపీ నాయకులతో పాటుగా సీపీఎం సహా పలు పార్టీల కార్యకర్తలు, కొందరు రైతు నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు.
వాటికి కొనసాగింపుగానే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం దూరంగా ఉంది. తమను ఆహ్వానించిన విధానం సజావుగా లేకపోవడంతో శంకుస్థాపనకు హాజరుకాలేమంటూ ఆనాడే వైఎస్సార్సీపీ ప్రకటించడం గమనార్హం.
తదుపరి సింగపూర్ కన్షార్షియం సహకారంతో రాజధాని నిర్మాణం మీద పలు వివాదాలు వచ్చాయి. ల్యాండ్ ఫూలింగ్ లో అక్రమాలు అంటూ విపక్షాలు ఆరోపించాయి.
అమరావతిని భ్రమరావతి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు వ్యాఖ్యానించారు. కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయి.
రాజధాని పేరుతో పాలనా కేంద్రీకరణ జరుగుతోందని, దాని వల్ల మరోసారి హైదరాబాద్ మూలంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు.
అయినప్పటికీ అమరావతి నిర్మాణం మొదలయ్యింది. పనులు చురుగ్గా సాగాయి. రాజధానిలో కొన్ని నిర్మాణాలు వెలిశాయి.
అందుకోసం 2022 నాటికి అమరావతి అభివృద్ధికై రూ. 8,572 కోట్లు ఖర్చు అయ్యిందంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు రూ.5,674 కోట్లుగా వెల్లడించింది.

ఫొటో సోర్స్, AP CRDA
రాజధానిని మార్చబోమంటూ జగన్ ప్రకటన
2019
ఎన్నికల నాటికి అమరావతి అంశం పెద్ద చర్చనీయాంశమయ్యింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే రాజధాని మార్చేస్తారంటూ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బహిరంగంగానే హెచ్చరించారు.
దానిని వైఎస్సార్సీపీ తోసిపుచ్చింది. స్వయంగా జగన్ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించారు. తాను సొంతంగా ఇల్లు కట్టుకుని, అమరావతిలో కాపురం కూడా పెట్టానని, చంద్రబాబుకి ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదంటూ జగన్ వ్యాఖ్యానించారు.
మే 30న కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ వంటివి దాదాపుగా పూర్తి కావచ్చాయి. కానీ తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తీసుకొచ్చే పనులు కూడా ముందుకు సాగలేదు. ఇతర గ్రూప్ 3,4 ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్ కూడా మధ్యలోనే నిలిపివేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా ఆగిపోయాయి. మొత్తంగా అమరావతి నిర్మాణ పనుల్లో సీఆర్డీయే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
దాంతో సర్వత్రా అనుమానాలు బలపడ్డాయి. అమరావతి ఏమవుతుందోననే ప్రశ్నలు తలెత్తాయి. అమరావతిలో జరిగిన అవినీతి మీద విచారణ చేసి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

మూడు రాజధానుల ప్రకటనతో మారిన సీన్
అమరావతి భవితవ్యం ఏమవుతోందననే ఉత్కంఠ సాగుతున్న దశలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది.
2019 డిసెంబర్ 17న తన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత ఏపీ అసెంబ్లీలో జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం తాము పాలనా వికేంద్రీకరణ చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.
దాని కోసమై దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అందుబాటులోకి తెస్తామన్నారు. అందుకోసమై పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు తీసుకొచ్చారు.
ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా అమరావతి రైతులు రోడ్డుమీదకు వచ్చారు. అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో ఆందోళనలు సాగిస్తున్నారు.
2020
జనవరి 21న ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం దక్కినా, శాసనమండలిలో మాత్రం హైడ్రామా నడిచింది.
సెప్టెంబర్‌లో అసెంబ్లీతో పాటుగా మండలి ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేసుకుని చట్టంగా రూపొందింది.
అయితే, ఇదే సంవత్సరం జనవరిలోనే ప్రభుత్వ చట్టాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతు పరిరక్షణ సమితి పేరుతో వేసిన పిటీషన్లపై సుదీర్ఘ విచారణ జరిగింది.
