దగ్గు మందు మరణాలు: నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఔషధం వాడొద్దంటూ నిషేధం విధించిన కేంద్రం

దగ్గు మందు

ఫొటో సోర్స్, GETTY IMAGES

నాలుగేళ్లలోపు వయసున్న పిల్లలకు ఒక జలుబు, దగ్గు నిరోధక ఔషధ మిశ్రమాన్ని వాడటాన్ని నిషేధిస్తూ భారత డ్రగ్ కంట్రోలర్ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నిర్ణయం తీసుకుంది.

గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో చాలా మంది పిల్లలు భారత దగ్గు మందు వాడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ దగ్గు మందులు భారత్‌లో తయారై, అక్కడికి ఎగుమతి అయ్యాయి.

భారత్‌లో కూడా 2019 నుంచి 2020 మధ్య 12 మంది పిల్లలు దగ్గు మందు కారణంగా ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వచ్చాయి.

వీటిని తయారు చేసిన కంపెనీలు మాత్రం ఆరోపణలను కొట్టిపడేశాయి. ఇవి సురక్షితమైనవేనని, వీటి తయారీలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పాయి.

నిషేధించిన డ్రగ్ కాంబినేషన్‌లో క్లోర్ఫెనిరామైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ ఔషధాలు ఉన్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

దీనిని 2015లో ఆమోదించారు. ఈ కాంబినేషన్‌ను దగ్గు సిరప్‌లలో, సాధారణ జలుబు చికిత్స కోసం వాడే ట్యాబ్లెట్లలో వినియోగిస్తారు.

ఈ కాంబినేషన్‌ను నిషేధిస్తూ డిసెంబరు 18న జారీ చేసిన ఉత్తర్వును 20న బహిరంగపరిచారు. దీంతో మందుల తయారీ కంపెనీలు ఈ కొత్త ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఈ కాంబినేషన్ ఉన్న దగ్గు మందులని అమ్మాలనుకుంటే నాలుగేళ్లలోపు పిల్లలకు వీటిని వాడకూడదని హెచ్చరించే లేబుల్‌ని తప్పనిసరిగా పెట్టాలి.

దగ్గు మందు మరణాలు
ఫొటో క్యాప్షన్, చిత్రంలో గాంబియాకు చెందిన ఎబ్రిమా సాజ్నియా, ఆయన భార్య. సాజ్నియా దంపతుల మూడేళ్ల కొడుకు లామిన్ కిడ్నీ సమస్యలతో నిరుడు చనిపోయాడు. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో చాలా మంది పిల్లలు భారత దగ్గు మందు వాడిన కారణంగా చనిపోయారని ఆరోపణలు వచ్చాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో పెరిగిన పర్యవేక్షణ

గాంబియాలో 66 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి, భారత్‌లో తయారవుతున్న దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా హెచ్చరిక జారీ చేయడంతో, దగ్గు మందులపై పర్యవేక్షణ పెరిగింది.

దగ్గు మందులో డైఇథలీన్ గ్లైకాల్, విషపూరిత ఆల్కహాల్‌గా భావించే డ్రగ్ ఇథలీన్ గ్లైకాల్ పరిమితికి మించిన మోతాదులో ఉన్నాయని లేబొరేటరీ విశ్లేషణలో బయటపడింది.

తర్వాత ఇలాంటి మరణాలే ఉజ్బెకిస్తాన్‌లోనూ చోటుచేసుకున్నాయి. భారత్‌లో తయారైన దగ్గు మందు కారణంగా 2022 నాటికి 18 మంది పిల్లలు మరణించారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య శాఖ ఆరోపించింది.

భారత్‌లోని జమ్మూ ప్రాంతంలో కూడా 2019లో కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల వయసు నుంచి ఆరేళ్ల వయసులోపు పిల్లలు 12 మంది దగ్గు మందు తాగి ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై భారత డ్రగ్ రెగ్యులేటర్ స్పందిస్తూ ఇది అరుదైన ఘటనగా పేర్కొంది. గాంబియాలోని పిల్లల మరణాలతో సంబంధమున్న నాలుగు దగ్గు మందులు కూడా క్లియరెన్స్ పరీక్షల్లో నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని భారత డ్రగ్ రెగ్యులేటర్ చెప్పుకొచ్చింది. అయితే,ఈ వాదనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకీభవించలేదు. అనంతరం ఉజ్బెకిస్తాన్‌లోని పిల్లల మరణాలకు కారణమైందనే ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయ మందుల తయారీ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసింది.

అలానే మందుల తయారీ ప్రక్రియపై లోతైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. భారత్‌లోని మందుల తయారీ కంపెనీలన్నీ, ఇతర దేశాలకు దగ్గు మందు ఎగుమతులు చేసే మందు నిర్దేశిత పరీక్షలు చేయించడాన్ని తప్పనిసరి చేస్తూ జూన్‌లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)