గాజా: బందీలైన ఈ ముగ్గుర్ని కాపాడమంటే కాల్చి చంపారు... పొరపాటు ఎక్కడ జరిగింది?

ఇజ్రాయెల్ బందీలు

ఫొటో సోర్స్, HOSTAGE AND MISSING FAMILIES FORUM

ఫొటో క్యాప్షన్, అలోన్ షమ్రీజ్, మోతెమ్ హైమ్, సమీర్ తలల్కా (వరుసగా ఎడమ నుంచి కుడికి)

గాజాలో శుక్రవారం సైనికులు పొరపాటున చంపేసిన ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు, మిగిలిపోయిన ఆహారంతో హెల్ప్ అంటూ టీ షర్టుల మీద రాసి సంకేతాలు పంపారని ఇజ్రాయెల్ తెలిపింది.

వారిని కాల్చి చంపిన ప్రదేశానికి పక్కనున్న భవనంలోనే వారంతా కొంతకాలంగా ఉంటున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడిచింది.

తెల్లజెండాను పట్టుకున్న ఆ ముగ్గురిని చంపడం మిలిటరీ నిబంధన(రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్)ల ఉల్లంఘనే అని అధికారులు అంగీకరించారు.

హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించే ఒప్పందం కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. గాజా స్ట్రిప్‌లో ఇంకా 120 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7నాటి హమాస్ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లో 1200 మంది ప్రాణాలు కోల్పోగా చాలామందిని బందీలుగా తీసుకెళ్లారు.

ఆ తర్వాత, హమాస్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా భారీ ప్రతీకార చర్యకు పూనుకుంది ఇజ్రాయెల్.

ఇజ్రాయెల్ బలగాలు

ఫొటో సోర్స్, ISRAEL DEFENSE FORCES

స్థానిక ఆరోగ్య అధికారుల ప్రకారం, గాజాలో ఇప్పటివరకు 18 వేల మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.

శుక్రవారం గాజాలోని షెజయా పరిసరాల్లో హమాస్ నుంచి ఇజ్రాయెల్‌కు గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఈ సమయంలోనే కాల్పుల్లో బందీలు యోతెమ్ హైమ్ (28), సమీర్ తలల్కా (22), అలోన్ షమ్రీజ్ (26) చనిపోయారు.

ఒక భవనం నుంచి వీరంతా చొక్కాల్లేకుండా బయటకు వచ్చారని, ఒకరి చేతిలో తెల్లటి వస్త్రంతో కూడిన కర్ర ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ఒకరు చెప్పారు.

ఒక సైనికుడికి వారంతా కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉండగా, ప్రమాదంగా భావించిన ఆ సైనికుడు వారిని తీవ్రవాదులుగా భావించి కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

అందులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మూడో వ్యక్తి గాయపడి భవనంలోకి పారిపోయాడని చెప్పారు.

వీడియో క్యాప్షన్, గాజాలో సహాయక సామగ్రి కోసం లారీల వెంట పరిగెత్తుతున్న ప్రజలు

‘కాపాడండి’ అంటూ హీబ్రూలో ఒక ఏడుపు వినిపించడంతో బెటాలియన్ కమాండర్ కాల్పులను ఆపాలని ఆదేశించారు.

గాయపడిన ఆ వ్యక్తి బయటకు వచ్చాక మళ్లీ కాల్చడంతో ఆయన మరణించినట్లు ఆ అధికారి వెల్లడించారు.

బందీలుగా ఉన్న ఆ ముగ్గురు తప్పించుకొని బయటకు వచ్చారా? లేదా హమాస్ వారిని విడిచిపెట్టిందా అనే అంశంపై స్పష్టత లేదు.

ఆదివారం ఆ భవనంలో తనిఖీలు చేపట్టగా అందులో ఒక వస్త్రం మీద ‘‘ఎస్‌ఓఎస్’’, ‘‘హెల్ప్ త్రీ హోస్టెజెస్ (ముగ్గురు బందీలకు సాయం చేయండి)’’ అనే సందేశాలు రాసి కనిపించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.

వారు అక్కడే కొన్నిరోజులుగా బందీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈనెల మొదట్లో ముగిసింది.

మరికొంతమంది బందీలు విడుదలయ్యేంత వరకు హమాస్‌తో మరో కొత్త ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి బందీల కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి.

తొలి ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే దానికి బదులుగా 100 మందికి పైగా ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నారు.

ఐడీఎఫ్

ఫొటో సోర్స్, ISRAEL DEFENSE FORCES

ఫొటో క్యాప్షన్, ఎరెజ్ క్రాసింగ్‌కు 400మీ దూరంలోనే సొరంగం ఉందని ఐడీఎఫ్ చెప్పింది. యుద్ధానికి ముందు ఈ సొరంగాన్ని గాజా వారు ఉపయోగించేవారని తెలిపింది

పాలస్తీనా పౌరుల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాన మిత్రదేశం అమెరికాతో సహా అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగింది.

తక్షణ, మెరుగైన సంధి కోసం పిలుపునిస్తూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరిన్ కొలోన్నా ఆదివార ఇజ్రాయెల్ వెళ్లారు.

కాల్పుల విరమణ పాటిస్తే అది పొరపాటు అవుతుందని, హమాస్‌కు అదొక గిఫ్ట్‌గా మారుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ అన్నారు.

యూకే, జర్మనీలు కూడా కాల్పుల విరమణ చేయాలంటూ పిలుపునిచ్చాయి.

ఇజ్రాయెల్ బాంబుదాడుల వల్ల గాజా స్ట్రిప్‌లోని చాలా ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి.

ప్రాథమిక అవసరాలు తీర్చే సామగ్రి కొరత ఉన్నందున అక్కడ ఏర్పడే మానవతా సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

ఆదివారం సహాయాన్ని తీసుకొస్తున్న లారీల మీదకు గాజా నివాసితులు ఎక్కుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

హమాస్‌కు చెందిన టన్నెల్‌లో భారీగా దాడులు చేసినట్లుగా చెబుతూ ఐడీఎఫ్ కొన్ని ఫోటోలను ప్రచురించింది.

ఈ సొరంగం కొన్ని చోట్ల కారు వెళ్లేంత వెడల్పుగా ఉందని తెలిపింది. ఎరెజ్ సరిహద్దు క్రాసింగ్‌కు 400మీ. దూరంలో ఈ సొరంగం ఉన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, గాజాలో యుద్ధానికి శాంతియుత ముగింపు సాధ్యమేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)