గుడిలో చోరీ: హాయిగా నిద్రపోవడంతో పట్టుబడిన యువకుడు.. అసలేం జరిగింది? - ప్రెస్‌రివ్యూ

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆలయంలోకి ప్రవేశించి నగలు కాజేసిన ఓ యువకుడు.. తీరిగ్గా అక్కడే నిద్రపోవడంతో పట్టుబడ్డాడని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘చాంద్రాయణగుట్ట ఠాణాకు కూతవేటు దూరంలో శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీరామాలయం ఆవరణలో సాయిబాబా, దుర్గాభవాని, స్వయంభువు ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి.

ఆదివారం సాయిబాబా మందిరం పూజారి తలుపులు తీయగా.. లోపల ఓ యువకుడు నిద్రపోయి కనిపించాడు. వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధి ప్రభాకర్‌రాజుకు సమాచారం ఇచ్చి, అతడిని నిద్రలేపారు.

అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా.. అమ్మవారి వెండి వడ్డాణం, త్రిశూలం, కత్తి, వస్త్రాలు కనిపించాయి.

నిలదీయగా.. ఆలయంలో చోరీ చేశానని, నిద్ర రావడంతో ఇక్కడే పడుకున్నానన్నాడు. సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ, ఎస్సై కె.గోవర్ధన్‌రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు.

అర్ధరాత్రి స్లాబ్‌ నుంచి మెట్ల మార్గం ద్వారా లోనికి ప్రవేశించిన అతడు సాయిబాబా ఆలయం వెనుక తలుపు ధ్వంసం చేశాడు.

హుండీ, అల్మారా తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి ఆభరణాలు తీసుకున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో అతడు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిందితుడికి వైట్నర్‌ సేవించే అలవాటు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు’’అని ఈనాడు తెలిపింది.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

498ఏ కింద గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించేందుకు వీల్లేదు..

గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్‌ కింద విచారించేందుకు వీలుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్‌ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది.

ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

అరెస్ట్‌తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు.

తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ జరిపారు’’అని సాక్షి తెలిపింది.

హత్య

ఫొటో సోర్స్, ANI

యువకుడి మర్మాంగాన్ని కత్తిరించి హత్య

బిహార్‌లో ప్రేమికురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా చంపేశారని వెలుగు ఓ కథనం ప్రచురించింది.

‘‘కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేశారు.

ముజఫర్‌పూర్ జిల్లాలోని కాంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపురా రాంపూర్షా గ్రామానికి చెందిన 17 ఏళ్ల సౌరభ్ కుమార్.. పక్క గ్రామమైన సోర్బారాలోని తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు.

యువకుడిని గమనించిన బాలిక బంధువులు సౌరభ్ మీద దాడిచేశారు. అనంతరం సౌరభ్ మర్మాంగాన్ని కత్తిరించారు.

తీవ్ర రక్తస్రావమైన సౌరభ్‌ను.. కొంతమంది స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌరభ్.. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి చనిపోయాడు.

సౌరభ్ హత్యతో తీవ్ర ఆగ్రహానికిలోనైన అతని బంధువులు.. శనివారం బాలిక ఇంటిముందే సౌరభ్ అంత్యక్రియలు నిర్వహించారు.

యువకుడిపై దాడిచేసింది బాలిక బంధువైన సుశాంత్ పాండేగా గుర్తించినట్లు ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు.

సౌరభ్‌ని తీవ్రంగా కొట్టి.. అతని జననాంగాలు కత్తిరించారని, పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని రాజేశ్ కుమార్ తెలిపారు’’అని వెలుగు తెలిపింది.

తిరుపతి

శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తున్నవారిపై కేసు నమోదు

శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తున్న సంస్థలపై టీటీడీ కొరడా ఝళిపించిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘భక్తులకు అధిక ధరలకు టికెట్లను విక్రయిస్తున్న చెన్నైకి చెందిన రేవతి ట్రావెల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదు చేసింది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపింది.

కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని టీడీపీ పేర్కొంది.

చెన్నై‌కి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపింది.

దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారని పేర్కొంది’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)