ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, విధాన్షు కుమార్
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

భారత క్రికెట్‌లో ఈ మధ్య చెలరేగిన తుపాను టీమిండియాకు సంబంధించినది కాదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌కు చెందినది.

భారత అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకరైన రోహిత్ శర్మ ఈ వివాదానికి కేంద్రంగా మారారు.

రాబోయే సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తాడని మేనేజ్‌మెంట్ ప్రకటించిన వెంటనే ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చ మొదలైంది.

లక్షల మంది ఫాలోవర్లు ముంబయి ఇండియన్స్ జట్టును అన్‌ఫాలో చేశారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

రియాక్షన్ ఏంటి?

సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబయి ఇండియన్స్ లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. ఈ నిర్ణయం ప్రకటించిన మొదటిరోజే 4 లక్షల మంది అభిమానులు ముంబయి ఇండియన్స్‌ను సోషల్ మీడియాలో అనుసరించడం మానేశారు.

ముంబయి ఇండియన్స్ జెర్సీ, టోపీలకు అభిమానులు నిప్పు పెడుతున్న ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

అభిమానుల అసంతృప్తి స్పష్టంగా వెల్లడైంది. మాజీ క్రికెటర్లు కూడా ముంబయి ఇండియన్స్ నిర్ణయంపై ఆశ్చర్యపోయారు.

చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ధోని తరహాలో ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ ప్రత్యేకమని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.

స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ‘‘రోహిత్ శర్మది జట్టులో చాలా ఉన్నత స్థానం. చెన్నై జట్టులో ధోనికి ఇలాంటి స్థానమే ఉంది. రోహిత్ చాలా కష్టపడి ముంబయి ఇండియన్స్ జట్టును ఈ స్థితిలో నిలిపాడు. కెప్టెన్‌గా జట్టుకు చాలా మేలు చేశాడు’’ అని అన్నారు.

ముంబయి ఇండియన్స్ క్రికెటర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్రోకెన్ హార్ట్ ఎమోజీ చాలా వైరల్ అయింది.

భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్, ముంబయి ఇండియన్స్ నిర్ణయాన్ని సమర్థించారు. రోహిత్ శర్మ అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.

‘‘ఇందులో ఏది తప్పు? ఏది ఒప్పు అనేది చూడకూడదు. జట్టు ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనే సంగతిని అర్థం చేసుకోవాలి. రోహిత్ బ్యాటింగ్ స్థాయి కూడా తగ్గిపోయింది’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ సునీల్ గావస్కర్ అన్నారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

రోహిత్ శర్మ రికార్డు

నిజానికి రోహిత్ శర్మను ఈ రకంగా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే ఆలోచన ఎవరికీ లేదు.

ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ జట్టును అయిదుసార్లు టోర్నీ విజేతగా నిలిపాడు.

అతని అద్భుత బ్యాటింగ్ తీరు, కెప్టెన్సీలోని నైపుణ్యాలు రోహిత్ శర్మను జట్టులో ప్రత్యేక ఆటగాడిగా నిలిపాయి.

రోహిత్ శర్మ 2011నుంచి ముంబయి జట్టు తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే 33.81 సగటుతో 372 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ 31 సగటుతో 5,230 పరుగులు చేశాడు. ఇందులో 40 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

వేగంగా ఆడుతూ జట్టుకు మంచి ఓపెనింగ్స్ అందివ్వడంలో రోహిత్ శర్మ సహాయపడ్డాడు.

అయితే, గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ జోరు తగ్గింది. బహుశా ఈ ఫామ్ త్వరలోనే మెరుగుపడొచ్చు కూడా. అతని నుంచి ఇంకా చాలా కాలం పాటు టీ20 క్రికెట్‌ను మనం ఆశించొచ్చు.

2013 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే రికీ పాంటింగ్ కెప్టెన్సీ వదిలేయడంతో ముంబయి ఇండియన్స్ పగ్గాలు రోహిత్ శర్మ చేతికి వచ్చాయి.

రోహిత్ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. దాదాపు పదేళ్ల కాలంలో రోహిత్ కెప్టెన్సీ వహించిన 158 మ్యాచ్‌ల్లో ముంబయి 87 మ్యాచ్‌ల్లో గెలిచి, 67 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

కారణం ఏంటి?

జట్టు, రోహిత్ శర్మ ఫామ్ గురించి క్రికెట్ నిపుణులు ఒక కారణాన్ని చెబుతున్నారు. ముంబయి ఇండియన్స్ జట్టు రెండేళ్ల క్రితం హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ జట్టు కోసం విడుదల చేసింది. లీగ్‌లో అరంగేట్రం చేసిన సీజన్‌లోనే గుజరాత్ జట్టును పాండ్యా విజేతగా నిలిపాడు. నిరుడు గుజరాత్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఈ రెండేళ్లలో ముంబయి ఇండియన్స్ జట్టు పెద్దగా రాణించలేదు. ఫైనల్‌కూ చేరుకోలేక పోయింది. చివరగా 2020లో జట్టు చాంపియన్‌గా నిలిచింది. గత రెండేళ్లలో రోహిత్ శర్మ బ్యాట్‌తో కూడా ఆకట్టుకోలేకపోయాడు.

2022లో అతను 14 మ్యాచ్‌ల్లో 19 సగటుతో 268 పరుగులు చేశాడు. 2023లో 16 మ్యాచ్‌ల్లో 20.75 సగటుతో 332 పరుగులు స్కోర్ చేశాడు. గత రెండు సీజన్లలో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే చేయగలిగాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

2022 నవంబర్ నుంచి రోహిత్ శర్మ టి20ల్లో భారత్ తరఫున ఆడలేదు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్సీ వహించాడు.

వన్డే వరల్డ్ కప్ సన్నద్ధత కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లకు టీ20 క్రికెట్‌ నుంచి బ్రేక్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ కోరుకుందనే వాదన కూడా ఉంది. ఈ ఆటగాళ్ల టీ20 కెరీర్ ముగిసిందని చెప్పడానికి ఈ బ్రేక్ అనేది సంకేతం కాదని అంటున్నారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

ఇప్పుడు ఏం జరుగనుంది?

ఇప్పుడు రోహిత్ శర్మ ఏం చేయనున్నాడనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. అతను హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబయికి ఆడతాడా? లేదా కెప్టెన్సీ అవకాశం లభించే వేరే జట్టుకు ఆడాలని అనుకుంటాడా?

రోహిత్ శర్మకు సెల్యూట్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్ ఒక పోస్ట్ చేసింది. రోహిత్ భార్య రితిక ఆ పోస్ట్‌ను లైక్ చేశారు.

డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరుగుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20న బదిలీలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.

తమ జట్టును బలోపేతం చేసుకునే అవకాశం ప్రతీ జట్టుకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర జట్లు రోహిత్ శర్మ పేరును పరిశీలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.

2022 మెగా వేలంలో రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ జట్టు 16 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. కాబట్టి అతన్ని పొందాలనుకునే ఏ జట్టు అయినా కనీసం రూ. 16 కోట్లు అతనిపై వెచ్చించేందుకు సిద్ధంగా ఉండాలి.

కానీ, రోహిత్ శర్మ జట్టు మారాలనుకుంటాడా? లేదా, తన అభిమాన జట్టుతోనే ఇంకొన్నేళ్లు ఉండి తర్వాత మెంటార్ రూపంలో సేవలు అందిస్తాడా?

ఒక్కటి మాత్రం నిజం. అతను ఎక్కడ ఉన్నా అభిమానుల నుంచి రోహిత్‌కు విపరీతమైన మద్దతు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)