ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అకౌంట్‌లోని డబ్బును ఎలా కొల్లగొడుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల నుంచి సినీ తారలు, ప్రభుత్వాధినేతలను ఆందోళనకు గురి చేస్తున్న విషయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).
సాంకేతిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడం వల్ల కలిగిన అనేక మార్పులలో ఏఐ ఒకటి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల వివిధ వర్గాల నుంచీ అసంతృప్తి వ్యక్తమౌతోంది.
డీప్ ఫేక్ ద్వారా కొందరు ప్రముఖ నటీనటుల వీడియోలు వైరల్ కావడం ఇటీవల జరిగిన పరిణామం. అలాగే ఈ టెక్నాలజీ వల్ల రాబోయే సమస్యల గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ టెక్నాలజీ ఆర్థిక నేరాలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తోంది? దాని కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక నేరాలు రెండు రకాలు
1. బాధితులకు ఎక్కువ రాబడి వస్తుంది అని మభ్యపెట్టి వారి అనుమతితో వారి నుంచే డబ్బు తీసుకోవడం. ఏదో ఒక కారణం చెప్పి బాధితులను పూర్తిగా నమ్మించి ఓటీపీ, పిన్ లాంటి గుప్త సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా వారి ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం. 2019లో ఇలా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం రూ. 50 వేల కోట్లని అంచనా.
వివిధ పర్సనల్ లోన్ యాప్స్, యూపీఐ ద్వారా చేసే మోసాలు ఈ కోవలోకే వస్తాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకుండా ఉండటం ద్వారా ఇలాంటి మోసాల నుంచి బయటపడచ్చు.
2. బాధితుల ప్రమేయం లేకుండా వారి అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడం. అకౌంట్ హ్యాకింగ్, పాస్‌వర్డ్ దొంగిలించడం లాంటివి ఈ కోవలోకి వచ్చే మోసాలు. అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు ఇలాంటి మోసాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ ద్వారా వచ్చే సమస్యలు పైన చెప్పిన రెండు రకాల కంటే విభిన్నమైనవి. ఎందుకంటే డీప్ ఫేక్ ద్వారా ఒక వ్యక్తిని పోలిన డిజిటల్ నకిలీ వ్యక్తిని తయారు చేసే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, MYHERITAGE
ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థుల ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి వారి విజయావకాశాలను దెబ్బతీయడం మనం చూశాం. అలాగే నకిలీ ప్రొఫైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం కూడా సాధ్యమే.
ఉదాహరణకు మన కుటుంబసభ్యులు ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేసి ఒకానొక అకౌంట్ నంబరుకు డబ్బు పంపమని అడిగితే మనం ఎలాంటి సంకోచం లేకుండా పంపుతాం. ఎందుకంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి మన కుటుంబసభ్యుడే అని నమ్ముతాం. బ్యాంక్ కూడా ఆ లావాదేవీని మోసపూరితమైనదిగా గుర్తించదు. దానిపై బ్యాంక్ నుంచి మనకు ఎలాంటి సాయం దొరకదు.
2019లో ఒక బ్రిటీష్ ఎనర్జీ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇలాంటి మోసానికే గురైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది. ఇలాంటి మోసాల బెడద ప్రముఖుల నుంచీ సామాన్యులదాకా అందరినీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఇప్పుడు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి ఆర్థిక నేరాలు జరగచ్చో ఒకసారి చూద్దాం:
వ్యక్తిగత స్థాయిలో
పైన చెప్పినట్లుగా ఒక వ్యక్తి డిజిటల్ నకిలీని తయారు చేసి తద్వారా లాభం పొందడం భవిష్యత్తులో రాబోయే ప్రధాన సమస్య.
టెక్నాలజీలో అభివృద్ధి రావడం వల్ల ఇలాంటివి చేయడం మరింత సులభం అయ్యే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సంస్థల స్థాయిలో
ఆర్థిక సంస్థల పనితీరు గురించి లేదా కొన్ని కంపెనీల పనితీరు గురించి ఆ కంపెనీ నుంచే అధికారిక ప్రకటన వచ్చినట్టుగా పుకార్లు వ్యాప్తి చేయడం.
గతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం మెషీన్లలో నగదు రాదంటూ కొన్ని పుకార్లు రావడం వల్ల ఆ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవడానికి క్యూ కట్టారు.
