జిమ్మీ లై: జేబులో ఒక డాలర్‌తో దేశం నుంచి వచ్చేసి, బిలియనీర్‌గా మారిన ఈయన్ను చైనా ఎందుకు జైల్లో పెట్టింది?

జిమ్మీ లై

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 డిసెంబర్ 12న పోలీసులు, జిమ్మీని కోర్టుకు తీసుకెళ్లారు

చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించే వ్యక్తులను వేళ్ల మీద లెక్కించవచ్చు.

ఇలాంటి వ్యక్తుల్లో ఒకరు జిమ్మీ లై.

12 ఏళ్ల వయసులో జేబులో ఒక డాలర్‌తో చైనా నుంచి హాంకాంగ్‌కు చేరుకున్న జిమ్మీ నిర్భయంగా ఉండే, ఉన్నదున్నట్లు మాట్లాడే, ఎప్పుడూ ఓటమిని అంగీకరించని వ్యక్తి.

అంతేకాకుండా ఆయన ఒక బిలియనీర్. హాంకాంగ్‌లోని ప్రభావవంతమైన హాంకాంగ్ వార్తాపత్రిక యాపిల్‌కు ఆయన యజమాని.

ప్రపంచంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ధనవంతుల ఉదాహరణలు చాలా తక్కువ. కానీ, ఇందుకు జిమ్మీ లై మినహాయింపు.

సాధారణంగా వ్యాపారవేత్తలు, ప్రభుత్వంతో కలిసి నడవాలని కోరుకుంటారు.

హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమానికి అతిపెద్ద మద్దతుదారుల్లో జిమ్మీ లై ఒకరు. తీవ్ర ఆరోపణల మీద చైనా ప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారంటూ ఇప్పుడు జిమ్మీ లై మీద మరో కేసు నమోదైంది.

ఆయనపై మోసం, హాంకాంగ్ నిరసనల్లో ప్రమేయానికి సంబంధించిన అభియోగాలు ముందు నుంచే ఉన్నాయి. 76 ఏళ్ల జిమ్మీ లై మీద విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలు కూడా మోపారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ ఆయన తోసిపుచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఆయన కేసు చర్చనీయాంశమైంది. జిమ్మీ లై నిజానికి బ్రిటిష్ పౌరుడు. ఆయన్ను విడుదల చేయాలని బ్రిటన విదేశాంగ మంత్రి డిమాండ్ చేశారు.

హాంకాంగ్ న్యాయ వ్యవస్థ తన రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించే ఆయుధంగా మారిందని విమర్శకులు అంటున్నారు.

మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన జిమ్మీకి ఇప్పుడు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

జిమ్మీ

ఫొటో సోర్స్, Getty Images

జిమ్మీ అంటే చైనాకు ఎందుకు చిరాకు?

చైనాకు చాలా కాలంగా జిమ్మీ ఇబ్బందికరంగా ఉన్నారు. ఇతర హాంకాంగ్ బిలియనీర్ల తరహాలో కాకుండా చైనా ప్రభుత్వాన్ని జిమ్మీ తీవ్రంగా విమర్శించేవారు. ఈ పూర్వపు బ్రిటిష్ భూభాగంలో ప్రజాస్వామ్యం కోసం పిలుపునిచ్చిన వారిలో జిమ్మీ లై కీలకం.

అందుకే ఆయనపై అనేక కేసులు పెట్టారు. 2021లో అనుమతి లేకుండా సమావేశమైనందుకు ఆయనకు శిక్ష పడింది. నిరుడు ఒక ఫ్రాడ్ కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ అయిదేళ్ల శిక్ష వేశారు.

హాంకాంగ్ వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన వారిలో లై అత్యంత ప్రముఖుడు.

తాను పుట్టుకతోనే తిరుగుబాటుదారుడినని 2020లో అరెస్ట్ అయ్యే కొన్ని గంటల ముందు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిమ్మీ అన్నారు.

హాంకాంగ్

ఫొటో సోర్స్, EPA

ఒక డాలర్‌తో మొదలై, బిలియనీర్‌గా ఎదిగి

దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో జిమ్మీ లై పుట్టారు. వారిది సంపన్న కుటుంబం. చైనాలో 1949లో కమ్యూనిస్టు పాలన వచ్చిన తర్వాత వారి కుటుంబం అంతా కోల్పోయింది.

జిమ్మీ లై 12 ఏళ్ల వయసులో చేపలు పట్టేవారి పడవలో దాక్కొని చైనా నుంచి హాంకాంగ్ చేరుకున్నారు.

