విమానాశ్రయంలో పడవల్లా విమానాలు.. వీధుల్లో మొసలి

ఆస్ట్రేలియా వరదలు

ఫొటో సోర్స్, JOSEPH DIETZ

    • రచయిత, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రికార్డు స్థాయి వర్షపాతం భారీ వరదలకు కారణం అవుతోంది.

ఆస్ట్రేలియాలోనే ఇవి అత్యంత దారుణమైన వరదలుగా నిలుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, కొందరు వరదల్లో చిక్కుకుపోయారు.

తుపాను కారణంగా ఏర్పడిన ఈ విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక ఏడాదికి చాలినంత వానలు కురిశాయి.

క్వీన్స్‌‌లాండ్ ప్రాంతానికి చెందిన ఫోటోల్లో కెయిర్న్స్ విమానాశ్రయంలో మునిగిపోయిన విమానాలు, పట్టణం మధ్యలో మొసలి, ఇళ్లను వదిలి పడవల్లో తరలిపోతున్న ప్రజలు కనబడుతున్నారు.

ఇప్పటివరకు వరదల కారణంగా మరణాలు, వ్యక్తులు కనిపించకుండా పోవడం వంటి ఘటనలు నమోదు కాలేదు.

మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

నీటిలో మొసలి

ఫొటో సోర్స్, Chloe Chomicki/ABC

రాత్రంతా ఆసుపత్రి పైకప్పు మీద రోగులు

వందల మంది ప్రజలను వరదల నుంచి కాపాడారు. వరదల కారణంగా ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు మూత పడ్డాయి. మంచి నీటి కొరత ఏర్పడుతోంది.

తుపాను మొదలైనప్పటి నుంచి కెయిర్న్స్ నగరంలో 2 మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

ఈ ప్రకృతి విపత్తు అత్యంత దారుణంగా ఉందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో మాట్లాడుతూ క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ స్టీవెన్ మిల్స్ అన్నారు.

‘‘కెయిర్న్స్ ప్రజలతో క్షేత్రస్థాయిలో నేను మాట్లాడుతున్నా. ఇలాంటి వరదల్ని ముందెన్నడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. ఉత్తర క్వీన్స్‌లాండ్ ప్రజలు ఇలా చెప్పారంటే కచ్చితంగా అక్కడేదో జరుగుతోందని అనుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న నీటిమట్టంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం గురించి ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెప్పారు.

అత్యవసర సేవల సిబ్బంది చేరుకోలేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నారి సహా మొత్తం 9 మంది వ్యక్తులు రాత్రంతా ఆసుపత్రి పైకప్పు మీద గడిపారు.

అయితే, వారిని సోమవారం మరో ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు.

పట్టణంలో ఉన్న అందర్నీ తరలించాల్సిన అవసరం ఉంటుందని మిల్స్ అన్నారు.

‘‘వరదల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడమే కాకుండా మంచినీటి వసతి, డ్రైనేజీ, విద్యుత్, టెలీకమ్యూనికేషన్లు, రోడ్లు నిలిచిపోవడం వంటివి ఇతర ఆందోళనకర అంశాలు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయ కార్యక్రమాల్లోకి వైమానిక సేవల్ని తీసుకురాలేకపోతున్నాం’’ అని ఆయన వివరించారు.

సోమవారం చాలా సమయం పాటు కుండపోత వర్షం కొనసాగుతుందని, లోతట్టు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు.

మంగళవారం వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే, నదులన్నీ కొన్ని రోజుల పాటు నిండు కుండల్లాగే ఉంటాయని అన్నారు.

ఆస్ట్రేలియా వరదలు

ఫొటో సోర్స్, Joseph Dietz

భారీ నష్టం

1977లో సంభవించిన భారీ వరదల రికార్డులను పలు నదులు బద్దలు కొడతాయని అంచనా వేశారు.

ఉదాహరణకు, డెన్‌ట్రీ నది ఇప్పటికే మునుపటి రికార్డు 2 మీటర్ల వరదను దాటింది. గత 24 గంటల్లో 820 మి.మీ వరద నీరు డెన్‌ట్రీ నదిలోకి చేరింది.

ఈ విపత్తు నష్టం 1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (రూ. 5,580 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తూర్పు ఆస్ట్రేలియా ఇటీవలి ఏళ్లలో తరచుగా వరదలకు గురవుతోంది. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఆస్ట్రేలియా తీవ్ర కరవు, కార్చిచ్చు, రికార్డు స్థాయిలో వరదలు, గ్రేట్ బారియర్ రీఫ్‌లో మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ వంటి వరుస విపత్తులతో సతమతం అవుతోంది.

వాతావరణ మార్పులను అరికట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర విపత్తులు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదిక హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)