రేప్ కేస్-సజ్జన్ జిందాల్‌: ఈ బిజినెస్‌ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?

సజ్జన్ జిందాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఎండీ, చైర్మన్ సజ్జన్ జిందాల్‌పై ముంబయి పోలీసులు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదుచేశారు. తనను రేప్ చేశారని 30 ఏళ్ల నటి చేసిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 376 (రేప్), 354 (మహిళపై దాడి లేదా బలాన్ని ప్రయోగించడం), 506 (భయపెట్టడం) సెక్షన్ల కింద బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.

సజ్జన్ జిందాల్ కంపెనీ ప్రధాన కార్యాలయం పైఅంతస్తులో, 2022 జనవరిలో ఈ నేరం జరిగిందని ఫిర్యాదులో సదరు మహిళ ఆరోపించారు.

‘‘ఘటనపై ఈ ఏడాది మొదట్లోనే పోలీసులను ఆశ్రయించాను. కానీ, నేను చెప్పేది పోలీసులు పట్టించుకోలేదు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ఆమె తెలిపారు.

అయితే, ఈ ఆరోపణలు నిరాధారమైనవని సజ్జన్ జిందాల్ ఖండించారు. ఈ విషయంలో సజ్జన్ జిందాల్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.

‘‘ఈ దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరించేందుకు సజ్జన్ జిందాల్ కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుండటంతో, ఇంతకుమించి మేం స్పందించాలని కోరుకోవడం లేదు. జిందాల్ కుటుంబ గోప్యతను గౌరవిస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జేఎస్‌డబ్ల్యూ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఐఆర్‌లో ఏముంది?

ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన సదరు మహిళ ఒక నటి. 2021 అక్టోబరులో దుబాయ్‌లోని ఒక ఐపీఎల్ మ్యాచ్‌ చూడటానికి వెళ్లినప్పుడు వీఐపీ బాక్స్‌లో సజ్జన్ జిందాల్‌ను ఆమె కలిశారు.

‘‘నా సోదరుడు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ కన్సల్టంట్‌గా పనిచేస్తున్నారు. కొన్ని ఆస్తుల కొనుగోలుపై సజ్జన్ జిందాల్ ఆసక్తి వ్యక్తం చేయడంతో మేం నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం’’ అని ఆమె చెప్పారు.

దీని కోసమే 2021 డిసెంబరు 13న ముంబయిలో ఒకసారి కలిశామని ఆమె చెప్పారు. ఆ తర్వాత మాజీ ఎంపీ ప్రఫుల్ పటేల్ కుమారుడి వివాహం సందర్భంగా2021 డిసెంబరు 18-19 తేదీలో జైపుర్‌లో మరోసారి కలిశామని వివరించారు.

‘‘జైపుర్‌లో కలిసినప్పుడు ఆయన సరదాగా మాట్లాడారు. ఆయన నన్ను బేబ్, బేబీ అని పిలిచారు. ఒక హోటల్‌లో కలుద్దామని పట్టుబట్టారు’’ అని ఆమె చెప్పారు.

‘‘తన వైవాహిక జీవితం సాఫీగా లేదని, అన్నీ గొడవలే జరుగుతున్నాయని ఆయన చెప్పారు’’ అని ఆమె వివరించారు.

సజ్జన్ జిందాల్

ఫొటో సోర్స్, ANI

ఆ తర్వాత నెమ్మదిగా తనపై రొమాంటిక్ ఫీలింగ్స్‌ను ఆయన బయటపెట్టారని ఆమె అన్నారు. ‘‘ఆయనకు పెళ్లి అయినప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశారు. శరీరకంగా దగ్గరకావడం గురించి మాట్లాడారు. అయితే, పెళ్లి అయిన తర్వాతే అన్నీ అని నేను చెప్పాను’’ అని ఆమె వివరించారు.

2022 జనవరిలో ఒక మీటింగ్‌ కోసం ఆమె మళ్లీ జేఎస్‌డబ్ల్యూ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అప్పుడే తననుపై అంతస్థులోని పెంట్‌హౌస్‌కు తీసుకెళ్లారని, వద్దని వారిస్తున్నప్పటికీ బలప్రయోగం చేశారని ఆమె ఆరోపించారు.

ఆ ఘటన తర్వాత కూడా ఆయనతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాను ప్రయత్నించానని ఆమె చెప్పారు. కానీ, ఆయన తన నంబరును బ్లాక్ చేశారని వివరించారు. పోలీసులను ఆశ్రయిస్తే, ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించినట్లు చెప్పారు.

మొత్తానికి 2023 ఫిబ్రవరి 16న ఆమె బీకేసీ పోలీసులను ఆశ్రయించారు. అయితే, కోర్టు ఆదేశాలపైనే ఎఫ్ఐఆర్ నమోదైంది.

వీడియో క్యాప్షన్, 'భర్త వ్యభిచారంలోకి దింపాడు... స్నేహితులు మోసం చేశారు'

సజ్జన్ జిందాల్ ఎవరు?

భారత్‌లోని రెండో అతిపెద్ద స్టీల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వ్యవస్థాపకుడే సజ్జన్ జిందాల్. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ కంపెనీల్లో జేఎస్‌డబ్ల్యూ 15వ స్థానంలో ఉందని వరల్డ్ స్టీల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్‌వో) గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు మైనింగ్, ఎనర్జీ, స్పోర్ట్స్, సిమెంట్, పెయింట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్ బిజినెస్ లాంటి భిన్న రంగాలకు విస్తరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపుకు మేనేజింగ్ డైరెక్టర్‌గానూ సజ్జన్ జిందాల్ కొనసాగుతున్నారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వెబ్‌సైట్, మీడియా రిపోర్టుల ప్రకారం సజ్జన్ జిందాల్ ఒక మెకానికల్ ఇంజినీర్. 64 ఏళ్ల ఆయన 2021-22 మధ్య కాలంలో వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ)కు చైర్మన్‌గానూ పనిచేశారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూపు వ్యవస్థాపకుడు ఓపీ జిందాల్, హరియాణా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సావిత్రి జిందాల్‌ల కుమారుల్లో సజ్జన్ జిందాల్‌ కూడా ఒకరు.

సజ్జన్ జిందాల్ తమ్ముడు నవీన్ జిందాల్ కూడా ఒక వ్యాపారవేత్త, మాజీ ఎంపీ.

భారత్‌లోని సంపన్న కుటుంబాల్లో జిందాల్ కుటుంబం నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు భారత్‌లోని అత్యంత సుసంపన్న మహిళల్లో సావిత్రి జిందాల్ తొలి స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.

సజ్జన్ జిందాల్ భార్య సంగీతా జిందాల్ స్వచ్ఛంద సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ను నడిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)