ఇలా ఒక సంస్థ పనితీరు బాగాలేదని సదరు సంస్థ మదుపరులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తే అది ఆ సంస్థకు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఎక్స్ (ట్విట్టర్) మాధ్యమంలో బ్లూటిక్ సంబంధిత నియమాలు మారిన తర్వాత కొందరు ఆకతాయి వ్యక్తులు ప్రముఖ కంపెనీల పేరు మీద ప్రొఫైల్ పేజీలు మొదలుపెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.
ఈ సందర్భంలో ఎక్స్ వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంది. కానీ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వచ్చే వార్తలను లేదా సంఘటనలను నివారించడం చాలా కష్టం.
నియమ నిబంధనలు
ప్రభుత్వాలు లేదా ఆర్థిక సంస్థలు తమ నిబంధనలలో మార్పులు చేశారని ప్రజలను నమ్మించడం.
ఉదాహరణకు ఏదైనా ఒక రంగానికి ప్రభుత్వం మద్దతు ఉపసంహరిస్తోందని అని వార్త వ్యాపిస్తే మదుపరులు ఆ రంగం నుంచి తమ పెట్టుబడిని వెనక్కు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆ రంగంలోని సంస్థల మార్కెట్ విలువ ఉన్నపళంగా పడిపోయి మదుపరులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
అలాగే ఫలానా రంగాన్ని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా గుర్తించింది అనే వార్త సహజంగా ఆ రంగం వైపు పెట్టుబడులు మళ్లేలా చేస్తుంది. ఇలా తప్పుడు వార్తలు ప్రాచుర్యంలోకి తీసుకురావడం డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా మారుతుంది.
సగటు మదుపరిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆర్థిక భద్రతకు ముప్పు రాకుండా చూసుకోవాలో ఒకసారి చూద్దాం:
1. అధిక రాబడి
ఏదైనా స్కీం ద్వారా అధిక రాబడి వస్తోంది అంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.
ఎవరి మాటలు లేదా అభిప్రాయాలను నమ్మి మదుపు చేయకండి. మీ సమయాన్ని వెచ్చించి సొంతంగా అధ్యయనం చేయండి. అలాంటి స్కీములు గతంలో ఏవైనా ఉన్నాయేమో చూడండి.
ఏ మాత్రం అనుమానంగా కనిపించినా మదుపు చేయకపోవడమే చెప్పదగిన సూచన.
ఎందుకంటే మనకు రాబోయే వడ్డీ కంటే మన దగ్గర ఉన్న డబ్బును కాపాడుకోవడం ముఖ్యం. పర్సనల్ ఫైనాన్స్ మూలసూత్రాలలో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
2. ఓటీపీ, పిన్ లాంటి సమాచారం
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటీపి, పిన్ లాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకండి. ఏ కంపెనీకి కూడా మీ ఓటీపీ లాంటి సమాచారాన్ని తీసుకునే అధికారం, అవసరం లేవు.
3. ఒత్తిడికి లోను కావద్దు
మీ మదుపు చేసిన విధానాలు లేదా కంపెనీల గురించి నెగెటివ్ వార్తలు వస్తే వెంటనే ఎలాంటి చర్య చేపట్టకుండా కొన్ని రోజులు వేచి చూడండి. ప్రస్తుత తరుణంలో అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చిన వార్తలను మాత్రమే నమ్మండి.
ప్రముఖ మీడియా సంస్థలను కూడా బురిడి కొట్టించగల సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉందనే విషయం గుర్తు పెట్టుకోండి.
4. దీర్ఘకాల ఆలోచన
దీర్ఘకాల ఆలోచనతో మదుపు చేయడం పర్సనల్ ఫైనాన్స్ మూలసూత్రం. ఇలా మదుపు చేయడం వల్ల ఇలా డీప్ ఫేక్ దాడులకు గురైనా కూడా కంపెనీలు కోలుకుంటాయి.
మంచి పనితీరు కనబరిచే కంపెనీలు మళ్ళీ త్వరగా మునుపటి స్థాయిని అందుకుంటాయి. వారెన్ బఫెట్ కొన్ని దశాబ్దాలుగా కొకాకోలా కంపెనీలో మదుపు చేసిన షేర్లను అట్టిపెట్టుకున్నారు. దీర్ఘకాల ఆలోచనకు ఇది చాలామంచి ఉదాహరణ.
(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)
ఇవి కూడా చదవండి
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














