COP 28: ఆయిల్, గ్యాస్, బొగ్గు లేకుండా మనుషులు మనుగడ సాగించగలరా?

శిలాజ ఇంధనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిలాజ ఇంధనాలపై ఆధారపడకూడదని కాప్28 సదస్సులో దేశాలు నిర్ణయించినా అదంత సులభం కాదు
    • రచయిత, బీబీసీ ముండో
    • హోదా, ..

ఒక సమస్యను పరిష్కరించాలంటే ముందు దాన్ని గుర్తించడం ముఖ్యం. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తమ ఉనికికే ప్రమాదమని ఎట్టకేలకు ప్రపంచ దేశాలు గుర్తించాయి.

వాతావరణంలో చోటుచేసుకుంటున్న ప్రమాదకర మార్పులను నివారించేందుకు ఆయిల్(చమురు), గ్యాస్ (సహజవాయువు), బొగ్గు వాడకాన్ని నిలిపేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు దాదాపు 200 దేశాల ప్రతినిధులు అంగీకరించడం ఇదే మొదటిసారి.

ఇటీవల దుబాయ్‌లో రెండువారాల పాటు జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు(యునైటెడ్ నేషన్స్ కాప్28 సమ్మిట్) ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది.

పర్యావరణ సదస్సును COP (కాప్) సదస్సు లేదా కాప్ శిఖరాగ్ర సమావేశం అని వ్యవహరిస్తారు. COP అంటే 'కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్'. ఇక్కడ పార్టీలు అంటే సదస్సుకు హాజరయ్యే దేశాలు. ఇవన్నీ కూడా 1992లో 'యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్' (యూఎన్ఎఫ్‌సీసీ)పై సంతకం చేసిన దేశాలు.

అయితే, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం కష్టంగానే కనిపిస్తోంది. ఎన్నో దేశాలు, ప్రజా సంఘాలు, ఎంతోమంది సైంటిస్టులు డిమాండ్ చేసినట్లుగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం, లేదా తగ్గించడానికి స్పష్టమైన కట్టుబాట్లు లేకపోవడం, ఇతర కారణాల వల్ల అది కార్యాచరణకు నోచుకునే అవకాశం కనిపించడం లేదు.

ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తివంతమైన ఇంధన వనరులను మార్చడం మానవాళికి ఎంతవరకూ సాధ్యమనే విషయాలను బీబీసీ క్లైమేట్ ఎడిటర్ జస్టిన్ రౌలట్ ఈ కథనంలో వివరించారు.

శిలాజ ఇంధనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దుబాయ్‌లో జరిగిన కాప్28 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది

2025 నాటికి ఇంధన వినియోగం గరిష్ట స్థాయికి..

మానవాళి ఒక మైల్‌స్టోన్‌ను చేరుకోబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు చెబుతున్నారని రౌలట్ చెప్పారు.

రానున్న సంవత్సరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అత్యధిక స్థాయికి చేరుకోనుంది. అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్, బొగ్గు వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇక ఆ తర్వాతి నుంచి ఆ ఇంధనాలకు డిమాండ్ తగ్గడం మొదలవుతుంది.

ఇందులో రెండోది అపురూపమైన విజయం, అందరం ఉత్సాహంగా వేడుకలు చేసుకోవాల్సినంత పెద్ద విషయం. కానీ, ఇది కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.

అవేంటంటే, క్లీన్ ఎనర్జీ మోడల్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? భూమి తగలబడిపోయేలోపు ఆ కొత్త మోడల్ వస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మానవాళి మనుగడ, నాగరికతలో శిలాజ ఇంధనాల పాత్ర మనకు అర్థమైన దాని కంటే చాలా ఎక్కువే. అందువల్ల వాటి నుంచి పూర్తిగా బయటపడడం చాలా కష్టమైన పని.

అందుకోసం ప్రభుత్వాలు వాతావరణానికి సంబంధించి ఎలాంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టకపోయినా, 2025లో ప్రపంచంలో శిలాజ ఇంధన వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది.

దీన్ని ''చారిత్రక మలుపు''గా ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాటిహ్ బిరోల్ అభివర్ణించారు.

శిలాజ ఇంధనాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బొగ్గు, గ్యాస్, ఆయిల్ నుంచే 70 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతోంది

అది అంత సులభమా?

అయితే, మన ముందున్న సవాలేంటి?

మానవ సమాజంపై ఇంధనం ప్రభావం గురించి అకడమిక్, ఎక్స్‌పర్ట్ వాక్లవ్ స్మిల్ మాట్లాడుతూ ''ఇంధనం అనేది ఉక్కులానో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాదిరిగానో, లేక కొత్త ఆవిష్కరణ తరహాలోనో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(ఎకానమీ)లో ఒక భాగం కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(ఎకానమీ)కి అదే మూలమని అన్నారు.

''ఎకనామిక్స్ అంటే ఒక రూపంలో ఉన్న ఎనర్జీ(ఇంధనాన్ని)ని మరో రూపంలోకి మార్చడమా, నిజంగా అంతే అనుకుంటున్నారా?. కాదు. ఇంధనం లేకుండా అసలు ఆర్థిక వ్యవస్థే (ఎకానమీ) లేదు'' అని ఆయన అన్నారు.

భూమి వేడెక్కిపోవడానికి కారణమవుతున్న ఇంధనాల వినియోగాన్ని ఆపేయడం అంత సులభమా? అని స్మిల్ సందేహాలు వ్యక్తం చేశారు.