ఆ రోజుల గురించి 2021లో బీబీసీతో జిమ్మీ లై మాట్లాడారు.

“నేను ఇక్కడికి జేబులో ఒక డాలర్‌తో వచ్చాను. చేపలు పట్టే పడవలో ఎక్కి ఇక్కడికి చేరుకున్నా. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ నగరమే. ఈ నగరం రుణం తీర్చుకునే సమయం ఇదే అయితే అందుకు నేను సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు.

12 ఏళ్ల వయసులో దుకాణాల్లో చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టిన జిమ్మీ లై, పట్టుబట్టి ఇంగ్లిష్ నేర్చుకున్నారు.

దుస్తుల్లో ఒక అంతర్జాతీయ బ్రాండ్‌ను రూపొందించడంతో ఆయనకు మొదటి విజయం దక్కింది. ఆ బ్రాండ్ పేరు గియోర్డానో.

ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్ దుకాణాలు వెలిశాయి.

కానీ, 1989లో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌కు చైనా ట్యాంకులను పంపించినప్పుడు జిమ్మీ లై మరో అవతారం ఎత్తారు.

వ్యాపారవేత్తగానే కాకుండా ప్రజాస్వామ్య వేత్తగా గొంతెత్తడం మొదలుపెట్టారు. తియానన్మెన్ స్క్వేర్‌లో జరిగిన మారణకాండపై విమర్శనాత్మక కథనాలు రాయడం ప్రారంభించారు. తర్వాత ఒక పబ్లిషింగ్ హౌస్‌‌ను స్థాపించారు. క్రమంగా హాంకాంగ్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు.

చైనాకు ఆయన తీరు నచ్చలేదు. చైనాలో ఆయన బ్రాండ్ దుకాణాలను మూసేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత జిమ్మీ తన కంపెనీని అమ్మేశారు.

దుస్తుల బ్రాండ్ తర్వాత తన పబ్లిషింగ్ కంపెనీ నుంచి ప్రజాస్వామ్య అనుకూల వార్తాపత్రికలు, మ్యాగజీన్లను ప్రచురించడం మొదలుపెట్టారు. వీటిలో నెక్స్ట్ డిజిటల్ మ్యాగజీన్ కూడా ఉంది.

అయితే వీటన్నింటిలో ఆయన నడిపే యాపిల్ డైలీ వార్తాపత్రిక అత్యంత శక్తిమంతమైనదిగా నిరూపితమైంది.

చైనా ప్రభుత్వం మీద రాయడానికి హాంకాంగ్‌లోని ప్రతీ వార్తాపత్రిక భయపడుతున్న సమయంలో జిమ్మీ లై బహిరంగంగా చైనా విధానాలను తన పత్రిక ద్వారా వ్యతిరేకించారు.

జిమ్మీ లై

ఫొటో సోర్స్, REUTERS

చంపేందుకు ప్రయత్నాలు

ఈ కారణంతో జిమ్మీ లై, హాంకాంగ్‌లో చాలా మందికి హీరో అయ్యాడు. కానీ, చైనా మాత్రం ఆయనను దేశద్రోహిగా చూస్తుంది. ఆయనను చంపేందుకు చాలాసార్లు దాడులు జరిగాయి.

అయితే, ఎన్ని బెదిరింపులు వచ్చినా జిమ్మీ లై ఎవరికీ లొంగలేదు. తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు జిమ్మీ లై కీలక వ్యక్తిగా మారారు. 2021లో ఆయనను రెండుసార్లు అరెస్ట్ చేశారు.

2020 జూన్‌లో హాంకాంగ్ కోసం చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఇక్కడ ప్రజాస్వామ్యం అంతకంతకూ క్షీణిస్తోందని, ఈ చట్టంతో అంతమైపోతుందని ఆయన బీబీసీతో అన్నారు.

చైనా తరహాలో హాంకాంగ్ అవినీతిమయం అవుతుందని ఆయన హెచ్చరించారు. సరైన చట్టాలు లేకుంటే ప్రపంచ ఆర్థిక కేంద్రంగా హాంకాంగ్‌ ప్రతిష్ఠ మసకబారుతుందని అన్నారు.

తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారనే పేరున్న జిమ్మీ లై, 2021లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికారు.

చైనా నుంచి తమను రక్షించగల ఏకైక వ్యక్తి ట్రంప్ అని ఆయన అన్నారు.

"నేను జైలు నుంచి బయటికి వస్తే, నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కానీ, జైలులో నేను అర్థవంతమైన జీవితాన్ని గడపగలను" అని 2021లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)