ఆంధ్రప్రదేశ్: న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల కేసులో మరో ఆరుగురు వైసీపీ కార్యకర్తల అరెస్టు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతోపాటు న్యాయ వ్యవస్థను కించపరిచేలా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే కేసులో మరో ఆరుగురు వైసీపీ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది.
హైకోర్టు తీర్పులపై చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు విదేశాల్లో ఉండడంతో వారిని కూడా విచారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసు విచారణను వేగంగా చేపట్టాలని ఇటీవల హైకోర్టు కూడా ఆదేశించింది.
తాజాగా అరెస్టైన వారిలో వైసీపీ కార్యకర్తలు అవుతు శ్రీధర్ రెడ్డి, జంగం వెంకట సత్యనారాయణ, శ్రీనాధ్ రెడ్డి, అజయ్, శ్రీధర్, దర్శి కిషోర్ రెడ్డి ఉన్నారు.
వైసీపీలో వీరు సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా మరికొందరిపైనా ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN/
సీఐడీ నుంచి సీబీఐకు
న్యాయమూర్తులపై అభ్యంతకర పోస్టులు చేశారనే ఆరోపణలపై తొలుత సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసులు సీబీఐకి చేరాయి.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ విశాఖపట్నం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోలింగ్‌లు వివాదాస్పదమవుతున్నాయి. వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో కొందరు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని కేసుల్లో నిందితుల అరెస్టులు కూడా జరిగాయి. చాలా కేసుల్లో విచారణ సాగుతోంది.
ఇదే సమయంలో హైకోర్టు జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేశారంటూ ఏకంగా రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేయడం చర్చనీయమైంది.
సోషల్ మీడియా ట్రోలింగ్ బాధితుల కేసులు విచారించే న్యాయమూర్తులే ఇప్పుడు బాధితులుగా పేర్కొంటూ కేసు నమోదు కావడం కలకలం రేపింది.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో హద్దులు మీరితే..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ, అభిప్రాయాలను వెల్లడించడానికి ఉన్న ఈ అవకాశానికి పరిధులు, పరిమితులు కూడా ఉన్నాయి.
భావ ప్రకటన పేరుతో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా అనేక అంశాలను ప్రస్తావించడానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఎదుటి వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో ప్రవర్తన, భాష, రాత, వ్యాఖ్య ఉండకూడదు.
కానీ, సోషల్ మీడియాలో కొందరు ఈ హద్దులు మీరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా అభ్యంతకర రీతిలో ఏదైనా సమాచారం ప్రచురించినా, ప్రసారం చేసినా శిక్షార్హులవుతారు. తొలిసారి నేరం చేస్తే నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఐదు లక్షల రూపాయల వరకూ జరిమానా వేస్తారు.
నేరం పునరావృతం అయితే ఐదేళ్ల కారాగార శిక్షతో పాటుగా రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
పెరిగిన ఐటీ యాక్ట్ కేసులు
వివిధ సైబర్ నేరాలతో పాటుగా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల విషయమై పెడుతున్న కేసులు కూడా ఇటీవల పెరిగాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రిపై, పలువురు మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ వివిధ కేసుల్లో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2019లో సోషల్ మీడియా పోస్టులపై అరెస్టైన వారి సంఖ్య 130కి పైగా ఉందని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ తరహాలో నమోదైన కొన్ని కేసులు, అరెస్టులు వివాదాలకు దారితీశాయి.
సోషల్ మీడియా పోస్టులపై తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదని గతంలో టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అయినా, చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’
- యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న భారత్.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు
- ‘రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఆపినట్లు ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ఆపగలరా’
- ‘బంగ్లాదేశ్‌లో ఆలయాల్లో హింస చూసి నా గుండె పగిలింది’ : అమెరికా మాజీ ఎంపీ
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