''మనం శిలాజ ఇంధనాలతో నడుస్తున్న సమాజంలో బతుకుతున్నాం. ఏడాదికి వెయ్యి టన్నుల ఉక్కు, 4000 మిలియన్ టన్నుల సిమెంట్, 4000 మిలియన్ టన్నుల ద్రవ ఇంధనాల గురించి మనం మాట్లాడుతున్నాం'' అని ఆయన గుర్తు చేశారు. ఆ సంఖ్యలు మన ఊహలకు కూడా అందవని ఆయన అన్నారు.

ఇంధనమనేది ఎంత కీలకమో ఇది మనకు తెలియజేస్తుంది.

శిలాజ ఇంధనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ ఇంజిన్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు

ఇంకా చాలా దూరంలో ఉన్నాం

ప్రస్తుతం మనం వాడుతున్న ఇంధనాల్లో 80 శాతం శిలాజ ఇంధనాల నుంచి వస్తున్నదే. కాప్28 సదస్సులో చర్చించినట్లు శిలాజ ఇంధనాల వినియోగం రాబోయే ఇంధన విప్లవానికి సవాల్ లాంటిది.

క్లీన్ ఎనర్జీలో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ భవిష్యత్తులో ఆశాజనకమైన ఇంధనాలుగా కనిపిస్తున్నాయి. వాటి ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. 2022లో ఉత్పత్తి అయిన మొత్తం ఎనర్జీలో ఈ రెండింటి వాటా 12 శాతంగా ఉంది. కొన్ని దశాబ్దాల కిందట వాటి ఉత్పత్తి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 70 శాతం వరకూ బొగ్గు, ఆయిల్, గ్యాస్ నుంచే ఉత్పత్తి అవుతోంది.

అయితే, ప్రపంచంలోని మొత్తం ఇంధనం వినియోగంలో విద్యుత్‌కు వినియోగించేది ఐదవ వంతు మాత్రమే.

అందువల్ల, విద్యుత్ సరఫరాలో విండ్, సోలార్ ఎనర్జీ వాటా వాస్తవానికి కేవలం 2 శాతం మాత్రమే.

పెరిగిపోతున్న పవర్ ప్లాంట్లు, ఉక్కు పరిశ్రమలు, గ్లాస్ ఫ్యాక్టరీలు, నౌకలు, విమానాలు, వాహనాల కారణంగా శిలాజ ఇంధనాల వినియోగంలో గరిష్ట స్థాయికి చేరుతోంది.

మరి అవి లేకుండా మనుషులు మనుగడ సాగించగలరా?

ఈ విషయంలో ప్రొఫెసర్ స్మిల్ కంటే యూకే క్లైమేట్ చేంజ్ కమిటీ హెడ్ క్రిస్ స్టార్క్ ఆశావహంగా కనిపించారు.

విద్యుదీకరణ దిశగా కాప్28 సదస్సు నిర్ణయాలు తీసుకుందని, నిజానికి శిలాజ ఇంధనాల కంటే విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయన చెప్పారు.

''మీ కారు బానెట్ నుంచి వచ్చే వేడి ఒక రకంగా ఎనర్జీ వృథా. ఎలక్ట్రిక్ వాహనాల్లో అలా జరగదు'' అని ఆయన వివరించారు.

అలాగే, గ్యాస్ బాయిలర్‌‌లో ఒక యూనిట్ ఎనర్జీ వినియోగిస్తే, ఒక యూనిట్ వేడి పుడుతుంది. అదే ఎలక్ట్రిక్ హీటర్‌ అయితే మూడు యూనిట్లు వేడి పుట్టిస్తుంది.

శిలాజ ఇంధనాల వినియోగాన్ని విద్యుత్ శక్తి తప్పకుండా తగ్గిస్తుందని, భారీగా పెరిగిపోతున్న ఇంధన వినియోగానికి చెక్ పెడుతుందని స్టార్క్ అభిప్రాయపడ్డారు.

క్రిస్ స్టార్క్
ఫొటో క్యాప్షన్, యూకే క్లైమేట్ చేంజ్ కమిటీ హెడ్ క్రిస్ స్టార్క్

చవక కూడా..

శిలాజ ఇంధనాల కంటే రెన్యువబుల్ ఎనర్జీ చవకైనదని, అందువల్ల డబ్బు కూడా ఆదా అవుతుందని స్టార్క్ అన్నారు.

భారీ రాయితీలు ఇవ్వకుండానే ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి సాధ్యం కాగలదని బ్రిటిష్ అధికారి అభిప్రాయపడ్డారు.

అయితే, పునరుత్పాదక ఇంధనాలైన విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో తొలుత విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ఎక్కువ ఖర్చవుతుంది. ఈ ప్రారంభ ఖర్చులే పేద దేశాలకు సమస్యగా మారాయి.

ప్రపంచ ఇంధన సరఫరాలో 80 శాతంగా ఉన్న శిలాజ ఇంధనాల వాటా, 20230 నాటికి 73 శాతానికి తగ్గుతుందని ఐఈఏ అంచనా వేస్తోంది.

''ప్రపంచం క్లీన్ ఎనర్జీ దిశగా సాగుతోంది. అది నిరాటంకంగా కొనసాగుతుంది. సందేహాలకు అవకాశం లేదిక్కడ. ఎంత త్వరగా, ఎంత త్వరగా జరిగితే అంత మంచిది'' అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాటిహ్ బిరోల్ అన్నారు.

''అయితే, శిలాజ ఇంధనాల వినియోగం ఏ స్థాయిలో ఉందో మనం గుర్తుంచుకోవాలి. భూమిపై ఉన్న జనాభా అందరికీ విద్యుత్ విరివిగా వినియోగంలోకి రావాల్సిన అవసరం ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి తీసుకురావాలి. ఎందుకంటే, మనకు ఇంకా కొన్ని దశాబ్దాలు మాత్రమే మిగిలి ఉన్నాయని సైన్స్ హెచ్చరిస్తోంది'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)