WP 13919/2020(AP CRDA),WP 14282/2020 (Decentralisation)) పేరుతో రెండు చట్టాలకు సంబంధించిన విచారణ జరిగింది.
జనవరి 24 నుంచి ఈ కేసులో ఏపీ హైకోర్టుకి చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఫొటో సోర్స్, UGC
2021
నవంబర్ 2న ఈ చట్టాలపై కోర్టులో విచారణ సాగుతుండగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
పాలనా వికేంద్రీకరణ చట్టం రద్దు చేస్తూ, సీఆర్డీయేని పునరుద్దరణ చేస్తూ పూర్వపు విధానం అమలయ్యేందుకు గానూ ఆ చట్టాలు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
అదేసమయంలో లోపాలు లేకుండా త్వరలోనే మూడు రాజధానుల కోసం మెరుగైన చట్టాలు రూపొందించబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
2022
మార్చి 3న ఏపీ హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు ఎం. సత్యనారాయణమూర్తి, డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు తో కూడిన ఉన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.
ఆ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. దానికి గడువులు కూడా విధించింది.
నెలరోజులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాజధాని నగరాన్ని ఆరు నెలలలో నిర్మించాలని కూడా ఆదేశించింది.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
న్యాయస్థానాల్లో రాజధాని అంశం
2023
2020 డిసెంబర్ నుంచి మొదలుకుని 2023 ఆఖరికి కూడా ఈ వివాదం న్యాయస్థానాల్లో నానుతోంది.
2022 మార్చిలో ఇచ్చిన ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుపై అదే ఏడాది సెప్టెంబరులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ తీర్పు చెల్లుబాటు కాదని, స్టే విధించాలని కోరింది.
కానీ ఏపీ ప్రభుత్వం ఆశించిన రీతిలో సుప్రీంకోర్టు స్పందించలేదు. రాజధాని నిర్మాణానికి విధించిన గడువు చెల్లుబాటు కాదని చెబుతూనే ఇతర అంశాలు విచారణకు స్వీకరించింది.
ఏడాదికి పైగా ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చింది. కేసులో అమరావతి జేఏసీ సహా పలువురు ఇంప్లీడ్ అయ్యారు. వాదనలు వినిపిస్తున్నారు.
ఏపీ రాజధాని వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉండగానే విశాఖలో పాలనా కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానికి తగ్గట్టుగా రుషికొండపై పర్యాటక శాఖ కాటేజీలు తొలగించి ముఖ్యమంత్రి నివాసానికి అనుగుణంఆ నిర్మాణాలు జరిగాయి.
విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాసాల కోసం భవనాల ఎంపిక కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
పలు ముహూర్తాలు పెట్టినప్పటికీ అమరావతి కేంద్రంగానే పాలన సాగించాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మనసంతా విశాఖలో ఉండగా, పాలన మాత్రం అమరావతి నుంచి కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, నిర్మాణంలో భవనాలు, సేకరించిన భూములు, చేసిన ఖర్చు వంటి అనేక అంశాలతో ముడిపడిన అమరావతి రాజధాని వ్యవహారం ఎటు తేల్చేందుకు కేంద్రం కూడా సిద్ధపడిన దాఖలాలు లేవు.
ఇలా రాజకీయంగా మొదలై, న్యాయ, చట్టాల పరిధిలో నలుగుతున్న అమరావతి కథ ఎటు మళ్ళుతుందన్నది ఎవరికీ అంతుబట్టని అంశంగా మారిపోయింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తదుపరి కొత్త ప్రభుత్వ హయంలోనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అకౌంట్లోని డబ్బును ఎలా కొల్లగొడుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి....
- COP 28: ఆయిల్, గ్యాస్, బొగ్గు లేకుండా మనుషులు మనుగడ సాగించగలరా?
- గాజా: బందీలైన ఈ ముగ్గుర్ని కాపాడమంటే కాల్చి చంపారు... పొరపాటు ఎక్కడ జరిగింది?
- మాల్దీవులు: చైనాతో స్నేహం వల్లే ‘ఇండియా అవుట్’ అంటోందా? మోదీ ముందున్న మార్గాలేంటి....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















