సుజనా చౌదరిని దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎందుకు ఆపారు... అమెరికా వెళ్లేందుకు ఆయనకు హైకోర్టు అనుమతి ఎందుకు అవసరమైంది?

సుజనా చౌదరి

ఫొటో సోర్స్, YSChowdary/Facebook

కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ రాజ్యసబ సభ్యుడిగా ఉన్న యలమంచిలి సుజనా చౌదరి తనకు అమెరికాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ తిరిగి వచ్చేది ఎప్పుడో సీబీఐకి లిఖిత పూర్వకంగా తెలపాలనే షరతు మీద కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది.

సుజనా చౌదరి అమెరికాకు వెళ్లడానికి గరువారం నాడు దిల్లీలోని విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఒక బ్యాంకు అక్రమాలకు సంబంధించిన కేసులో సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌(ఎఓసీ)ను వారు ఆయనకు చూపించి ప్రయాణాన్ని అడ్డుకున్నారు.

దాంతో, హైదరాబాద్‌లో ఉంటున్న సుజన శుక్రవారం నాడు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అమెరికా ప్రయాణానికి అనుమతించాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు.

ఎల్ఓసీ గడువు ఏడాది కాలమేనని, 2019లో జారీ చేసిన ఆ నోటీసు గడువు పూర్తయిందని సుజన తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ తరఫు న్యాయవాది, ఆ సర్క్యులర్ పొడిగించారని చెప్పారు. కానీ, అందుకు సంబంధించిన పత్రాలు కోర్టుకు సమర్పించలేకపోయారు. దాంతో, ఆయన ఎంపీ కూడా కాబట్టి అమెరికా ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, ఆయన తిరిగి స్వదేశానికి ఎప్పుడు వచ్చేది సీబీఐకి తెలపాలని ఆదేశించింది.

సుజనా చౌదరి

ఫొటో సోర్స్, YSChowdary/Facebook

చైన్నైకు చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ బ్యాంకుల నుంచి రూ. 71.46 కోట్లఅప్పు తీసుకొని, తిరిగి చెల్లించలేదని 2019 లో సిబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిఆర్ పిసి సెక్షన్లు 160, 161 కింద విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది.

బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ సంస్థకు సంబంధించి అక్రమాల జరిగాయంటూ 2016 ఏప్రిల్‌ 27న సుజనా చౌదరిపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్‌ 18న సీబీఐ లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసింది. తమకు చెల్లించాల్సిన అప్పు ఎగవేశారంటూ మారిషస్‌ బ్యాంకు కూడా గతంలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అమెరికాలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న బంధువును చూడడానికి వెళుతున్న సుజనా చౌదరిని అనుమతించాలంటూ ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది మాథూర్‌ హౌస్‌ మోషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు ప్రయాణ తేదీతో పాటుగా భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)